Prison Punishment
-
కొడుకును తప్పించేందుకు ఓ తల్లి సాహసం
న్యూఢిల్లీ : కొడుకు రాజైనా, పేదయినా, చివరకు నేరస్థుడైనా అతనిపై తల్లికి ప్రేముంటుందని అంటారు. ఈ నిజాన్ని మరోసారి నిర్ధారించింది ఉక్రెయిన్‌లోని దక్షిణ జపోరిజియా ప్రాంతంలో నివసిస్తున్న ఓ తల్లి ఉదంతం. హత్య కేసులో నేరం రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కొడుకును జైలు నుంచి తప్పించేందుకు ఆ తల్లి అనూహ్య నిర్ణయం తీసుకుంది. జైలు పక్కన పది అడుగుల లోతులో ఏకంగా 35 అడుగుల పొడవైన సొరంగాన్ని ఒంటరిగా తవ్వింది. అది కూడా సాధారణ చేతి పరికరాలు, పనిముట్లను ఉపయోగించి ఆ పని చేసింది. ఆ తల్లి ముందస్తు వ్యూహంతో జైలుకు సమీపంలోని ఇంటిని అద్దెకు తీసుకుంది. జైలుకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో సొరంగం తవ్వకానికి స్థలాన్ని ఎంపిక చేసుకుంది. పగలు చేస్తే జనం దష్టిలో పడతాననే ఉద్దేశంతో ఆమె కేవలం రాత్రి పూటే మూడు వారాల పాటు కష్టపడి పది అడుగుల లోతు నుంచి జైలు ప్రహారీ గోడల లోపలి వరకు సొరంగ మార్గాన్ని తవ్వింది. అలా తవ్వడం ద్వారా వచ్చిన దాదాపు మూడు టన్నుల మట్టిని సమీపంలో ఉన్న నిరుపయోగ చెత్తకుండిలో పారవేసింది. ఆమె వద్ద రెండు చక్రాలు కలిగిన చెత్తను మోసుకుపోయే ఇనుప లాగుడు బండి ఉందని, దానిలో తట్టా, పార వేసుకొని జైలుకు సమీపంలో అప్పుడప్పుడు కనిపించిందని జైలు సెక్యూరిటీ గార్డు తెలిపారు. మూడు వారాల అనంతరం ఆమె సొరంగ మార్గాన్ని తవ్వుతూ జైలు సెక్యూరిటీ గార్డులకే పట్టుబడింది. అంతకుముందు ఐదు కిలోమీటర్ల దూరంలోని మైకలోవ్ ప్రాంతంలో తల్లి కొడుకులు నివసించేవారట. కొడుకు ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి జైలుకు రావడంతో ఆ తల్లి ఈ సాహసానికి ఒడిగట్టింది. ఆమె పేరునుగానీ, ఆమె కొడుకు పేరునుగానీ వెల్లడించేందుకు ఉక్రెయిన్ జైలు అధికారులు నిరాకరించారు. ఉక్రెయిన్ ప్రజలు మాత్రం ఆ మాతమూర్తిని ప్రశంసలతో ముంచెత్తారు. కొడుకు కోసం ఆ తల్లి చేసిన సాహసాన్ని వారు మెచ్చుకున్నారు. -
బండిపై హలో.. జైలుకి చలో..!
సాక్షి, అమరావతిబ్యూరో: సెల్ఫోన్లో మాట్లాడుతూ రోడ్డుపై వాహనం నడుపుతున్నారా? అయితే మీ డ్రైవింగ్ లెసెన్స్ రద్దుతోపాటు మీరు జైలుకు వెళ్లడం ఖాయం. ఎందుకంటే.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందంటూ కోర్టులకు నివేదించనున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో ఇలాంటి కేసుల తీవ్రతను పరిశీలిస్తున్న న్యాయమూర్తులు జరిమానాతో పాటు జైలుశిక్షలు విధిస్తున్నారు. ఇటీవల నగర కమిషనరేట్ పరి«ధిలోనూ సెల్‌ఫోన్ చూస్తూ వాహనదారులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ఈ ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదాల కారణాలు.. నగర ట్రాఫిక్ పోలీసులు వాహనచోదకులు సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నా, హెల్మెట్‌లో ఫోన్‌ను ఉంచుకుని వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని పట్టుకుంటున్నారు. పోలీసులు లేని చోట్ల కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 2019 జనవరి నుంచి 2020 జనవరి వరకు 5,388 మందిపై సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న చోదకులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో కొన్ని ప్రత్యేక బృందాలు వాహనచోదకుల తీరును గమనిస్తున్నాయి. సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు చోదకుల ప్రవర్తనల్లో మార్పులను బృందం సభ్యులు పరిశీలించారు. ఫోన్ మోగగానే... ద్విచక్రవాహనచోదకులు వెంటనే దాన్ని చేతికి తీసుకుని మరో చేత్తో వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు అవతలి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వినిపించకపోవడంతో ఫోన్ దగ్గరగా పట్టుకునే ప్రయత్నంలో యాక్సిలేటర్ ఎక్కువగా ఇస్తున్నారు. దీంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొడుతున్నారు. మూడేళ్లలో వెయ్యిమందికిపైగా మృత్యువాత.. విజయవాడలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా వీటి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తే 80 శాతంపైగా ప్రమాదాలు సెల్ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలోనే చోటుచేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. 2017లో 349 మంది వాహనచోదకులు మృత్యువాత పడగా.. 2018లో 359 మంది, 2019 నుంచి 2020 జనవరి నాటి వరకూ 375 మంది మరణించారు. కఠిన చర్యలు ఉంటాయి.. అధిక శాతం మంది ట్రాఫిక్ నిబంధనలను పాటించకకుండా అడ్డదిడ్డంగా వాహనాలు నడపుతున్నారు. దీనివల్ల వారి ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలు పోవడానికి కారకులవుతున్నారు. అత్యధిక శాతం ప్రమాదాలు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సందర్భంలోనే జరిగాయి. గత పదమూడు నెలల కాలంలో నగరంలో 5,388 మంది వాహనచోదకులు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడుపుతుండటం వల్ల వారిపై కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు కేవలం జరిమానాలతో సరిపెట్టాం. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. – టీవీ నాగరాజు, విజయవాడ ట్రాఫిక్ డీసీపీ -
చెరసాలేనా చిన్నమ్మ?
నాలుగేళ్ల శిక్ష ముగింపు దశకు చేరుకుంది. జైలు నుంచి విముక్తిపై శశికళ చుట్టూ కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి. జరిమానా రూపంలో చిన్నమ్మ చిక్కుల్లో పడ్డారు. జరిమానా చెల్లించనట్లయితే అదనంగా ఏడాది పాటు జైలు జీవితం తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్‌లో ప్రత్యేక న్యాయస్థానం తీర్పుచెప్పింది. ఇదే కేసులో సహ నిందితులైన జయ నెచ్చెలి శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్‌కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఏడాదిపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై రెండేళ్ల పాటు అప్పీళ్లపై అప్పీళ్లతో శిక్ష అమలులో జాప్యం చోటుచేసుకుంది. 2016 డిసెంబర్లో జయలలిత కన్నుమూయగా 2017 ఫిబ్రవరి నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పెద్ద మొత్తంలో జరిమానాకు గురైన వారు శిక్ష ముగిసే సమయంలోనే చెల్లిస్తారు. శశికళ వ్యవహారంలో చెక్ లేదా డీడీ రూపంలో జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియబరుస్తూ ఆదాయపు పన్నుశాఖకు ఆదారాలు చూపి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను జతచేసి చెల్లించాలి. ఖైదీగా ఉన్న కాలంలో జైలు నిబంధనలకు అనుగుణంగా, క్రమశిక్షణతో వ్యవహరించినవారు శిక్షా కాలం నుంచి మినహాయింపు పొంది ముందుగానే విడుదలయ్యే వెసులుబాటు ఉంది. ఈ కేటగిరి కింద శశికళ నాలుగేళ్లు ముగిసేలోపే విడుదలవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దోపిడీ, హత్య, అత్యాచారం కేసుల్లో 14 జైలుశిక్ష పడిన వారికి మాత్రమే ముందస్తు విడుదల వెసులుబాటు వర్తిస్తుంది. అవినీతి కేసులో శిక్ష పడినవారు అందుకు అనర్హులని అంటున్నారు. శశికళ రూ.10 కోట్ల జరిమానా చెల్లించిన పక్షంలో 2021 జనవరి 25వ తేదీన జైలు నుంచి విడుదల అవుతారు. జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 15వ తేదీ వరకు జీవితం గడపక తప్పదని జైళ్లశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు రెండేళ్ల కిత్రం శశికళ సొంత వ్యాపారాలు, బంధువుల వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు చేసి రూ.5వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కనుగొన్నారు. ఈ పరిస్థితిలో రూ.10 కోట్ల జరిమానాను కరెన్సీ రూపంలో శశికళ చెల్లించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ శశికళ బంధువులు, స్నేహితులు చెల్లించినా వారికి సైతం ఐటీ అధికారుల బెడద ఉంటుంది. శశికళ తరఫున అంతపెద్ద మొత్తాన్ని కట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. శశికళ రూ.10 కోట్లు జరిమానా చెల్లించి వచ్చే ఏడాది విడుదల అవుతారా..? లేక మరో ఏడాది పాటు జైల్లోనే ఉండిపోతారా..? అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. -
లైంగిక దాడి యత్నం; తండ్రికి పదేళ్ల జైలు
విశాఖ లీగల్: కన్న కూతురుపై లైంగిక దాడికి యత్నించిన తండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ నగరంలోని ఒకటో అదనపు జిల్లా కోర్టు(పోక్సో చట్ట పరిధిలోని నూతన న్యాయస్థానం) న్యాయమూర్తి ఎ.వి.పార్థసారథి శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.వేణుగోపాలరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు డారక్ హయిస్(37) నగరంలోని బీచ్ రోడ్డులో ఉంటున్నాడు. అతనికి వివాహం జరిగి, 12 ఏళ్ల కుమార్తె ఉంది. నేరం జరగడానికి ముందు కొన్ని కారణాల వల్ల భార్యాభర్తలు చట్టరీత్యా విడిపోయారు. బాధితురాలి తల్లి విదేశాల్లో ఉంటున్నారు. బాలిక తన అమ్మమ్మ దగ్గర ఉంటోంది. కుమార్తెను చూడడానికి నిందితునికి కోర్టు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో బాలిక తరచూ తండ్రి దగ్గరకు వెళ్లేది. ఇదే అదునుగా నిందితుడు డారక్ హయిస్ 2014 అక్టోబర్ 22వ తేదీ రాత్రి బాలిక నిద్రిస్తున్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి కూడా యత్నించినట్టు ఆమె కోర్టులో వివరించింది. బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి అప్పటి ఏసీపీ నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ కీలకమైన ఐదుగుర్ని విచారించింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. విశాఖలో గత అక్టోబర్ 2న ఏర్పాటైన పోక్సో చట్టం–2012 పరిధిలోని నూతన న్యాయస్థానంలో ఇదే తొలితీర్పు కావడం విశేషం. -
నిత్య పెళ్లికూతురు తండ్రికి రెండేళ్ల జైలు
ఖాజీపేట: ఒకరికి తెలియకుండా మరొకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు చేసుకుని వంచనకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు కేసులో ఆమె తండ్రికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే లో వివాహమైంది. అమ్మాయి బాగుండడంతో ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. కొద్ది నెలల పాటు వీరు సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత ఆగస్టు 25న అనంతరెడ్డి వచ్చి తమ కూతురిని పుట్టింటికి తీసుకెళతానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన భర్త రామకృష్ణారెడ్డి ఆగస్టు 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె వాడుతున్న సెల్ నంబర్ ఆధారంగా పోలీసులు హైదరాబాద్‌లో ఆమెతో పాటు చంటినాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కొమ్మలూరుకు చెందిన వ్యక్తికి వివాహం చేసుకునే ముందు ఆమెకు నలుగురితో వివాహమైందని, ఇతన్ని వివాహం చేసుకుని పారిపోయిన తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని ఆరో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. మైదుకూరు కోర్టులో ఏడాది పాటు కేసు విచారణ జరిగింది. కిలాడీ లేడి తండ్రి అనంతరెడ్డిని దోషిగా గుర్తించిన కోర్టు ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మౌనికతో పాటు చంటినాయక్ కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వారు దొరికితే వారు చేసిన నేరంపై కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. -
బాలికపై లైంగికదాడి కేసులో పదేళ్ల జైలు
సాక్షి, హిందూపురం/అనంతపురం: ఫోక్సో కేసులో ముద్దాయికి పదేళ్లు జైలు, రూ.2వేల జరిమానా, బాధితురాలికి రూ.25వేలు పరిహారం చెల్లించేలా అనంతపురం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. 2016, నవంబర్1వ తేదీ హిందూపురం సమీపంలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక కనిపించకుండా పోయింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ ఈదూర్‌బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూర్ తాలూకా మంచేపల్లికి చెందిన ఎం.రాజు ఓ పని నిమిత్తం గ్రామానికి వచ్చి బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గ్రామానికి వెళ్లి అతని చెరలో ఉన్న బాలికను విడిపించి, ఆమెపై జరిగిన అత్యాచారం ఘటనకు సంబంధించి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎం. రాజును అరెస్ట్ చేశారు. అనంతరం వచ్చిన సీఐ చిన్న గోవిందు ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన న్యాయమూర్తి సోమవారం తుది తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫు న వాదనలను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుడెన్‌సాహెబ్ వినిపించారు. -
దివ్యాంగ యువతులపై అఘాయిత్యాలు..
కర్ణాటక, హొసూరు: రెండు ప్రాంతాల్లో ఇద్దరు దివ్యాంగ యువతులపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు కామాంధులకు క్రిష్ణగిరి కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోట తాలూకా కుందమారనపల్లి గ్రామానికి చెందిన 26 ఏళ్ల దివ్యాంగ యువతి గత 2015 జనవరి 14వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే ప్రాంతానికి చెందిన మునిరాజ్ (21), రామమూర్తి (22)లు ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశారు. మరో కేసులో.. డెంకణీకోట సమీపంలోని బాలతోటనపల్లికి చెందిన 20 ఏళ్ల దివ్యాంగ యువతి 2015 అక్టోబర్ 18వ తేదీ ఇంటి ముందు కొళాయిలో నీరు పట్టుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన వీరేంద్రన్(27), సంతోష్(22)లు ఆమెను వీరేంద్రన్ ఇంటికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ సంఘటనలపై డెంకణీకోట మహిళా పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులందరినీ అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. క్రిష్ణగిరి కోర్టులో బుధవారం ఈ కేసులు తుది విచారణకు వచ్చాయి. నలుగురికి తలా రూ. 15 వేలు జరిమానాతో పాటు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి కళైయరసి తీర్పునిచ్చారు. -
రూ.500కు ఆశపడి ఐదేళ్లు జైలు పాలయ్యాడు!
చెన్నై , అన్నానగర్: రైతు వద్ద రూ.500 లంచం తీసుకున్న కేసులో పదవీ విరమణ పొందిన విద్యుత్ శాఖ కార్య నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విల్లుపురం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. విల్లుపురం సమీపం రాధాపురం కరుమారపేట ప్రాంతానికి చెందిన వీరాస్వామి (50). ఇతనికి సొంతంగా అదే గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. ఆ స్థలానికి ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం 2008లో వీరాస్వామి మదురవాక్కంలోని విద్యుత్ ఇంజినీర్ కార్యాలయంలో వినతి సమర్పించాడు. విద్యుత్ శాఖ కార్య నిర్వాహకుడిగా ఉన్న విల్లుపురం ప్రాంతానికి చెందిన తిరుజ్ఞాన సంబంధం (54) ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.1000 లంచం కోరాడు. అందుకు వీరాస్వామి రూ.500 ఇచ్చేందుకు అంగీకరించాడు. అనంతరం దీనిపై వీరాస్వామి విల్లుపురం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు సూచించిన విధంగా 2008 నవంబర్ 7న వీరాస్వామి విద్యుత్‌శాఖ కార్యాలయానికి వెళ్లి రసాయనం పూసిన నోట్లను తిరుజ్ఞాన సంబంధంకు ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడ దాగిఉన్న ఏసీబీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసు విల్లుపురం కోర్టులో నడుస్తూ వచ్చింది. కేసు విచారణ సమయంలోనే తిరుజ్ఞాన సంబంధం పదవీ విరమణ పొందాడు. ఈ స్థితిలో కేసు తుది విచారణ మంగళవారం జరిగింది. విచారణ చేసిన న్యాయమూర్తి ప్రియ తిరుజ్ఞాన సంబంధంకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
లైంగికదాడి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష
గుంటూరు లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన యడవల్లి జాన్‌సైదా అలియాస్ అంకాలుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 30వేల జరిమానాను బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తూ ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.గోపీచంద్ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పొన్నూరు పట్టణంలోని 7వ వార్డుకు చెందిన జాన్ సైదాకు పెళ్లై ముగ్గురు సంతానం. అదే ప్రాంతంలో నివసిస్తున్న బాలికపై కన్నేశాడు. 2013 నవంబర్ 8న బాలిక కూలి పనుల నుంచి వస్తూ సాయంత్రం 7 గంటల సమయంలో పొన్నూరు సెంటర్లో తినుబండారాలు కొనుక్కొనేందుకు షాపు వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న జాన్ సైదా పలకరించాడు. ఇంటికి బైక్‌పై తీసుకు వెళతానని నమ్మబలికి ఖాళీ ప్రదేశానికి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి చేరి తల్లికి విషయం చెప్పి పొన్నూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జాన్‌సైదాపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరం రుజువు చేయడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏపీపీ కె రామచంద్రరావు ప్రాసిక్యూషన్ నిర్వహించగా అప్పటి సీఐ ఎండీ హుస్సేన్ కేసు దర్యాప్తు చేశారు. -
జీవితఖైదును పదేళ్ల జైలుశిక్షగా మార్చిన హైకోర్టు
- తాగిన మత్తు వల్లే నిందితుడు - భార్యను చంపాడని తేల్చిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: లైంగికవాంఛ తీర్చడానికి నిరాకరించిందన్న కారణంతో మద్యం మత్తులో భార్యపై కిరోసిన్ పోసి తగులబెట్టిన ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఉమ్మడి హైకోర్టు సవరించింది. జీవితఖైదును పదేళ్ల జైలు శిక్షగా మార్చింది. తాగిన మత్తులో భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేల్చిన హైకోర్టు, ఈ విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్లే జీవిత ఖైదును సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. మహబూబ్‌నగర్ జిల్లా కుతినేపల్లి గ్రామానికి చెందిన భీమయ్య.. లైంగిక వాంఛ తీర్చలేదన్న కారణంతో 2008లో తన భార్య ఈశ్వరమ్మపై కిరోసిన్ పోసి తగులపెట్టాడని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశ్వరమ్మ సోదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. హత్య జరగడానికి మూడు నెలల ముందు ఈశ్వరమ్మ గర్భసంచిని అనారోగ్య కారణాలతో డాక్టర్లు తొలగించారని, ఆరు నెలల పాటు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని వారు హెచ్చరించారన్న సంగతి పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కారణంతోనే హత్య జరిగిన రోజున భీమయ్య కోరికను ఆమె తిరస్కరించిందని ఈశ్వరమ్మ సోదరి, తల్లి పోలీసులకు తెలిపారు. ఈ కేసును విచారించిన మహ బూబ్‌నగర్ సెషన్స్ కోర్టు భీమయ్యకు జీవితఖైదు విధిస్తూ 2010లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భీమయ్య హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తిస్థాయి విచారణ అనంతరం భీమయ్యకు కింది కోర్టు విధించిన జీవితఖైదును సవరిస్తూ పదేళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
- కోర్టు ధిక్కారం కింద ఖమ్మం మాజీ కలెక్టర్ ఇలంబర్తితో పాటు మరొకరికి.. - అప్పీల్‌కు వెళతాం:ప్రభుత్వం - శిక్ష అమలు వాయిదా సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కారం కేసులో ఖమ్మం జిల్లాకు గతంలో కలెక్టర్‌గా పనిచేసిన ఇలంబర్తితోపాటు సబ్ డివిజనల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డిలకు హైకోర్టు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం తీర్పు వెలువరించారు. ఖమ్మం జిల్లా గోడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో తమకున్న 14 ఎకరాల భూమి ఏడూళ్ల చెరువు నిర్మాణం సందర్భంగా మునిగిపోయిందని, అందుకు పరిహా రం ఇప్పించాలని కోరుతూ ఎం.రామకృష్ణ అనే వ్యక్తి 2010లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. ఆయనకు పరిహారం చెల్లించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదంటూ రామకృష్ణ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు.. అప్పటి జిల్లా కలెక్టర్ ఇలంబర్తి, శ్రీనివాస్‌రెడ్డికి నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అయితే తీర్పుపై అప్పీల్ దాఖలు చేస్తామని, అందువల్ల తీర్పు అమలును వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ... తీర్పు అమలును నాలుగు వారాల పాటు వాయిదా వేశారు. -
ఫెల్ప్స్‌కు తప్పిన శిక్ష
బాల్టిమోర్ (అమెరికా): మద్యం సేవించడమే కాకుండా అతి వేగంగా కారు నడిపిన కేసులో అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఈ కేసులో బాల్టిమోర్ కోర్టుకు హాజరైన స్విమ్మర్ తన ప్రవర్తనతో జడ్జీని ఆకట్టుకున్నాడు. ఆరిజోనాలోని మిడోస్ అడిక్షన్ సెంటర్లో ఫెల్ప్స్ 45 రోజుల పాటు పునరావాస చికిత్స తీసుకున్నాడని స్విమ్మర్ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. ప్రస్తుతం అతను ఆల్కహాల్ జోలికి వెళ్లడం లేదని, ఈ కేసులో ప్లేయర్‌పై కరుణ చూపాలని విజ్ఞప్తి చేశాడు. ఆరు నెలల పాటు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం ఎదుర్కొంటున్న ఫెల్ప్స్‌కు ఈ కేసులో కచ్చితంగా జైలు శిక్ష పడాల్సింది. కానీ ప్రాసిక్యూటర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఏడాది పాటు శిక్షను అమలు చేయకుండా ఉండటంతో పాటు, 18 నెలలు స్విమ్మర్ ప్రవర్తనను పర్యవేక్షించాలని జడ్జి ఆదేశించారు. -
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే ఇక జైలే
షీ టీంకు దొరికిన ఖదీర్‌కు రెండు రోజుల జైలు శిక్ష సాక్షి, హైదరాబాద్: ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన నిందితులను పీటీ కేసు కింద నమోదు చేయడంతో పోలీసు స్టేషన్లోనే బెయిల్‌పై విడుదలయ్యేవారు. ఇక నుంచి అలా కాకుండా ఏకంగా జైలు శిక్షే పడేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి రోజే నాంపల్లి కోర్టు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించింది. మంగళవారం మల క్‌పేట బస్‌స్టాప్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ పతేషానగర్కు చెందిన ఎండీ అబ్దుల్ ఖదీర్ ఖురేషీ(37) సీసీఎస్ పోలీసు(షీటీమ్)లకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతనిపై సిటీ పోలీసు యాక్ట్ 70 సీ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం నాంపల్లిలోని ఏడవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ కేసు వివరాలను పరిశీలించి ఖదీర్‌కు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించా రు. తనపై ఆధారపడిన భార్య, కూతురు ఇబ్బందులకు గురవుతారని ఖదీర్ మెజిస్ట్రేట్‌ను అభ్యర్ధించి, సారీ చెప్పాడు. దీంతో శిక్షను రెండు రోజులుగా మార్చి తీర్పునిచ్చారు. ఖదీర్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మహిళ భద్రతపై దృష్టి.... ఇప్పటివరకు నిందితులు స్టేషన్ స్థాయిలోనే చలానా చెల్లించడంతో కేసు మూసివేసేవారు. దీంతో ఈవ్‌టీజర్లలో మార్పు రాదని తలంచిన నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి నిందితులను కోర్టులో హాజరుపర్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి రజనికి ఇటీవల లేఖ రాసారు. దీన్ని పరిశీలించిన జడ్జి.. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని కోర్టులో హాజరుపర్చి జైలు శిక్ష కూడా విధించాలంటూ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లను ఆదేశించారు. ఇది బుధవారం నుంచే మొదలైంది. ఇక నుంచి పట్టుబడితే ఎనిమిది రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.