రియో తర్వాత ఫెల్ప్స్ రిటైర్మెంట్!
అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం మైకెల్ ఫెల్ప్స్ అలసిపోయాడు. ఈత కొలనుకు ఇక తాను దూరంగా ఉండాలనుకున్నట్లు నేరుగా సంకేతాలిచ్చాడు. స్విమ్మింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈత కొలనులో దిగాడంటే ప్రత్యర్థులు రెండో స్థానం కోసం పోటీ పడాల్సి ఉంటుంది. బరిలోకి దిగాడంటే స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం ఫెల్ప్స్ కు కొత్తేం కాదు. ప్రస్తుతం రియో ఒలింపిక్స్ లోనూ నాలుగు స్వర్ణాలు, ఓ రజతం తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు పదుల వయసులోనూ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు.
ఓవరాల్ గా ఒలింపిక్స్ కెరీర్ లో 27 పతకాలు సాధించగా, అందులో 22 స్వర్ణాలు, మూడు రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణంతో ఈత కొలనులో తన ప్రస్థానం ప్రారంభించిన ఫెల్ప్స్ వరుసగా నాలుగో ఒలింపిక్స్ రియోలోనూ అమెరికాకు పతకాల పంట పండించాడు. మద్యం తాగి వెహికల్ నడపడంతో పోలీసుల చేతికి చిక్కాడు. దాంతో ఫెల్ప్స్ తన కెరీర్ వివాదాలతో ముగుస్తుందని చింతించాడు. 2012 ఒలింపిక్స్ ముగిసిన కొంత కాలానికి స్విమ్మింగ్ కు గుడ్ బై చెప్పిన బంగారు చేప.. 2014లో కసితో మళ్లీ రంగంలోకి దిగింది. రియోకు ముందు చెప్పినట్టుగానే నాలుగు స్వర్ణాలు సహా ఓ రజతాన్ని ఒడిసిపట్టాడు. ఇది ఆటపట్ల అతడికున్న అంకితభావానికి నిదర్శనమని చెప్పవచ్చు.
'కెరీర్ పరంగా ఎంతో సాధించాను. వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా శరీరం సహకరించడం లేదు. కాళ్లు, చేతుల నొప్పిని భరించలేక పోతున్నాను. వయసు రీత్యా ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. వీడ్కోలు చెబుతాను' అని ఫెల్ప్స్ శుక్రవారం జరిగిన ఈవెంట్ కు ముందు, అనంతరం కొన్ని విషయాలను ప్రస్తావించాడు. భార్య నికోలా, బాబు బూమర్‌తో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నానని ఫెల్ప్స్ వివరించాడు. సింగపూర్ యువ సంచలనం జోసెఫ్ స్కూలింగ్ శనివారం ఉదయం జరిగిన 100మీ బటర్‌ఫ్లై ఈవెంట్లో స్వర్ణం గెలిచి దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్‌ని రజతానికే పరిమితం చేసిన సంగతి తెలిసిందే.