Inspirational Story All Time Great Swimmer Michael Phelps Biography - Sakshi
Sakshi News home page

Michael Phelps: బంగారు చేప.. చరిత్రలో నిలిచిపోయిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్విమ్మర్‌

Published Sun, Feb 12 2023 1:34 PM | Last Updated on Sun, Feb 12 2023 4:38 PM

Inspirational Story All Time Great Swimmer Michael Phelps Biography - Sakshi

ఒకటి, రెండు, మూడు, నాలుగు.. ఆ సంఖ్య పెరిగుతూనే ఉంది.. పది దాటాయి, ఇరవై కూడా చిన్నదిగా మారిపోయింది.. చెబుతోంది అల్లాటప్పా విజయాల సంఖ్య కాదు..అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్‌ పతకాల గురించి.. ప్రపంచ క్రీడా సంబరంలో ఒక్క పతకం సాధిస్తే జీవితం ధన్యమయినట్లుగా భావించే ఆటగాళ్లు ఎందరో! ఏకంగా 28 ఒలింపిక్స్‌ పతకాలు.. అందులో 23 స్వర్ణాలు అంటే అతను సాధించింది మహాద్భుతం! నీటి కొలనును.. రికార్డులను మంచినీళ్ల ప్రాయంలా మార్చుకున్న అతనే మైకేల్‌ ఫెల్ప్స్‌ .. ప్రపంచ స్విమ్మింగ్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్విమ్మర్‌!!

ప్రఖ్యాత ఆస్ట్రేలియన్‌ స్విమ్మర్‌ ఇయాన్‌ థోర్ప్‌ను టీనేజ్‌లో ఫెల్ప్స్‌ ఎంతగానో అభిమానించాడు, ఆరాధించాడు. ఒలింపిక్స్‌  స్విమ్మింగ్‌లో 5 స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు థోర్ప్‌ సొంతం. సరిగ్గా థోర్ప్‌ ముగించిన చోటునుంచే ఫెల్ప్స్‌ కొనసాగించాడు. థోర్ప్‌లాంటి స్విమ్మర్‌ మళ్లీ రాకపోవచ్చని అనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి ఫెల్ప్స్‌ దూసుకొచ్చాడు.

2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో థోర్ప్‌తో పోటీ పడి పతకాలు గెలుచుకున్న అతను.. ఆ తర్వాతి మూడు ఒలింపిక్స్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ పతకాల పంట పండించాడు. ఫెల్ప్స్‌ ఎంత అద్భుతమైన స్విమ్మర్‌ అయినా ఒకే ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు గెలవడం అసాధ్యమని థోర్ప్‌ పోటీలకు ముందు వ్యాఖ్యానించాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సమయంలో ఈ వ్యాఖ్యను తన గది లాకర్‌పై రాసుకున్న ఫెల్ప్స్‌.. దానిని చూస్తూ ప్రతిరోజూ స్ఫూర్తి పొందాడు. చివరకు దానిని చేసి చూపించాడు.

ఏకంగా ఎనిమిది స్వర్ణాలతో సంచలనం సృష్టించాడు. వాటన్నింటిలోనూ అతను ఒలింపిక్స్‌ రికార్డులను నెలకొల్పి మరీ పతకాలు కొట్టాడు. తాను ఎనిమిదో స్వర్ణం గెలిచిన చివరి రేసు 4X100 మీటర్‌ మెడ్లీ రిలేలో ఫెల్ప్స్‌ రేస్‌ పూర్తి కాగానే స్విమ్మింగ్‌ పూల్‌ బయట అతడిని అందరికంటే ముందుగా అభినందించింది థోర్ప్‌ కావడం విశేషం. ‘మీరు కనే కలలు కూడా చాలా పెద్దవిగా ఉండాలి. ఎందుకంటే నా దృష్టిలో ఏదీ అసాధ్యం కాదు. నేనిప్పుడు అలాంటి కలల ప్రపంచంలో ఉన్నాను’ అని తన విజయాల అనంతరం 23 ఏళ్ల ఫెల్ప్స్‌ వ్యాఖ్యానించాడు.

గురువు తోడుగా..
తొమ్మిదేళ్ల వయసులో ఫెల్ప్స్‌ తల్లిదండ్రులు విడిపోయారు. ఇది తర్వాతి రోజుల్లో తనపై, తన ఇద్దరు అక్కలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించిందని అతను చెప్పుకున్నాడు. ఎవరూ పట్టించుకోకుండా వదిలేస్తే వచ్చే మానసిక వ్యాధి (అటెన్షన్‌ డెఫిషిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌)కి కూడా ఒక దశలో ఫెల్ప్స్‌ గురయ్యాడు. అయితే అతడి అన్ని బాధలకు స్విమ్మింగ్‌పూల్లో ఉపశమనం లభించింది. సరదాగా ఈత నేర్చుకుంటే బాగుంటుందని సన్నిహితులు కొందరు చెప్పడంతో పూల్లోకి దిగిన అతనికి అప్పుడు తెలీదు దానితో తన జీవితమే మారిపోనుందని.

తన స్వస్థలం బాల్టిమోర్‌లోని ఒక అక్వాటిక్‌ క్లబ్‌లో అతని ఈత మొదలైంది. అయితే అక్కడి కోచ్‌ బాబ్‌ బోమన్‌ ఈ కుర్రాడి ఈతలో అసాధారణ ప్రతిభను గుర్తించాడు. కేవలం సరదాగా ఆడుకొని వెళ్లిపోకుండా ఆ స్విమ్మింగ్‌ టైమింగ్‌ను నమోదు చేసి పోటీతత్వాన్ని పెంచాడు. దాంతో పదేళ్ల వయసులోనే ఫెల్ప్స్‌ పేరిట కొత్త జాతీయ రికార్డు నమోదైంది. అది మొదలు లెక్కలేనన్ని రికార్డులు అలవోకగా అతని వెంట వచ్చాయి.

నీటి కొలనులో అలసట లేకుండా సాగిన ఆ ఈత అద్భుతాలను చూపించింది. ప్రపంచాన్ని శాసించే వరకు సాగిన ఈ మొత్తం ప్రయాణంలో అతను తన కోచ్‌ బోన్‌ను ఏనాడూ వీడలేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, ఎక్కడ కోచ్‌గా ఉంటే అక్కడికి వెళ్లి తన ఆటను కొనసాగించాడు. తనకు స్విమ్మర్‌గా అనుమతిలేని చోట కూడా కోచ్‌కు అసిస్టెంట్‌గా, స్వచ్ఛందంగా వెళ్లిపోయి ఆయనతో కలసి నడిచాడు. 

ఒలింపిక్‌ ప్రయాణం..
15 ఏళ్ల వయసులోనే ఫెల్ప్స్‌ ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌ ప్రస్థానం మొదలైంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అమెరికా స్విమ్మింగ్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న అతను ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో పతకం నెగ్గలేకపోయినా ఆ సమయంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ కుర్రాడు తర్వాతి ఒలింపిక్స్‌ సమయానికి మండుతున్న అగ్నికణికలా మారాడు.

2004 ఏథెన్స్‌లోనే ఆరు స్వర్ణాలతో అగ్రస్థానాన నిలిచిన అతను మరో నాలుగేళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తులో శిఖరాన నిలిచాడు. ఫేవరెట్‌గానే బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహాలు లేకున్నా.. ఎనిమిది స్వర్ణాల ఘనత అందుకుంటాడా అనే సందేహాలు అందరిలో ఉండేవి. కానీ తానేంటో బీజింగ్‌ ఒలిపింక్స్‌లో చూపించాడు. ఆ జోరు 2012లో లండన్‌ ఒలింపిక్స్‌ మీదుగా 2016 రియో ఒలింపిక్స్‌ వరకు సాగింది. 2012 ఒలింపిక్స్‌ తర్వాత ఇక చాలు అంటూ రిటైర్మెంట్‌ ప్రకటించినా.. తనలో సత్తా తగ్గలేదని చూపిస్తూ మళ్లీ తిరిగొచ్చి ఒలింపిక్స్‌లో అదరగొట్టడం విశేషం. ఎట్టకేలకు రియో క్రీడల తర్వాత 31 ఏళ్ల వయసులో సగర్వంగా అతను పూల్‌కు గుడ్‌బై చెప్పాడు. 

రికార్డులే రికార్డులు..
మైకేల్‌ ఫెల్ప్స్‌ సాధించిన, సృష్టించిన రికార్డుల గురించి ఒక ప్రత్యేక అధ్యాయామే చెప్పవచ్చు. ఫ్రీస్టయిల్,  బటర్‌ఫ్లయ్, బ్యాక్‌ స్ట్రోక్‌.. ఇలా ఈవెంట్ల పేర్లు మారవచ్చు.. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు..  పూల్‌లో దూరాల మధ్య తేడా ఉండవచ్చు. కానీ ఏ రికార్డు ఉన్నా వాటిపై ఫెల్ప్స్‌ పేరు మాత్రం ఘనంగా లిఖించి ఉంటుంది. ప్రపంచ స్విమింగ్‌ సమాఖ్య (ఫెనా) అధికారికంగా గుర్తించిన రికార్డులను చూస్తే.. ఫెల్ప్స్‌ ఖాతాలో ఒక దశలో 39 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. తాను రికార్డు సృష్టించడం, కొద్ది రోజులకు తానే వాటిని స్వయంగా బద్దలు కొట్టడం.. ఇదంతా ఫెల్ప్స్‌ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాయి. వరల్డ్‌ స్విమ్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎనిమిదేళ్లు అతను తన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. 

ఒలింపిక్స్‌లో 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు, ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో 26 స్వర్ణాలు సహా మొత్తం 33 పతకాలు, పాన్‌ పసిఫిక్‌ చాంపియన్‌షిప్‌లో 16 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు.. ఈ జాబితాకు ఫుల్‌స్టాప్‌ లేదు. అతని ఆటలాగే అతని ఆటోబయోగ్రఫీ ‘బినీత్‌ ద సర్ఫేస్‌’ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. చాలా మంది పాశ్చాత్య దేశపు అగ్రశ్రేణి అథ్లెట్లలో కనిపించే చిన్న చిన్న వివాదాలు (ఆల్కహాల్‌ డ్రైవింగ్, స్పీడింగ్‌)వంటివి ఫెల్ప్స్‌ ఖాతాలోనూ ఉన్నా.. అవేవీ అతని గొప్పతనాన్ని తగ్గించేవి కావు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement