ఫెల్ప్స్‌కు తప్పిన శిక్ష
బాల్టిమోర్ (అమెరికా): మద్యం సేవించడమే కాకుండా అతి వేగంగా కారు నడిపిన కేసులో అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఈ కేసులో బాల్టిమోర్ కోర్టుకు హాజరైన స్విమ్మర్ తన ప్రవర్తనతో జడ్జీని ఆకట్టుకున్నాడు. ఆరిజోనాలోని మిడోస్ అడిక్షన్ సెంటర్‌లో ఫెల్ప్స్ 45 రోజుల పాటు పునరావాస చికిత్స తీసుకున్నాడని స్విమ్మర్ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు.
ప్రస్తుతం అతను ఆల్కహాల్ జోలికి వెళ్లడం లేదని, ఈ కేసులో ప్లేయర్‌పై కరుణ చూపాలని విజ్ఞప్తి చేశాడు. ఆరు నెలల పాటు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం ఎదుర్కొంటున్న ఫెల్ప్స్‌కు ఈ కేసులో కచ్చితంగా జైలు శిక్ష పడాల్సింది. కానీ ప్రాసిక్యూటర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఏడాది పాటు శిక్షను అమలు చేయకుండా ఉండటంతో పాటు, 18 నెలలు స్విమ్మర్ ప్రవర్తనను పర్యవేక్షించాలని జడ్జి ఆదేశించారు.