- తాగిన మత్తు వల్లే నిందితుడు
- భార్యను చంపాడని తేల్చిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: లైంగికవాంఛ తీర్చడానికి నిరాకరించిందన్న కారణంతో మద్యం మత్తులో భార్యపై కిరోసిన్ పోసి తగులబెట్టిన ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఉమ్మడి హైకోర్టు సవరించింది. జీవితఖైదును పదేళ్ల జైలు శిక్షగా మార్చింది. తాగిన మత్తులో భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేల్చిన హైకోర్టు, ఈ విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్లే జీవిత ఖైదును సవరిస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. మహబూబ్‌నగర్ జిల్లా కుతినేపల్లి గ్రామానికి చెందిన భీమయ్య.. లైంగిక వాంఛ తీర్చలేదన్న కారణంతో 2008లో తన భార్య ఈశ్వరమ్మపై కిరోసిన్ పోసి తగులపెట్టాడని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశ్వరమ్మ సోదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. హత్య జరగడానికి మూడు నెలల ముందు ఈశ్వరమ్మ గర్భసంచిని అనారోగ్య కారణాలతో డాక్టర్లు తొలగించారని, ఆరు నెలల పాటు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని వారు హెచ్చరించారన్న సంగతి పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కారణంతోనే హత్య జరిగిన రోజున భీమయ్య కోరికను ఆమె తిరస్కరించిందని ఈశ్వరమ్మ సోదరి, తల్లి పోలీసులకు తెలిపారు.
ఈ కేసును విచారించిన మహ బూబ్‌నగర్ సెషన్స్ కోర్టు భీమయ్యకు జీవితఖైదు విధిస్తూ 2010లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భీమయ్య హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తిస్థాయి విచారణ అనంతరం భీమయ్యకు కింది కోర్టు విధించిన జీవితఖైదును సవరిస్తూ పదేళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది.
జీవితఖైదును పదేళ్ల జైలుశిక్షగా మార్చిన హైకోర్టు
Published Sun, Oct 9 2016 3:47 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
Advertisement
Advertisement