అడగడుగునా నీచులే.. మాకు స్థానం లేదు!
న్యూఢిల్లీ
ఈ దేశంలో ఆడవాళ్లుగా పుట్టకూడదని నా ప్రార్థన. నీచులు ప్రతి అంగుళం కాచుకొని ఉన్నారు. ఇదీ ఓ యువ ఐఏఎస్ ఆఫీసర్ ఆవేదన. తన ఆవేదన వెలిబుచ్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేసింది. తనకెదురైన అవమానాలను వివరిస్తూ ఫేస్బుక్లో పెట్టిన ఈ పోస్ట్ ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. వేధింపులకు గురైన మహిళ పట్ల న్యాయవాది, జడ్జి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే రిజు బఫ్నా అనే మహిళా ఐఏఎస్ ఆఫీసర్... తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి, న్యాయవాదులు వ్యవహరించిన తీరుపై ఆమె మండిపడ్డారు. కోర్టు హాల్లో తన వాదనను వినిపించడానికి తనకు ప్రైవసీ కావాలని కోరితే న్యాయవాది, జడ్జి అనుమతించలేదన్నారు. పైగా మీరు బయట ఆఫీసర్ గానీ, కోర్టులో కాదని లాయర్ తనపై విరుచుకుపడ్డారని ఆరోపించారు. చివరికి అర్థం చేసుకోవాల్సిన జడ్జి కూడా అనుచితంగా ప్రవర్తించారన్నారు. మీరు యూత్ కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత అతన్ని ఆ పదవి నుంచి తప్పించారు తప్ప, తగిన శిక్ష పడలేదన్నారు.
మహిళల పట్ల సెన్సిటివ్గా వ్యవహరించాల్సిన హక్కుల సంఘాల్లోని సభ్యుల ప్రవర్తన తీరుపైనా ఆమె మండిపడ్డారు. కేసు విచారణ సమయంలో మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన కోర్టులు, న్యాయవాదుల తీరు పట్ల ఆమెతన పోస్ట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడిది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఇంతకీ ఈ మహిళా ఐఏఎస్ను అసభ్య మెసేజ్లతో వేధించింది ఎవరో కాదు.. సాక్షాత్తు ఓ మానవ హక్కుల సంఘం సభ్యుడు.