లగ్జరీ గిఫ్ట్లు ఇచ్చిన 24 గంటల్లోనే..
మాస్కో: రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన రష్యా క్రీడాకారులు లగ్జరీ గిఫ్ట్లు అందుకున్న అనంతరం వాటిని అమ్మకానికి పెట్టడం వివాదాస్పదంగా మారింది. రియోలో పతకాల్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టిన క్రీడాకారులకు అటు ప్రభుత్వం పాటు, పలు సంస్థలు బంఫర్ ఆఫర్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం పతక విజేతలకు భారీ స్థాయిలో నగదును రూపంలో నజరానా ఇవ్వడంతో పాటు బీఎండబ్యూ కార్లను కూడా అందజేసింది.
అయితే ప్రధానంగా కార్లను అందుకున్న 24 గంటల్లోనే అత్యధిక స్థాయిలో అమ్మకాల ప్రకటనలు ఆన్ లైన్లో దర్శనిమిచ్చాయి. తమ కార్లను అమ్మకానికి సిద్ధంగా ఉంచుతూ పతక విజేతలు ఇచ్చిన ఫోజులు రష్యా ప్రభుత్వంలో ఆందోళన పెంచాయి. క్రీడాకారులకు బహుమతులుగా ఇచ్చిన గిఫ్ట్లను ఇలా అమ్ముకోవడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టారు. అయితే ఇలా అమ్ముకోవడం తప్పేముందని రష్యా క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కార్లను ఉన్నవారు గిఫ్ట్లుగా అందిన కార్లను విక్రయించకపోతే ఏం చేస్తారని 2014 వింటర్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మాక్సిమ్ ట్రాంకోవ్ ప్రశ్నించాడు.
తనకు లైసెన్స్ ను పొందడానికి తగిన వయసు లేకపోవడంతో కారును అమ్ముకోవడం ఒక్కటే మార్గమని 17 జిమ్నాస్ట్ సెదా తుఖాల్యాన్ స్పష్టం చేసింది. ఒక బీఎండబ్యూ కారుకు డ్రైవర్ ను పెట్టుకునే స్థోమతకు తనకు లేదని ఆమె పేర్కొంది. ఇలా ఒలింపిక్ మెడలిస్ట్లకు లభించిన గిఫ్ట్లను అమ్ముకోవడాన్ని నెటిజన్లు సైతం సమర్ధిస్తున్నారు. ఆ గిఫ్ట్ లను ఉంచుకోవాలా?లేదా అనేది ఆయా క్రీడాకారులకు సంబంధించిన హక్కుగా వారు అభిప్రాయపడుతున్నారు.