బోల్ట్ అండ్ బ్యూటిఫుల్ | Usain Bolt wins 100m gold, Andre De Grasse gets bronze | Sakshi
Sakshi News home page

బోల్ట్ అండ్ బ్యూటిఫుల్

Published Tue, Aug 16 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

బోల్ట్ అండ్ బ్యూటిఫుల్

బోల్ట్ అండ్ బ్యూటిఫుల్

100 మీ. పరుగులో ఉసేన్ బోల్ట్‌కు స్వర్ణం
వరుసగా మూడు ఒలింపిక్స్‌లో  ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్
9.81 సెకన్లలో రేస్ ఫినిష్


మెరుపు ఒకే చోట రెండో సారి రాదు అంటారు... కానీ ఈ మెరుపు రెండు సార్లు కాదు తన గడపలో మూడో సారి మెరిసింది. వేగంలో వాయుదేవుడికి కూడా పాఠాలు చెప్పగల జమై‘కింగ్’ మెడలో మళ్లీ పసిడి మాల పడింది. అడుగేస్తే చాలు పసిడి పరుగెత్తుతూ నా వైపు వస్తుందన్నట్లుగా ఆ ‘బంగారపు బూట్లు’ మళ్లీ రికార్డుల మోత మోగించాయి. బీజింగ్‌లో ప్రారంభమైన పతక పరుగు రియోలో కూడా ఆగలేదు.


100 మీటర్ల రేస్ అంటే ఒలింపిక్స్‌లో ఫ్యాన్సీ ఈవెంట్, ప్రేక్షకులకు వినోదం పంచే అందమైన పరుగు... అథ్లెట్లకు మాత్రం అది జీవిత కాల శ్రమ. పతకం కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడేవారంతా ఒక వైపు... అసలు ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆందోళన కనిపించకుండా బోల్ట్ మరోవైపు. ఏదో పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లినంత సులభంగా గెలవడం బోల్ట్‌కు మాత్రమే తెలిసిన విద్య. దానిని మరోసారి ప్రదర్శించిన అతను అలవోకగా లక్ష్యం చేరి  తన గొప్పతనం మళ్లీ చూపించాడు.


రియో: ప్రపంచంలో వేగవంతమైన అథ్లెట్‌గా తనకున్న గుర్తింపును జమైకా సూపర్ స్టార్ ఉసేన్ బోల్డ్ నిలబెట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగులో తనకు తిరుగు లేదని నిరూపిస్తూ సునాయాసంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 9.81 సెకన్లలో రేస్ పూర్తి చేసి బోల్ట్ అగ్రస్థానంలో నిలిచాడు. అతని గత టైమింగ్‌లతో పోలిస్తే ఇది  ఎక్కువే అయినా... ట్రాక్‌పై ప్రత్యర్థులనుంచి బోల్ట్‌కు ఎలాంటి సవాల్ ఎదురు కాలేదు. గాట్లిన్ (అమెరికా - 9.89 సె.) రజత పతకం గెలుచుకోగా, ఆండ్రీ డీ గ్రాస్ (కెనడా-9.91 సె.) కాంస్యం దక్కించుకున్నాడు. మరో జమైకా ఆటగాడు యోహాన్ బ్లేక్‌కు నాలుగో స్థానం దక్కింది. గత జూన్‌లో గాయం కారణంగా జమైకా జాతీయ చాంపియన్‌షిప్‌నుంచి బోల్ట్ తప్పుకోవడంతో అతని ఫామ్‌పై సందేహాలు రేకెత్తాయి. అయితే ఈ దిగ్గజం అవన్నీ తప్పని చేతల్లో నిరూపించాడు.

 
ట్రిపుల్ గ్రేట్

120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో వరుసగా మూడో ఒలింపిక్స్‌లో ఒకే ఈవెంట్ (100 మీ.)లో స్వర్ణం గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. గతంలో దిగ్గజ అథ్లెట్లు ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ ఈ ఈవెంట్‌లో పసిడి పతకం సాధించాడు. మొత్తంగా ఒలింపిక్స్‌లో అతనికి ఇది ఏడో స్వర్ణ పతకం కావడం విశేషం. 2008నుంచి ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు కలిపి బోల్ట్ ఇప్పటికి 18 స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో 2 రజతాలు కూడా అతనికి దక్కాయి.


ఆ వేగం వెనుక... అష్ట సూత్రాలు
బోల్ట్‌ను ఓడించే మనిషి ఇంకా భూమిపై పుట్టలేదా..? మెరుపు కూడా అతనితో పోటీ పడేముందు ఆలోచించుకుంటుందా..? రికార్డులు సృష్టించటం అంత సులభమా? చిరుతలా పరిగెత్తటం అతనికెలా సాధ్యం? ఆరున్నర అడుగుల శరీరంతో అద్భుతాలు చేస్తున్న బోల్ట్‌ను చూస్తుంటే.. ఎంతో మందికి ఎన్నో సందేహాలు. జమైకాలో పుట్టి మొత్తం అథ్లెటిక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఉసేన్ బోల్ట్‌ను ట్రాక్‌పై అందుకోవడం తోటి స్ప్రింటర్లకు కలలోనూ సాధ్యం కావటం లేదు. బోల్ట్ విజయం వెనక ఉన్న రహస్యాలను చూస్తే... 

 

తక్కువ శక్తితో ఎక్కువ వేగం
బోల్ట్ అంత వేగంగా ఎలా పరిగెడతాడు? అనే ప్రశ్న అభిమానుల్లోనే కాదు.. భౌతికశాస్త్ర పండితుల్లోనూ చర్చనీయాంశమైంది. దీనిపై పరిశోధనలు చేపట్టిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్.. కొన్ని విషయాలపై స్పష్టత సాధించింది. బోల్ట్ శరీరంలో 8 శాతం కండరాలు పరిగెత్తేందుకు ఉపయోగపడితే... మిగిలిన 92 శాతం అతను ముందుకు దూసుకుపోయేందుకు (డ్రాగ్) పనిచేస్తున్నాయని వారు గుర్తించారు. బోల్ట్  శరీర బరువు, గాలి, ఉష్ణోగ్రత, చలనాత్మక శక్తి వంటి అంశాల ఆధారంగా గణించిన ‘డ్రాగ్ గుణకం’ సామాన్య మానవుడితో పోలిస్తే చాలా తక్కువ. అందుకే తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం దూసుకుపోవటం ఇతనికి సాధ్యమని గుర్తించారు.

 

అసాధారణమైన అంగలు
ఆరున్నర అడుగుల ఎత్తుండటం బోల్ట్‌కు కలిసొచ్చే అంశం. దీంతో చాలా పెద్ద పెద్ద అంగలు వేయవచ్చు. దీని కారణంగానే బోల్ట్ దూసుకుపోతున్నాడని కేంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధకుడు జాన్ బారో వెల్లడించాడు. ప్రత్యేకమైన శరీరాకృతి కూడా క్షణాల్లో బోల్ట్ వేగం పుంజుకునేందుకు ఉపకరిస్తోంది. మిగిలిన అథ్లెట్లు సగటున 45 అంగల్లో 100 మీటర్లు పరిగెడితే.. బోల్ట్ కేవలం 40 అంగల్లోనే రేసు ఫినిష్ చేస్తున్నాడు. ఒకవేళ రేసు జరుగుతున్న దిశలోనే వాయు గమనం ఉన్నట్లైతే బోల్ట్ మరింత వేగంగా రేసు ఫినిష్ చేస్తాడు.

 

గ్లెన్ మిల్స్ శిష్యరికం
గ్లెన్ మిల్స్ ప్రపంచంలోని గొప్ప అథ్లెట్లకు కోచ్. అనేకమంది జమైకన్ అథ్లెట్లను ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దారు. యొహాన్ బ్లేక్, అసాఫా పావెల్ వంటి స్టార్లు ఈయన శిష్యులే. 2004లో బోల్ట్‌ను స్టార్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న మిల్స్... ఈ ‘చిరుత’ను ప్రపంచానికి పరిచయం చేయటంలో చాలా కీలకంగా వ్యవహరించారు. కేవలం వంద మీటర్లకే పరిమితమవుతానన్న బోల్ట్‌ను 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో పాల్గొనేలా మిల్స్ ప్రోత్సహించారు.


కాళ్లు కాదు స్ప్రింగులు
ఉసేన్ బోల్ట్ వేగంపై పరిశోధనలు చేసిన వారిలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ప్రొఫెసర్ మాక్స్ ప్రొకోపీ ఒకరు. ఈయన చెప్పినదాని ప్రకారం.. బోల్ట్‌లో ఉన్న జన్యుపరమైన అడ్వాంటేజ్ వల్ల అతని పాదాలు స్ప్రింగుల్లా పనిచేస్తున్నాయి. సాధారణ అథ్లెట్లు పరిగెత్తే సమయంలో అడుగుతీసి మరో అడుగు వేస్తున్నప్పుడు 226 కిలోల శక్తి ఉత్పన్నమైతే... బోల్ట్ అడుగులో 453 కిలోల శక్తి ఉత్పన్నమవుతోంది. అంటే కాళ్లు స్ప్రింగుల్లా ఎగురుతాయి. దీని వల్ల మరింత వేగంగా.. ఎక్కువ దూరంతో అంగలు వేయవచ్చు. యూరోపియన్లు, ఆసియన్లతో పోలిస్తే జమైకన్ల శరీరం సౌష్టవంగా ఉంటుంది. వీరి కాళ్లు మరీ ముఖ్యంగా మోకాళ్లు చాలా బలంగా ఉంటాయి. పెరుగుతున్న కొద్దీ పరిగెత్తేందుకు అనుకూలంగా శరీరంలో మార్పు వస్తుంది. అందుకే బ్లేక్, పావెల్, నెస్టా కార్టర్, స్టీవ్ ముల్లింగ్స్ వంటి అథ్లెట్లు జమైకా నుంచి వచ్చారు.

 

భోజనం, నిద్ర
ఉసేన్ బోల్ట్ రికార్డులు బద్దలు కొట్టడానికి, పతకాల పంట పండించడానికి పడే కష్టంలో అతని చెఫ్ (వంట మనిషి) భాగస్వామ్యం కూడా ఉంది. బోల్ట్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక కప్పు ఆహారంలో కనీసం 177 కేలరీలుండాల్సిందే. రోజూవారీ డైట్‌లో 34 శాతం సి-విటమిన్, 40 శాతం బీ6 విటమిన్ (శక్తిని పెంపొందించేందుకు), 26 శాతం పొటాషియం ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో అకీ పండు, ఉప్పుచేప, యెల్లో యామ్ (ఒక రకమైన కంద), ఆలు గడ్డ ఇస్తారు. మధ్యాహ్నం భోజనంలో పాస్తా, చికెన్ (బ్రెస్ట్) ... రాత్రి భోజనంలో అన్నం, బఠాణీలు ఉంటాయి. భోజనం, వ్యాయామమే కాదు.., అథ్లెట్లకు నిద్ర కూడా సరిగా ఉండాలి. అయితే బోల్ట్‌కు నిద్రంటే చాలా ఇష్టం. ఏమాత్రం సమయం దొరి కినా నిద్రపోతాడు. ‘పొద్దున్నే నిద్రలేవాలి.. వెంటనే జిమ్‌కు పోవాలి’ అనే రూల్స్ ఏం పెట్టుకోకుండా.. కాస్త ఆలస్యంగానైనా శిక్షణ ప్రారంభిస్తాడు.

 

ఫిట్‌నెస్ మంత్ర
శరీరాకృతిని సరిగా ఉంచుకోవటమే అథ్లెట్ల ప్రధాన సమస్య. బోల్ట్ కూడా ఇందులో భాగంగా రోజూ జిమ్‌లో సాధన చేస్తాడు. ఇందులో లెగ్ వర్కవుట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే గంటల తరబడి భారీగా వ్యాయామాలు కాకుండా శరీరం ఫిట్‌గా ఉండేలా చూసుకుంటాడు. దీని వల్లే శరీరం బరువు పెరగకుండా ఉండి వేగంగా పరిగెత్తేందుకు వీలుంటుంది.

 

భయం
బోల్ట్ విజయానికి భయం కూడా ఓ కారణమే. నమ్మబుద్ది కాకపోయినా ఇది నిజం. ఎప్పుడూ తనను ఎవరో తరుముతున్నట్లు ఊహించుకుంటానని చాలా సందర్భాల్లో బోల్ట్ చెప్పాడు. ‘నా తోటి అథ్లెట్లను పెద్ద సాలీడులుగా ఊహించుకుంటా. దీంతో నాకు భయం ఎక్కువవుతుంది. ఈ భయంతోనే వారినుంచి తప్పించుకునేందుకు వేగంగా పరిగెడతా’ అని బోల్ట్ తెలిపాడు.

 

తీరని దాహం
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే అథ్లెట్ అయినా.. బోల్ట్‌లో రికార్డుల దాహం తీరదు. ఎప్పటికప్పుడు తన రికార్డులు తనే బద్దలు కొట్టుకోవాలనే తపనతోనే రోజురోజుకూ వేగం పెంచుకుంటున్నాడు. 100 మీటర్ల రేసులో తను నెలకొల్పిన 9.58 రికార్డును ఎప్పటికైనా తనే బద్దలు కొడతానంటున్నాడు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ బోల్ట్‌కు ఆఖరి ఈవెంట్. మరి ఈ సంవత్సర కాలంలో దీనిని సాధ్యం చేస్తాడో లేదో చూడాలి.

 

రేస్ ఎలా జరిగిందంటే...
బోల్ట్ ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో నెమ్మదిగా రేస్‌ను ప్రారంభించాడు. 0.155 సెకన్ల రియాక్షన్ టైమ్‌తో అతను ఎనిమిది మందిలో ఏడో స్థానంతో స్లో స్టార్ట్ చేశాడు. సగం పరుగు ముగిసిన తర్వాత కూడా అతను వెనుకబడే ఉన్నాడు. 6.1 సెకన్ల టైమింగ్ సమయంలో గాట్లిన్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. అయితే చివరి 40 మీటర్లలో బోల్ట్ తన విశ్వరూపం చూపించాడు. గాలికంటే వేగంగా దూసుకుపోయి విజేతగా అవతరించాడు. లిన్‌ఫోర్ట్ క్రిస్టీ (32) తర్వాత ఎక్కువ వయసులో 100 మీ. స్ప్రింట్ గెలిచిన ఆటగాడిగా బోల్ట్ నిలిచాడు. ఈ నెల 21తో బోల్ట్‌కు 30 ఏళ్లు నిండుతాయి. పరుగు పూర్తి కాగానే బోల్ట్ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. తన బంగారు బూట్లను తీసి ఫ్యాన్స్‌తో సెల్ఫీలకు సిద్ధమైపోయాడు. ఆ వెంటనే మోకాళ్లపై కాస్త వంగి ఆకాశం వైపు చూపిస్తూ తన మార్క్ ‘టు ద వరల్డ్’ పోజులో అభిమానులను అలరించాడు. కిక్కిరిసిన స్టేడియం బోల్ట్ పేరుతో హోరెత్తిపోయింది.

 

గాట్లిన్‌కు వెక్కిరింతలు
డోపింగ్‌లో పట్టుబడి గతంలో రెండు సార్లు నిషేధానికి గురైన అమెరికన్ జస్టిన్ గాట్లిన్ 34 ఏళ్ల వయసులోనూ పట్టు వీడలేదు. ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో అతను తన మూడో పతకాన్ని గెలుచుకున్నాడు. 2004లో స్వర్ణం, 2012లో కాంస్యం అతని ఖాతాలో ఉన్నాయి. అయితే అతను ట్రాక్‌పై అడుగు పెట్టిననాటినుంచి స్టేడియం మొత్తం డోపీ అంటూ వెక్కిరించింది. కానీ రెండో స్థానంలో నిలిచిన అనంతరం గాట్లిన్ ఇవేవీ లెక్క చేయలేదు. అమెరికా జాతీయ పతాకంతో స్టేడియం మొత్తం ఒక్కడే కలియతిరిగాడు. ‘ఇక్కడి 9 సెకన్ల కోసం మేం ఏడాదిలో 365 రోజులు కష్ట పడతాం. 34 ఏళ్ల వయసులో కుర్రాళ్లతో పోటీ పడి పోడియంపై నిలవడం సంతోషంగా ఉంది. ఈ విజయం నా కొడుకు కోసం. మా అథ్లెట్లు అందరం పరస్పరం గౌరవించుకుంటాం. మా మధ్య ఎలాంటి సమస్య లేదు. నేను చేసిన తప్పుకు ఇప్పటికే శిక్ష అనుభవించినా... సూటిపోటి మాటలు నేను ఇక ముందు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని నాకు తెలుసు’ అని గాట్లిన్ ఉద్వేగంగా చెప్పాడు. మరో వైపు బోల్ట్ కూడా స్టేడియంలో అథ్లెట్‌ను ఆట పట్టించడం తనను కూడా ఆశ్చర్యపరచిందని, గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని అన్నాడు.

 

‘చిరంజీవి’గా ఉండిపోతా!
రియో ఒలింపిక్స్‌లో బోల్ట్ మరో రెండు ఈవెంట్లు 200 మీ., 4ఁ100 మీటర్ల రిలేలో పాల్గొనాల్సి ఉంది. ఈ రెండింటిలో స్వర్ణం గెలవాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అదే జరిగితే మూడు ఒలింపిక్స్‌లలో మూడు చొప్పున మొత్తం 9 స్వర్ణాలతో తిరుగులేని ఘనత బోల్ట్ సొంతమవుతుంది. ఇదే జరిగితే తాను ఎప్పటికీ మరణం దరి చేరని చిరంజీవిగా మిగిలిపోతానని బోల్ట్ వ్యాఖ్యానించాడు. ‘మరో రెండు పతకాలు గెలిస్తే చాలు, నేను ఆటను ముగించేయవచ్చు. ఎప్పటికీ చిరంజీవిగా నిలిచిపోవచ్చు. దానిని సాధిస్తాననే నమ్మకముంది’ అని బోల్ట్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. 200 మీటర్ల పరుగులో తన రికార్డు (19.19 సె.)ను బద్దలు కొట్టి 19 సెకన్ల లోపు పూర్తి చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ స్ప్రింట్ స్టార్ వెల్లడించాడు.

 
100 మీటర్ల రేస్‌లో తాను గెలుస్తానని ముందునుంచే చెప్పానని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని ఉసేన్ చెప్పాడు. ‘రేస్ చాలా బాగా జరిగింది. ఆరంభంలో తొందరేం లేదు. ప్రశాంతంగా పరుగెత్తవచ్చని నాకు నేనే చెప్పుకున్నాను. నేను మరీ వేగంగా లక్ష్యం చేరలేదనేది వాస్తవం. కానీ ఈ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. సాధారణంగా సెమీ ఫైనల్, ఫైనల్ మధ్య ఉండే విరామంతో పోలిస్తే ఈ సారి కోలుకునేందుకు మాకందరికీ తక్కువ సమయం లభించింది’ అని బోల్ట్ తన ఈవెంట్‌ను విశ్లేషించాడు. మూడు స్వర్ణాలు గెలిచేందుకు తాను రియోకు వచ్చానని, ఇందులో విఫలమైతే తాను తట్టుకోలేనని అతను అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement