joseph schooling
-
స్వర్ణం నెగ్గిన సంబరాలలో...
స్విమ్మింగ్ రారాజు, బంగారు చేపగా ప్రసిద్ధి గాంచిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్‌కు షాకిచ్చిన సింగపూర్ చిన్నోడు జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని నెగ్గిన సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. రియోలో జరిగిన 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రియో ఒలింపిక్ పతకానికి గుర్తుగా ఓ టాటూ వేయించుకున్నాడు. తాను ఎంత సంతోషంగా ఉన్నాడో తెలిపేందుకు ఆ టాటూను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోలో ఒలింపిక్స్ లోగోలే ఉండే ఐదు వలయాలు తన కుడిచేతిపై ఉన్న టాటూలో దర్శనమిస్తాయి. స్వర్ణం నెగ్గి సింగపూర్ చేరుకున్న ఈ చిన్నోడికి దేశం ఘన స్వాగతం పలికింది. జోసెఫ్ పోటీలో ఓడించింది అలాంటి ఇలాంటి స్విమ్మర్‌ను కాదు.. స్విమ్మింగ్ కే మారుపేరుగా నిలిచిన ఫెల్ప్స్‌ను రజతానికి పరిమితం చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం చాలా గొప్ప విజయం. 'టాటూ చాలా ఏళ్లుగా ఉండిపోతుందని తెలుసు, నాకు కావాల్సింది చివరికి దక్కింది' అని జోసెఫ్ స్కూలింగ్ తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఆ టాటూ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
స్కూలింగ్..నాకో సెల్ఫీ ఇవ్వవా!
సింగపూర్:జోసెఫ్ స్కూలింగ్..ఈ పేరు ఇప్పుడు సింగపూర్ దేశమంతటా మారుమోగిపోతోంది. రియో ఒలింపిక్స్ స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలోలో దేశానికి తొలిసారి బంగారు పతకం సాధించాడు. అంతేకాకుండా స్విమ్మింగ్ లో పసిడి అంటే అమెరికన్ దిగ్గజం మైఖేల్ ఫిల్ఫ్ కే సొంతం అనే ముద్రను కూడా చెరిపేశాడు. ఆ ఈవెంట్లో ఫెల్ప్స్‌ను రెండో స్థానానికి నెట్టి మరీ పసిడిని దక్కించుకున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున సింగపూర్‌కు చేరుకున్న స్కూలింగ్ ఆ దేశం ఘనస్వాగతం పలికింది. ఈ క్రమంలోనే సింగపూర్ ఎయిర్ పోర్టు భారీ అభిమానులతో నిండిపోయింది. స్కూలింగ్ బ్యానర్లతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం మెరిసిపోయింది. దాదాపు ఆరు గంటల పాటు విమానాశ్రయంలో అభిమానులు స్కూలింగ్ రాకకోసం నిరీక్షించడమే అతని ప్రతిభకు అద్దం పడుతుంది. అయితే సింగపూర్ ప్రధాని లీ హసేన్ లూంగ్ సైతం స్కూలింగ్‌కు వీరాభిమాని అయిపోయాడు. ఈ క్రమంలోనే స్కూలింగ్ తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డారు. దేశ కీర్తిని ఇనుమడింపజేసిన స్కూలింగ్‌కు తాను ప్రస్తుతం అభిమానిని అయ్యానంటూ లూంగ్ పేర్కొన్నారు. 'ఐ లవ్ యూ జో్సెఫ్. దేశ కీర్తిని మరింత పెంచావ్. నీతో సెల్పీ దిగాలని ఉంది'అని లూంగ్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఆ ఫోటోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి స్కూలింగ్‌పై అభిమనాన్ని చాటుకున్నారు. సాధారణంగా తనతో్ సెల్పీలు దిగాలని ప్రజలు అడుగుతుంటారు. కానీ ఈరోజు స్కూలింగ్ను సెల్ఫీ అడగటాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నా అని ప్రధాని తెలిపారు. ఇదిలా ఉండగా, దేశ మిలటరీ సర్వీస్ నుంచి స్కూలింగ్ మరో నాలుగు సంవత్సరాల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు రక్షణ మంత్రి ఇంగ్ హెన్ పేర్కొన్నారు. వచ్చే టోక్యో ఒలింపిక్స్ వరకూ స్కూలింగ్ మిలటరీకి దూరంగా ఉండవచ్చంటూ హెన్ పేర్కొన్నారు. ఆ ఒలింపిక్స్‌లో కూడా స్కూలింగ్ విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
గురువును మించిన శిష్యుడు!
స్విమ్మింగ్ రారాజు, బంగారు చేపగా ప్రసిద్ధి గాంచిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్‌కు ఓ చిన్న చేప షాకిచ్చింది. స్విమ్మింగ్ అంటేనే మైకెల్ ఫెల్ప్స్ అనేలా పేరు సంపాదించి రికార్డు స్థాయిలో 26 పతకాలు(22 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు) సాధించిన దిగ్గజానికి సింగపూర్ యువ సంచలనం నుంచి పోటీ ఉంటుందని ఎవరూ భావించలేదు. కానీ అనూహ్యంగా తన గురువు(రోల్ మోడల్)ను ఓడించి 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఒలింపిక్స్ లో వరుసగా నాలుగు స్వర్ణాలు సాధించిన ఫెల్ప్స్ రజతం(27వ పతకం)తో సరిపెట్టుకున్నాడు. ఒకసారి ఈ ఫొటో చూడండి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ ముందు ఫెల్ప్స్ ను 13 ఏళ్ల జోసెఫ్ కలుసుకున్నాడు. అప్పటి నుంచి తన ఆరాధ్య ఆటగాడు ఫెల్ప్స్ అని గతంలో తెలిపాడు. స్విమ్మింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. కఠోర సాధన చేసి 2011లో ఫెల్ప్స్ వయసు(26 ఏళ్లు) ఉన్న వాళ్లను 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో కేవలం 15-16 ఏళ్ల వయసులోనే ఓడించాడు. లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న జోసెఫ్ చిన్న తప్పిందం కారణంగా రేసులో సాధారణ ప్రదర్శన చేశాడు. కానీ ఆ ఈవెంట్ తర్వాత తనకు ఆదర్శప్రాయుడైన ఫెల్ప్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రాటుదేలాడు. బహుశా తనను ఎంతగానో ఆరాధించే ఆ కుర్రాడి చేతిలో తనకు ఓటమి వస్తుందని దిగ్గజం ఊహించలేదు. లండన్ లో ఈవెంట్ ముగిసిన తర్వాత బాధపడుతున్న జోసెఫ్ వద్దకు వచ్చి ఫెల్ప్స్ ఓదార్చి, ఏం జరిగిందని అడిగాడు. తన గాగుల్స్(కళ్లద్దాలు) అంతర్జాతీయ స్థాయిలో లేవని చాలా ఆలస్యంగా తెలుసుకుని వాటిని మార్చుకున్నాను, అయితే అప్పటికే అంతా అయిపోయిందని వాపోయాడు. నీవు ఇంకా యువకుడివే ఇంకా చాలా భవిష్యత్తు ఉందని ఫెల్ప్స్ అతడిలో ఉత్సాహాన్ని నింపాడు. ఫలితంగా... రియోలో జరిగిన పురుషుల 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో పాల్గొన్న స్కూలింగ్ 50.39 సెకన్లలో ఈవెంట్ పూర్తి చేసి బంగారు పతకాన్ని ఒడిసిపట్టగా, 22 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన ఫెల్ఫ్స్ వరుస విజయాలకు తెరదించి అతన్ని రజతానికి పరిమితం చేశాడు. చిత్రంగా అమెరికన్ స్విమ్మర్ ఫెల్ఫ్స్, దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లీ క్లోస్, హంగేరీ స్విమ్మర్ లాజ్లో సేహ్ లు సరిగ్గా 51.14 సెకన్లలో ఈవెంట్ ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. -
'బంగారు' చేపకు కుర్రోడి షాక్!
జోసెఫ్ స్కూలింగ్.. ఈ పేరు ఇప్పుడు సింగపూర్ దేశమంతటా మారుమోగిపోతోంది. రియో ఒలింపిక్స్ స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్ ఫ్లై లో దేశానికి తొలిసారి బంగారు పతకం సాధించాడు 21 ఏళ్ల స్కూలింగ్. అంతేకాకుండా స్విమ్మింగ్ లో గోల్డ్ మెడల్ అంటే అది అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫిల్ఫ్ కే సొంతం అనే మాటను బద్దలు కూడా చేశాడు. ఇప్పటికే 22 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన ఫెల్ఫ్స్ వరుస విజయాలకు తెరదించి అతన్ని రజతానికి పరిమితం చేశాడు. పురుషుల 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో పాల్గొన్న స్కూలింగ్ 50.39 సెకన్లలో ఈవెంట్ పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలిచాడు. చిత్రంగా అమెరికన్ స్విమ్మర్ ఫెల్ఫ్స్, దక్షిణ ఆఫ్రికా స్విమ్మర్ చాడ్ లీ క్లోస్, హంగేరీ స్విమ్మర్ లాజ్లో సేహ్ లు 51.14 సెకన్లలో ఒకేసారి ఈవెంట్ ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈవెంట్ అనంతరం మాట్లాడిన ఫెల్ఫ్స్ ముగ్గురు ఆటగాళ్లం ఒకే సమయానికి గమ్యానికి చేరుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసినట్లు చెప్పాడు. గత ఒలింపిక్స్ కన్నా మెరుగైన సమయంలో తాను ఈవెంట్ ను పూర్తిచేశానని, కానీ జోసఫ్ ఇంకా అద్భుతమైన ప్రదర్శన చేశాడని అన్నాడు. 50.39 సెకన్లలో ఈవెంట్ పూర్తి చేసిన జోసఫ్ సరికొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించాడు. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో స్కూలింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.