స్వర్ణంతో స్విమ్మింగ్కు వీడ్కోలు!
స్విమ్మింగ్ లో ఓ శకం ముగిసింది. స్విమ్మింగ్ దిగ్గజం ఈత కొలనుకు గుడ్ బై చెప్పాడు. అమెరికా స్విమ్మింగ్ కింగ్గా, స్వర్ణాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మైకెల్ ఫెల్ప్స్ ను ఇక స్విమ్మింగ్ పూల్ లో చూడలేము. అతడు పాల్గొన్న చివరి ఈవెంట్లోనూ స్వర్ణం కైవసం చేసుకుని అభిమానులకు మధుర జ్ఞాపకంగా నిలిచాడు. ఆదివారం ఉదయం జరిగిన 4x100 మీటర్ల మెడ్లే రిలేలో అమెరికా స్విమ్మర్లు విజయం సాధించారు. దీంతో ఫెల్ఫ్స్ ఖాతాలో 23వ ఒలింపిక్ స్వర్ణం చేరింది. ఫెల్ప్స్, రెయాన్, మిల్లర్, నాథన్‌లతో కూడిన అమెరికా టీమ్ 3.27.95 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరింది. బ్రిటన్ జట్టు రెండో స్థానం, ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచాయి. దీంతో స్విమ్మింగ్ ఈవెంట్ నేటితో ముగిసింది.
రెండు రోజుల కిందట జరిగిన 100 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించిన అనంతరం అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే నిర్ణయాన్ని ప్రకటించినా.. చివరి ఈవెంట్ నేడు పూర్తవడంతో అతడు ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లయింది. ఒలింపిక్స్ చరిత్రలో అమెరికా ఎన్నడూ ఓడని ఈ ఈవెంట్‌లో మరో పతకం గెలిచిన ఫెల్ప్స్ మొత్తం 28 పతకాలతో కెరీర్ ను ముగించాడు. రియోలో ఐదు స్వర్ణాలు, ఒక రజతం సాధించి కెరీర్ ను ఘనంగా ముగించాడు ఫెల్ప్స్.