జీతూ ‘పసిడి గురి’ ప్రపంచకప్‌లో స్వర్ణం
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్ బోణీ చేసింది. పోటీల రెండో రోజు శుక్రవారం భారత్‌కు పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం లభించింది. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ 50 మీటర్ల పిస్టల్ విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందించాడు.
ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో జీతూ రాయ్ అందరికంటే ఎక్కువగా 191.3 పాయింట్లు స్కోరు చేశాడు. ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ వీ పాంగ్ (చైనా-186.5 పాయింట్లు) రజతం నెగ్గగా... జీవీ వాంగ్ (చైనా-165.8 పాయింట్లు) కాంస్యం సాధించాడు. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో జీతూ రాయ్ 562 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానం దక్కించుకొని ఫైనల్‌కు అర్హత పొందగా... భారత్‌కే చెందిన ప్రకాశ్ నంజప్ప 549 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచాడు.