గురువును మించిన శిష్యుడు!
స్విమ్మింగ్ రారాజు, బంగారు చేపగా ప్రసిద్ధి గాంచిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్కు ఓ చిన్న చేప షాకిచ్చింది. స్విమ్మింగ్ అంటేనే మైకెల్ ఫెల్ప్స్ అనేలా పేరు సంపాదించి రికార్డు స్థాయిలో 26 పతకాలు(22 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు) సాధించిన దిగ్గజానికి సింగపూర్ యువ సంచలనం నుంచి పోటీ ఉంటుందని ఎవరూ భావించలేదు. కానీ అనూహ్యంగా తన గురువు(రోల్ మోడల్)ను ఓడించి 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఒలింపిక్స్ లో వరుసగా నాలుగు స్వర్ణాలు సాధించిన ఫెల్ప్స్ రజతం(27వ పతకం)తో సరిపెట్టుకున్నాడు.
ఒకసారి ఈ ఫొటో చూడండి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ ముందు ఫెల్ప్స్ ను 13 ఏళ్ల జోసెఫ్ కలుసుకున్నాడు. అప్పటి నుంచి తన ఆరాధ్య ఆటగాడు ఫెల్ప్స్ అని గతంలో తెలిపాడు. స్విమ్మింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. కఠోర సాధన చేసి 2011లో ఫెల్ప్స్ వయసు(26 ఏళ్లు) ఉన్న వాళ్లను 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో కేవలం 15-16 ఏళ్ల వయసులోనే ఓడించాడు. లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న జోసెఫ్ చిన్న తప్పిందం కారణంగా రేసులో సాధారణ ప్రదర్శన చేశాడు. కానీ ఆ ఈవెంట్ తర్వాత తనకు ఆదర్శప్రాయుడైన ఫెల్ప్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రాటుదేలాడు. బహుశా తనను ఎంతగానో ఆరాధించే ఆ కుర్రాడి చేతిలో తనకు ఓటమి వస్తుందని దిగ్గజం ఊహించలేదు.
లండన్ లో ఈవెంట్ ముగిసిన తర్వాత బాధపడుతున్న జోసెఫ్ వద్దకు వచ్చి ఫెల్ప్స్ ఓదార్చి, ఏం జరిగిందని అడిగాడు. తన గాగుల్స్(కళ్లద్దాలు) అంతర్జాతీయ స్థాయిలో లేవని చాలా ఆలస్యంగా తెలుసుకుని వాటిని మార్చుకున్నాను, అయితే అప్పటికే అంతా అయిపోయిందని వాపోయాడు. నీవు ఇంకా యువకుడివే ఇంకా చాలా భవిష్యత్తు ఉందని ఫెల్ప్స్ అతడిలో ఉత్సాహాన్ని నింపాడు. ఫలితంగా... రియోలో జరిగిన పురుషుల 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో పాల్గొన్న స్కూలింగ్ 50.39 సెకన్లలో ఈవెంట్ పూర్తి చేసి బంగారు పతకాన్ని ఒడిసిపట్టగా, 22 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన ఫెల్ఫ్స్ వరుస విజయాలకు తెరదించి అతన్ని రజతానికి పరిమితం చేశాడు. చిత్రంగా అమెరికన్ స్విమ్మర్ ఫెల్ఫ్స్, దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లీ క్లోస్, హంగేరీ స్విమ్మర్ లాజ్లో సేహ్ లు సరిగ్గా 51.14 సెకన్లలో ఈవెంట్ ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.