అతను ఉదయాన్నే లేచాడు. అదీ ఓ ప్రత్యేకతేనా అంటే ఈ రోజుల్లో కచ్చితంగా ప్రత్యేకమే. అర్ధరాత్రుళ్ళ వరకూ పార్టీలు, విదేశాల్లోని ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు– తెల్లవారు ఝాము సమయాల్లో అశ్లీల వీడియోలు చూసుకుంటూ, నిజమో, అబద్ధమో తెలియని నకిలీ ప్రొఫైల్స్, చాటింగ్‌తో డొంక తిరుగుడు ప్రపోజల్స్ పెట్టి, విచిత్రమైన ఎమోజీలతో సమాధానాలు అందుకుని– ఆపై పడుకుని ఆఫీస్‌కి టైమ్ అయ్యే వేళలో హడావుడిగా లేచి, పరుగులెత్తే బిజీ జీవితాల్లో తెల్లవారు ఝామునే లేవడం విశేషం కాక మరేమిటి?
లేవగానే దిండు కింద ఫోన్ తీసుకున్నాడు. తీసుకునే ముందు పక్కకి చూశాడు. అతని భార్య అటువైపు తిరిగి పడుకుంది. ఆమె శరీరాన్ని మెత్తటి రగ్గు కప్పుకుని ఉంది– జింకని మింగే కొండ చిలువలా. లేవగానే మొబైల్లో సెల్ఫీ తీసుకున్నాడు. ఫొటో చూసుకున్నాడు. నిద్రమొహంలా లేదు కానీ– నిరాభావంగా ఉంది. చిరునవ్వు పెదాల్లోకి, కళ్ళల్లోకి, ముఖం మీద ముడతల్లోకి తెచ్చుకుని నవ్వుకుంటున్నాడు.
ఆ నవ్వు ముఖాన్ని సెల్ఫీగా రికార్డు చేసుకున్నాడు. బెడ్ రూమ్‌లో నుంచి నడుచుకుంటూ వచ్చి, హాల్లోని సోఫాలో కూర్చున్నాడు. సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోని అందమైన అమ్మాయిల ఫొటోలకి లవ్ సింబల్ నొక్కాడు. హాట్, ఆసమ్, హార్ట్ బర్నింగ్ లాంటి కామెంట్స్ పెట్టాడు. ట్విట్టర్లో ట్రెండ్ పరిశీలించాడు. ఫేస్ బుక్‌లో కరెంట్ ఎఫైర్స్ మీద కామెంట్ పెట్టాడు. మళ్ళీ చదువుకుంటూ భయం వేసింది. ఎవరైనా హర్ట్ అయితే– తలనొప్పి, ట్రోల్ చేస్తారు.
పోస్ట్ తీసి, ఓ జోక్ పెట్టాడు. నిమిషాల్లోకి లైకులు వస్తున్నాయి. తనలాగే ఈ ప్రపంచం ఎంత పనీపాటా లేకుండా ఉంది? ఎవరో చనిపోయిన పోస్ట్ చూశాడు. లైక్ కొట్టి, రిప్ పెట్టాడు. స్నాప్ చాట్ చూశాడు. ఆఫీస్‌లో ఉండే అమ్మాయికి తను పెట్టిన మెసేజ్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయి ఉంది. అంటే చూసింది! మరి రిప్లై? ఓ కొంటెనవ్వు ఎమోజీ కనబడింది. అతని ముఖం వికసించింది, హృదయం విశాలమైంది.
‘ఈ రోజంతా నాకు శుభమే, లేవగానే నీ మెసేజ్ చూశాను’ అని అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తే.. గుమ్మం ముందు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలు, పాల ప్యాకెట్లు. అదే సమయంలో ఎదురింటాయన పెంపుడు కుక్కతో తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. ‘పొద్దున్నే లేవగానే కుక్క మొహమా?’ అని లోపల తిట్టుకున్నాడు. పైకి– ‘జిమ్మి ఎంత పంక్చువలో ఆరు కాగానే షిట్‌కి రెడీ అయి ఉంది’ అన్నాడు.
ఎదురింటాయన కూడా ‘మనకే టైమింగ్స్ సరిగ్గా ఉండవు.. ప్రతిరోజు జిమ్మిని చూసి నేర్చుకోవాలనుకుంటాను’ అన్నాడు. ‘నేర్చుకోరా– కుక్కనుంచి అన్నీ నేర్చుకో– చెత్త నాయాలా’ మనసులో తిట్టుకున్నాడు. ‘మీతో మాట్లాడితే అదే.. ఎంత హాయిగా, ఆహ్లాదంగా ఉంటుందో’ అన్నాడు.
బాత్‌రూమ్‌లో పాట్ మీద కూర్చుని, అందమైన గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు వెదికాడు.. ఇమేజ్‌లతో సహా. వాటిని తన వాట్సాప్, టెలిగ్రామ్‌లోని పనికొచ్చేవాళ్ళకి ఫార్వర్డ్ చేశాడు. తను ఎవర్ని అయితే కాకా పట్టాలనుకుంటున్నాడో. వాళ్ళకి కూడా పంపించాడు. కొందరు మాత్రమే ప్రతిస్పందించారు. మిగిలిన వాళ్ళు పట్టించుకోలేదు.
స్నానం చేయబోతుండగా, నీళ్ళు మధ్యలో ఆగిపోయాయి. సగం తడిసిన ఒంటి మీదే టవల్ చుట్టుకున్నాడు. ఫ్లాట్స్ సూపర్‌వైజర్‌కి, వాచ్‌మన్‌కి ఫోన్ చేశాడు. ఎవరూ తీయలేదు. ఆ టవల్‌తోనే సూపర్ వైజర్ ఫ్లాట్‌కి వెళ్ళిపోయాడు. సూపర్‌వైజర్ కంగారు పడ్డాడు. నీళ్ళు రావడం లేదని ప్రత్యక్షంగా చూపించడానికి వచ్చాడో, లేక ఆ వంకన ఇంట్లో ఆడవాళ్ళ ముందు అతను తన శరీరాన్ని ప్రదర్శించడానికి వచ్చాడో.. అర్థం కాక బెంబేలెత్తి పోయాడు.
తనే వెళ్లి మోటర్ ఆన్ చేసి వచ్చాడు సూపర్‌వైజర్. ‘రక్షాబంధన్ రోజున సిస్టర్ ఇంట్లో ఉంటారు కదా.. వచ్చి రాఖీ కట్టించుకుంటాను’ అని అతను చెప్పగానే సూపర్‌వైజర్ మనసు కుదుటపడింది. అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి భార్య అప్పటికే లేచి ఉంది. కాఫీ పెడుతోంది. ఊరందరికీ శుభోదయాలు చెప్పిన అతను భార్యని చూసి, పలకరింపుగా కూడా నవ్వలేదు. ఆమె కూడా దానికోసం ఎదురు చూస్తున్నట్లు లేదు. కాఫీ తీసుకొచ్చి అతని చేతికి ఇచ్చింది. నిన్న ఇంట్లో జరిగిన సంఘటనలు ఏవో చెప్పబోయింది. అతను కేవలం ఆమెకి దొరికేది ఈ కాఫీలు, టీల టైమ్‌లోనే.. లేదంటే తినేటప్పుడు.
‘తినేటప్పుడు నోర్మూసుకుని ఉంటామనేనా ఆడవాళ్ళు ఎప్పుడూ ఈ సమయాల్లోనే కంప్లయింట్లు, కబుర్లు చెబుతుంటారు’ అని చాలాసార్లు కసురుకున్నాడతను. ఆమె చెప్పింది అతను విన్నాడో.. లేదో తెలియదు. ‘సాయంత్రం మాట్లాడుకుందాం. ఊ– ఆఫీస్‌కి టైమవుతోంది’ అని బయల్దేరాడతను.
ఏదన్నా అదృశ్యశక్తి, గాల్లోకి ఎగిరే శక్తి ఉంటే– భర్తకి తెలియకుండా అనుసరించాలనే ఆమెకి చాలాసార్లు అన్పిస్తుంటోంది. తనతోనే ఇలా ముభావంగా ఉంటాడా? ప్రపంచంతో కూడా ఇలాగే ఉంటాడా? పెళ్ళయిన ఏడాదిన్నర నుంచి ఆమెకి ఇదే అనుమానం. ఆ క్షణం కూడా అలాగే అనుకుంది. అది తథాస్తు దేవతల టైమ్ అయి ఉంటుంది, నిజమై కూర్చుంది. ఆమెకి ఆ రెండు శక్తులూ వచ్చాయి.
తనకీ తెలియకుండా ఆశ్చర్యంగా అతడ్ని అనుసరిస్తోంది. లిఫ్ట్ దిగిన అతను.. వాచ్‌మన్ భార్యని నవ్వుతూ పలకరించాడు... ‘ఎప్పుడు వెళ్తున్నావు ఊరు? అన్నిరోజులు నాగాయేగా.. నీ బదులు వేరే పనిమనిషిని చూడు.. డబ్బులేదన్నా కావాలంటే తీసుకో’ అని కార్లో కూర్చుకున్నాడు. పక్కకారు అతడ్ని నవ్వుతూ పలకరించాడు.
ఆమె అతని వెనక సీట్లోనే కూర్చింది. కానీ ఆ విషయం అతనికి తెలియలేదు. ఏవేవో ఫోన్లు వస్తున్నాయి. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు, జోక్‌లు వేస్తున్నాడు. ఈ మనిషిలో ఇంత సరదా స్వభావం ఉందా అని ఆశ్చర్యపోతోంది. ఆఫీస్‌కి చేరుకున్నాడు. కొలీగ్స్‌ని నవ్వుతూ పలకరిస్తున్నాడు. కాఫీ వెండింగ్ మెషిన్ దగ్గర నిలబడి, కాఫీ తాగుతూ, వాళ్ళ వ్యక్తిగత విషయాలు చర్చిస్తున్నాడు. ఈలోగా బాస్ పిలిచాడు. ఆమె వెనకే వెళ్ళింది.
బాస్ అతడ్ని దారుణంగా తిట్టాడు. బూతులు ఒకటే తక్కువ. ‘గౌరవప్రదంగా వినబడే ఇంగ్లిష్ మాటలతో కూడా ముఖం మీద అలా ఉమ్మేయ వచ్చా?’ అన్పించింది ఆమెకు. భర్త రియాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాఫీ డికాక్షన్‌లో తేడా వచ్చినా, వంట రుచుల్లో ఏదన్నా తగ్గినా ముఖం మీదే విసిరేస్తాడతను. ఇప్పుడేం చేస్తాడు మొగుడు? పేపర్ వెయిట్ బాస్ ముఖం మీద విసిరేస్తాడా? ఈ ఉద్యోగం నాకొద్దు అని రిజిగ్నేషన్ లెటర్ మెయిల్ చేస్తాడా?
‘ఏమీ జరగలేదు. అతని శరీరంలో చీమూ– నెత్తురూ లేనట్లుగా, ఒక బానిసత్వం లాంటి నటన మాత్రమే అతని నరనరాన ప్రవహిస్తున్నట్లుగా– బాస్‌కి పదేపదే క్షమాపణలు చెప్పుకున్నాడు. బాస్‌కి అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టే – తమ తప్పులు వెదకగలిగాడన్నాడు’ తగిన సమయం ఇస్తే తప్పు సరిదిద్దుకుంటానన్నాడు.
ఆ రోజు తన భార్య బర్త్ డే కాబట్టి బాస్‌కి పార్టీ ఇద్దామనుకుంటున్నట్లు చెప్పాడు.
ఆమె ఆశ్చర్యపోయింది. నిజంగానే ఆ రోజు తన పుట్టినరోజు, తమ పెళ్ళిరోజే గుర్తుండదు అతనికి. ఇక పుట్టిన రోజుకి ఎక్కడ అవకాశం ఉంది! ఇంట్లో కాకుండా పబ్‌లో పార్టీ చేసుకుందామన్నాడు బాస్. ఆమెకి భర్తమీద జాలి వేసింది. చంద్రమతి మాంగల్యంలా భర్తల వెన్నెముకలు, పురుషాహంకారాలు భార్యలకి తప్ప మరెవరికీ కనబడదేమో.
ఆ తర్వాత అతని బావమరిది ఆఫీస్‌కి వచ్చి కలిశాడు. లోగడ ఏవో ఆస్తుల విషయంలో మోసం చేశాడని ఆ బావమరిదిని దూరం పెట్టాడు.
ఇప్పుడు ఆ బావమరిది కొంటున్న కోటిన్నర విల్లాకి ష్యూరిటీ పెట్టమని వచ్చాడు. ఆ మోసం, ద్రోహం ఏ మాత్రం గుర్తులేనట్లు అతను బావమరిది తీసుకొచ్చిన కాగితాల మీద సంతకం పెట్టాడు. ఆమెకి కోపం వచ్చినా, తమాయించుకుంది. కర్ణుడికి కవచ కుండలాలు లాగా– నవ్వుని ముఖానికి మొగుడు ఎలా కుట్టేసుకున్నాడో అర్థం కావడంలేదామెకి.
తనతోనేనా ఈ రుసరుసలు? తెలియని బాధ ఆమెలో సుడులు తిరిగింది. ఆ తర్వాత ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎవరెవరో కలుస్తున్నారు. రకరకాల భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు. అధిక శాతం, కోపం, చిరాకు, అసహనం– వెటకారం, అవహేళన, అవమానించడం. కానీ అతనిలో చిరునవ్వు చెక్కు చెదరడం లేదు. ముఖానికి ఎంత బలమైన ముసుగు వేసుకుని ఉన్నాడంటే– అతనిలో ప్రేమ, శాంతం, దయాగుణం, సహనం తప్ప మరేమీ తెలియనట్లుగా ఉన్నాడు.
ఆఫీస్ అయింది. ఆ తర్వాత బాస్‌తో పబ్‌లో పార్టీ అయింది. ఆమె అతనికి తెలియకుండానే ఇంటికి వచ్చేసింది. జరిగిందంతా నిజమేనా అన్పిస్తోంది. ఎప్పుడో రాత్రి పదకొండు గంటలకు అతను ఇంటికొచ్చాడు. రాగానే ఆమె మీద అరిచాడు. అన్నం ప్లేటు విసిరేశాడు. ప్రతిరాత్రి అతని ప్రవర్తనకి ఆమెకి భయం వేసేది, అసహ్యం వేసేది. అతను ఒక కోపిష్టిలా, శాడిస్ట్‌లా కన్పించేవాడు.
కానీ అతనికి మరో రూపం ఉంది. అందరితో అంత మృదువుగా, మర్యాదగా ఉండే అతను తనతోనే ఇంత కరుకుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అదే అడిగింది– ‘అందరితోనూ బాగానే ఉంటారు కదా.. నాతోనే ఎందుకిలా?’ అని నిలదీసింది. తను ఆ రోజంతా గమనించిన విషయాలు చెప్పింది. అతను మొదట ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ తర్వాత తేరుకుని ‘అదంతా నటన.. ఏ ఒక్క మాటా, చేత, భావం– ఏదీ నిజం కాదు. నన్ను నేను ఈ దిక్కుమాలిన ప్రపంచం నుంచి కాపాడుకోవడానికి వేసుకున్న ముసుగులు’ అన్నాడు.
‘ఆ ముసుగుతోనే నన్నూ కాస్త ప్రేమించరాదూ నటన అయినా ఫర్లేదు. ఈ నిజమైన కోపం కన్నా నాటకమైన ప్రేమకావాలి’ అని అర్థించింది ఆమె. అతనికి కన్నీళ్ళు ముంచుకొచ్చాయి. ‘రోజంతా.. లోకమంతా నా నటనే. కనీసం నా ఇంట్లో అయినా, నేనెంతో ప్రేమించే నీ ముందు అయినా నన్ను నన్నులా ఉండనివ్వవా? నీకూ నా ముసుగు ముఖమే కావాలా’ అని రోదించాడు.
ఆమె బదులు చెప్పలేదు. అతను కోరుకుంటున్నది ఆమె భరించలేదు. ఆమె కోరుకుంటున్నది అతను ఎన్నడూ ఇవ్వలేకపోవచ్చు. ఎప్పటిలానే– కొన్ని వందల రొటీన్ రాత్రుల్లాగే– ఆ పరాయి జీవితాలు ఓ పక్కకి చేరాయి. ఇద్దరూ చెరోవైపు తిరిగి పడుకున్నారు. ఇద్దరి మధ్య ఆ దూరం అలాగే ఉంది.
-తోట ప్రసాద్
చదవండి: The Bellaire House: నిజంగా నిజమిది.. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయంటే!
Comments
Please login to add a commentAdd a comment