సాయి చరిత్రని ఎంతగా విన్నా, ఎంతగా చదివినా– ఇంకా ఇంకా వినాలీ ఇంకా ఇంకా తెలుసుకోవాలీ అనే అనిపిస్తుంది తప్ప– ఇక చాల్లే! అని అనిపించనే అనిపించదు. ఒట్టిగా నీటిని ఎన్నింటినో తాగలేం! అదే మరి ద్రాక్షరసం పంచదార ఖర్జూరరసం.. ఇలా కలిపిన పానీయమైతేనో.. మరికాస్త మరికాస్త.. అంటూ తాగమూ? అలా ఒట్టి నీళ్లలో మధురపదార్థాలు కలిసి రుచికరంగా మారి పానీయమైనట్లుగా, సాయి యదార్థకథలో సాయి మంత్ర మనన(తపశ్శక్తి) శక్తి చేరి ఉన్న కారణంగా ఈ చరిత్రని ఎంతకాలం విన్నా చదివినా విసుగు రాదు, చాలు అనిపించదు. ఈ నేపథ్యంలో మసీదులో జరిగిన ఓ వింత సంఘటనని తెలుసుకుందాం!
వృద్ధురాలి ఆమరణ నిరాహార దీక్ష
దేశ్‌ముఖ్ అనే ఇంటి పేరు కల ఓ ఇల్లాలు ‘రాధాబాయ్’ అనే ఆమె తన స్నేహితురాళ్లతో కావాలని షిర్డీ దర్శనం కోసం వచ్చింది. ఆమె అతి వృద్ధురాలు. అందుకే కొంతమందిని తోడు చేసుకుని కూడా వచ్చిందామె. షిర్డీకొచ్చాక అక్కడి భక్తులూ– వాళ్ల భక్తి పారవశ్యం– ఆ భజనలూ.. సాయి దర్శనం కోసం ఆ భక్తులంతా నిరీక్షిస్తూ కనిపిస్తూ, దర్శనం కాగానే– చెట్టుకి నీరు పోసిన మరుక్షణంలో ఆ చెట్టు ఆకులు ఎలా విస్తరిస్తాయో అలా వెలిగిపోతున్న ముఖాలతో కనిపిస్తున్న తీరూ– మళ్లీ ఆ భక్తులే దర్శనానంతరం తిరిగి వెళ్లిపోతూ– ‘మళ్లీ ఎన్నాళ్లకి దర్శనమౌతుందో అనే నిరాశతో ఎదురుచూపుతో ఆనందాశ్రువులని పెట్టుకుంటూ ఉన్నవిధానమూ’.... ఆమెని మరింత ఉత్సాహపరిచాయి. వరుసలో తన వంతురాగానే సాయి ముఖంలోనికి, చూస్తూ చెప్పలేని భక్తి పారవశ్యాన్ని పొంది తన శిరసుని సాయి పాదాల మీద పెట్టి తన్మయత్వాన్ని పొందింది.
వర్షం వస్తూన్న కొద్దీ తనలోకి ప్రవాహపు నీరు వస్తున్న కొద్దీ ఎలా ఓ చెరువు తనకున్న పూర్వపు నీటిమట్టాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తుందో, అలాగే ఆ రాధాబాయ్‌లో భక్తిభావం మరింత పెరిగిపెరిగి పోసాగింది. ప్రారంభంలో పదిమందీ వెళ్తున్నారు కదాని వాళ్లతో బయల్దేరింది. తోవ నిండుగా అటూ ఇటూ ఉన్న భక్తులూ వాళ్ల అనుభవాలూ విని మరింత ఆత్రుతతో షిర్డీని ఎప్పుడెప్పుడు చేరుతామా? అనే ఉత్సాహంతో ఊగిపోయింది. షిర్డీకొచ్చాక ఆ ఆత్రుతా ఎదురుచూపూ ఉత్సాహం... ఇలా అన్నీ కలిసి, సాయి ఆశ్రమంగాని ఏదైనా ఉంటే అక్కడే తన శేషజీవితాన్ని గడపాలనే నిర్ణయానికొచ్చేసింది. ఇక భక్తుల వరుసలో కదులుతూ సాయిని దర్శించడం తన శిరసుతో ఆయన పాదాలని స్పృశించడం ఎప్పుడైతే జరిగిందో దాంతో ఆమెకి మరో ఆలోచన ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్లవాళ్లకి కలుగుతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. మళ్లీ కొంతసేపో లేదా కొంత కాలమో అయ్యేసరికి పాలమీద నీళ్లు చల్లగా ఆ పొంగు తగ్గిపోయినట్లుగా– కుటుంబం బాధ్యతా అపరిష్కృత సమస్యలూ... వంటివి గుర్తుకి రాగానే మళ్లీ మామూలైపోతూ ఉండటం సర్వసాధారణం.
అయితే ఈమె మాత్రం అలాంటి తాత్కాలిక భావానికి గురైనది కానేకాదు. వయసు పెద్దది కావడం, కుటుంబానికి సంబంధించిన జంజాటం లేకపోవడం, ఎక్కడో ఓ చోట నిరామయంగా జీవిస్తూ దైవం పిలిస్తే చాలు వెళ్లిపోదామనుకునే ఆలోచనతో ఉండటం కారణంగా ఆ శేషజీవిత నివాసాన్ని షిర్డీకే అంకితం చేయాలని భావించింది. ఆ ఊహతోనే మళ్లీ మసీదులో సాయి దర్శనానికని బయల్దేరింది. అంతలోనే సాయి మరోప్రదేశానికి వెళ్తున్నారనీ దర్శనం సాధ్యం కాదనీ తెలిసి వెనక్కొచ్చేసింది. దాంతో ఆమెతో మరింతయింది భక్తి భావం.
ధర్శసూత్రాల్లో ఓ మాట ఉంది. ‘పునర్విశ్లేష భీరుత్వం పరమా భక్తి రుచ్యతే’– అని. చక్కగా కలిసి ఉన్న ఆత్మీయంగా ఉన్న ఏ ఇద్దరో ఏదో కారణంగా గాని తాత్కాలికంగా దూరదూరంగా ఉండాల్సొచ్చి ఉండి– మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో? అనే తీరు నిరుత్సాహం ఎదురుచూపుల కలయికతో గాని విడిపోతే దాన్ని ‘పరమభక్తి’ అంటారని పై వాక్యానికర్థం. త్యాగరాజస్వామి ప్రతి నిత్యం పూజ ముగించి, అప్పటికప్పుడు భక్త్యావేశంతో వచ్చిన కీర్తనలని పాడి సీతారామచంద్రప్రభువుకి విన్నవించుకుని ఇంటి నుండి బయటికి వెళ్లిపోబోతూ ‘రామా! నన్ను విడువవుగా! వెంటనే దర్శనానికి రప్పించుకుంటావుగా!’ అని చిరుకన్నీళ్లతో వెళ్తూ ఉండేవాడట. ఆ స్థాయి భక్తీ తన్మయత్వమూ లేని తన కుటుంబ సభ్యులకి మాత్రం శ్రమించిన రైతు ధాన్యాన్ని పండించి, ఆ ధ్యాన్యాన్ని మళ్లీ పొలంలో చల్లుతూంటే – తెలియనివాడు ఎలా ఈ రైతుకి పిచ్చి పట్టిందేమో! అనుకుంటాడో, తిరిగి పంటకోసం ధాన్యాన్ని విత్తనాలుగా చల్లుతున్నాడనే ఆలోచనకే రాలేకపోతాడో అలా త్యాగరాజుని గురించి కుటుంబసభ్యులు అనుకుంటూ ఉండేవారు. చిత్రమేమంటే నిజమైన వ్యక్తి–ఏకాగ్రత దృష్టి ఉన్నవాడు ఇలాంటి వారెవరినీ పట్టించుకోడు, తన పనిలోనే తానుండిపోతాడు.
సరిగ్గా అలాగే ఈ వృద్ధురాలైన రాధాబాయ్ కూడా శేషజీవితాన్ని సాయి నామస్మరణలోనే గడిపెయ్యాలని దృఢమైన నిర్ణయానికొచ్చేసింది. ఈమెతో వచ్చిన అందరూ ఒకరొకరుగా వెళ్లిపోయినా, ఈమె మాత్రం అక్కడే ఉండిపోయింది. సాయినామాన్ని జపించుకుంటూ షిర్డీలో ఉన్న ఆమెకి మరో గట్టి ఆలోచన వచ్చింది తన భక్తి ఏకాగ్రత కారణంగా ‘సాయి వద్ద ఓ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకుంటేనో?..’ అని.
ఇదంతా తాత్కాలిక ఆవేశంతో చేసుకుంటున్న నిర్ణయం కానేకాదు. దాంతో ఆమె సాయిని దర్శించాలనీ మంత్రోపదేశానికి ప్రార్థించాలనీ మంత్రాన్ని పొందాక షిర్డీలోనే ఉంటూ శరీరాన్ని విడిచెయ్యాలని నిశ్చయించుకుని ప్రతినిత్యం మసీదుకి వెళ్లి దర్శనానికి ప్రయత్నిస్తూ ఉండేది. అదేం చిత్రమో కానీ ఎన్నిమార్లు ప్రయత్నించినా సాయి ఎంతో దూరంలో ఉండటం, లేదా భక్తులంతా చుట్టు ముట్టి ఉండటం, పూజల్లో రద్దీగా ఉండటం, సమీపించి మంత్రోపదేశం గురించి అడుగుదామనేలోగా సాయి బయల్దేరి ఎక్కడికో వెళ్తూ ఉండటం.. ఇలాగే జరిగింది అన్ని సార్లూ కూడా.
ఆమరణ నిరశన దీక్ష
ఇన్నిమార్లు ఇన్ని విధాలుగా ప్రయత్నించిన ఆమెకి– పట్టుదలతో కాదు, నిరాశతో కూడిన అసహనం– వచ్చేసింది. దాంతో మసీదు మందు ఆమరణ(మరణించేంతవరకూ, నిర్+అశన= తిండి తినకుండా ఉండే నియమం కల దీక్ష– ఓ పవిత్ర వ్రతం) నిరశన దీక్ష చేయాలనే నిశ్చయానికొచ్చింది. అంతే! ఓ దర్భాసనం నేల మీద పరుచుకుని, దాని మీద కూర్చుని సాయినామాన్నే జపిస్తూ కూచుండిపోయింది. మొదటిరోజులో మొదటి పూట ఎవరూ అంత పట్టించుకోలేదు గాని, రెండవపూట మాత్రం ఆమె అందరినీ తన చిత్రమైన ఈ నిరశనదీక్షాచేష్టతో ఆకర్షించడంతో అందరూ గమనించసాగారు ఆమెని.
‘శరీరమాద్యం ఖలు సాధనమ్’ అంటుంది ధర్మశాస్త్రం. ఎంతటి దీక్షని ఉపవాసాన్ని యాగాన్ని యజ్ఞాన్ని హోమాన్ని వ్రతాన్ని చేయదలిచినా ఈ శరీరం నిలబడేందుకు కావాలసినంత ఆహారాన్ని (అన్నానికి బదులుగా, అన్నం కంటే తక్కువ పరిమాణంలో, అనేక పర్యాయాలు కాకుండా రెండు పూటలు మాత్రమే, అది కూడా శరీర ఆరోగ్యస్థితిని గమనించుకుంటూ) తీసుకోవాల్సిందే! అని పై వాక్యానికర్థం. ‘నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధానతః’ –ఆహారం అనేదాన్ని ఆరోగ్యభంగం కాకుండానూ శరీరం నీరసంతో లేకుండా నిలబడేంతగానూ తీసుకోవాలని పై వాక్యానికర్థం వైద్యశాస్త్రపరంగా.
ఈ వృద్ధురాలు మాత్రం కొద్ది మూర్ఖతతో అన్నాన్ని కనీసం నీటినీ కూడా తీసుకోవడం మానేసింది. భక్తుల్లో అర్ధభక్తిపరులుంటారు కొందరు. అటు సాయి మీద విశేషమైన భక్తితోనూ ఉంటారు– ఇలాంటివేమైనా దైవానికి (ఇక్కడ సాయి విషయంలో) ఏదైనా ఇలాంటి వ్యతిరేకత జరుగుతూ ఉంటే.. ఏం జరుగబోతోంది’ అన్నట్లు వీలైనన్ని ఎక్కువమార్లు పరిశీలిస్తూ పరామర్శిస్తూ ఉంటారు విషయాన్ని. అందుకే వీళ్లు అర్ధభక్తులు.
నిజమైన భక్తిపరులుంటారు. వాళ్లు మాత్రం ఈ తీరు దీక్ష ఎలా దీక్షే అనిపించుకోదో, ఇలా చేయడం ఎందుకు సరికాదో చెప్పి, ఆ తీరు వ్యక్తులకి అర్థమై వాళ్లంతట వాళ్లే మానేలా చేస్తారు. ఇలా ఉండే భక్తులు ఆమెతో స్పష్టంగా చక్కని అవగాహనతో అనుభవంతో చెప్ప ప్రారంభించారు.
‘అమ్మా! నువ్వా వృద్ధురాలివి. శరీరంలో ఉండే అవయవాలన్నీ క్రమంగా బలక్షీణతకి గురయ్యే స్థితిలో ఉన్నదానివి. ఆ కారణంగా నీ వాళ్లెవరి దగ్గరో అక్కడుండటం సబబు. పోనీ! భక్తిపూర్వకమైన మనసుతో ఇక్కడి కొచ్చావు. మంచిదే! దర్శనాన్ని పొందావు. మాక్కూడా అప్పుడప్పుడు అసాధ్యమవుతూ ఉండే తీరులో నీ నుదుటిని ఆయన పాదాల మీద ఉంచి నమస్కరించుకున్నావు. ఎంతో అదృష్టం నీకు లభించింది.
ఈ వయసులో– నీ వాళ్లెవరూ లేని ఈ స్థలంలో కనీసం నీకంటూ పరిచితులెవరూ కూడా మసీదులో లేని కారణంగా వాళ్ల వెంట నీ అసలు ప్రదేశానికి వెళ్లిపోవడం మంచిది. పైగా ఇక్కడికొచ్చే సందర్భంలో లేని ఆలోచన, నీకు ఇక్కడికొచ్చాక వచ్చిందనేది సుస్పష్టం కదా! ఈ అభిప్రాయాన్ని నువ్వు నీ ఇంటికెళ్లి చెప్పిన పక్షంలో నీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాళ్లు కూడా నీకు తగిన ఏర్పాట్లని నీకిక్కడ చేసే ఆలోచనతో ఓ మనిషిని తోడుగా ఉంచేవారేమో? సరే! ఇదంతా అలా ఉంచితే.. మాకు తెలిసి సాయి ఎవ్వరికీ ఏనాడూ మంత్రాన్ని ఉపదేశించిన జాడ లేదు. ఆయనకాయన అల్లా మంత్రాన్ని జపించుకుంటూ ఉండడాన్నే గమనిస్తున్నాం.
‘ఏమైనా సాయి నీకు మంత్రోపదేశాన్ని చేస్తే తప్ప దీక్షని విరమించనంటూ చెప్తూ భక్తులందర్నీ నువ్వు ఆయోమయానికి గురి చేస్తూ ఉంటే, మా అంతట మేమే స్వయంగా వచ్చి చెప్తున్నాం! సాయి ఏ ఒక్కరికీ మంత్రోపదేశాన్ని చేయలేదు– చేయడు– చేయబోడు. చివరికి అభాసుపాలు కాకుండానూ, నీ పెద్దరికానికి తగినట్లూనూ ఈ (మొండి) పట్టుదల పట్టకుండా ఈ దీక్షని విరమించవలసింది’ అని.
ఆమె వీరి మాటల్ని వింటూ కూడా మౌనంగానే ఉండి వీళ్లని అసలు పట్టించుకోనేలేదు. చూస్తూ ఉండగానే 3 రోజులయ్యాయి. ఆమె మరింతగా క్షీణించింది. ఎప్పుడైనా ఆమెకి ఏదైనా జరుగుతుందేమో? అనే భయం కలగజేస్తోంది అందరికీ ఆమె శారీరక స్థితి.
వెంటనే శ్యామా, సాయి వద్దకి వెళ్లి పాదాభివందనం చేసి నేల మీదే కూర్చుని సాయితో వృద్ధురాలి గురించీ ఆమె శారీరకస్థితిని గురించీ వివరించి ‘సాయి భగవాన్! నీకంతా ప్రశాంతంగా కనిపించవచ్చు. మాకు మాత్రం గుండెల్లో మేఘాలు గర్జిస్తూన్నట్లే ఉంది ఆమె విషయం. జరగరానిదేదైనా జరిగితే మసీదుకీ నీకూ మాకూ...’ అంటూ తన కంఠం గద్గదమైపోగా మౌనంగా ఉండిపోయాడు మాట రాక.
సాయి ఒక్కసారి శూన్యంలోకి చూసి ‘శ్యామా! ఆమెని పిలిపించు!’ అన్నాడు. తన ఆశ నెరవేరుతోందనే అభిప్రాయంతో ఆమె అంత నీరసంలోనూ కూడా చెంగుచెంగున సాయిని చేరి పాదాభివందనం చేసి ఆయన ముందు కూర్చుంది. సాయి చెప్పడం ప్రారంభించాడు.
‘తల్లీ! అని సంబోధించి.. ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ... ‘అమ్మా! నిన్ను ఓ స్త్రీగా భావించి ఇలా పిలవడం లేదు.. నిజంగా నేను నీ బిడ్డణ్ణి. నా అదృష్టమేమంటే ఎందరో తల్లుల బిడ్డణ్ణి నేను. ‘భవతీ భిక్షాం దేహి!’ అని అడిగితే అమ్మ పెడుతుందంటారు. అయితే ఈ పిలుపే అవసరం లేకుండా వాళ్లంతట వాళ్లే అంటే ఆ అందరు అమ్మలే నాకు బిచ్చాన్ని ఏదో బిచ్చంలా కాకుండా నా జోలెలో వేస్తూంటే బతికే పకీరుని. ఎక్కడైనా బిడ్డడు బాధని అనుభవిస్తూ ఉంటే తల్లి వాడి కన్నీళ్లని తుడిచి ఓదారుస్తుంది. నువ్వేమిటమ్మా? ఆత్మహత్య దిశగా ఈ నిరశన దీక్షకి దిగావు? మంత్రోపదేశం కావాలంటున్నావట! నాకో గురువుండేవాడు. ఆయన్ని 12 సంవత్సరాల పాటు సేవించాను. సరిగ్గా నీలాగే మంత్రోపదేశం చేయవలసిందని ప్రార్థించాను. ఆయన తనకి 2 పైసలు కావాలన్నాడు. మంత్రం వస్తోంది కదా అని ఇచ్చాను. ఆయన నన్ను చూస్తూ ఈ రెండు పైసలూ ఏమిటో తెలుసా? శ్రద్ధా సబూరి(సహనం) అన్నాడు. ఆ క్షణంలో నాకర్థం కాలేదు కానీ.. ఓ రోజు పాటు నాలో నేను తర్కించుకున్నాక తెలిసింది – ఒక పని పట్ల శ్రద్ధగా తిరిగి ప్రారంభించి పూర్తి చేసి తీరాలనే సబూరీ (సహనం) అనేది ఉంటే జీవితానికి చాలు అని.
ఆయన శ్రద్ధా సబూరీ అనే ఈ రెండూ తన ఉపదేశాలన్నాడు. తల్లి తాబేలు సముద్రపు ఒడ్డున ఉండే తన పిల్లలైన తాబేళ్లని ఏనాడూ చూడలేదు. చూసినా ఏవి తన పిల్లలో అన్ని వేల తాబేళ్లలో గుర్తుపట్టలేదు కూడా. అయినా భగవంతుడెంత గొప్పవాడంటే.. ఆ తల్లి తాబేలు తన పిల్లల్ని అలా ఒక్కసారి గుండెనిండుగా తలుచుకోగానే ఆ పిల్లలైన తాబేళ్లన్నీ తల్లిని తలుచుకుంటాయి. కడుపులు నిండిపోయిన ఆనందంతో నడిచేస్తాయి. ఈదులాడుతాయి. అలా నా మీద నీకు అంతటి ఇష్టమే ఉంటే నన్ను తలుచుకో కన్నతల్లీ! ఇంతకీ విశేషమేమంటే ఈ మాటల్ని చెప్పిన నా గురువు ఏ మంత్రాన్నీ నాకే ఉపదేశించలేదు. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన నేను– నాకే మంత్రం లేనప్పుడు ఎలా ఉపదేశం చేయగలనమ్మా? దయచేసి బిడ్డణ్ణి కనిపెట్టమ్మా!’ అన్నాడు. ఆమె కళ్ల వెంట ధారాపాతంగా కన్నీరు రాసాగింది. ‘సాయీ! అంటూ ఆయన పాదాలమీద పడి ‘తప్పైపోయింది’ అంటూ వినమ్రంగా మెట్లు దిగిపోయి తన ఊరికి వెళ్లింది. పైవారం– విరిగిన ఇటుక చెప్పిన విశేషం.
మసీదులో ఆమరణ దీక్షా?
Published Sun, May 26 2019 12:57 PM | Last Updated on Sun, May 26 2019 12:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment