'బంగారు' చేపకు కుర్రోడి షాక్!
జోసెఫ్ స్కూలింగ్.. ఈ పేరు ఇప్పుడు సింగపూర్ దేశమంతటా మారుమోగిపోతోంది. రియో ఒలింపిక్స్ స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్ ఫ్లై లో దేశానికి తొలిసారి బంగారు పతకం సాధించాడు 21 ఏళ్ల స్కూలింగ్. అంతేకాకుండా స్విమ్మింగ్ లో గోల్డ్ మెడల్ అంటే అది అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫిల్ఫ్ కే సొంతం అనే మాటను బద్దలు కూడా చేశాడు.
ఇప్పటికే 22 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన ఫెల్ఫ్స్ వరుస విజయాలకు తెరదించి అతన్ని రజతానికి పరిమితం చేశాడు. పురుషుల 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో పాల్గొన్న స్కూలింగ్ 50.39 సెకన్లలో ఈవెంట్ పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలిచాడు. చిత్రంగా అమెరికన్ స్విమ్మర్ ఫెల్ఫ్స్, దక్షిణ ఆఫ్రికా స్విమ్మర్ చాడ్ లీ క్లోస్, హంగేరీ స్విమ్మర్ లాజ్లో సేహ్ లు 51.14 సెకన్లలో ఒకేసారి ఈవెంట్ ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచారు.
ఈవెంట్ అనంతరం మాట్లాడిన ఫెల్ఫ్స్ ముగ్గురు ఆటగాళ్లం ఒకే సమయానికి గమ్యానికి చేరుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసినట్లు చెప్పాడు. గత ఒలింపిక్స్ కన్నా మెరుగైన సమయంలో తాను ఈవెంట్ ను పూర్తిచేశానని, కానీ జోసఫ్ ఇంకా అద్భుతమైన ప్రదర్శన చేశాడని అన్నాడు. 50.39 సెకన్లలో ఈవెంట్ పూర్తి చేసిన జోసఫ్ సరికొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించాడు. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో స్కూలింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.