రికార్డులు కూడా ఈర్ష్యపడతాయ్..!
రెండు స్వర్ణాలు సాధించిన అనంతరం ఫెల్ప్స్ ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న తన కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లి తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన 3 నెలల కొడుకు బూమర్‌ను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ‘200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఫైనల్ రేసు కోసం ఎదురుచూశాను. స్వర్ణమే నెగ్గాలనే లక్ష్యంతో ఈత కొలనులోకి దూకాను. అనుకున్నది సాధించాను’ అని ఫెల్ప్స్ వ్యాఖ్యానించాడు.
చిన్నప్పుడు నీళ్లంటేనే భయపడ్డ ఫెల్ప్స్.. స్విమ్మింగ్‌లో ప్రపంచ అత్యుత్తమ ఒలింపియన్‌గా నిలవటం నిజంగా అద్భుతమే. ఏడేళ్ల ప్రాయంలో ఈత కొలనులో అడుగుపెట్టిన ఫెల్ప్స్ పదేళ్లకే అమెరికా జాతీయ రికార్డును నెలకొల్పాడు. 15 ఏళ్లకే తొలి ఒలింపిక్స్ (2000లో సిడ్నీ)లో పాల్గొని.. 200 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో ఐదో స్థానంలో నిలిచాడు. 2001 అక్వాటిక్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో (200మీటర్ల బటర్‌ఫ్లై) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అక్కడి నుంచి ఈ బంగారు చేప రికార్డుల వేట మొదలైంది.
రికార్డులతోనే ఫెల్ప్స్ పోటీ
2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సమయానికి ఫెల్ప్స్ ఖాతాలో ఐదు ప్రపంచ టైటిళ్లు చేరాయి. ఈ ఆత్మవిశ్వాసంతో ఏథెన్స్‌లో పాల్గొన్న ఎనిమిది ఈవెంట్లలో ఆరు బంగారు, రెండు రజత పతకాలు సాధించాడు. ఇందులో మూడు ఒలింపిక్ రికార్డులు, రెండు ప్రపంచ రికార్డులు, రెండు జాతీయ రికార్డులున్నాయి. 2005లో వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్‌లో ఐదు స్వర్ణాలు, 2006 పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, 2007 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏడు స్వర్ణాలతో ‘బంగారు చేప’ అనిపించుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని ఈవెంట్లలోనూ బంగారు పతకాలు (8) సాధించి మరోసారి క్రీడాప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాడు.
ఒక ఒలింపిక్స్‌లో ఏడు రికార్డులు సాధించిన మార్క్ స్పిట్జ్ (అమెరికా స్విమ్మర్) రికార్డును బద్దలు కొట్టాడు. ఏడు ప్రపంచ రికార్డులు, ఒక ఒలింపిక్ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ‘అసలు ఇతనికి అలుపన్నదే లేదా, ఆయాసం రాదా’ అని ప్రపంచం ప్రశ్నించుకునేలా చేశాడు. అప్పటినుంచి లండన్ ఒలింపిక్స్ వరకు నాలుగేళ్లలో జరిగిన 17 అంతర్జాతీయ ఈవెంట్లలో రెండు రజతాలు, మూడు కాంస్యాలు మినహా మిగిలినవన్నీ బంగారు పతకాలే. అంతేకాదు.. కొన్ని ఈవెంట్లలో వరుసగా నాలుగేళ్లూ స్వర్ణాలు గెలుచుకున్న ఏకైక క్రీడాకారుడిగా పలు రికార్డులు సృష్టించారు.
రిటైర్మెంట్.. తూచ్!
2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఫెల్ప్స్ ప్రకటించాడు. ఇది అభిమానులకు నిరాశే అయినా.. ప్రపంచంలోని ఇతర స్విమ్మర్లకు మాత్రం శుభవార్తగా మారింది. ఈ బంగారు చేప గైర్హాజరీలోనైనా తాము పతకాలు గెలవొచ్చని సంబరపడ్డారు. అయితే.. 2014లో తూచ్.. నేనొచ్చేస్తున్నానంటూ ప్రకటించాడు. ఆ ఏడాది పాన్ పసిఫిక్‌లో మూడు స్వర్ణాలు, రెండు రజతాలతో సత్తా తగ్గలేదని నిరూపించాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ఫెల్ప్స్.. రియోలోనూ జోరు కొనసాగిస్తున్నాడు.
ఈ చేప ఏం తింటుంది?
దినమంతా పూల్‌లో కఠోర సాధన చేయాలంటే తిండి కూడా భారీగానే ఉండాలి. అందుకు తగ్గట్లుగానే ఫెల్ప్స్ డైట్ ఉంటుంది. పళ్లు, కాఫీ, పెద్ద గిన్నెడు ఓట్స్‌తోపాటు చీజ్ ఆమ్లెట్, పెద్ద హామ్ (పంది లెగ్ పీస్) తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండాల్సిందే. మధ్యాహ్నం మీట్‌బాల్ సబ్ (మాంసాహారంతో కూడిన హాట్‌డాగ్), వెజ్జీస్‌తోపాటు తక్కువ ఫ్యాట్ ఉండే మాంసాన్ని తీసుకుంటాడు.
కో అంటే కోటి
పతకాల వేటలో రికార్డులతో దూసుకుపోవడంతో చాలా కంపెనీ లు ఫెల్ప్స్ వెనకపడ్డాయి. దీంతో సబ్‌వే, హిల్టన్, స్పీడో, వీసా, ఒమే గా, పవర్ బార్, మస్తునిచీ వంటి ప్రముఖ కంపెనీలు ఈయన్ను ఎం డార్స్ చేసుకున్నాయి. దీనికి తోడు క్రీడల ద్వారా సంపాదించిన దాంతో కలిపి ఫెల్ప్స్ ఆస్తి 55 మిలియన్ డాలర్లు (రూ.370 కోట్లకు పైనే)
మైకేల్ ఫెల్ప్స్ ఫౌండేషన్
ఈతపై ఉన్న అభిమానంతో ‘మైకేల్ ఫెల్ప్స్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా స్విమ్మింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు.. వేరే సంస్థలు చేపట్టే స్విమ్మింగ్ కార్యక్రమాలకు నిధులిస్తున్నాడు. బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ ఆఫ్ అమెరికాకు అధికార ప్రతినిధిగా ఉన్నాడు. 2004 ఏథెన్స్‌లో బంగారు పతకం సాధించాక సొంత ఊరు బాల్టీమోర్‌లో ఓ రోడ్డుకు ఫెల్ప్స్ పేరు పెట్టి గౌరవించారు.
రెండుసార్లు అరెస్టయ్యాడు
ప్రపంచం గర్వించే అథ్లెట్ అయినా.. రెండుసార్లు తప్పుచేసి అరెస్టయ్యాడు. 2004లో ఓసారి డీయూఐ (డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్-మద్యం తాగి వాహనం నడపటం) కేసులో అరెస్టయిన ఫెల్ప్స్.. 2015లోనూ ఇదే కేసులో బుక్కయ్యాడు. దీంతో ఇతన్ని ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ నుంచి అమెరికా తప్పించింది. తర్వాత తప్పును ఒప్పుకోవటంతో శిక్ష తప్పించుకున్నా.. 250 డాలర్ల జరిమానాతోపాటు 18 నెలలు ప్రొబేషన్‌లో ఉండాల్సి వచ్చింది. 2009లో ఓ పేపర్లో ఫెల్ప్స్ గంజాయి తీసుకుంటున్న ఫొటో ప్రచురితమవటం కూడా సంచలనం సృష్టించింది.
చిన్నప్పుడే ఏడీహెచ్‌డీ వ్యాధి
ఫెల్ప్స్ ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) వ్యాధికి గురయ్యాడు. ఇది వచ్చిన వారికి ఏ విషయం కూడా ఎక్కువసేపు గుర్తుండదు. ఉద్వేగాన్ని, కోపాన్ని అణచుకోవటం వీరి వల్ల కాదు. కానీ ఈ సమస్యను చాలా తొందరగా అధిగమించిన ఈ బంగారు చేప మనోశక్తి చాలా గొప్పదనే చెప్పాలి.
ఒలింపిక్స్ చరిత్రలో భారత్ సాధించిన మొత్తం పతకాలు 26 అయితే ఫెల్ప్స్ ఒక్కడే 25 కొల్లగొట్టాడు.
ఒలింపిక్స్‌లో అత్యధిక వ్యక్తిగత పతకాలు (14) సాధించిన లారిసా (సోవియట్ యూనియన్) రికార్డును ఫెల్ప్స్ సమం చేశాడు. 11 పతకాలు టీమ్ ఈవెంట్స్‌లో వచ్చాయి.