
ఫెల్ప్స్ కు రెండో స్థానం!
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ లో అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరో పసిడిపై దృష్టిసారించాడు. మూడో రోజు గేమ్స్ లో భాగంగా సోమవారం 4 x100 మీటర్ల ఫ్రీ స్టయిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణంతో పతకాల వేటను ఆరంభించిన ఫెల్ప్స్.. ఆ తరువాత జరిగిన 200 మీటర్ల బటర్ ఫ్లయ్ సెమీ ఫైనల్ వ్యక్తిగత రేసులో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. గత అర్థరాత్రి జరిగిన 200 మీటర్ల బటర్ ఫ్లయ్ రేసును ఒక నిమిషం 54.12 సెకెండ్లలో ముగించిన ఫెల్ఫ్స్ ..మంగళవారం రాత్రి జరిగే ఫైనల్ పోరుకు సిద్దమయ్యాడు. ఈ రేసులో కూడా ఫెల్ఫ్స్ స్వర్ణం సాధించే అవకాశాలు మెండుగానే ఉన్నా.. హంగేరీ స్విమ్మర్ థామస్ కెండెర్సీ నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ స్టార్ స్విమ్మర్లిద్దరూ ఫైనల్ కు అర్హత సాధించే క్రమంలో థామస్ కెండెర్సీ అగ్రస్థానంలో నిలిచాడు. సెమీ ఫైనల్ రేసును ఒక నిమిషం 53.96 సెకెండ్లలో పూర్తి చేసి మొదటి స్థానం సాధించాడు. దీంతో ఫైనల్లో కెండెర్సీ , ఫెల్ఫ్స్ ల మధ్య ఆసక్తికర రేసు జరగవచ్చు. మరోవైపు సెమీ ఫైనల్ రేసును మూడో స్థానంతో ముగించిన మరో హంగేరీ స్విమ్మర్ స్టాల్ వార్ట్ లాస్ జ్లో కూడా దీటైన సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు.
ఒలింపిక్స్ లో భాగంగా పురుషుల 4 x100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలోసెలెబ్ డ్రెసెల్, రియాన్ హెల్డ్, నాథన్ ఆడ్రియన్‌లతో కలిసి ఫెల్ఫ్స్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫెల్ప్ష్ ఖాతాలో 19వ ఒలింపిక్స్ పసిడి చేరింది. రియో ఒలింపిక్స్‌లో భాగంగా 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ వ్యక్తిగత ఫైనల్ రేసుకు అర్హత సాధించిన ఫెల్ఫ్స్.. ఇంకా 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసుల్లో పోటీపడాల్సి ఉంది.