జైలు శిక్ష పడిన తిరుజ్ఞాన సంబంధన్
చెన్నై , అన్నానగర్: రైతు వద్ద రూ.500 లంచం తీసుకున్న కేసులో పదవీ విరమణ పొందిన విద్యుత్ శాఖ కార్య నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విల్లుపురం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. విల్లుపురం సమీపం రాధాపురం కరుమారపేట ప్రాంతానికి చెందిన వీరాస్వామి (50). ఇతనికి సొంతంగా అదే గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. ఆ స్థలానికి ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం 2008లో వీరాస్వామి మదురవాక్కంలోని విద్యుత్ ఇంజినీర్ కార్యాలయంలో వినతి సమర్పించాడు. విద్యుత్ శాఖ కార్య నిర్వాహకుడిగా ఉన్న విల్లుపురం ప్రాంతానికి చెందిన తిరుజ్ఞాన సంబంధం (54) ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.1000 లంచం కోరాడు.
అందుకు వీరాస్వామి రూ.500 ఇచ్చేందుకు అంగీకరించాడు. అనంతరం దీనిపై వీరాస్వామి విల్లుపురం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు సూచించిన విధంగా 2008 నవంబర్ 7న వీరాస్వామి విద్యుత్‌శాఖ కార్యాలయానికి వెళ్లి రసాయనం పూసిన నోట్లను తిరుజ్ఞాన సంబంధంకు ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడ దాగిఉన్న ఏసీబీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసు విల్లుపురం కోర్టులో నడుస్తూ వచ్చింది. కేసు విచారణ సమయంలోనే తిరుజ్ఞాన సంబంధం పదవీ విరమణ పొందాడు. ఈ స్థితిలో కేసు తుది విచారణ మంగళవారం జరిగింది. విచారణ చేసిన న్యాయమూర్తి ప్రియ తిరుజ్ఞాన సంబంధంకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment