
రారాజు జైత్రయాత్ర
ఫెల్ప్స్ ఖాతాలో 22వ స్వర్ణం
కొలనులో అమెరికా హవా
రియో డి జనీరో: ఒలింపిక్స్ ఈత కొలనులో రారాజు మైకేల్ ఫెల్ప్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ప్రపంచ చాంపియన్ శుక్రవారం జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే ఈవెంట్‌లో స్వర్ణం సాధించి.. ఒలింపిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డును చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఒకే ఈవెంట్లో వరుసగా నాలుగు గేమ్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన అథ్లెట్‌గా.. కార్ల్ లూయిస్ (లాంగ్ జంప్), అల్ ఓయెర్టర్ (డిస్కస్ త్రోయర్) సరసన నిలిచాడు. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ స్వర్ణాల సంఖ్య 22కు.. మొత్తం పతకాల సంఖ్య 26కు చేరింది. ఇది ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం పతకాల సంఖ్యకు సమానం.
మళ్లీ అమెరికాదే బ్యాక్‌స్ట్రోక్
బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో 1992 నుంచీ స్వర్ణాన్ని వదలని అమెరికా మరోసారి తన సత్తా కొనసాగించింది. 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో అమెరికన్ స్విమ్మర్ ర్యాన్ మర్ఫీ స్వర్ణం సాధించాడు. దీంతో వరుసగా రెండు బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో (200 మీటర్లు, 100 మీటర్లు) స్వర్ణాలు గెలిచిన మూడో అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. మూడ్రోజుల క్రితం 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లోనూ మర్ఫీ మొదటి స్థానంలో నిలిచాడు.