Michael Phelps
-
ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏదో తెలుసా..?
పారిస్ వేదికగా జరుగనున్న సమ్మర్ ఒలింపిక్స్ 2024 ఇవాల్టి (జులై 26) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సారి ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 206 దేశాల నుంచి 10714 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 32 క్రీడల్లో 329 విభాగాల్లో విశ్వ క్రీడలు జరుగనున్నాయి. ఇవాళ జరిగే ఓపెనింగ్ సెర్మనీతో పోటీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి ఈ సారి 117 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. పీవీ సింధు, శరత్ కమల్ ఓపెనింగ్ సెర్మనీలో భారత ఫ్లాగ్ బేరర్లుగా ఉంటారు. భారత్ విశ్వ క్రీడల్లో పాల్గొనడం ఇది 26వ సారి. గత ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతాకలు సాధించి, పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. భారత్ సాధించిన పతకాల్లో ఓ స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సారి ఒలింపిక్స్‌లో 16 క్రీడా విభాగాల్లో పోటీపడుతున్న భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో చూడాలి.కాగా, 128 ఏళ్ల ఘన చరిత్ర (1896-2024) కలిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా యూఎస్ఏకి చెందిన మైఖేల్ ఫెల్ప్స్ ఉన్నాడు. ఫెల్ప్స్ 2004-2016 మధ్యలో ఏకంగా 28 మెడల్స్ సాధించాడు. ఇందులో 23 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఫెల్ప్స్ తర్వాత అత్యధిక పతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో లరిసా లాటినినా (సోవియట్ యూనియన్-18), మారిట్ ఝోర్గెన్ (నార్వే-15), నికొలై యాండ్రియానోవ్ (సోవియట్ యూనియన్-15) టాప్-4లో ఉన్నారు.ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ఉంది. యూఎస్ఏ ఇప్పటివరకు జరిగిన 25 ఒలింపిక్స్‌లో 2629 పతకాలు సాధించింది. ఇందులో 1061 స్వర్ణాలు, 830 రజతాలు, 738 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆల్‌టైమ్ పతకాల పట్టికలో (స్వర్ణ పతకాల వారీగా) యూఎస్ఏ తర్వాతి స్థానంలో సోవియట్ యూనియన్ (1010), గ్రేట్ బ్రిటన్ (916), చైనా (636), ఫ్రాన్స్ (751), ఇటలీ (618), జర్మనీ (655), హంగేరీ (511), జపాన్ (497), ఆస్ట్రేలియా (547) టాప్-10లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 56వ స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్‌లో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్య పతకాలు (35) సాధించింది. -
చరిత్ర సృష్టించిన కేటీ.. మైఖేల్ ఫెల్ప్స్ రికార్డు బద్ధలు
26 ఏళ్ల అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ చరిత్ర సృష్టించింది. జపాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 16 స్వర్ణ పతాకాలు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రికార్డు దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (15) పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కేటీ.. ఫెల్ప్స్ రికార్డు బద్దలు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇవాళ (జులై 30) జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్లో స్వర్ణం గెలవడం ద్వారా లెడెకీ ఈ ఘనత సాధించింది. 800 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం కైవసం చేసుకున్న లెడెకీ మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పింది. అలాగే ఒకే ఈవెంట్లో అత్యధిక ప్రపంచ ఛాంపియన్షిప్స్ బంగారు పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లోనూ స్వర్ణంతో మెరిసిన కేటీ.. ఇప్పటివరకు తన కెరీర్లో 20 వరల్డ్ ఛాంపియన్షిప్స్ స్వర్ణాలు, 7 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది. మహిళల స్విమ్మింగ్ చరిత్రలో ఏ సిమ్మర్ కేటీ సాధించినన్ని గోల్డ్ మెడల్స్ సాధించలేదు. -
బంగారు చేప.. చరిత్రలో నిలిచిపోయిన ఆల్‌టైమ్ గ్రేట్ స్విమ్మర్
ఒకటి, రెండు, మూడు, నాలుగు.. ఆ సంఖ్య పెరిగుతూనే ఉంది.. పది దాటాయి, ఇరవై కూడా చిన్నదిగా మారిపోయింది.. చెబుతోంది అల్లాటప్పా విజయాల సంఖ్య కాదు..అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ పతకాల గురించి.. ప్రపంచ క్రీడా సంబరంలో ఒక్క పతకం సాధిస్తే జీవితం ధన్యమయినట్లుగా భావించే ఆటగాళ్లు ఎందరో! ఏకంగా 28 ఒలింపిక్స్ పతకాలు.. అందులో 23 స్వర్ణాలు అంటే అతను సాధించింది మహాద్భుతం! నీటి కొలనును.. రికార్డులను మంచినీళ్ల ప్రాయంలా మార్చుకున్న అతనే మైకేల్ ఫెల్ప్స్ .. ప్రపంచ స్విమ్మింగ్ చరిత్రలో ఆల్‌టైమ్ గ్రేట్ స్విమ్మర్!! ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఇయాన్ థోర్ప్‌ను టీనేజ్‌లో ఫెల్ప్స్ ఎంతగానో అభిమానించాడు, ఆరాధించాడు. ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో 5 స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు థోర్ప్ సొంతం. సరిగ్గా థోర్ప్ ముగించిన చోటునుంచే ఫెల్ప్స్ కొనసాగించాడు. థోర్ప్లాంటి స్విమ్మర్ మళ్లీ రాకపోవచ్చని అనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి ఫెల్ప్స్ దూసుకొచ్చాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో థోర్ప్తో పోటీ పడి పతకాలు గెలుచుకున్న అతను.. ఆ తర్వాతి మూడు ఒలింపిక్స్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ పతకాల పంట పండించాడు. ఫెల్ప్స్ ఎంత అద్భుతమైన స్విమ్మర్ అయినా ఒకే ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు గెలవడం అసాధ్యమని థోర్ప్ పోటీలకు ముందు వ్యాఖ్యానించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో ఈ వ్యాఖ్యను తన గది లాకర్‌పై రాసుకున్న ఫెల్ప్స్.. దానిని చూస్తూ ప్రతిరోజూ స్ఫూర్తి పొందాడు. చివరకు దానిని చేసి చూపించాడు. ఏకంగా ఎనిమిది స్వర్ణాలతో సంచలనం సృష్టించాడు. వాటన్నింటిలోనూ అతను ఒలింపిక్స్ రికార్డులను నెలకొల్పి మరీ పతకాలు కొట్టాడు. తాను ఎనిమిదో స్వర్ణం గెలిచిన చివరి రేసు 4X100 మీటర్ మెడ్లీ రిలేలో ఫెల్ప్స్ రేస్ పూర్తి కాగానే స్విమ్మింగ్ పూల్ బయట అతడిని అందరికంటే ముందుగా అభినందించింది థోర్ప్ కావడం విశేషం. ‘మీరు కనే కలలు కూడా చాలా పెద్దవిగా ఉండాలి. ఎందుకంటే నా దృష్టిలో ఏదీ అసాధ్యం కాదు. నేనిప్పుడు అలాంటి కలల ప్రపంచంలో ఉన్నాను’ అని తన విజయాల అనంతరం 23 ఏళ్ల ఫెల్ప్స్ వ్యాఖ్యానించాడు. గురువు తోడుగా.. తొమ్మిదేళ్ల వయసులో ఫెల్ప్స్ తల్లిదండ్రులు విడిపోయారు. ఇది తర్వాతి రోజుల్లో తనపై, తన ఇద్దరు అక్కలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించిందని అతను చెప్పుకున్నాడు. ఎవరూ పట్టించుకోకుండా వదిలేస్తే వచ్చే మానసిక వ్యాధి (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కి కూడా ఒక దశలో ఫెల్ప్స్ గురయ్యాడు. అయితే అతడి అన్ని బాధలకు స్విమ్మింగ్‌పూల్‌లో ఉపశమనం లభించింది. సరదాగా ఈత నేర్చుకుంటే బాగుంటుందని సన్నిహితులు కొందరు చెప్పడంతో పూల్‌లోకి దిగిన అతనికి అప్పుడు తెలీదు దానితో తన జీవితమే మారిపోనుందని. తన స్వస్థలం బాల్టిమోర్‌లోని ఒక అక్వాటిక్ క్లబ్లో అతని ఈత మొదలైంది. అయితే అక్కడి కోచ్ బాబ్ బోమన్ ఈ కుర్రాడి ఈతలో అసాధారణ ప్రతిభను గుర్తించాడు. కేవలం సరదాగా ఆడుకొని వెళ్లిపోకుండా ఆ స్విమ్మింగ్ టైమింగ్‌ను నమోదు చేసి పోటీతత్వాన్ని పెంచాడు. దాంతో పదేళ్ల వయసులోనే ఫెల్ప్స్ పేరిట కొత్త జాతీయ రికార్డు నమోదైంది. అది మొదలు లెక్కలేనన్ని రికార్డులు అలవోకగా అతని వెంట వచ్చాయి. నీటి కొలనులో అలసట లేకుండా సాగిన ఆ ఈత అద్భుతాలను చూపించింది. ప్రపంచాన్ని శాసించే వరకు సాగిన ఈ మొత్తం ప్రయాణంలో అతను తన కోచ్ బోన్‌ను ఏనాడూ వీడలేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, ఎక్కడ కోచ్‌గా ఉంటే అక్కడికి వెళ్లి తన ఆటను కొనసాగించాడు. తనకు స్విమ్మర్‌గా అనుమతిలేని చోట కూడా కోచ్‌కు అసిస్టెంట్‌గా, స్వచ్ఛందంగా వెళ్లిపోయి ఆయనతో కలసి నడిచాడు. ఒలింపిక్ ప్రయాణం.. 15 ఏళ్ల వయసులోనే ఫెల్ప్స్ ఒలింపిక్స్ స్విమ్మింగ్ ప్రస్థానం మొదలైంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అమెరికా స్విమ్మింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతను ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో పతకం నెగ్గలేకపోయినా ఆ సమయంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ కుర్రాడు తర్వాతి ఒలింపిక్స్ సమయానికి మండుతున్న అగ్నికణికలా మారాడు. 2004 ఏథెన్స్‌లోనే ఆరు స్వర్ణాలతో అగ్రస్థానాన నిలిచిన అతను మరో నాలుగేళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తులో శిఖరాన నిలిచాడు. ఫేవరెట్‌గానే బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహాలు లేకున్నా.. ఎనిమిది స్వర్ణాల ఘనత అందుకుంటాడా అనే సందేహాలు అందరిలో ఉండేవి. కానీ తానేంటో బీజింగ్ ఒలిపింక్స్‌లో చూపించాడు. ఆ జోరు 2012లో లండన్ ఒలింపిక్స్ మీదుగా 2016 రియో ఒలింపిక్స్ వరకు సాగింది. 2012 ఒలింపిక్స్ తర్వాత ఇక చాలు అంటూ రిటైర్మెంట్ ప్రకటించినా.. తనలో సత్తా తగ్గలేదని చూపిస్తూ మళ్లీ తిరిగొచ్చి ఒలింపిక్స్‌లో అదరగొట్టడం విశేషం. ఎట్టకేలకు రియో క్రీడల తర్వాత 31 ఏళ్ల వయసులో సగర్వంగా అతను పూల్‌కు గుడ్‌బై చెప్పాడు. రికార్డులే రికార్డులు.. మైకేల్ ఫెల్ప్స్ సాధించిన, సృష్టించిన రికార్డుల గురించి ఒక ప్రత్యేక అధ్యాయామే చెప్పవచ్చు. ఫ్రీస్టయిల్, బటర్‌ఫ్లయ్, బ్యాక్ స్ట్రోక్.. ఇలా ఈవెంట్ల పేర్లు మారవచ్చు.. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు.. పూల్‌లో దూరాల మధ్య తేడా ఉండవచ్చు. కానీ ఏ రికార్డు ఉన్నా వాటిపై ఫెల్ప్స్ పేరు మాత్రం ఘనంగా లిఖించి ఉంటుంది. ప్రపంచ స్విమింగ్ సమాఖ్య (ఫెనా) అధికారికంగా గుర్తించిన రికార్డులను చూస్తే.. ఫెల్ప్స్ ఖాతాలో ఒక దశలో 39 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. తాను రికార్డు సృష్టించడం, కొద్ది రోజులకు తానే వాటిని స్వయంగా బద్దలు కొట్టడం.. ఇదంతా ఫెల్ప్స్ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాయి. వరల్డ్ స్విమ్మర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎనిమిదేళ్లు అతను తన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ఒలింపిక్స్‌లో 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు, ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో 26 స్వర్ణాలు సహా మొత్తం 33 పతకాలు, పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో 16 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు.. ఈ జాబితాకు ఫుల్స్టాప్ లేదు. అతని ఆటలాగే అతని ఆటోబయోగ్రఫీ ‘బినీత్ ద సర్ఫేస్’ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. చాలా మంది పాశ్చాత్య దేశపు అగ్రశ్రేణి అథ్లెట్లలో కనిపించే చిన్న చిన్న వివాదాలు (ఆల్కహాల్ డ్రైవింగ్, స్పీడింగ్)వంటివి ఫెల్ప్స్ ఖాతాలోనూ ఉన్నా.. అవేవీ అతని గొప్పతనాన్ని తగ్గించేవి కావు. -
అప్పుడు అబద్ధం.. ఇప్పుడు ఓటమి.. కన్నీళ్లతో గుడ్‌బై!
తప్పులు.. చేసిన పాపాలు దాగవు. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలూ సాగవు. ఏదో ఒక నాటికి శిక్ష అనుభవించాల్సిందే. అమెరికన్ స్విమ్మర్ ర్యాన్ లోక్టి విషయంలో ఇదే జరిగింది. ఒలింపిక్స్‌లో పన్నెండు మెడల్స్.. 27 ప్రపంచ ఛాంపియన్‌షిష్ టోర్నీలో గెలిచిన ఘనత ఈయనది. కానీ, వరుస విజయాల ట్రాక్ నుంచి పక్కకు తప్పి.. అబద్ధం, తప్పులు, అవమానాల మీదుగా సాగి చివరికి ఓటమితో ఈ దిగ్గజం కెరీర్ ముగింపు దశకు చేరింది. ర్యాన్ స్టీవెన్ లోక్టి.. అమెరికన్ స్విమ్మర్. ఒకప్పుడు ఛాంపియన్, స్విమ్మింగ్ హీరో. కానీ, తనను తానే పాతాళానికి తొక్కేసుకున్నాడు. తాజాగా టోక్యో ఒలంపిక్స్ కోసం జరిగిన 200 మీటర్ల క్వాలిఫైయింగ్ పోటీల్లో ఏడో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా ఒలంపిక్స్ అర్హతను కోల్పోయాడాయన(తొలి ఇద్దరికి మాత్రమే అవకాశం). ఈ ఓటమి తర్వాత లోక్టి మీడియా ముందుకొచ్చాడు. ఐదు నిమిషాలపాటు ఏకబిగిన కన్నీళ్లు పెట్టుకుని.. మౌనంగా కుటుంబ సభ్యులతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న మరో దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్.. లోక్టిని అడ్డుకుని హత్తుకుని సాగనంపాడు. ఇక లోక్టి ఒలింపిక్స్ కెరీర్ ఇక ముగిసినట్లేనని యూఎస్ స్విమ్మింగ్ అసోషియేషన్ ప్రకటించింది. అయితే ఆయన ఇక మీదట ఏ పోటీల్లోనూ కనిపించకపోవచ్చని అతని గర్ల్‌ఫ్రెండ్ కయ్లా ప్రకటించింది. తప్పతాగి.. అబద్ధం 2004 ఒలింపిక్స్ ట్రయల్స్‌లో మైకేల్ ఫెల్ప్స్ తర్వాతి ప్లేస్‌లో నిలిచి.. ఏథెన్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో ర్యాన్ లోక్టి పేరు మారుమోగింది. అప్పటి నుంచే ఫెల్ప్స్తో లోక్టి మధ్య ప్రొఫెషనల్ శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాత మెడల్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ విజయాలతో నడుమ లోక్టి కెరీర్ దిగ్విజయంగా సాగింది. ఈత కొట్టే టైంలో ‘యే’ అంటూ అతను అరిచే అరుపు అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే 2016 రియో ఒలింపిక్స్ టైంలో జరిగిన ఘటన అతని ప్రతిష్టను దారుణంగా తొక్కొపడేసింది. తోటి ప్లేయర్లతో తప్పతాగి ఓ గ్యాస్ స్టేషన్‌కు వెళ్లిన లోక్టి.. అక్కడి సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ఆ స్టేషన్ బయట మూత్రం పోసి, అక్కడి బాత్రూంని ధ్వంసం చేశాడు. ఆ తర్వాతి ఉదయం తుపాకులతో వచ్చిన దుండగులు కొందరు తమను బెదిరించి.. దోపిడీకి పాల్పడ్డారని అబద్ధం చెప్పాడు. దీంతో లోక్టి మీద అందరికీ సానుభూతి మొదలైంది. అయితే ఆటగాళ్ల భద్రత గురించి పలు దేశాలు ఒలింపిక్స్ నిర్వాహకులను ప్రశ్నించాయి. దీంతో కొన్నాళ్లపాటు నిర్వాహకులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తీవ్ర ఎత్తున విమర్శలు రావడంతో అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టగా.. చివరికి లోచ్టె చెప్పిందంతా అబద్ధం అని తేలింది. వరుస నిషేధాలు రియో ఘటనలో సెక్యూరిటీ గార్డులకు డబ్బులిచ్చి ఈ వ్యవహారాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు లోక్టిపై వచ్చాయి. ఈ నేరం రుజువు కావడంతో అతని నుంచి పరువు నష్టం దావా కింద భారీ ఫైన్ రాబట్టింది ఒలింపిక్స్ కమిటీ. అంతేకాదు యూఎస్ స్విమ్మింగ్ అసోషియేషన్ 10 నెలల నిషేధం విధించింది. ఇక ఈ వివాదం చల్లారకముందే 2018లో మోతాదుకు మించి డ్రగ్స్ ఉపయోగించాడని ఆంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్ధారించగా.. ఆ కేసులో 14 నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. ఈ వివాదాలన్నింటి తర్వాత రిహాబ్ సెంటర్లో కొన్నాళ్లపాటు గడిపిన లోక్టి.. ఇంకొన్నాళ్లు కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తిరిగి కిందటి ఏడాది మళ్లీ స్విమ్మింగ్ ట్రాక్‌లోకి దిగినప్పటికీ.. మునుపటిలా ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యువ స్విమ్మర్ల మధ్య పోటీలో ఓడిపోయి.. ఆ అవమానాన్ని దిగమింగుకోలేక భావోద్వేగపు పశ్చాత్తాపంతో కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు ఒకప్పటి స్విమ్మింగ్ ఛాంపియన్. -
బ్యాట్ పట్టిన బంగారు చేప
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ స్విమ్మర్, ఆల్‌టైమ్ గ్రేట్ ఒలింపియన్ మైకేల్ ఫెల్ప్స్ సరదాగా క్రికెట్ బ్యాట్ పట్టాడు. వాణిజ్య ప్రచార కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ఉన్న అతను... ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లతో బుధవారం కొంత సమయం గడిపాడు. మంగళవారం ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా అతను స్టేడియంలో కూర్చొని చూశాడు. క్రికెట్ ఆట ఆసక్తికరంగా అనిపించినా... ఆడటం మాత్రం తన వల్ల కాదని అతను నవ్వుతూ చెప్పాడు. ‘ఐపీఎల్ మ్యాచ్‌లో సిక్సర్లను ఆస్వాదిం చాను. ఆటలో కొన్ని నిబంధనలు ఆసక్తికరంగా అనిపించాయి. ప్రేక్షకుల ఉత్సాహం మాత్రం చాలా బాగుంది. బ్యాట్‌ను పట్టుకోవడం మొదలు మరికొన్ని చిట్కాలు ఇవాళ నేర్చుకున్నాను. వచ్చేసారి భారత్‌కు వచ్చినప్పుడు మాత్రం క్రికెట్ గురించి బాగా తెలుసుకొని వస్తా’ అని ఫెల్ప్స్ వ్యాఖ్యానిం చాడు. కావాల్సినన్ని రోజులు తన ఇంట్లో ఉండి ఫెల్ప్స్ క్రికెట్ నేర్చుకోవచ్చని రిషభ్ పంత్ సరదాగా చెప్పగా... తాను నేర్చుకోగలనని నమ్మినందుకు అతను కృతజ్ఞతలు చెప్పాడు. ఫెల్ప్స్ లాంటి దిగ్గజంతో సమయం గడిపే అవకాశం రావడం పట్ల క్రిస్ మోరిస్, ఇషాంత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. 2004–2016 మధ్య నాలుగు ఒలింపిక్స్‌లలో కలిపి ఫెల్ప్స్ 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు గెలుచుకున్నాడు. -
రియో పతకాలే అమూల్యం
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో 6 పతకాలు సాధించడం గొప్ప అనుభూతి అని అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం, 28 ఒలింపిక్స్ పతకాల విజేత మైకేల్ ఫెల్ప్స్ గుర్తు చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం భారత్ వచ్చిన ఈ దిగ్గజ స్విమ్మర్ తన రిటైర్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోనని స్పష్టం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ తను బరిలోకి దిగిన 8 ఈవెంట్లలోనూ స్వర్ణాలను సాధించడం విశేషం. రియోలో 5 స్వర్ణాలే గెలుచుకున్నప్పటికీ ఈ ప్రదర్శన... బీజింగ్ ప్రదర్శనకు ఏమాత్రం తీసిపోదని చెప్పుకొచ్చాడు. ‘గణాంకాల ప్రకారం బీజింగ్ ఒలింపిక్స్ గొప్ప. కానీ 2012 లండన్ ఒలింపిక్స్ అనంతరం నా వ్యక్తిగత జీవితం బాగో లేదు. డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఓ దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించా. కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించా. అనంతరం 2014లో మళ్లీ స్విమ్మింగ్‌ను మొదలుపెట్టాక రియో వరకు నా ప్రయాణం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎన్నో ఆటు పోట్ల అనంతరం నాపై నేను నమ్మకాన్ని కోల్పోకుండా రియోలో పతకాలు సాధించా. అందుకే రియో ప్రదర్శనే నాకు ముఖ్యం’ అని ఫెల్ప్స్ వివరించాడు. -
మెరిశారు మురిపించారు
అంతర్జాతీయ క్రీడాంగణంలో ఈ ఏడాదీ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. రియో ఒలింపిక్స్ అందరి దృష్టిని ఆకర్షించగా... విశ్వక్రీడల వేదికపై అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ పలువురు స్టార్ క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిశారు. అభిమానులను మురిపించారు. కొత్త ప్రత్యర్థులు వచ్చినా... కొత్త తారలు తెరపైకి వచ్చినా తమ ఉనికిని చాటుకుంటూ వారందరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అథ్లెటిక్స్‌లో ఉసేన్ బోల్ట్, స్విమ్మింగ్‌లో మైకేల్ ఫెల్ప్స్, టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్... ఇలా పేరున్న వారందరూ ఈ ఏడాదిలో తమ అద్భుత ఆటతీరుతో అలరించారు. – సాక్షి క్రీడావిభాగం ఎదురులేని బోల్ట్ సమకాలీన అథ్లెటిక్స్‌లో తనకు ఎదురులేదని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మరోసారి నిరూపించుకున్నాడు. రియో ఒలింపిక్స్ వేదికగా బోల్ట్ మూడు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో మాదిరిగానే రియోలోనూ బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి వరుసగా మూడోసారి ‘ట్రిపుల్’ సాధించాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో అవే విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా బోల్ట్ రికార్డు నెలకొల్పాడు. కొత్తగా ప్రపంచ రికార్డులు సాధించకపోయినా అతనికి తన ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ ఎదురుకాకపోవడం విశేషం. వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత వీడ్కోలు పలుకుతానని ఈ జమైకా స్టార్ ప్రకటించాడు. ‘బంగారు చేప’ వీడ్కోలు... ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధిస్తేనే కెరీర్ ధన్యమైపోయిందని భావించే క్రీడాకారులు ఎందరో ఉన్నారు. కానీ అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మాత్రం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం ఇంత సులువా అని తన అద్వితీయ ప్రతిభతో అబ్బురపరిచాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రియో ఒలింపిక్స్‌కు సిద్ధమైన ఫెల్ప్స్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం సాధించి తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలికాడు. ఈ ప్రదర్శనతో 31 ఏళ్ల ఫెల్ప్స్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఫెల్ప్స్ 23 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలు గెలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ‘డ్రాగన్’ జోరుకు బ్రేక్... బ్యాడ్మింటన్‌లో ఈ ఏడాది చైనా జోరుకు చెక్ పడింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్... డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సన్ సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. సీజన్‌లోని మొత్తం 12 సూపర్ సిరీస్ టోర్నీలలో పురుషుల సింగిల్స్‌లో మూడు... మహిళల సింగిల్స్‌లో రెండు టైటిల్స్ మాత్రమే చైనా క్రీడాకారులకు దక్కాయి. చైనా దిగ్గజం లిన్ డాన్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని ఆశించిన లిన్ డాన్ రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో అక్సెల్సన్ చేతిలో ఓడిపోయాడు. మహిళల ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఒక్క సూపర్ సిరీస్ టైటిల్ సాధించకపోయినా రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సంపాదించింది. రోస్‌బర్గ్... రయ్ రయ్... ఫార్ములావన్ (ఎఫ్1)లో ఈసారీ మెర్సిడెస్ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌ను వెనక్కినెట్టి మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్ విశ్వవిజేతగా నిలిచాడు. సీజన్‌లోని 21 రేసుల్లో రోస్‌బర్గ్ తొమ్మిది రేసుల్లో గెలిచి, మరో ఏడు రేసుల్లో టాప్–3లో నిలిచి మొత్తం 385 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. 10 రేసుల్లో గెలిచినప్పటికీ హామిల్టన్ (380 పాయింట్లు) మిగతా రేసుల్లో ఆశించిన రీతిలో రాణించకపోవడంతో చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 1982లో రోస్‌బర్గ్ తండ్రి కేకె రోస్‌బర్గ్ ఎఫ్1 చాంపియన్‌గా నిలువగా... 34 ఏళ్ల తర్వాత అతని తనయుడు నికో అదే ఫలితాన్ని సాధించడం విశేషం. యూరోలో పోర్చు‘గోల్’... ప్రొఫెషనల్ లీగ్స్‌లో మెరుపులు మెరిపించే క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తన జాతీయ జట్టు పోర్చుగల్‌ను తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా నిలబెట్టాడు. పారిస్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో పోర్చుగల్ 1–0 గోల్ తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై సంచలన విజయం సాధించింది. గాయం కారణంగా ఫైనల్ ఆరంభంలోనే రొనాల్డో మైదానం వీడినప్పటికీ... మిగతా పోర్చుగల్ ఆటగాళ్లందరూ పట్టుదలతో పోరాడి ఫ్రాన్స్‌ను నిర్ణీత సమయం వరకు నిలువరించారు. అదనపు సమయంలోని 109వ నిమిషంలో ఎడెర్ అద్భుత గోల్ చేసి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని పోర్చుగల్ కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి ఈ ఏడాది నిరాశనే మిగిల్చింది. ‘కోపా అమెరికా కప్’ ఫైనల్లో మెస్సీ జట్టు పెనాల్టీ షూటౌట్లో 2–4తో డిఫెండింగ్ చాంపియన్ చిలీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. షూటౌట్లో తొలి షాట్ తీసుకున్న మెస్సీ గురి తప్పడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఈ ఫలితం తర్వాత మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జాతీయ జట్టు ప్రయోజనాలదృష్ట్యా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఇక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో లీస్టర్సిటీ జట్టు విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ చాంపియన్స్ లీగ్ టైటిల్‌తోపాటు ప్రపంచకప్ క్లబ్ టైటిల్‌ను గెల్చుకుంది. స్టెఫీ సరసన సెరెనా ఈ ఏడాది పురుషుల, మహిళల టెన్నిస్‌లో సంచలన ఫలితాలు వచ్చాయి. జర్మనీకి చెందిన ఎంజెలిక్ కెర్బర్... బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వరుసగా మహిళల, పురుషుల విభాగాల్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. కెర్బర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించగా... స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచి ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) రికార్డును సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే రెండోసారి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... స్విట్జర్లాండ్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. అయితే సీజన్ చివర్లో తడబడిన ఈ సెర్బియా స్టార్ తన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను ఆండీ ముర్రేకు కోల్పోయాడు. ‘కింగ్’ కార్ల్సన్... అన్ని అవాంతరాలను అధిగమిస్తూ రియో ఒలింపిక్స్‌ను బ్రెజిల్ విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగిన ఈ క్రీడల్లో 205 దేశాల నుంచి 11 వేలకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అమెరికా 46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి 67 పతకాలు నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. చైనా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రీడల్లో మొత్తం 27 కొత్త ప్రపంచ రికార్డులు... 91 ఒలింపిక్ రికార్డులు నమోదయ్యాయి. -
సీక్రెట్ గా పెళ్లి చేసుకుని రియో వెళ్లాడు!
ఆరిజోనా: అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ సీక్రెట్ గా పెళ్లిచేసుకున్న విషయం వెల్లడైంది. రియో ఒలింపిక్స్ కంటే ముందే అతడు రహస్యంగా వివాహం చేసుకున్నట్టు ఆరిజోనా రిపబ్లిక్ న్యూస్ పేపర్ తెలిపింది. మాజీ మిస్ కాలిఫోర్నియా నికోల్ జాన్సన్(31)ను ఆరిజోనాలోని ప్యారడైజ్ వ్యాలీలో జూన్ 13న ఫెల్ప్స్ పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్ ను కూడా బయటపెట్టింది. అయితే వీరిద్దరూ రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకన్నారో వెల్లడికాలేదు. ఫెల్ప్స్ పెళ్లి వార్తపై అతడి తరపు ప్రతినిధులు ఇంకా స్పందిచలేదు. ఫెల్ప్స్, నికోల్ నిశ్చితార్థం 2015, ఫిబ్రవరిలో జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే ఫెల్ప్స్.. రియోకు పయనమయ్యాడు. తన క్రీడాజీవితంలో 23వ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. కొలనులో బంగారు పతకాల పంట పండించి ఘనంగా కెరీర్‌కు ముగింపు పలికాడు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
మైఖేల్ ఫెల్ప్స్: యాంగ్రీ ఫేస్ నిడివి : 3 ని. 57 సె. : హిట్స్ : 26,17,314 వయసు 31 ఏళ్లు. అమెరికన్ స్విమ్మర్. పేరు మైఖేల్ ఫెల్ప్స్. ఈ మధ్యే రియో ఒలింపిక్స్ పతకాల కొలనులో ఈది వెళ్లాడు. ఐదు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ పట్టుకెళ్లాడు. అందుకే అతడి ఫేస్కంటే ముందు అతడి పేరు, అతడు సాధించిన పతకాలు గుర్తొస్తాయి. కానీ ఒలింపిక్స్‌లో ఒక ఈవెంట్ మధ్యతో అతడు ఇచ్చిన యాంగ్రీ ఎక్స్ప్రెషన్ అతడి పేరును, అతడి పతకాలను పక్కకు నెట్టేసి, నెట్లో ఈత కొట్టేస్తోంది. ‘టు నైట్ షో’ టీవీహోస్ట్ జిమ్మీ ఫాలెన్ కూడా ఫెల్ప్స్‌ను తన స్టూడియోకి పిలిపించుకుని, అతడిని ఇంటర్వ్యూ చేసి, అతడి ప్రీ-రేస్ బ్యాక్స్లాపింగ్ని ఇమిటేట్ చేసి, నవ్వించి, కవ్వించి, నవ్వుల కన్నీళ్లు పెట్టించి... ఆ ఫేమస్ యాంగ్రీ ఒలింపిక్ ఫేస్ లైఫ్‌సైజ్ కటౌట్‌ను షోలో ప్రదర్శించి... ఆ అపురూపమైన క్షణాలను యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేయించారు. ఫొటోలో ఫెల్ప్స్, ఫాలెన్ మధ్య ఉన్నది ఆ యాంగ్రీ కటౌటే! ‘నువ్వు బెస్ట్ అనిపించుకోవాలంటే... ఎవరూ చేయలేని పని చెయ్యాలి’ అన్నది ఫెల్ప్స్ ఫేమస్ కొటేషన్. కోపం ఆపుకోవడం ఎవరూ చేయలేని పని. ఆఖరికి ఫెల్ప్స్ కూడానా?! జె బల్విన్ : సఫారీ ఫీట్ నిడివి : 3 ని. 24 సె. : హిట్స్ : 53,20,120 తెలుగు సినిమాల్లో నైట్ క్లబ్ సీక్వెన్స్‌లోని లేడీ డాన్ ఫైట్స్‌ని ఇష్టపడేవారిని ఈ సఫారీ ఫీట్ షేక్ చేస్తుంది. చువ్వలాంటి అమెరికన్ ర్యాపర్ బియాంకా లాండ్రా, డీజే స్కై, సింగర్ ఫారెల్ విలియమ్స్.. ఈ ముగ్గురినీ కలిపి కొలంబియన్ ర్యాపర్ జె బల్విన్ అల్లిన ఉల్లాస దృశ్యగీతిక... ఈ సఫారీ ఫీట్. ‘షి లైక్స్ ఇట్. ఐ లైక్ ఇట్.. అంటూ మొదలై... ‘మమ్మీ మమ్మీ విత్ యువర్ బాడీ ఐ లైక్ ఇట్, హే డాడీ గో విత్ మై ఫ్రెండ్స్ ఫర్ ద పార్టీ’ అంటూ సఫారీ ఫీట్ సాగుతుంది. మన సును పులకింపజేసే నృత్యాలను, ఒళ్లు జలదరించే ఫైట్స్‌ను చూస్తూ, డిమ్ లైట్స్‌లో డిన్నర్ తీసుకోదలచినవారు ఈ పాటను పెద్ద స్క్రీన్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీర్జా: టైటిల్ సాంగ్ నిడివి : 3 ని. 16 సె. : హిట్స్ : 23,15,986 రెండు రోజుల క్రితమే విడుదలైన బాలీవుడ్ యాక్షన్ రొమాంటిక్ మూవీ ‘మీర్జా’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డెరైక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హర్షవర్థన్ కపూర్, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఓంపురి, ఆర్ట్ మాలిక్, కె.కె.రైనా, అంజలీ పాటిల్, అనూజ్ చౌదరి తదితరులు ఇతర కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘మీర్జా’ ట్రైలర్ జూన్‌లోనే విడుదలైంది. తాజాగా ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. పంజాబీ జానపదగాథ ‘మీర్జా సాహిబా’ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. రంగ్‌దే బసంతి, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్ చిత్రాలను నిర్మించిన దర్శకుడే కాబట్టి ఈ చిత్రాన్నీ ఓ చక్కటి శిల్పంలా చెక్కుతున్నారు. ఆ పనితనాన్ని శాంిపిల్గా ఈ వీడియోలో చూడొచ్చు. -
‘కల నెరవేరింది’
రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో ఓ శకం ముగిసింది. కొలనులో బంగారు పతకాల పంట పండించిన దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ ఘనంగా కెరీర్‌కు ముగింపు పలికాడు. 4x100 మీటర్ల మెడ్లే రిలేలో మొదటి స్థానంలో నిలిచి మొత్తం 23 ఒలింపిక్స్ స్వర్ణాలతో మానవమాత్రుడికి సాధ్యంకాని రికార్డుతో కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. ఆదివారం జరిగిన చివరి ఈవెంట్లో స్వర్ణం గెలవగానే ఫెల్ప్స్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘అచ్చం ఇలాగే నా కెరీర్ ముగించాలనుకున్నా. నా కల నేరవేర్చుకున్నా. చివరిసారిగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కాస్త ఉద్వేగం కలిగింది. బాల్యంలో ఉన్నప్పుడు ఓ చిన్న కలతో మొదలైన నా ప్రస్థానంతో స్విమ్మింగ్‌కు గతంలో ఎవరూ చేయనంతగా చేయాలనుకున్నా. అనుకున్నది సాధించా’ అని ఫెల్ప్స్ తెలిపాడు. రియో ఆఖరి పోటీని చూసేందుకు భారీ సంఖ్యలో స్విమ్మింగ్ స్టార్స్ అందరూ వచ్చారు. గ్యాలరీలో కూర్చున్న ఫెల్ప్స్ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. పతకం అందుకున్నాక ఫెల్ప్స్ కూడా తన క న్నీటిని ఆపుకోలేకపోయాడు. అమెరికా ‘థౌజండ్’ వాలా మహిళల 4x100 మీటర్ల మెడ్లే రిలేలో అమెరికా మహిళల జట్టు (సిమోన్ మాన్యుయేల్, కేథలీన్ బేకర్, లిల్లీ కింగ్, దానా వోల్మర్) స్వర్ణం గెలిచింది. ఈ విజయంతో మొత్తం ఒలింపిక్స్ చరిత్రలో వెయ్యి స్వర్ణ పతకాలు గెలిచిన (1896 ఏథెన్స్ నుంచి 2016 రియో వరకు) జట్టుగా అమెరికా చరిత్ర సృష్టించింది. మరోవైపు 50 మీటర్ల ఫ్రీస్టయిల్లోనూ అమెరికా స్విమ్మర్ సిమోన్ మాన్యుయేల్ స్వర్ణం చేజిక్కించుకుంది. -
ఓ దిగ్గజం విడ్కోలు
రియో డి జనీరో: ప్రపంచ క్రీడా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. రికార్డు స్థాయిలో 22 స్వర్ణాలతో ఒలింపిక్స్ కొలనును ఉర్రూతలూగించిన అమెరికా దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 100 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించిన అనంతరం అతను తన నిర్ణయాన్ని వెల్లడించాడు. రియో ఒలింపిక్స్‌తో కెరీర్ ముగిస్తున్నానని ఫెల్ప్స్ చెప్పాడు. గతంలోలాగా మరోసారి పునరాగమనం చేసే ఆలోచన అసలే లేదని, ఇదే తన తుది నిర్ణయమని అతను స్పష్టం చేశాడు. ‘ఈతతో 24 ఏళ్లుగా నాకు అనుబంధం పెనవేసుకుపోయింది. ఇన్నేళ్లలో నేను ఏది అనుకుంటే అది చేయగలిగాను. నా కెరీర్‌ను ముగిస్తున్న తీరు పట్ల గర్వంగా ఉన్నాను. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మానసికంగా మరింత దృఢంగా ఉన్న స్థితిలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సహచరి నికోల్, కొడుకు బూమర్తో మరింత సమయం గడపాల్సి ఉంది’ అని ఫెల్ప్స్ వ్యాఖ్యానించాడు. అత్యద్భుత కెరీర్... 31 ఏళ్ల ఫెల్ప్స్ తొలి సారి 15 ఏళ్ల వయసులో సిడ్నీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 200 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్లో ఐదో స్థానంతో అతని పోరాటం ముగిసింది. అయితే ఆ తర్వాత ఏథెన్స్‌తో మొదలు పెట్టి తాజాగా రియో వరకు అతను నాలుగు ఒలింపిక్స్‌లో కలిపి 27 పతకాలు కొల్లగొట్టాడు. ఇందులో ఏకంగా 22 స్వర్ణాలతో ఆల్‌టైం గ్రేట్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్, పాన్ అమెరికా చాంపియన్‌షిప్ పోటీలు కలిపి అంతర్జాతీయ స్థాయిలో 65 స్వర్ణాలు సహా 81 పతకాలు గెలుచుకోవడం విశేషం. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించినా మరో రెండేళ్లకు తిరిగొచ్చి మళ్లీ స్విమ్మింగ్‌పై తనదైన ముద్ర వేసిన ఈ లెజెండ్ ఇప్పుడు పూర్తిగా ఈతకు దూరమవుతున్నాడు. చివరిగా ఒక్కసారి ఫెల్ప్స్ రిటైర్మెంట్ ప్రకటించినా... ఆదివారం ఉద యం (భారత కాలమానం ప్రకారం గం.7.34ని) అతడిని ఆఖరిసారిగా కొలనులో చూడవచ్చు. పురుషుల 4x100 మీ. మెడ్లే రిలేలో అతను పాల్గొనబోతున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో అమెరికా ఎన్నడూ ఓడని ఈ ఈవెంట్లో కూడా పతకం గెలిస్తే ఫెల్ప్స్ మొత్తం 28 పతకాలతో ముగిస్తాడు. లేదంటే 27తో సరి. డియర్ ఫెల్ప్స్... సగటు భారత క్రీడాభిమానులుగా మాకు స్విమ్మింగ్ గురించి పెద్దగా తెలియదు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి ఒలింపిక్స్ పుణ్యమాని ఈ ఆటను చూస్తున్నాం. నిజానికి ఒలింపిక్స్‌లో ఇంకా చాలా ఆటలు ఉన్నా... స్విమ్మింగ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నాం. దీనికి కారణం నువ్వు. ఈతలో ఇన్ని రకాలు ఉంటాయని కూడా మాలో చాలామందికి తెలియదు. ఫ్రీ స్టయిల్, బటర్‌ఫ్లయ్ , మెడ్లే... ఇలా విభిన్నమైన ఆటలు ఉంటాయని తెలుసుకోవడానికి కారణం కూడా నువ్వే. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలిసారి నువ్వు ఆరు స్వర్ణాలు గెలిచినప్పుడు ప్రపంచం అబ్బురపడింది. స్విమ్మింగ్‌లో ఓ స్టార్ ఉంటాడని మాకూ తెలిసింది. ఆ తర్వాత 2008లో బీజింగ్‌లో ప్రతి రోజూ ఓ స్వర్ణం చొప్పున ఎనిమిది స్వర్ణాలు గెలిచావని తెలిసినప్పుడు... ‘మనిషేనా..’ అనే సందేహం కలిగింది. ఇక లండన్‌లో నాలుగు స్వర్ణాలు మాత్రమే గెలిచినప్పుడు నీ జోరు తగ్గిపోయిందేమో అనుకున్నాం. ఆ ఒలింపిక్స్‌తో ఆటకు వీడ్కోలు చెప్పావని తెలిసినప్పుడు రెండు రకాల స్పందనలు. ఒకటి... మళ్లీ ఇలాంటి దిగ్గజాన్ని చూడలేమేమో అనే బాధ. మరొకటి... వచ్చే ఒలింపిక్స్‌లో కొత్త వాళ్లకు అవకాశం వస్తుందనే ఆశ కూడా కలిగింది. కానీ రెండేళ్ల క్రితం నువ్వు రిటైర్మెంట్ను విరమించుకున్నావ్. ఆ క్షణంలో నువ్వు మళ్లీ పాత ఫెల్ప్స్లా ఈదుతావనే నమ్మకం మాత్రం లేదు. రెండేళ్లు విరామం తీసుకున్న వ్యక్తి తిరిగి ఈత కొలనులో అంత చురుగ్గా కదలడం అసంభవమనే మాటా వినిపించింది. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత ప్రమాణాలతో పోటీలు జరిగే చోట మళ్లీ స్వర్ణాలు గెలుస్తాడా..? ఏమో చూద్దాం అని వేచి చూశాం. రెండేళ్ల పాటు నీ గురించి పెద్దగా వార్తలు, విశేషాలు లేవు. పైగా మద్యం తాగి కారు నడుపుతూ శిక్షకు గురవడం లాంటి సంఘటనల వల్ల ఏదో మూల చిన్న అనుమానం. కానీ రియోలో బరిలోకి దిగగానే అర్థమైపోయింది... ఫెల్ప్స్లో జోరు ఏమాత్రం తగ్గలేదని. పోటీ పడ్డ ప్రతి ఈవెంట్లో స్వర్ణం గెలవడం ఏంటసలు..? మానవమాత్రులకు ఇది ఎలా సాధ్యం. మాకు స్వాతంత్య్రం రాక ముందు నుంచీ 116 ఏళ్ల క్రీడల చరిత్రలో 26 పతకాలు వస్తే... నీకు 16 ఏళ్లలో 27 పతకాలు ఎలా వచ్చాయబ్బా..? కాస్త నీ సీక్రెట్స్ మా వాళ్లకు చెప్పి పుణ్యం కట్టుకోరాదు. చిన్నప్పుడు నీకు ఏ విషయం ఎక్కువసేపు గుర్తుండేది కాదని విన్నాం. మరి గజినీలా ఈతను మాత్రం ఎందుకు మరచిపోలేదో..! నీ వల్ల అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది మాత్రం నీ సహచరుడు, స్నేహితుడు లోచే. తాను స్వర్ణం గెలుస్తాడని ఆశించిన ప్రతిసారీ నువ్వు గెలుస్తుంటివాయె..! ప్రతిసారీ రజతంతో సరిపెట్టుకుంటున్నాడు పాపం. మెడల్ అందుకోవడానికి వచ్చి నీ పక్కన నిలుచుని వెండి పతకం అందుకుంటూ నవ్వుతున్నాడుగానీ... పాపం లోపల ఎంత కుమిలిపోతున్నాడో. నాలుగేళ్ల క్రితం నువ్వు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అతనే సంబరపడి ఉంటాడు. ఏదో టీమ్ ఈవెంట్లలో మాత్రం నీతో కలిసి స్వర్ణం అందుకుంటున్నాడు. రియోలో కూడా తన స్వర్ణ ఆశలను ఆవిరి చేస్తివి. మా దగ్గర రెండు దశాబ్దాల పాటు సచిన్ ధాటికి గొప్ప గొప్ప క్రికెటర్లు కూడా రెండో స్థానానికి పరిమితమైనట్లు... స్విమ్మింగ్‌లో నీ దెబ్బకి లోచే కూడా అలాగే అయిపోయాడు పాపం. అదేదో సినిమాలో మా బ్రహ్మానందం చెప్పినట్లు ‘క్రియేటర్స్‌కి కూడా ఎమోషన్స్ ఉంటాయ్’.. అని రియోలో నువ్వూ చూపించావ్. 200మీటర్ల బటర్‌ఫ్లై స్వర్ణం గెలవగానే పరిగెడుతూ వెళ్లి నీ బిడ్డను ముద్దాడిన దృశ్యం చెప్పింది... నువ్వెంత కసిగా మెడల్స్ కోసం రియోకు వచ్చావో అని. ఏమైనా నీ ఈత మాకు వినోదం. నీ రికార్డులు మాకు లక్ష్యాలు. నీ పతకాలు మాకు స్ఫూర్తి... మాకే కాదు... క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే ఏ దేశస్తుడైనా ముందు నీ గురించి తెలుసుకోవాలి. ఒక మనిషి ఇంత పెద్ద పెద్ద ఘనతలు సాధించడం సాధ్యమే అనే విశ్వాసం రావాలంటే నీ కథ చదవాలి. ఇక నిన్ను ఈత కొలనులో చూసే అవకాశం లేదని ఓ వైపు బాధగా ఉన్నా... ఇలాంటి గొప్ప అథ్లెట్ ఘనతలకు సాక్షులుగా నిలిచామని సంతృప్తిగా ఉంది. ఒలింపిక్స్ క్రీడా సంరంభం ఉన్నంతకాలం నీ పేరు ఉంటుంది. చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. గుడ్‌బై ఫెల్ప్స్. - సగటు భారత క్రీడాభిమాని ఫెల్ప్స్‌ను కొట్టిన మొనగాడు..! 21 ఏళ్ల స్కూలింగ్ సంచలనం x 100 మీటర్ల బటర్ ఫ్లయ్‌లో స్వర్ణపతకం ఎనిమిదేళ్ల క్రితం ఆ కుర్రాడు తాను కూడా స్విమ్మింగ్ స్టార్ ఫెల్ప్స్లా కావాలనుకున్నాడు. అతని ఘనతలనే స్ఫూర్తిగా తీసుకొని సాధన చేశాడు. నాడు ఫెల్ప్స్తో కలిసి దిగిన ఫోటోను అపురూపంగా దాచుకున్నాడు. ఇప్పుడు రెండు ఒలింపిక్స్‌లు ముగిసే సరికి తన అభిమాన స్విమ్మర్నే ఓడించే స్థాయికి చేరుకున్నాడు. 21 ఏళ్ల ఆ సింగపూర్ సంచలనం పేరు జోసెఫ్ స్కూలింగ్. 100 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్లో సత్తా చాటిన స్కూలింగ్ (50.39 సెకన్లు) అగ్ర స్థానంతో స్వర్ణ పతకం సాధించాడు. ఈత కొలనులో ఎదురు లేకుండా సాగుతున్న ఫెల్ప్స్‌కు అతను షాకిచ్చాడు. 22 స్వర్ణాలతో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఫెల్ప్స్‌ను కూడా ఓడించేవాడు ఒకడు ఉన్నాడని స్కూలింగ్ నిరూపించాడు. తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన స్విమ్మర్ నుంచి తనకు ఎదురైన పోటీకి స్వయంగా అమెరికా దిగ్గజం కూడా అచ్చెరువొందాడు. చివరకు ఫెల్ప్స్ రజతం (51.14 సె.)తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మరో ఇద్దరికి కూడా రజతం అందించారు. గతంలో 1969లో మాత్రమే ఇలా ఒకే టైమింగ్‌తో ముగ్గురు రజతాలు గెలుచుకున్నారు. -
రియో తర్వాత ఫెల్ప్స్ రిటైర్మెంట్!
అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం మైకెల్ ఫెల్ప్స్ అలసిపోయాడు. ఈత కొలనుకు ఇక తాను దూరంగా ఉండాలనుకున్నట్లు నేరుగా సంకేతాలిచ్చాడు. స్విమ్మింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈత కొలనులో దిగాడంటే ప్రత్యర్థులు రెండో స్థానం కోసం పోటీ పడాల్సి ఉంటుంది. బరిలోకి దిగాడంటే స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం ఫెల్ప్స్ కు కొత్తేం కాదు. ప్రస్తుతం రియో ఒలింపిక్స్ లోనూ నాలుగు స్వర్ణాలు, ఓ రజతం తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు పదుల వయసులోనూ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఓవరాల్ గా ఒలింపిక్స్ కెరీర్ లో 27 పతకాలు సాధించగా, అందులో 22 స్వర్ణాలు, మూడు రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణంతో ఈత కొలనులో తన ప్రస్థానం ప్రారంభించిన ఫెల్ప్స్ వరుసగా నాలుగో ఒలింపిక్స్ రియోలోనూ అమెరికాకు పతకాల పంట పండించాడు. మద్యం తాగి వెహికల్ నడపడంతో పోలీసుల చేతికి చిక్కాడు. దాంతో ఫెల్ప్స్ తన కెరీర్ వివాదాలతో ముగుస్తుందని చింతించాడు. 2012 ఒలింపిక్స్ ముగిసిన కొంత కాలానికి స్విమ్మింగ్ కు గుడ్ బై చెప్పిన బంగారు చేప.. 2014లో కసితో మళ్లీ రంగంలోకి దిగింది. రియోకు ముందు చెప్పినట్టుగానే నాలుగు స్వర్ణాలు సహా ఓ రజతాన్ని ఒడిసిపట్టాడు. ఇది ఆటపట్ల అతడికున్న అంకితభావానికి నిదర్శనమని చెప్పవచ్చు. 'కెరీర్ పరంగా ఎంతో సాధించాను. వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా శరీరం సహకరించడం లేదు. కాళ్లు, చేతుల నొప్పిని భరించలేక పోతున్నాను. వయసు రీత్యా ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. వీడ్కోలు చెబుతాను' అని ఫెల్ప్స్ శుక్రవారం జరిగిన ఈవెంట్ కు ముందు, అనంతరం కొన్ని విషయాలను ప్రస్తావించాడు. భార్య నికోలా, బాబు బూమర్తో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నానని ఫెల్ప్స్ వివరించాడు. సింగపూర్ యువ సంచలనం జోసెఫ్ స్కూలింగ్ శనివారం ఉదయం జరిగిన 100మీ బటర్‌ఫ్లై ఈవెంట్లో స్వర్ణం గెలిచి దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్‌ని రజతానికే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. -
గురువును మించిన శిష్యుడు!
స్విమ్మింగ్ రారాజు, బంగారు చేపగా ప్రసిద్ధి గాంచిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్‌కు ఓ చిన్న చేప షాకిచ్చింది. స్విమ్మింగ్ అంటేనే మైకెల్ ఫెల్ప్స్ అనేలా పేరు సంపాదించి రికార్డు స్థాయిలో 26 పతకాలు(22 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు) సాధించిన దిగ్గజానికి సింగపూర్ యువ సంచలనం నుంచి పోటీ ఉంటుందని ఎవరూ భావించలేదు. కానీ అనూహ్యంగా తన గురువు(రోల్ మోడల్)ను ఓడించి 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఒలింపిక్స్ లో వరుసగా నాలుగు స్వర్ణాలు సాధించిన ఫెల్ప్స్ రజతం(27వ పతకం)తో సరిపెట్టుకున్నాడు. ఒకసారి ఈ ఫొటో చూడండి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ ముందు ఫెల్ప్స్ ను 13 ఏళ్ల జోసెఫ్ కలుసుకున్నాడు. అప్పటి నుంచి తన ఆరాధ్య ఆటగాడు ఫెల్ప్స్ అని గతంలో తెలిపాడు. స్విమ్మింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. కఠోర సాధన చేసి 2011లో ఫెల్ప్స్ వయసు(26 ఏళ్లు) ఉన్న వాళ్లను 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో కేవలం 15-16 ఏళ్ల వయసులోనే ఓడించాడు. లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న జోసెఫ్ చిన్న తప్పిందం కారణంగా రేసులో సాధారణ ప్రదర్శన చేశాడు. కానీ ఆ ఈవెంట్ తర్వాత తనకు ఆదర్శప్రాయుడైన ఫెల్ప్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రాటుదేలాడు. బహుశా తనను ఎంతగానో ఆరాధించే ఆ కుర్రాడి చేతిలో తనకు ఓటమి వస్తుందని దిగ్గజం ఊహించలేదు. లండన్ లో ఈవెంట్ ముగిసిన తర్వాత బాధపడుతున్న జోసెఫ్ వద్దకు వచ్చి ఫెల్ప్స్ ఓదార్చి, ఏం జరిగిందని అడిగాడు. తన గాగుల్స్(కళ్లద్దాలు) అంతర్జాతీయ స్థాయిలో లేవని చాలా ఆలస్యంగా తెలుసుకుని వాటిని మార్చుకున్నాను, అయితే అప్పటికే అంతా అయిపోయిందని వాపోయాడు. నీవు ఇంకా యువకుడివే ఇంకా చాలా భవిష్యత్తు ఉందని ఫెల్ప్స్ అతడిలో ఉత్సాహాన్ని నింపాడు. ఫలితంగా... రియోలో జరిగిన పురుషుల 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో పాల్గొన్న స్కూలింగ్ 50.39 సెకన్లలో ఈవెంట్ పూర్తి చేసి బంగారు పతకాన్ని ఒడిసిపట్టగా, 22 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన ఫెల్ఫ్స్ వరుస విజయాలకు తెరదించి అతన్ని రజతానికి పరిమితం చేశాడు. చిత్రంగా అమెరికన్ స్విమ్మర్ ఫెల్ఫ్స్, దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లీ క్లోస్, హంగేరీ స్విమ్మర్ లాజ్లో సేహ్ లు సరిగ్గా 51.14 సెకన్లలో ఈవెంట్ ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. -
రారాజు జైత్రయాత్ర
ఫెల్ప్స్ ఖాతాలో 22వ స్వర్ణం కొలనులో అమెరికా హవా రియో డి జనీరో: ఒలింపిక్స్ ఈత కొలనులో రారాజు మైకేల్ ఫెల్ప్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ప్రపంచ చాంపియన్ శుక్రవారం జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే ఈవెంట్లో స్వర్ణం సాధించి.. ఒలింపిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డును చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఒకే ఈవెంట్లో వరుసగా నాలుగు గేమ్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన అథ్లెట్‌గా.. కార్ల్ లూయిస్ (లాంగ్ జంప్), అల్ ఓయెర్టర్ (డిస్కస్ త్రోయర్) సరసన నిలిచాడు. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ స్వర్ణాల సంఖ్య 22కు.. మొత్తం పతకాల సంఖ్య 26కు చేరింది. ఇది ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం పతకాల సంఖ్యకు సమానం. మళ్లీ అమెరికాదే బ్యాక్‌స్ట్రోక్ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో 1992 నుంచీ స్వర్ణాన్ని వదలని అమెరికా మరోసారి తన సత్తా కొనసాగించింది. 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో అమెరికన్ స్విమ్మర్ ర్యాన్ మర్ఫీ స్వర్ణం సాధించాడు. దీంతో వరుసగా రెండు బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో (200 మీటర్లు, 100 మీటర్లు) స్వర్ణాలు గెలిచిన మూడో అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. మూడ్రోజుల క్రితం 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్లోనూ మర్ఫీ మొదటి స్థానంలో నిలిచాడు. -
22 స్వర్ణాలు సాధించాను.. విసిగిపోయాను!
మైకెల్ ఫెల్ప్స్.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని అమెరికన్ స్విమ్మర్. చిన్నప్పుడు నీళ్లంటేనే వణుకు అని చెప్పే ఫెల్ప్స్ నేడు స్విమ్మింగ్ కు మాత్రమే కాదు.. రికార్డులకు మారు పేరుగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ 26 ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఈ బంగారు చేప మరో బంగారు పతకం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ స్విమ్మర్ తన మనసులోని భావాలను బయటపెట్టాడు. రిటైరయ్యాక మళ్లీ తాను పూర్తి స్థాయిలో రాణించగలనని నమ్మకం ఏర్పడ్డాక ఈత కొలనులో దిగినట్లు తెలిపాడు. మరిన్ని విషయాలపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'నేను పూర్తిగా అలసిపోయాను. కెరీర్ ఇప్పుడు నరకంలా మారింది. నిజం చెప్పాలంటే అసలు కెరీర్ పై ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు' అని ఫెల్ప్స్ ఉద్వేగానికి లోనయ్యాడు. తన శరీరం చాలా అలసటకు గురైందని, బాడీ అంతా తీవ్రమైన నొప్పులున్నాయి.. కాళ్లు ఇబ్బంది పెడుతున్నాయని 31 ఏళ్ల స్విమ్మింగ్ దిగ్గజం చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా లండన్ ఒలింపిక్స్ లో తన ప్రదర్శనపై ఇప్పటికీ తీవ్ర అసంతృప్తి ఉందన్నాడు. గురువారం సాధించిన స్వర్ణంతో ఒలింపిక్స్ లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో 200 మీటర్ల మెడ్లేలో వరుసగా నాలుగోసారి విజయకేతం ఎగురవేశాడు. నేడు 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో బరిలో దిగనున్నాడు ఫెల్ప్స్. 22 స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో మొత్తం 26 పతకాలను కొల్లగొట్టిన ఈ స్విమ్మర్ ఓవరాల్ గా తన కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నా, వ్యక్తిగతంగా కాస్త అలసిపోయానంటూ వివరించాడు. -
ఫెల్ప్స్ కు 22వ ఒలింపిక్ గోల్డ్ మెడల్
రియో డి జనీరో: అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ బంగారు పతకాల వేట కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్ లో వరుసగా నాలుగో పోటీలోనూ ఈ ‘ఫ్లయింగ్ ఫిష్’ అందరికంటే ముందు నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. 200 మీటర్ల మెడ్లీ విభాగంలో అతడు స్వర్ణ పతకం కైవసం చేసుకుని తనకు తిరుగులేదని మరోసారి చాటాడు. జపాన్ కు చెందిన కొసుకె హాంగినొ వెండి పతకం దక్కించుకున్నాడు. చైనా స్విమ్మర్ వాంగ్ షున్ రజతం సొంతం చేసుకున్నాడు. 22వ ఒలింపిక్ స్వర్ణాన్ని సొంతం చేసుకుని మైకేల్ ఫెల్ప్స్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఓవరాల్‌గా ఫెల్ప్స్కిది 26వ ఒలింపిక్ పతకం. ఇందులో 22 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. -
చేపా చేపా ఎందుకు ఈదట్లేదు అంటే ... ఫెల్ప్స్తో ఓడిపోతాగా అందట
నీటికి, చేపకు మధ్య ఉన్న బంధం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు... కానీ అతడిని చూస్తే మనిషికీ, నీళ్లకు మధ్య ఇంత స్వర్ణానుబంధం ఉంటుందా అనిపిస్తుంది. ఊర్లలో చెరువుల్లోనో, నదుల్లోకి నాణేలు వేసినప్పుడు లోపలికి దూకి వాటిని తీసుకొచ్చే ఈతగాళ్ల సరదా ఆటలను మనం చూస్తూనే ఉంటాం. మరి కొలనులోకి దిగితే చాలు కనీసం కనకంతోనే బయటికి వచ్చేవాడిని ఏమనాలి. పెద్ద చేపలు చిన్న చేపలను మింగేస్తాయంటారు... కానీ ఈ బంగారు చేప బరిలోకి దిగితే చాలు మిగతా చేపలంతా వినమ్రంగా పక్కకు తప్పుకొని దారి ఇస్తాయేమో. ఇదే గొప్పతనం మైకేల్ ఫెల్ప్స్‌ను జల క్రీడల్లో జగజ్జేతగా నిలిపింది. ఈతలో అలుపు, ఆయాసం అన్నదే రాకుండా పతకాలు అందుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచేలా చేసింది. ఒలింపిక్స్‌లో ఎన్నో దేశాలు ఒక్క స్వర్ణం గెలిస్తే చాలనుకునే చోట... అతను ఒక్కడే బంగారపు భోషాణంగా మారిపోయాడు. కొన్ని తరాల పాటు మరెవరూ కనీసం తాకేందుకు కూడా భయపడే కనకపు కీర్తిని అతను తన ఖాతాలో వేసుకున్నాడు. రియో డి జనీరో: ఈతకొలనులో అమెరికా దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ మళ్లీ మెరిశాడు. బుధవారం బరిలోకి దిగిన రెండు ఈవెంట్స్‌లోనూ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాడు. తన ఒలింపిక్స్ కెరీర్లో పసిడి పతకాల సంఖ్యను 21కు పెంచుకున్నాడు. ఓవరాల్‌గా ఫెల్ప్స్కిది 25వ ఒలింపిక్ పతకం. రియో ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్‌కు మరో రెండు ఈవెంట్స్ (100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే) మిగిలి ఉన్నాయి. రియో ఒలింపిక్స్ కోసమని రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పునరాగమనం చేసిన ఈ అమెరికా స్టార్ అనుకున్నది సాధించాడు. తనకెంతో ఇష్టమైన 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో స్వర్ణాన్ని హస్తగతం చేసుకున్నాడు. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గిన ఫెల్ప్స్... 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఈ కేటగిరీలో చాద్ లె క్లోస్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. రియో ఒలింపిక్స్‌లో ఎలాగైనా 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ స్వర్ణాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో రంగంలోకి దిగిన ఫెల్ప్స్ సఫలమయ్యాడు. ఫైనల్ రేసును ఫెల్ప్స్ ఒక నిమిషం 53.56 సెకన్లలో ముగించి విజేతగా నిలిచి తన ‘మిషన్’ పరిపూర్ణం చేశాడు. మసాటో సకాయ్ (జపాన్), తమాస్ కెండెర్సి (హంగేరి) రజత, కాంస్య పతకాలు నెగ్గారు. డిఫెండింగ్ చాంపియన్ చాద్ లె క్లోస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక 4ఁ200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో సహచరులు కానర్ డ్వయర్, ఫ్రాన్సిస్ హాస్, రియాన్ లోచ్టెలతో కలిసి ఫెల్ప్స్ అమెరికా బృందానికి పసిడి పతకాన్ని అందించాడు. ఫెల్ప్స్ బృందం 7 నిమిషాల 00.66 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రికార్డులు కూడా ఈర్ష్యపడతాయ్..!
రెండు స్వర్ణాలు సాధించిన అనంతరం ఫెల్ప్స్ ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న తన కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లి తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన 3 నెలల కొడుకు బూమర్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ‘200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఫైనల్ రేసు కోసం ఎదురుచూశాను. స్వర్ణమే నెగ్గాలనే లక్ష్యంతో ఈత కొలనులోకి దూకాను. అనుకున్నది సాధించాను’ అని ఫెల్ప్స్ వ్యాఖ్యానించాడు. చిన్నప్పుడు నీళ్లంటేనే భయపడ్డ ఫెల్ప్స్.. స్విమ్మింగ్‌లో ప్రపంచ అత్యుత్తమ ఒలింపియన్‌గా నిలవటం నిజంగా అద్భుతమే. ఏడేళ్ల ప్రాయంలో ఈత కొలనులో అడుగుపెట్టిన ఫెల్ప్స్ పదేళ్లకే అమెరికా జాతీయ రికార్డును నెలకొల్పాడు. 15 ఏళ్లకే తొలి ఒలింపిక్స్ (2000లో సిడ్నీ)లో పాల్గొని.. 200 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో ఐదో స్థానంలో నిలిచాడు. 2001 అక్వాటిక్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో (200మీటర్ల బటర్‌ఫ్లై) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అక్కడి నుంచి ఈ బంగారు చేప రికార్డుల వేట మొదలైంది. రికార్డులతోనే ఫెల్ప్స్ పోటీ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సమయానికి ఫెల్ప్స్ ఖాతాలో ఐదు ప్రపంచ టైటిళ్లు చేరాయి. ఈ ఆత్మవిశ్వాసంతో ఏథెన్స్లో పాల్గొన్న ఎనిమిది ఈవెంట్లలో ఆరు బంగారు, రెండు రజత పతకాలు సాధించాడు. ఇందులో మూడు ఒలింపిక్ రికార్డులు, రెండు ప్రపంచ రికార్డులు, రెండు జాతీయ రికార్డులున్నాయి. 2005లో వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్లో ఐదు స్వర్ణాలు, 2006 పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, 2007 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏడు స్వర్ణాలతో ‘బంగారు చేప’ అనిపించుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని ఈవెంట్లలోనూ బంగారు పతకాలు (8) సాధించి మరోసారి క్రీడాప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాడు. ఒక ఒలింపిక్స్‌లో ఏడు రికార్డులు సాధించిన మార్క్ స్పిట్జ్ (అమెరికా స్విమ్మర్) రికార్డును బద్దలు కొట్టాడు. ఏడు ప్రపంచ రికార్డులు, ఒక ఒలింపిక్ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ‘అసలు ఇతనికి అలుపన్నదే లేదా, ఆయాసం రాదా’ అని ప్రపంచం ప్రశ్నించుకునేలా చేశాడు. అప్పటినుంచి లండన్ ఒలింపిక్స్ వరకు నాలుగేళ్లలో జరిగిన 17 అంతర్జాతీయ ఈవెంట్లలో రెండు రజతాలు, మూడు కాంస్యాలు మినహా మిగిలినవన్నీ బంగారు పతకాలే. అంతేకాదు.. కొన్ని ఈవెంట్లలో వరుసగా నాలుగేళ్లూ స్వర్ణాలు గెలుచుకున్న ఏకైక క్రీడాకారుడిగా పలు రికార్డులు సృష్టించారు. రిటైర్మెంట్.. తూచ్! 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఫెల్ప్స్ ప్రకటించాడు. ఇది అభిమానులకు నిరాశే అయినా.. ప్రపంచంలోని ఇతర స్విమ్మర్లకు మాత్రం శుభవార్తగా మారింది. ఈ బంగారు చేప గైర్హాజరీలోనైనా తాము పతకాలు గెలవొచ్చని సంబరపడ్డారు. అయితే.. 2014లో తూచ్.. నేనొచ్చేస్తున్నానంటూ ప్రకటించాడు. ఆ ఏడాది పాన్ పసిఫిక్‌లో మూడు స్వర్ణాలు, రెండు రజతాలతో సత్తా తగ్గలేదని నిరూపించాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ఫెల్ప్స్.. రియోలోనూ జోరు కొనసాగిస్తున్నాడు. ఈ చేప ఏం తింటుంది? దినమంతా పూల్‌లో కఠోర సాధన చేయాలంటే తిండి కూడా భారీగానే ఉండాలి. అందుకు తగ్గట్లుగానే ఫెల్ప్స్ డైట్ ఉంటుంది. పళ్లు, కాఫీ, పెద్ద గిన్నెడు ఓట్స్తోపాటు చీజ్ ఆమ్లెట్, పెద్ద హామ్ (పంది లెగ్ పీస్) తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండాల్సిందే. మధ్యాహ్నం మీట్బాల్ సబ్ (మాంసాహారంతో కూడిన హాట్‌డాగ్), వెజ్జీస్తోపాటు తక్కువ ఫ్యాట్ ఉండే మాంసాన్ని తీసుకుంటాడు. కో అంటే కోటి పతకాల వేటలో రికార్డులతో దూసుకుపోవడంతో చాలా కంపెనీ లు ఫెల్ప్స్ వెనకపడ్డాయి. దీంతో సబ్వే, హిల్టన్, స్పీడో, వీసా, ఒమే గా, పవర్ బార్, మస్తునిచీ వంటి ప్రముఖ కంపెనీలు ఈయన్ను ఎం డార్స్ చేసుకున్నాయి. దీనికి తోడు క్రీడల ద్వారా సంపాదించిన దాంతో కలిపి ఫెల్ప్స్ ఆస్తి 55 మిలియన్ డాలర్లు (రూ.370 కోట్లకు పైనే) మైకేల్ ఫెల్ప్స్ ఫౌండేషన్ ఈతపై ఉన్న అభిమానంతో ‘మైకేల్ ఫెల్ప్స్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా స్విమ్మింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు.. వేరే సంస్థలు చేపట్టే స్విమ్మింగ్ కార్యక్రమాలకు నిధులిస్తున్నాడు. బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ ఆఫ్ అమెరికాకు అధికార ప్రతినిధిగా ఉన్నాడు. 2004 ఏథెన్స్లో బంగారు పతకం సాధించాక సొంత ఊరు బాల్టీమోర్‌లో ఓ రోడ్డుకు ఫెల్ప్స్ పేరు పెట్టి గౌరవించారు. రెండుసార్లు అరెస్టయ్యాడు ప్రపంచం గర్వించే అథ్లెట్ అయినా.. రెండుసార్లు తప్పుచేసి అరెస్టయ్యాడు. 2004లో ఓసారి డీయూఐ (డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్-మద్యం తాగి వాహనం నడపటం) కేసులో అరెస్టయిన ఫెల్ప్స్.. 2015లోనూ ఇదే కేసులో బుక్కయ్యాడు. దీంతో ఇతన్ని ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ నుంచి అమెరికా తప్పించింది. తర్వాత తప్పును ఒప్పుకోవటంతో శిక్ష తప్పించుకున్నా.. 250 డాలర్ల జరిమానాతోపాటు 18 నెలలు ప్రొబేషన్‌లో ఉండాల్సి వచ్చింది. 2009లో ఓ పేపర్లో ఫెల్ప్స్ గంజాయి తీసుకుంటున్న ఫొటో ప్రచురితమవటం కూడా సంచలనం సృష్టించింది. చిన్నప్పుడే ఏడీహెచ్‌డీ వ్యాధి ఫెల్ప్స్ ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) వ్యాధికి గురయ్యాడు. ఇది వచ్చిన వారికి ఏ విషయం కూడా ఎక్కువసేపు గుర్తుండదు. ఉద్వేగాన్ని, కోపాన్ని అణచుకోవటం వీరి వల్ల కాదు. కానీ ఈ సమస్యను చాలా తొందరగా అధిగమించిన ఈ బంగారు చేప మనోశక్తి చాలా గొప్పదనే చెప్పాలి. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ సాధించిన మొత్తం పతకాలు 26 అయితే ఫెల్ప్స్ ఒక్కడే 25 కొల్లగొట్టాడు. ఒలింపిక్స్‌లో అత్యధిక వ్యక్తిగత పతకాలు (14) సాధించిన లారిసా (సోవియట్ యూనియన్) రికార్డును ఫెల్ప్స్ సమం చేశాడు. 11 పతకాలు టీమ్ ఈవెంట్స్‌లో వచ్చాయి. -
పతకం నంబర్ 24
-
పతకం నంబర్ 25
రియోడీజనీరో: అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రియో ఒలింపిక్స్ లో మరో రెండు బంగారు పతకాలు సాధించాడు. 200 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో, 4x100 ప్రీ స్టయిల్ రిలే విభాగాలలో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఈ విభాగంలో తనపై నెగ్గిన జపాన్ స్విమ్మర్ మసాటో సాకాయ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. అతడిని రెండో స్థానానికి నెట్టి మైకేల్ ఫెల్ప్స్ స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్ లో మొదటి స్థానంలో నిలిచిన హంగేరీ స్విమ్మర్ థామస్ కెండెర్సీ కాంస్య పతకం దక్కించుకున్నాడు. 4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలోనూ మైకేల్ ఫెల్ప్స్ బంగారు పతకం సాధించాడు. తాజాగా సాధించిన పతకాలతో అతడి ఖాతాలో 25 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. ఇందులో 21 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. -
’గోల్డెన్‌ఫిష్’ ఫెల్ప్స్ విజయ రహస్యం
-
వారిపై నిషేధం విధించండి:ఫెల్ప్స్
రియో డీ జనీరో; క్రీడల్లో డ్రగ్ చీటింగ్‌కు పాల్పడే వారిపై జీవిత కాల నిషేధం విధించాలంటూ అమెరికా మేటి స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ ధ్వజమెత్తాడు. అసలు ఒకసారి డోపింగ్ పాల్పడిన వారిలో తిరిగి అనుమతించడం అంటూ ఉండకూడదన్నాడు. ఇలా తరచు కొంతమంది అథ్లెట్లు డ్రగ్స్ తీసుకోవడం తన హృదయాన్ని తీవ్రంగా కలిచి వేస్తుందన్నాడు. 'ఇటీవల కాలంలో అథ్లెట్లు డ్రగ్స్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. అది ఒక స్విమ్మింగ్ కే మాత్రమే పరిమితం కాదు.. ప్రతీ క్రీడలోనూ డ్రగ్స్ చీటింగ్ కొనసాగుతోంది. అలా ఒకసారి డోపింగ్ చేసిన వారికి కొంతకాలం వరకే నిషేధం విధిస్తున్నారు. డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా వారిని గేమ్స్ కు అనుమతించడం చాలాసార్లు జరిగింది. అలా చేయకుండా మొత్తం జీవితకాల నిషేధమే సరైనది' అని ఫెల్ప్స్ విమర్శించాడు. రియో ఒలింపిక్స్ లో చైనా స్విమ్మర్ సున్ యాంగ్ గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం ఆస్ట్రేలియా స్విమ్మర్ మాక్ హార్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. డోపింగ్ దొంగలు వచ్చారంటూ సున్ యాంగ్ పై మాక్ విమర్శలు సంధించాడు. ఈ నేపథ్యంలో ఫెల్ప్స్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. -
ఫెల్ప్స్ కు రెండో స్థానం!
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ లో అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరో పసిడిపై దృష్టిసారించాడు. మూడో రోజు గేమ్స్ లో భాగంగా సోమవారం 4 x100 మీటర్ల ఫ్రీ స్టయిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణంతో పతకాల వేటను ఆరంభించిన ఫెల్ప్స్.. ఆ తరువాత జరిగిన 200 మీటర్ల బటర్ ఫ్లయ్ సెమీ ఫైనల్ వ్యక్తిగత రేసులో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. గత అర్థరాత్రి జరిగిన 200 మీటర్ల బటర్ ఫ్లయ్ రేసును ఒక నిమిషం 54.12 సెకెండ్లలో ముగించిన ఫెల్ఫ్స్ ..మంగళవారం రాత్రి జరిగే ఫైనల్ పోరుకు సిద్దమయ్యాడు. ఈ రేసులో కూడా ఫెల్ఫ్స్ స్వర్ణం సాధించే అవకాశాలు మెండుగానే ఉన్నా.. హంగేరీ స్విమ్మర్ థామస్ కెండెర్సీ నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్టార్ స్విమ్మర్లిద్దరూ ఫైనల్ కు అర్హత సాధించే క్రమంలో థామస్ కెండెర్సీ అగ్రస్థానంలో నిలిచాడు. సెమీ ఫైనల్ రేసును ఒక నిమిషం 53.96 సెకెండ్లలో పూర్తి చేసి మొదటి స్థానం సాధించాడు. దీంతో ఫైనల్లో కెండెర్సీ , ఫెల్ఫ్స్ ల మధ్య ఆసక్తికర రేసు జరగవచ్చు. మరోవైపు సెమీ ఫైనల్ రేసును మూడో స్థానంతో ముగించిన మరో హంగేరీ స్విమ్మర్ స్టాల్ వార్ట్ లాస్ జ్లో కూడా దీటైన సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. ఒలింపిక్స్ లో భాగంగా పురుషుల 4 x100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలోసెలెబ్ డ్రెసెల్, రియాన్ హెల్డ్, నాథన్ ఆడ్రియన్లతో కలిసి ఫెల్ఫ్స్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫెల్ప్ష్ ఖాతాలో 19వ ఒలింపిక్స్ పసిడి చేరింది. రియో ఒలింపిక్స్‌లో భాగంగా 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ వ్యక్తిగత ఫైనల్ రేసుకు అర్హత సాధించిన ఫెల్ఫ్స్.. ఇంకా 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసుల్లో పోటీపడాల్సి ఉంది. -
‘ఫ్లయింగ్ ఫిష్’ కు గోల్డ్ మెడల్
రియోడీజనీరో: ఈతలో తనకు తిరుగులేదని అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరోసారి రుజువు చేశాడు. 23వ ఒలింపిక్ పతకాన్ని గెలిచి తన రికార్డును మరింత పదిలపరుచుకున్నాడు. రియో ఒలింపిక్స్ లో 4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలో బంగారు పతకం సాధించి బోణి కొట్టాడు. అతడికిది 19వ ఒలింపిక్ గోల్డ్ మెడల్ కావడం విశేషం. 2 రజతాలు, 2 కాంస్యాలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. ‘ఫ్లయింగ్ ఫిష్’ గా ప్రఖ్యాతి గాంచిన ఈ 6 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న స్విమ్మర్ రియో ఒలింపిక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ ఏకంగా 8 స్వర్ణాలు గెలిచి ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు కూడా తిరగ రాస్తాడేమో చూడాలి. -
స్విమ్మింగ్‌లో 'త్రిముఖ' పోరు!
రియోడీజనీరో: ఈసారి రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఐదోసారి ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటున్న ఫెల్ఫ్స్ .. అమెరికా తరఫున అత్యధిక సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పురుష స్విమ్మర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఫెల్ప్స్ 18 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఒలింపిక్స్ స్విమ్మింగ్ ఈవెంట్ లో ప్రధానంగా మూడు దేశాల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. స్విమ్మింగ్‌లో అమెరికాతో పాటు, ఆస్ట్రేలియా, చైనా జట్లు బలంగా ఉండటంతో వారి మధ్య త్రిముఖ పోరు ఖాయంగా కనబడుతోంది. అమెరికా జట్టు పురుషుల విభాగంలో మైకేల్ ఫెల్ప్స్ వంటి దిగ్గజ ఆటగాడు బరిలోకి దిగుతుండగా, ఆస్ట్రేలియా జట్టు కామెరూన్ మెక్వాయ్, చైనా జట్టు నుంచి లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత సున్ యాంగ్తో పాటు 2015 వరల్డ్ చాంపియన్ నింగ్ జెటావ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా స్విమ్మర్ కేట్ క్యాంపబెల్ పతకాలు కొల్లగొట్టే అవకాశం ఉంది. గత నెల్లో 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో వరల్డ్ రికార్డు నమోదు చేసిన క్యాంపబెల్.. రియోలో సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు చైనా స్విమ్మర్ యి షివెన్పై ఒలింపిక్స్ పతకాలపై దృష్టి సారించింది. మహిళల విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లో వరల్డ్ రికార్డు నమోదు చేసిన యి షివెన్ పతకాలపై భారీగానే ఆశలు పెట్టుకుంది. కాగా, వీరికి జపాన్, దక్షిణాఫ్రికా జట్ల స్విమ్మర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. -
ఎందరో మహానుభావులు
అద్వితీయ ప్రదర్శనతో ఒలింపిక్స్‌కే వన్నె తెచ్చిన దిగ్గజాలు ఒక్క అవకాశంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు ఒలింపిక్స్ క్రీడలు వేదికగా నిలుస్తాయి. ఈ విశ్వ క్రీడల సంరంభంలో ఒకసారైనా పాల్గొనాలని, పతకంతో తిరిగి రావాలని క్రీడాకారులందరూ పరితపిస్తారు. కేవలం ప్రాతినిధ్యమే కాకుండా తమ అద్వితీయ ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టి... ఎందరికో స్ఫూర్తిగా నిలిచి.. ఈ ప్రపంచ క్రీడల పండుగకు వన్నె తెచ్చిన క్రీడాకారులెందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి క్లుప్తంగా.. - సాక్షి క్రీడావిభాగం మైకేల్ ఫెల్ప్స్ బరిలో దిగితే పతకమే... ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడు మైకేల్ ఫెల్ప్స్. అమెరికాకు చెందిన ఈ 31 ఏళ్ల స్విమ్మర్ ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొని 22 పతకాలు సాధించాడు. ఇందులో 18 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. ‘బాల్టిమోర్ బుల్లెట్’... ‘ఫ్లయింగ్ ఫిష్’ ముద్దు పేర్లు కలిగిన ఈ 6 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న స్విమ్మర్ రియో ఒలింపిక్స్‌లో మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ ఏకంగా 8 స్వర్ణాలు గెలిచి ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాకే చెందిన స్విమ్మర్ మార్క్ స్పిట్జ్ (1972 మ్యూనిచ్-7 స్వర్ణాలు) పేరిట ఉన్న ఈ రికార్డును ఫెల్ప్స్ బద్దలు కొట్టాడు. నాడియా కొమనెసి పర్ఫెక్ట్ జిమ్నాస్ట్... మహిళల జిమ్నాస్టిక్స్ను ప్రస్తావిస్తే అందరి మదిలో మెదిలే తొలిపేరు నాడియా కొమనెసి. రొమేనియాకు చెందిన ఈ జిమ్నాస్ట్ 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో కేవలం 15 ఏళ్ల ప్రాయంలో మూడు స్వర్ణాలు సొంతం చేసుకుంది. ఈ ఒలింపిక్స్‌లో నాడియా ఆల్ రౌండ్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్ విభాగాల్లో 10కి 10 పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో మరో రెండు స్వర్ణాలు నెగ్గిన నాడియో 1981లో 20 ఏళ్లకే ఈ క్రీడకు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి నాడియా ఒలింపిక్స్‌లో 5 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి తొమ్మిది పతకాలు సాధించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అత్యున్నత పురస్కారం ‘ఒలింపిక్ ఆర్డర్’ను రెండుసార్లు అందుకున్న ఏకైక క్రీడాకారిణి నాడియా కావడం విశేషం. వితాలీ షెర్బో ఒకే ఒక్కడు... ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధిస్తేనే గొప్పగా భావించే చోట ఒకే ఒలింపిక్స్‌లో ఏకంగా ఆరు స్వర్ణాలతో మెరిసిన జిమ్నాస్ట్ వితాలీ షెర్బో. ఒకప్పటి సోవియట్ యూనియన్‌కు చెందిన షెర్బో 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో టీమ్, ఆల్ రౌండ్, పామెల్ హార్స్, రోమన్ రింగ్స్, వాల్టింగ్, పారలల్ బార్స్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. 1991 డిసెంబరులో సోవియట్ యూనియన్ విచ్ఛినమైన తర్వాత ఏర్పడిన కొత్త దేశాలకు చెందిన క్రీడాకారులందరూ ‘యూనిఫైడ్ టీమ్’ పేరుతో 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. షెర్బో కూడా యూనిఫైడ్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. షెర్బో తర్వాత ఇప్పటివరకు ఏ జిమ్నాస్ట్ కూడా ఒకే ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు సాధించలేదు. 1996లో షెర్బో భార్య ఇరీనా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. దాంతో షెర్బో శిక్షణ మానేసి భార్య దగ్గరే ఉన్నాడు. నెల రోజుల తర్వాత భార్య కోమాలో నుంచి బయటకు రావడం... అట్లాంటా ఒలింపిక్స్‌లో కచ్చితంగా పాల్గొనాలని ఆమె షెర్బోను కోరడంతో అతను మళ్లీ ప్రాక్టీస్ చేశాడు. అయితే తగినంత సమయం లేకపోవడంతో సరైన సాధన చేయకుండానే అట్లాంటా ఒలింపిక్స్‌లో బెలారస్ దేశం తరఫున పాల్గొన్న షెర్బో నాలుగు కాంస్య పతకాలను సాధించాడు. తన ఒలింపిక్ కెరీర్‌ను పది పతకాలతో ముగించాడు. వీళ్లనూ మరువలేం... ఫెల్ప్స్, లారిసా, నాడియా, జెస్సీ ఓవెన్స్, షెర్బోలతోపాటు ఎంతోమంది ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించిన వారు ఉన్నారు. వీరిలో కార్ల్ లూయిస్, రా ఎవ్రీ, ఎడ్విన్ మోజెస్, మైకేల్ జాన్సన్ (అథ్లెటిక్స్, అమెరికా), నికోలాయ్ అడ్రియనోవ్, బోరిస్ షాక్లిన్ (జిమ్నాస్ట్, రష్యా), తకాషి ఒనో (జిమ్నాస్ట్, జపాన్), పావో నుర్మి,(అథ్లెటిక్స్, ఫిన్లాండ్), ఎమిల్ జటోపెక్ (అథ్లెటిక్స్, చెకోస్లొవేకియా), మార్క్ స్పిట్జ్, నటాలీ కులిన్, మాట్ బియాండీ (స్విమ్మింగ్, అమెరికా), డారా టోరెస్ (స్విమ్మింగ్, అమెరికా), ఫెలిక్స్ సవాన్ (బాక్సింగ్, క్యూబా), అలెగ్జాండర్ కరెలిన్ (రెజ్లింగ్, రష్యా), అబెబీ బికిలా, హెయిలీ గెబ్రెసెలాసీ, కెనెనిసా బెకెలే (అథ్లెటిక్స్, ఇథియోపియా), ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్, జమైకా) కూడా ఒలింపిక్స్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జెస్సీ ఓవెన్స్ నల్ల బంగారం... ఎలాంటి ప్రచార్భాటాలు లేని రోజుల్లో ఒకే ఒక్క ఒలింపిక్స్‌లో పాల్గొని తిరుగులేని పేరు తెచ్చుకున్న అథ్లెట్ జెస్సీ ఓవెన్స్. అమెరికాకు చెందిన ఈ నల్ల జాతీయుడు 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలను సొంతం చేసుకొని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు గర్వభంగాన్ని చేశాడు. సొంతగడ్డపై జర్మనీ అథ్లెట్స్‌ను అలవోకగా ఓడించిన ఓవెన్స్ విజయాలను ఓర్వలేని హిట్లర్ అతనితో కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడకుండానే మైదానాన్ని వీడారు. ఆగస్టు 3న 100 మీటర్ల రేసులో స్వర్ణాన్ని నెగ్గిన ఓవెన్స్, ఆగస్టు 4న లాంగ్‌జంప్‌లో, ఆగస్టు 5న 200 మీటర్ల రేసులో, ఆగస్టు 9న 4ఁ100 మీటర్ల రిలేలో పసిడి పతకాలను దక్కించుకొని దుమ్మురేపాడు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944లలో ఒలింపిక్స్ జరగలేదు. లేదంటే జెస్సీ ఓవెన్స్ మరిన్ని అద్భుతాలు చేసేవాడు. 1981లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఓవెన్స్ మృతి చెందాడు. లారిసా లాతినినా కళ్లు చెదిరే విన్యాసాలు.. తమ శరీరాన్ని విల్లులా వంచి అబ్బురపరిచే విన్యాసాలు చేయడంలో జిమ్నాస్ట్‌లకు తిరుగులేదు. ఒకప్పటి సోవియట్ యూనియన్‌కు చెందిన లారిసా లాతినినా తన అద్వితీయ ప్రతిభతో వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో (1956, 1960, 1964) బరిలోకి దిగి ఏకంగా 18 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం 81 ఏళ్ల వయస్సున్న లారిసా వ్యక్తిగత విభాగంలో అత్యధికంగా 14 పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌లో ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. ఫెల్ప్స్ వ్యక్తిగత విభాగంలో 13 పతకాలు సాధించి లారిసా రికార్డుకు చేరువలో ఉన్నాడు. -
ఫెల్ప్స్‌కు తప్పిన శిక్ష
బాల్టిమోర్ (అమెరికా): మద్యం సేవించడమే కాకుండా అతి వేగంగా కారు నడిపిన కేసులో అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఈ కేసులో బాల్టిమోర్ కోర్టుకు హాజరైన స్విమ్మర్ తన ప్రవర్తనతో జడ్జీని ఆకట్టుకున్నాడు. ఆరిజోనాలోని మిడోస్ అడిక్షన్ సెంటర్లో ఫెల్ప్స్ 45 రోజుల పాటు పునరావాస చికిత్స తీసుకున్నాడని స్విమ్మర్ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. ప్రస్తుతం అతను ఆల్కహాల్ జోలికి వెళ్లడం లేదని, ఈ కేసులో ప్లేయర్‌పై కరుణ చూపాలని విజ్ఞప్తి చేశాడు. ఆరు నెలల పాటు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం ఎదుర్కొంటున్న ఫెల్ప్స్‌కు ఈ కేసులో కచ్చితంగా జైలు శిక్ష పడాల్సింది. కానీ ప్రాసిక్యూటర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఏడాది పాటు శిక్షను అమలు చేయకుండా ఉండటంతో పాటు, 18 నెలలు స్విమ్మర్ ప్రవర్తనను పర్యవేక్షించాలని జడ్జి ఆదేశించారు. -
తాగి బండి నడుపుతూ పట్టుబడ్డ ఒలింపిక్ ఈతగాడు
ఒలింపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ మైఖేల్ ఫెల్ప్స్ తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బాల్టిమోర్‌లోని ఫోర్ట్ మెక్‌హెన్రీ సొరంగంలో వెళ్లాల్సిన వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్లి, డబుల్ లేన్‌ను కూడా క్రాస్ చేసినట్లు మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 1.40 గంటలకు ఫెల్ప్స్ వ్యవహారాన్ని రాడార్ గుర్తించింది. గంటకు 45 మైళ్ల వేగంతోనే వెళ్లాల్సిన ప్రాంతంలో అతడు 84 మైళ్ల వేగంతో వెళ్లాడు. దాంతో 18 సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించిన అతగాడిని పోలీసులు ముందుగా అరెస్టుచేసి, తర్వాత విడుదల చేశారు. ఎంత మొత్తంలో మద్యం తాగాడన్న పరీక్షల్లో కూడా ఫెల్స్ప్ విఫలం అయినట్లు పోలీసులు చెప్పారు. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు ఫెల్స్ప్ గానీ, ఆయన ప్రతినిధులు గానీ అందుబాటులోకి రాలేదు. -
ఫెల్ప్స్‌కు ‘తొలి’ పతకం
చార్లోట్: లండన్ ఒలింపిక్స్‌తో స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అమెరికా దిగ్గజం ఫెల్ప్స్... ఇటీవల మళ్లీ మనసు మార్చుకుని ఈత కొలనులోకి దిగిన సంగతి తెలిసిందే. తన పునరాగమనం చేసిన నెల రోజుల్లోనే ఈ స్టార్ స్విమ్మర్ తొలి పతకం సాధించాడు. చార్లోట్ గ్రాండ్ ప్రి 100మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలో తను విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన పోటీలో తను 52.13సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. పావెల్ సంకోవిచ్ (బెలారస్, 52.72సె.), జోసెఫ్ స్కూలింగ్ (సింగపూర్, 52.95సె.) తర్వాత స్థానాల్లో నిలిచారు.