ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏదో తెలుసా..? | Paris Olympics 2024: Most Olympic Medals Won By A Athlete And Most Olympic Medals Won By A Team | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏదో తెలుసా..?

Published Fri, Jul 26 2024 8:51 AM | Last Updated on Fri, Jul 26 2024 12:02 PM

Paris Olympics 2024: Most Olympic Medals Won By A Athlete And Most Olympic Medals Won By A Team

పారిస్‌ వేదికగా జరుగనున్న సమ్మర్‌ ఒలింపిక్స్‌ 2024 ఇవాల్టి (జులై 26) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సారి ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 206 దేశాల నుంచి 10714 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 32 క్రీడల్లో 329 విభాగాల్లో విశ్వ క్రీడలు జరుగనున్నాయి. ఇవాళ జరిగే ఓపెనింగ్‌ సెర్మనీతో పోటీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. భారత్‌ నుంచి ఈ సారి 117 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. 

పీవీ సింధు, శరత్‌ కమల్‌ ఓపెనింగ్‌ సెర్మనీలో భారత ఫ్లాగ్‌ బేరర్లుగా ఉంటారు. భారత్‌ విశ్వ క్రీడల్లో పాల్గొనడం ఇది 26వ సారి. గత ఒలింపిక్స్‌లో భారత్‌ ఏడు పతాకలు సాధించి, పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. భారత్‌ సాధించిన పతకాల్లో ఓ స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సారి ఒలింపిక్స్‌లో 16 క్రీడా విభాగాల్లో పోటీపడుతున్న భారత్‌ ఎన్ని పతకాలు సాధిస్తుందో చూడాలి.

కాగా, 128 ఏళ్ల ఘన చరిత్ర (1896-2024) కలిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా యూఎస్‌ఏకి చెందిన మైఖేల్‌ ఫెల్ప్స్‌ ఉన్నాడు. ఫెల్ప్స్‌ 2004-2016 మధ్యలో ఏకంగా 28 మెడల్స్‌ సాధించాడు. ఇందులో 23 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఫెల్ప్స్‌ తర్వాత అత్యధిక పతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో లరిసా లాటినినా (సోవియట్‌ యూనియన్‌-18), మారిట్‌ ఝోర్గెన్‌ (నార్వే-15), నికొలై యాండ్రియానోవ్‌ (సోవియట్‌ యూనియన్‌-15) టాప్‌-4లో ఉన్నారు.

ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) ఉంది. యూఎస్‌ఏ ఇప్పటివరకు జరిగిన 25 ఒలింపిక్స్‌లో 2629 పతకాలు సాధించింది. ఇందులో 1061 స్వర్ణాలు, 830 రజతాలు, 738 కాంస్య పతకాలు ఉన్నాయి. 

ఆల్‌టైమ్‌ పతకాల పట్టికలో (స్వర్ణ పతకాల వారీగా) యూఎస్‌ఏ తర్వాతి స్థానంలో సోవియట్‌ యూనియన్‌ (1010), గ్రేట్‌ బ్రిటన్‌ (916), చైనా (636), ఫ్రాన్స్‌ (751), ఇటలీ (618), జర్మనీ (655), హంగేరీ (511), జపాన్‌ (497), ఆస్ట్రేలియా (547) టాప్‌-10లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌ 56వ స్థానంలో ఉంది. భారత్‌ ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్‌లో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్య పతకాలు (35)  సాధించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement