స్కూలింగ్..నాకో సెల్ఫీ ఇవ్వవా!
సింగపూర్:జోసెఫ్ స్కూలింగ్..ఈ పేరు ఇప్పుడు సింగపూర్ దేశమంతటా మారుమోగిపోతోంది. రియో ఒలింపిక్స్ స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలోలో దేశానికి తొలిసారి బంగారు పతకం సాధించాడు. అంతేకాకుండా స్విమ్మింగ్ లో పసిడి అంటే అమెరికన్ దిగ్గజం మైఖేల్ ఫిల్ఫ్ కే సొంతం అనే ముద్రను కూడా చెరిపేశాడు. ఆ ఈవెంట్లో ఫెల్ప్స్ను రెండో స్థానానికి నెట్టి మరీ పసిడిని దక్కించుకున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున సింగపూర్కు చేరుకున్న స్కూలింగ్ ఆ దేశం ఘనస్వాగతం పలికింది.
ఈ క్రమంలోనే సింగపూర్ ఎయిర్ పోర్టు భారీ అభిమానులతో నిండిపోయింది. స్కూలింగ్ బ్యానర్లతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం మెరిసిపోయింది. దాదాపు ఆరు గంటల పాటు విమానాశ్రయంలో అభిమానులు స్కూలింగ్ రాకకోసం నిరీక్షించడమే అతని ప్రతిభకు అద్దం పడుతుంది. అయితే సింగపూర్ ప్రధాని లీ హసేన్ లూంగ్ సైతం స్కూలింగ్కు వీరాభిమాని అయిపోయాడు. ఈ క్రమంలోనే స్కూలింగ్ తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డారు. దేశ కీర్తిని ఇనుమడింపజేసిన స్కూలింగ్కు తాను ప్రస్తుతం అభిమానిని అయ్యానంటూ లూంగ్ పేర్కొన్నారు. 'ఐ లవ్ యూ జో్సెఫ్. దేశ కీర్తిని మరింత పెంచావ్. నీతో సెల్పీ దిగాలని ఉంది'అని లూంగ్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఆ ఫోటోను ఫేస్ బుక్లో పోస్ట్ చేసి స్కూలింగ్పై అభిమనాన్ని చాటుకున్నారు. సాధారణంగా తనతో్ సెల్పీలు దిగాలని ప్రజలు అడుగుతుంటారు. కానీ ఈరోజు స్కూలింగ్ను సెల్ఫీ అడగటాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నా అని ప్రధాని తెలిపారు.
ఇదిలా ఉండగా, దేశ మిలటరీ సర్వీస్ నుంచి స్కూలింగ్ మరో నాలుగు సంవత్సరాల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు రక్షణ మంత్రి ఇంగ్ హెన్ పేర్కొన్నారు. వచ్చే టోక్యో ఒలింపిక్స్ వరకూ స్కూలింగ్ మిలటరీకి దూరంగా ఉండవచ్చంటూ హెన్ పేర్కొన్నారు. ఆ ఒలింపిక్స్లో కూడా స్కూలింగ్ విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.