
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో 6 పతకాలు సాధించడం గొప్ప అనుభూతి అని అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం, 28 ఒలింపిక్స్ పతకాల విజేత మైకేల్ ఫెల్ప్స్ గుర్తు చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం భారత్ వచ్చిన ఈ దిగ్గజ స్విమ్మర్ తన రిటైర్మెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోనని స్పష్టం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ తను బరిలోకి దిగిన 8 ఈవెంట్‌లలోనూ స్వర్ణాలను సాధించడం విశేషం.
రియోలో 5 స్వర్ణాలే గెలుచుకున్నప్పటికీ ఈ ప్రదర్శన... బీజింగ్ ప్రదర్శనకు ఏమాత్రం తీసిపోదని చెప్పుకొచ్చాడు. ‘గణాంకాల ప్రకారం బీజింగ్ ఒలింపిక్స్ గొప్ప. కానీ 2012 లండన్ ఒలింపిక్స్ అనంతరం నా వ్యక్తిగత జీవితం బాగో లేదు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఓ దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించా. కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించా. అనంతరం 2014లో మళ్లీ స్విమ్మింగ్‌ను మొదలుపెట్టాక రియో వరకు నా ప్రయాణం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎన్నో ఆటు పోట్ల అనంతరం నాపై నేను నమ్మకాన్ని కోల్పోకుండా రియోలో పతకాలు సాధించా. అందుకే రియో ప్రదర్శనే నాకు ముఖ్యం’ అని ఫెల్ప్స్ వివరించాడు.