ఊరిలో దీపం పెట్టింది!
* కెన్యా అథ్లెట్ ఘనతకు ప్రభుత్వ సాయం
* సొంత ఊరికి కరెంట్ సరఫరా
ఎన్‌దబిబిట్ (కెన్యా) : ఒలింపిక్స్ వేదికపై తాను స్వర్ణం సాధించిన క్షణంలో ఆమెకు తెలీదు తాను ఊరివారందరి ఇళ్లల్లో వెలుగు నింపబోతున్నానని... తన గెలుపు ఆటల్లో సాధించిన ఘనత మాత్రమే కాదని, అది చీకటిని చీల్చే కిరణం కానుందని! సాధారణంగా ఒలింపిక్ విజేతలు తాము సాధించిన పతకాలు చూసుకుంటూ జరుపుకునే సంబరాలకు భిన్నమైన కథ ఇది. వివరాల్లోకెళితే... కెన్యా అథ్లెట్ ఫెయిత్ చెపాంగ్‌టిక్ కిపైగాన్ రియో ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది.
అయితే ఆ సమయంలో తన కూతురి ఘనతను కనీసం టీవీలో కూడా చూడలేకపోయానని, తమ ఊరు ఎన్‌దబిబిట్‌కు కరెంట్ సౌకర్యం కూడా లేదని ఫెరుుత్ తండ్రి శామ్యూల్ కూచ్ తమ దేశాధ్యక్షుడు ఉహురు కెన్‌యట్టాకు ఆవేదనగా లేఖ రాశాడు. ఇక ముందైనా నా కూతురి పరుగు చూసే అవకాశం కల్పించమని అతను కోరాడు. అంతే... 40 ఏళ్లుగా చీకట్లోనే మగ్గిపోతున్న ఆ ఊర్లోకి విద్యుత్ శాఖ అధికారులు ఒక్కసారిగా వాలిపోయారు. రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లో లైన్‌లు వేయడంతో పాటు కనెక్షన్ కూడా ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారితో ప్రారంభోత్సవం కూడా చేయించేశారు!
చీకటి గదినుంచి రియోకు వెళ్లిన చెపాంగ్‌టిక్ తన పసిడితో పాటు విద్యుత్ వెలుగుల మధ్య ఇంట్లోకి ప్రవేశించింది. ఆమెకు అద్భుత రీతిలో స్వాగతం పలికిన గ్రామస్థులు... ఆమె వల్లే ఊరికి విద్యుత్ వచ్చిందని, జీవిత కాలం గుర్తుంచుకుంటామని హృదయపూర్వకంగా దీవించారు. దీనిని చూసి తండ్రి హృదయం కూడా పులకించిపోయింది. ఇక ముందు నీ కూతురు ఆటను చూడమంటూ స్యామ్‌సంగ్ ఫ్లాట్ స్కీన్ టీవీ బహుమతిగా ఇవ్వగా, సూపర్ స్పోర్ట్ డిష్ కనెక్షన్ కూడా ఇచ్చింది. అన్నట్లు... ప్రారంభోత్సవానికి వచ్చిన అధికారి అథ్లెట్‌కు లక్ష షిల్లింగ్‌లు బహుమతిగా అందిస్తే, ఓవెన్ కొనుక్కునేందుకు స్థానిక ఎంపీ 10 వేల షిల్లింగ్‌లు అందజేశారు. జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడైతే కిపైగాన్‌కు గ్యాస్ కుకర్ కొనిస్తానని హామీ ఇచ్చారు!