లైంగికదాడి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష
లైంగికదాడి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష
Published Fri, Oct 21 2016 10:33 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
గుంటూరు లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన యడవల్లి జాన్‌సైదా అలియాస్ అంకాలుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 30వేల జరిమానాను బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తూ ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.గోపీచంద్ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పొన్నూరు పట్టణంలోని 7వ వార్డుకు చెందిన జాన్ సైదాకు పెళ్లై ముగ్గురు సంతానం. అదే ప్రాంతంలో నివసిస్తున్న బాలికపై కన్నేశాడు. 2013 నవంబర్ 8న బాలిక కూలి పనుల నుంచి వస్తూ సాయంత్రం 7 గంటల సమయంలో పొన్నూరు సెంటర్‌లో తినుబండారాలు కొనుక్కొనేందుకు షాపు వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న జాన్ సైదా పలకరించాడు. ఇంటికి బైక్‌పై తీసుకు వెళతానని నమ్మబలికి ఖాళీ ప్రదేశానికి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి చేరి తల్లికి విషయం చెప్పి పొన్నూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జాన్‌సైదాపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరం రుజువు చేయడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏపీపీ కె రామచంద్రరావు ప్రాసిక్యూషన్ నిర్వహించగా అప్పటి సీఐ ఎండీ హుస్సేన్ కేసు దర్యాప్తు చేశారు.
Advertisement
Advertisement