చిరుత కూడా ఒప్పుకుంది బోల్ట్ గొప్పోడని
ప్రపంచంలోనే నేనే గొప్పవాడిని... ఎంత మంది ఇలా ధైర్యంగా రొమ్ము విరిచి చెప్పుకోగలరు... మూడు పదుల వయసు అంటే ముసలితనం కాదు, మళ్లీ ‘మూడు’ కొడతా చూడమని సవాల్ చేసి మరీ బరిలోకి దిగేందుకు ఎంత ధైర్యం ఉండాలి, తనపై తనకు ఎంత నమ్మకం ఉండాలి. త్రీ ఇంటూ త్రీ నైన్ అనేది సాధారణ లెక్క మాత్రమే. కానీ బోల్ట్‌కు సంబంధించి అదో చరిత్ర. ప్రపంచ క్రీడా పటంపై మరే అథ్లెట్‌కూ సాధ్యం కాని, ఎవరూ ఊహించేందుకు కూడా సాహసించని నవ స్వర్ణాల ఘనత అది.
మూడు ఒలింపిక్స్‌లో అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఆ పరుగు విశ్వ క్రీడా సంబరంలో ముగిసింది. వెళుతూ వెళుతూ కూడా ఆ బంగారపు అడుగులు తమదైన ముద్ర వేశాయి. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా తొమ్మిది పసిడి పతకాలను మెడలో వేసుకొని దర్జాగా అతను ‘తొమ్మిది సెకన్లలో’ ఒలింపిక్స్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక ‘చిరుత’ చింత కూడా తీరిపోయింది... మళ్లీ తన పరుగును ప్రపంచం గుర్తిస్తుందని. చిరుత కూడా బోల్ట్ గొప్పతనాన్ని ఒప్పుకుంది... అతనితో పోటీ పడి అడవిలో కూడా తాను తొమ్మిది స్వర్ణాలు సాధించలేనని.
‘నేను ప్రపంచంలోనే గొప్పవాడిని అని నిరూపించుకునేందుకే రియోలో అడుగు పెట్టాను. ఇప్పుడు దానిని చేసి చూపించాను. ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు. ఈ క్రీడల తర్వాత మొహమ్మద్ అలీ, పీలేల సరసన నిలబడతానని నమ్ముతున్నా’... రిలేలో విజయం తర్వాత సింహనాదం చేస్తూ బోల్ట్ తన గురించి తాను ఒక్క వాక్యంలో చెప్పుకున్న మాట అక్షర సత్యం. అతనొక్కడే కాదు... ప్రపంచం మొత్తం దీనిని అంగీకరించింది. వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో మూడేసి చొప్పున అతను సాధించిన 9 స్వర్ణ పతకాలు ఈ దిగ్గజం గురించి చెబుతున్నాయి. ఎనిమిదేళ్ల వ్యవధిలో ప్రపంచ అథ్లెటిక్స్‌ను ఒక ఊపు ఊపిన ఈ సూపర్ స్టార్ ఆదివారం (నేడు) తన 30వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. స్ప్రింట్‌కు పర్యాయపదంగా నిలిచిన అతను తాజా స్వర్ణంతో తన ఒలింపిక్స్ ప్రస్థానాన్ని ముగించాడు.
2008 బీజింగ్‌లో బంగారు పతకాలు గెల్చుకున్నా... ఇంత గొప్పగా కెరీర్ ముగించగలడంటే నమ్మలేదు. ‘బీజింగ్‌నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొనగలనని నేనూ ఊహించలేదు. మొదటి ఒలింపిక్స్ కాస్త సంతోషాన్నిచ్చింది. రెండో ఒలింపిక్స్ నాకు సవాల్‌గా నిలిచింది. మూడోది నమ్మలేనంత అద్భుతంగా సాగింది’ అని తన ‘మూడు’ విజయాల గురించి బోల్ట్ విశ్లేషించాడు.
ఇప్పటికీ దరిదాపుల్లో లేరు
ఒలింపిక్స్‌లో ఇక ముందు తొమ్మిది సెకన్లలో ప్రపంచాన్ని గెలిచే ఆ పరుగు కనిపించదు. ఒక్కో పతకానికి తన స్థాయిని ఆకాశానికి పెంచుకుంటూ తారాపథానికి ఎదిగిన ఆ వ్యక్తి విశ్వ క్రీడా సంబరంలో భాగం కాలేడు. రియో ఒలింపిక్స్‌తోనే ఆఖరు అని బోల్ట్ చాలా ముందే చెప్పేశాడు. బహుశా మళ్లీ పునరాగమనం లాంటి ఆలోచన కూడా చేయకపోవచ్చు. ఈ ఒలింపిక్స్‌లో తన టైమింగ్‌కంటే చాలా తక్కువగా నమోదు చేయడం, అలవాటైన రీతిలో నెమ్మదిగా పరుగు ప్రారంభించడం... ఇలా ఎన్ని చేసినా బోల్ట్ ఇప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన అథ్లెటే. రియోలో ఎవరూ అతని దరిదాపులకు కూడా రాలేకపోయారు. రిలేలో కూడా చివరి లెగ్‌లో అతను మిగతావారితో పోలిస్తే ఆలస్యంగా బ్యాటన్ అందుకున్నాడు. అయినా సరే మరోసారి ఎలాంటి డ్రామా కనిపించలేదు. ఆ గొప్పతనంలో తేడా రాలేదు. ప్రశాంతంగా అతను ఫినిషింగ్ లైన్‌ను దాటడమే అందరి మనసుల్లో నిలిచిపోయింది.
అమెరికా ఆధిపత్యానికి గండి
బోల్ట్ రాకముందు స్ప్రింట్‌లో అమెరికా ఆధిపత్యమే కొనసాగింది. ఒక్కసారిగా అతను వచ్చాక దీనికి గండిపడింది. 2008నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా అమెరికా అథ్లెట్లు బోల్ట్ జోరును ఆపలేకపోయారు. పావెల్, బ్లేక్‌వంటి సహచరులు కూడా అండగా నిలవడంతో స్ప్రింట్‌ను జమైకా శాసించడం మొదలు పెట్టింది. అమెరికాకు అడ్డుకట్ట వేస్తూ ప్రారంభమైన బోల్ట్ పరుగు... ఈ సారి అదే జట్టు ‘డిస్‌క్వాలిఫై’ సాక్షిగా ముగియడం యాదృచ్ఛికం. జమైకాను ఓడించాలనే ఒత్తిడిలో తమ ఆటను మరిచి వారు దారి తప్పినట్లు పావెల్ వ్యాఖ్యానించినా... అసలు జమైకాను కాదు బోల్ట్‌ను ఓడించే ప్రయత్నంలో అమెరికా ఒత్తిడికి లోనైంది. ‘నా చేతికి బ్యాటన్ రాగానే నేను గెలిచేశానని నమ్మాను. నేనేం చెబుతున్నానో మీకు అర్థం అయింది కదా. ట్రాక్‌పై నన్ను వెనక్కి తోసేవారెవరూ అప్పుడు నాకు కనిపించలేదు’ అని ఒకరకమైన గర్వంతో బోల్ట్ చెప్పాడు. 2004 ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచి ఆ తర్వాత నాలుగేళ్ల నిషేధానికి గురైన అమెరికన్ గాట్లిన్... మిగిలిన తన కెరీర్ ఆసాంతం బోల్ట్ వెనకే ఉండిపోవాల్సి వచ్చింది.
వెనక్కి వెళ్లిన ప్రతిసారీ పుంజుకుని
2008లో అనామకుడిగా వచ్చి స్వర్ణం గెలిచిన కొద్ది రోజులకే బోల్ట్ గాయపడ్డాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు బ్లేక్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ సారి కూడా గాయాలు వేధించాయి. జూన్‌లో గాయం కారణంగా జమైకా జాతీయ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకోవడంతో అందరికీ సందేహాలు తలెత్తాయి. కానీ అతను అన్నీ పటాపంచలు చేశాడు. ఒకటి కాదు రెండు కాదు... అనేక సందర్భాల్లో రేసులో వెనుకబడి కూడా మళ్లీ విజేతగా నిలవడం అతనికే చెల్లింది. ఒలింపిక్స్‌లో బోల్ట్ స్వర్ణాలు చూస్తే పరుగు ఇంత సులువా అని అనిపించవచ్చు. కానీ తన కఠోర శ్రమతో అతను గాయాలను గెలిచి అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించాడు. అసలు సమయంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలగడం అతనికే చెల్లింది. 9 ఒలింపిక్స్ ఫైనల్స్... 9 స్వర్ణాలు... ఖేల్ ఖతం! ‘నేను ఇన్నేళ్ల పడిన శ్రమ, తీవ్రమైన ఒత్తిడి, గాయాల సమస్య తర్వాత ఒలింపిక్స్‌లో పరుగు ముగించడం... ఇప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపిస్తోంది. అయితే ఇదే నా ఆఖరు పరుగు అని, ఒలింపిక్స్‌లో మళ్లీ ఆడలేనని కాస్త బాధగా కూడా అనిపిస్తోంది’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు.
స్వచ్ఛమైన పరుగు
బీజింగ్ నుంచి రియో వరకూ ఒలింపిక్స్ పతకాలు గెలిచిన ఎనిమిదేళ్లలో అతను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరో 11 స్వర్ణాలు, 2 రజతాలు కూడా సాధించాడు. 2011లో ఫాల్స్ స్టార్ట్ మినహా పాల్గొన్న ప్రతీసారి 100 మీ., 200 మీ. లలో స్వర్ణం దక్కింది. ప్రపంచంలో 100 మీ. పరుగులో అత్యుత్తమ టైమింగ్ సాధించిన టాప్-5లో బోల్ట్ మినహా మిగతా నలుగురు టైసన్ గే, బ్లేక్, పావెల్, గాట్లిన్ ఏదో ఒక దశలో డోపింగ్‌లో పట్టుబడినవారే! ఈ స్వచ్ఛమైన పరుగే బోల్ట్‌ను మరింత గొప్పగా నిలబెట్టింది. ఒక దశలో డోపింగ్ చేస్తే తప్ప బోల్ట్‌ను గెలవలేరేమోనని పరిస్థితి కనిపించింది. అయితే అలా చేసినా బోల్ట్‌ను వారు కొట్టలేకపోయారు!
ఎనిమిదిగా మారతాయా..!
బోల్ట్ స్వర్ణం నెగ్గిన బీజింగ్ 4 100 మీ. రిలే పోటీల్లో భాగస్వామిగా ఉన్న నెస్టా కార్టర్ ఇటీవలే డోపింగ్‌లో పట్టుబడ్డాడు. త్వరలో జరిగే రెండో పరీక్షలోనూ అతను పాజిటివ్‌గా తేలితే ఆ స్వర్ణం కోల్పోతాడు. అంటే బోల్ట్ నంబర్ కూడా 9నుంచి 8కి పడిపోవచ్చు! ‘ఇది నా గొప్పతనాన్ని తగ్గిస్తుందని అనుకోవడం లేదు. క్లీన్‌గా ఉంటూనే నన్ను నేను నిరూపించుకున్నాను. నిజంగా పతకం పోతే నిరాశకు గురవుతాను. జీవితంలో నా ప్రమేయం లేకుండానే కొన్ని ఇలాంటివి జరిగిపోతాయి’ అని బోల్ట్ అభిప్రాయ పడ్డాడు.
ఇంతింతై... వటుడింతై...
జమైకాలాంటి ఓ పేద దేశంలో ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బోల్ట్... ఇవాళ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచే ఘనతలు సాధించాడు. కానీ నిజానికి చిన్నతనంలో తను క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ స్కూల్ క్రికెట్ కోచ్ సలహా మేరకు అథ్లెటిక్స్‌వైపు మళ్లాడు. 2001లో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల రేసులో తొలిసారి పాల్గొన్నప్పుడు ఫైనల్‌కు చేరలేకపోయాడు. 15 ఏళ్లు వచ్చేసరికి బోల్ట్ ఎత్తు 6 అడుగుల 5 అంగుళాలకు చేరింది. 2002లో స్వదేశంలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 200 మీటర్లలో స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కాలి గాయంతోనే 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 200 మీటర్ల రేసులో తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. 2007 జపాన్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 200 మీటర్ల విభాగంలో రజతం సాధించాడు. ఈ ఫలితం ద్వారా బోల్ట్ తన కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాడు.
ప్రపంచ రికార్డుతో వెలుగులోకి: న్యూయార్క్ వేదికగా 2008 మేలో జరిగిన అంతర్జాతీయ మీట్‌లో బోల్ట్ 100 మీటర్ల రేసును 9.72 సెకన్లలో ముగించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దాంతో అథ్లెటిక్స్ ట్రాక్‌పై కొత్త సంచలనం వచ్చాడంటూ బోల్ట్ పేరు మార్మోగిపోయింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ బోల్ట్ 100, 200 మీటర్లు, 4*100 మీటర్ల రిలేలో కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పడంతోపాటు స్వర్ణాలను సొంతం చేసుకొని పెను సంచలనం సృష్టించాడు.
బెర్లిన్‌లో మెరుపులు: బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు ప్రపంచ రికార్డులు సాధించిన బోల్ట్... 2009లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల విభాగంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. 4*100 మీటర్ల రిలేలోనూ స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత బోల్ట్‌కు ఎదురులేకుండా పోయింది. ‘ఫౌల్ స్టార్ట్’ చేసి 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల ఫైనల్ రేసు నుంచి నిష్ర్కమించిన బోల్ట్... ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు తాను పాల్గొన్న రేసుల్లో అజేయంగా నిలిచాడు.
లండన్‌లో వీడ్కోలు: నేటితో (ఆదివారం) 30 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బోల్ట్ రియోనే తనకు చివరి ఒలింపిక్స్ అని ప్రకటించాడు. వచ్చే ఏడాది ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని తెలిపాడు. బోల్ట్ వెలుగులోకి రాకముందు డోపింగ్ ఆరోపణలతో అథ్లెటిక్స్ ప్రతిష్ట మసకబారిపోయింది. అయితే ఈ జమైకా స్టార్ రాకతో అథ్లెటిక్స్‌కు మళ్లీ ప్రాణం లేచొచ్చింది.