ఆ రెజ్లింగ్ కోచ్లపై నిషేధం!
రియో డీ జనీరో:ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్లో జడ్జిల నిర్ణయాన్ని తప్పుబడుతూ అర్థనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మంగోలియాకు చెందిన ఇద్దరు రెజ్లింగ్ కోచ్లపై మూడేళ్ల నిషేధం పడింది. కాంస్య పతక పోరులో తమ దేశానికి చెందిన గంజోరిగీన్ మందఖ్నారన్ గెలుపును జడ్జిలు అడ్డుకున్నారంటూ కోచ్ లు సెరెంబాతర్ సోగ్బాయర్, బయారాలు తీవ్రంగా నిరసించడంతో వారిపై నిషేధం విధిస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం 2019 ఆగస్టు వరకూ అమల్లో ఉండనుంది.
రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ కాంస్య పతక పోరులో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన రెజ్లర్ కు పెనాల్టీ పాయింటు ఇవ్వడంతో పాయింట్ తేడాతో మంగోలియా రెజ్లర్ ఓడిపోయాడు. కాగా, అప్పటికి వరకూ తమవాడు గెలిచాడని భావిస్తున్న మంగోలియా కోచ్‌లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టేశారు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత.. వాళ్లకు అసలు విషయం తెలిసింది. జడ్జీల నిర్ణయాన్ని సవాలు చేయాలని కోచ్‌లు భావించారు. కానీ, అలా చేయడానికి వీల్లేదని జడ్జీలు వాళ్లకు చెప్పారు. దాంతో ఒకరు షర్టు విప్పేయగా, మరొకరు షర్టు, ప్యాంటు రెండూ విప్పేసి రింగ్‌లోనే పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో వారిపై కొన్నేళ్ల పాటు నిషేధం పడింది.