22 స్వర్ణాలు సాధించాను.. విసిగిపోయాను!
మైకెల్ ఫెల్ప్స్.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని అమెరికన్ స్విమ్మర్. చిన్నప్పుడు నీళ్లంటేనే వణుకు అని చెప్పే ఫెల్ప్స్ నేడు స్విమ్మింగ్ కు మాత్రమే కాదు.. రికార్డులకు మారు పేరుగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ 26 ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఈ బంగారు చేప మరో బంగారు పతకం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ స్విమ్మర్ తన మనసులోని భావాలను బయటపెట్టాడు. రిటైరయ్యాక మళ్లీ తాను పూర్తి స్థాయిలో రాణించగలనని నమ్మకం ఏర్పడ్డాక ఈత కొలనులో దిగినట్లు తెలిపాడు.
మరిన్ని విషయాలపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'నేను పూర్తిగా అలసిపోయాను. కెరీర్ ఇప్పుడు నరకంలా మారింది. నిజం చెప్పాలంటే అసలు కెరీర్ పై ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు' అని ఫెల్ప్స్ ఉద్వేగానికి లోనయ్యాడు. తన శరీరం చాలా అలసటకు గురైందని, బాడీ అంతా తీవ్రమైన నొప్పులున్నాయి.. కాళ్లు ఇబ్బంది పెడుతున్నాయని 31 ఏళ్ల స్విమ్మింగ్ దిగ్గజం చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా లండన్ ఒలింపిక్స్ లో తన ప్రదర్శనపై ఇప్పటికీ తీవ్ర అసంతృప్తి ఉందన్నాడు.
గురువారం సాధించిన స్వర్ణంతో ఒలింపిక్స్ లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో 200 మీటర్ల మెడ్లేలో వరుసగా నాలుగోసారి విజయకేతం ఎగురవేశాడు. నేడు 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో బరిలో దిగనున్నాడు ఫెల్ప్స్. 22 స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో మొత్తం 26 పతకాలను కొల్లగొట్టిన ఈ స్విమ్మర్ ఓవరాల్ గా తన కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నా, వ్యక్తిగతంగా కాస్త అలసిపోయానంటూ వివరించాడు.