హడావిడి లేకుండానే...
స్వస్థలం చేరిన ఉసేన్ బోల్ట్
కింగ్‌స్టన్: ఒక రజతమో, ఒక కాంస్యమో గెలిస్తేనే దేశమంతా ఊగిపోతూ చేసుకునే సంబరాలతో పోలిస్తే ఒలింపిక్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడికి ఎలాంటి స్థాయిలో ఘన స్వాగతం లభించాలో, ఏ రేంజ్‌లో వేడుకలు జరగాలో ఊహించుకోండి! కానీ సూపర్ స్టార్ ఉసేన్ బోల్ట్ మాత్రం ఇలాంటి హడావిడి ఏమీ లేకుండా బుధవారం తన సొంత నగరం కింగ్‌స్టన్‌కు చేరుకున్నాడు. రియోలో 3 స్వర్ణాలతో పాటు ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో 9 స్వర్ణాలు నెగ్గిన దిగ్గజానికి జమైకా ప్రభుత్వం తరఫున అధికారిక స్వాగతం అంటూ కూడా ఏమీ లేదు.
ప్రశాంతంగా ఎయిర్‌పోర్ట్‌నుంచి బయటికి వచ్చిన అతను బయట నిలబడిన కొంత మంది అభిమానులను చిరునవ్వుతో పలకరించాడు. వారు చేసిన సరదా వ్యాఖ్యలకు స్పందించి బదులిచ్చిన అతను కొంత మందితో సెల్ఫీలు కూడా దిగాడు. ఒక కారులో తన లగేజీ పెట్టుకునే వరకు వేచి చూసిన బోల్ట్, మరో కారులో మేనేజర్‌తో కలిసి వెళ్లిపోయాడు. అతని వెంట ఎలాంటి బలగం, బృందం కూడా లేవు!