సినీ ఇండస్ట్రీలో జెండా పాతిన స్త్రీలు, ఆ కథేంటో చూద్దామా? | Womens Day 2022: Women Key Role In Movie Industry | Sakshi
Sakshi News home page

Womens Day Special: సినీ ఇండస్ట్రీలో జెండా పాతిన స్త్రీలు, ఆ కథేంటో చూద్దామా?

Published Sun, Mar 6 2022 11:52 AM | Last Updated on Sun, Mar 6 2022 12:10 PM

Womens Day 2022: Women Key Role In Movie Industry - Sakshi

హీరోల చాటు హీరోయిన్లు... కొడుకు డిగ్రీ పాసై వస్తే ఆనందబాష్పాలు రాల్చే తల్లులు... గయ్యాళి అత్తగార్లు.. క్లబ్‌సాంగ్స్‌ చేసే వ్యాంప్‌లు.. మహిళా ప్లేబ్యాక్‌ సింగర్లు.. గ్రూప్‌ డాన్సర్లు.... ఇంతకు మాత్రమే ప్రవేశం ఉన్న భారతీయ సినిమా నేడు క్రమంగా స్త్రీలు శాసించే స్థితికి చేరింది. ఇన్నాళ్లయినా ఇంకా మగ ప్రపంచపు లక్షణాలు ఉన్న సినీ ఇండస్ట్రీలో స్త్రీలు తమ జెండా పాతేశారు. రాబోయే రోజుల్లో సినిమా యూనిట్‌ అంటే పురుషులు ఎంతమందో స్త్రీలు అంతేమంది కనిపించనున్నారు. కోట్ల విలువ చేసే గ్లామర్‌ ఇండస్ట్రీలో స్త్రీల సృజనాత్మక సమర్థ భాగస్వామ్యం కనిపిస్తున్నది. ఇప్పుడు ‘యాక్షన్‌ సీన్‌’ వారిది కూడా.

ముందు ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’కు బెస్ట్‌ విషెస్‌ చెబుదాం..
ఎందుకంటే మార్చి 27న జరగనున్న ఆస్కార్‌ వేడుకలో ఈ డాక్యుమెంటరీకి అవార్డు వస్తే భారతీయ సినిమా రంగంలో అదో గొప్ప మహిళా విజయం అవుతుంది. ఘన చరిత్రగా నిలుస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో కొంతమంది దళిత మహిళలు స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించి ‘ఖబర్‌ లెహరియా’ పేరుతో న్యూస్‌ బులెటిన్‌ను, న్యూస్‌పేపర్‌ను వెలువరించడాన్ని డాక్యుమెంటరీగా తీసిన ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సందర్భంలో ఈ మహిళా దినోత్సవం జరగడం ఒక విశేషం. ఈ డాక్యుమెంటరీకి ఒక దర్శకురాలు రింతు థామస్‌.

కార్యదర్శులు
సూపర్‌స్టార్‌కు మేనేజర్‌ అంటే మహరాజుకు మంత్రితో సమానం. ఒకప్పుడు మంత్రులూ ఆ తర్వాత మేనేజర్లూ అంతా మగవారే. కాని మీరు షారూఖ్‌ ఖాన్‌తో సినిమా తీయాలని బయలుదేరండి... ముందు అతని మేనేజర్‌ పూజా దద్లానీని కలవాలి. 2012 నుంచి షారూఖ్‌ ఖాన్‌ మేనేజర్‌గా ఉన్న దద్లానీ అతని కుటుంబ సభ్యురాలన్నంతగా కలిసిపోయింది. షారూఖ్‌ ఖాన్‌ తన కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసులో ఆందోళనలో ఉన్నప్పుడు ఆమే సకల వ్యవహారాలు చూసింది. జీతాలు, భత్యాలు కలిపి నేటికి ఒక 50 కోట్లు ఆమె రాబడి పొంది ఉంటుందని అంచనా. ప్రేక్షకులు స్టార్‌ మీద ఆధారపడితే స్టార్‌ ఒక మహిళా మేనేజర్‌ మీద ఆధారపడే సినిమా యుగం ఇది.

అయితే ఆమిర్‌ ఖాన్‌ మేనేజర్‌ ఎవరు? బింకీ మెండెస్‌. ఆమె అతని పక్కనే ఉండి నిమిష నిమిషం అతనేం చేయాలో చెబుతుంటుంది. సరే.. మీకు కరీనా కపూర్‌ డేట్స్‌ కావాలా? ఆమె మేనేజర్‌ పూనమ్‌ దమానియాను కలవాలి. రణ్‌వీర్‌ సింగ్‌ యాడ్‌ చేయాలన్నా, సినిమాకు సైన్‌ చేయాలన్నా అతని మేనేజర్‌ సుశాన్‌ రోడ్రిగ్స్‌ను దాటి రావాలి. ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, హృతిక్‌ రోషన్, అక్షయ్‌ కుమార్, షాహిద్‌ కపూర్‌... వీళ్లందరి మేనేజర్లు ఇప్పుడు స్త్రీలే. ఒకప్పుడు బాలీవుడ్‌లో మేనేజర్లుగా మగవారు రాజ్యం ఏలారు. కాలక్రమంలో వారు ప్రొడ్యూసర్లుగా కూడా మారారు. కాని స్త్రీలే తమ కెరీర్‌ను మెరుగ్గా మలచగలరని స్టార్లు భావిస్తున్నారు. నేటి ముఖ్యమైన మార్పు ఇది.

కార్యనిర్వాహకులు
టాప్‌ ప్రొఫెషనల్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లు తమ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లుగా మహిళలనే ఇప్పుడు నియమించుకుంటున్నాయి. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వంటి సంస్థల్లో ఒక సినిమా ప్రపోజల్‌ గట్టెక్కాలంటే ఈ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లను ఒప్పించాలి. ముంబైలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ వంటి ఓటీటీ  ప్లాట్‌ఫామ్స్‌ మహిళా కంటెంట్‌ హెడ్స్‌తో నిండి ఉన్నాయి. కంటెంట్‌ను తీసుకెళ్లి వీరి ముందు పెట్టి ప్రాజెక్ట్స్‌ ఫైనలైజ్‌ చేసుకోవాల్సి వస్తుంది. అపర్ణా పురోహిత్‌ అమెజాన్‌ ఒరిజినల్స్‌కు హెడ్‌గా ఉంది. మోనికా షేర్‌గిల్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇక ఏఎల్‌టీ బాలాజీ ప్రొడక్షన్స్‌ని ఏక్తా కపూర్‌ చూస్తుందన్న సంగతి తెలిసిందే. ‘స్త్రీలు ఎంత సమర్థంగా ఇంటిని నడపగలరో అలాగే ప్రొడక్షన్‌ హౌస్‌ అనే ఇంటిని కూడా నడపగలరు’ అనే భావన రావడం వల్లే స్త్రీలకు బాధ్యతలు ఇవ్వడం జరుగుతోంది. ఆ బాధ్యతలను స్వీకరించాక వారు గొప్పగా పని చేస్తున్నారు కూడా.

బిహైండ్‌ ది స్క్రీన్‌
సినిమా రంగంలో నేటికీ ‘స్పాట్‌ బాయ్‌’, ‘లైట్‌ బాయ్‌’ ఉన్నారు తప్ప ‘స్పాట్‌ గర్ల్‌’, ‘లైట్‌ గర్ల్‌’ లేరు. సినిమా ఇంతకాలం పురుష ఆధారిత రంగంగానే పురుషుల నియంత్రణలోనే ఉంది. ప్రొడక్షన్‌ హౌస్‌ల అధిపతులుగా మగవారే ఉన్నారు. దశాబ్దాల పాటు మగ ప్రొడ్యూసర్ల, హీరోల, డైరెక్టర్ల దయాదాక్షిణ్యాల మీద, మెహర్బానీ మీద స్త్రీలు ఆ రంగంలో మనుగడ సాగించాల్సి వచ్చింది. అయితే అందరూ కాదు. ఏం మాకేం తక్కువ... మేమూ చేసి చూపించగలం అని మగవారినీ ఉలిక్కిపడేలా చేసిన ధీరలూ వీర వనితలూ ఉన్నారు. మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకుని శోభనాచల స్టూడియో బాధ్యతలు చూస్తూ హిట్‌ సినిమాల నిర్మాతగా ఉన్న చిత్తజల్లు కృష్ణవేణికి ‘మన దేశం’లో ఏకంగా ఎన్టీఆర్‌కు అవకాశం ఇచ్చిన ఘనత ఉంది.

స్టూడియో స్థాపించడమే కాదు నటిగా, గాయనిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా చక్రం తిప్పిన తెలుగు మూర్తి భానుమతి రామకృష్ణను యావత్‌ దక్షణాది పరిశ్రమ నెత్తిన పెట్టుకుంది. హిందీలో దాదాసాహెబ్‌ ఫాల్కేకు దీటుగా 1926–28 మధ్య సినిమాలు తీసిన తొలి మహిళ ఫాతిమా బేగమ్‌ కీర్తి బయటకు రాలేదు. ఆ ప్రింట్‌లు అందుబాటులో లేకపోవడమే కారణం. లండన్‌లో సినిమా కళను చదువుకొని వచ్చిన దేవికా రాణి ‘బాంబే టాకీస్‌’ స్థాపించి దేశానికి దిలీప్‌ కుమార్‌ వంటి హీరోని ఇచ్చింది. సరస్వతి దేవి, జద్దన్‌ బాయి (నర్గిస్‌ తల్లి) హిందీ రంగంలో తొలిగా బాణీలు కట్టిన మహిళా సంగీతకారులు. ఇస్మత్‌ చుగ్తాయ్‌ స్క్రిప్ట్‌లు రాసింది. జొహ్రా సైగల్‌ కొరియోగ్రఫీ చేసింది. స్త్రీలు సగర్వంగా తమ ప్రాతినిధ్యం చూపారు. కాని ఈ కొద్దిమంది ప్రతిభను మించిన మగవారి ప్రాతినిధ్యం వారిని వెనుకగానే ఉంచింది.

తెరమరుగవుతున్న స్టీరియోటైప్‌
సినిమా రంగం అనేది ఒక విచిత్రమైన పని తీరు ఉన్న రంగం. మగవాళ్లు ఉన్న గదిలో మరో మగాడు సులభంగా దూరి పనికి సంబంధించిన చర్చను సాగిస్తాడు అక్కడ. కథ కోసం సిట్టింగ్‌కు ఎక్కడికో కొందరు మగవాళ్లు వెళతారు. లొకేషన్స్‌ వెతకడానికి కొందరు మగవాళ్లు వెళతారు. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కొందరు మగవాళ్లు కూచుంటారు. సినిమా వ్యాపార లావాదేవీల్లో కొందరు మగవాళ్లు  కూచుంటారు. స్త్రీలు సులువుగా అతి మామూలుగా ఈ చోట్లలోకి వెళ్లే పరిస్థితులు ఆ కాలంలో లేవు. పైగా పెద్దగా చదువు లేని దిగువ సిబ్బంది చాలామంది లొకేషన్లో పని చేస్తారు. వారికి ‘మగవారి మాట’ వినాలనే కండిషన్‌ ఉన్న మైండ్‌సెట్‌ ఉంటుంది. దానికి భిన్నంగా స్త్రీ నిర్మాతనో, స్త్రీ దర్శకురాలినో, సినిమాటోగ్రాఫర్‌నో వారు అంగీకరించరు. అదే కాక పని నేర్పించడానికి కూడా మగ సీనియర్లు సిద్ధంగా ఉండరు. ఇవన్నీ స్త్రీలు సినిమా రంగంలోని వివిధ క్రాఫ్ట్స్‌లలో ప్రవేశించడానికి నిన్న మొన్నటి వరకూ అడ్డంకిగా నిలిచాయి. ఇప్పుడూ నిలుస్తూ ఉన్నా స్త్రీలు గేట్లు తోసుకుని వెళ్లి తాము కూచుంటున్నారు.

ఓనర్‌ ఆఫ్‌ ది షిప్‌
భానుమతి, అంజలీ దేవి, బి.శాంతకుమారి తో మొదలెట్టి జయసుధ, జీవిత, మంచు లక్ష్మి వరకూ నటీమణులు నిర్మాతలుగా మారడం సినీ పరిశ్రమలో ఆనవాయితీ. స్త్రీలు ఇవాళ నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లుగా సినిమాలను డిసైడ్‌ చేస్తున్నారు. ఏక్తా కపూర్‌ టెలివిజన్‌ రంగంతో పాటు సినిమా రంగంలో కూడా ప్రొడ్యూసర్‌గా ఒక బలమైన శక్తిగా నిలిచింది. దీపికా పడుకోన్, అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా నిర్మాతలుగా మారి చాలా సీరియస్‌గా సినిమాలను నిర్మిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ బ్యానర్‌లో జూహీ చావ్లాతో పాటు గౌరీ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ తరఫున కిరణ్‌ రావు మేలిమి సినిమాలు తీస్తున్నారు.

‘లంచ్‌ బాక్స్‌’ సినిమా నిర్మించిన గునీత్‌ మోంగా మరో ముఖ్య నిర్మాత. తెలుగులో ఇప్పుడు యువ మహిళా నిర్మాతలు ఉత్సాహంగా సినిమాలు తీస్తున్నారు. సునీత తాటి (ఓ బేబీ, శాకినీ డాకినీ, దొంగలున్నారు జాగ్రత్త), పరుచూరి ప్రవీణ (కేరాఫ్‌ కంచరపాలెం), కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య (నేను మీకు బాగా కావాల్సినవాడిని), సుస్మిత కొణిదెల (సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు), నాగబాబు కుమార్తె నిహారిక (ముద్దపప్పు ఆవకాయ, సూర్యకాంతం), కృష్ణంరాజు కుమార్తె ప్రసీద (రాధేశ్యామ్‌), దిల్‌ రాజు కుమార్తె హన్షితా రెడ్డి, గుణశేఖర్‌ కుమార్తె నీలిమా గుణ (శాకుంతలం), అమలా పాల్‌ (తెలుగు–తమిళ ‘కడవేర్‌’) వీరంతా సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే సుప్రియా యార్లగడ్డ, స్వప్నా దత్, ప్రియాంకా దత్‌లు నిర్మాతలుగా ప్రూవ్‌ చేసుకున్నారు. తెలుగులోనే నిత్యా మీనన్‌ ‘స్కైల్యాబ్‌’ను, కాజల్‌ అగర్వాల్‌ ‘మను చరిత్ర’ను నిర్మించారు.

కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌
డైరెక్టర్‌ ఈజ్‌ కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటారు. మన విజయనిర్మల 40కి పైగా కమర్షియల్‌ సినిమాలకు దర్శకత్వం వహించడం, కెప్టెన్‌లా సమర్థంగా యూనిట్‌ను నడపడం ఒక పెద్ద ఘనత. ఈ కెప్టెన్‌ స్థానాన్ని స్త్రీలు ఇప్పుడు మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ పని అన్ని భాషల్లోనూ జరుగుతోంది. 1980లలో సాయి పరాంజపే, కల్పనా లాజ్మీ, మీరా నాయర్, అపర్ణాసేన్‌ వచ్చి మహిళా దర్శకుల ఉనికిని దేశమంతా చాటారు. ఆ తర్వాత దీపా నాయర్‌ అంతర్జాతీయ ఖ్యాతి పొందుతూ భారతీయ మహిళా దర్శకుల మేధను చాటింది. నిజానికి స్త్రీలు పారలల్‌ సినిమాలు మాత్రమే తీస్తారు అనే ముద్ర నుంచి నేడు జోయా అఖ్తర్‌ వంటి మహిళా దర్శకులు హిందీ సినిమాను బయట పడేశారు. ఆమె తీసిన ‘గల్లీ బాయ్‌’, ‘జిందగీ నా మిలేగీ దుబారా’ వంటి సినిమాలు కలెక్షన్ల రికార్డులు తిరగరాశాయి. ఆమె అడిగితే సూపర్‌స్టార్లు డేట్స్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆమెలాగే ఎందరో యువ మహిళా దర్శకులు సినిమాలు తీస్తున్నారు. గౌరి షిండే (డియర్‌ జిందగీ, ఇంగ్లిష్‌ వింగ్లిష్‌), అలంకృతా శ్రీవాస్తవ (లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా), మేఘనా గుల్జార్‌ (తల్వార్, రాజీ, చపాక్‌), రీమా కాగ్తీ ( తలాష్, గోల్డ్‌), నందితా దాస్‌ (మంటో), ఫర్హా ఖాన్‌ (మై హూనా, ఓమ్‌ శాంతి ఓమ్‌), అశ్విని అయ్యర్‌ తివారీ (నీల్‌ బత్తి సన్నాట, బరేలీకి బర్ఫీ), తనూజా చంద్ర (కరీబ్‌ కరీబ్‌ సింగిల్‌), అనూష రిజ్వీ (పీప్లీ లైవ్‌)... బాలీవుడ్‌లో తమ వాటా సినిమాలను పొందుతున్నారు. దక్షిణాదిన నటిగా మంచి గుర్తింపు పొందిన రేవతి ఇంగ్లిష్‌ చిత్రం ‘మిత్ర్‌ మై ఫ్రెండ్‌’తో దర్శకురాలిగానూ నిరూపించుకున్నారు. ప్రస్తుతం కాజోల్‌తో ‘సలామ్‌ వెంకీ’ తెరకెక్కిస్తున్నారు.

దక్షిణాదిలో సుధా కొంగర (గురు, ఆకాశమే నీ హద్దురా), అంజలీ మీనన్‌ (బెంగళూరు డేస్‌) గుర్తింపు పొందారు. తెలుగులో నందినీ రెడ్డి (అలా మొదలైంది, ఓ బేబీ), సుజనా రావు (గమనం), లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను), గౌరీ రోణంకి (పెళ్లి సందడి), గంటా దీప్తి (మీట్‌ క్యూట్‌ వెబ్‌ ఆంథాలజీ), నటి కల్యాణి తదితరులు ఉన్నారు. అలాగే తెలుగులో స్క్రిప్ట్, పాటలు, డైలాగులు రాస్తున్న స్త్రీలు ఉన్నారు. చైతన్య పింగళి, శ్రేష్ఠ, చల్లా భాగ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియాంక, కడలి సత్యనారాయణ వంటి లిరిసిస్ట్‌లు ఇప్పటికే పదుల కొద్దీ పాటలు రాయడం విశేషం.

స్క్రీన్‌ప్లేస్‌
కాలం చాలా మారింది. స్త్రీల ఉద్యమాలు, విద్య, ఉపాధి  స్త్రీలను సినిమా రంగంలో కూడా ప్రయత్నం చేయమంటున్నాయి. స్త్రీల విజయగాధలు ఇప్పుడు కథాంశాలు అయ్యాయి. ‘మేరీ కోమ్‌’, ‘సైనా నెహ్వాల్‌’, ‘మిథాలీ రాజ్‌’ వంటి క్రీడాకారిణుల కథలు తెరకు ఎక్కుతున్నాయి. కరణం మల్లీశ్వరి గుర్తుకు వస్తోంది. ‘మిషన్‌ మంగళ్‌’లో ఆడవారి భాగస్వామ్యం సినిమా అవుతోంది. ‘పింక్‌’ వంటి కథాంశాలతో స్త్రీల హక్కులను చర్చిస్తున్నారు. మగవాడికి ఒక్క చెంపదెబ్బ కొట్టే అధికారం కూడా లేదని ‘థప్పడ్‌’ వంటి సినిమాల్లో చూపిస్తున్నారు. వారి లైంగిక ఉద్వేగాలు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల చర్చకు వస్తున్నాయి. ఇవన్నీ స్త్రీలను సినిమా కథాంశంలోనే కాదు సినిమా నిర్మాణంలో కూడా పాలుపంచుకునే ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఒకప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఒక్క అమ్మాయిని పెట్టుకోవడానికి ఇష్టపడని సినిమా ఆఫీసులు ఇవాళ ప్రతి సినిమాకు ఒకరో ఇద్దరో అమ్మాయిలకు జాబ్‌ ఇస్తున్నాయి. ఆర్ట్‌ డైరెక్టర్లుగా, కాస్ట్యూమ్‌ డిజైనర్లుగా, మేకప్‌ విమెన్‌గా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లుగా స్త్రీలు తమ ఉనికి ప్రదర్శించేంత స్పేస్‌ను తీసుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. చిన్న విజయం కాదు.

అయినప్పటికీ... 
అయితే సినిమా పరిశ్రమ స్త్రీలకు పూలదారిగానే ఉందా? అలా చెప్పలేము. ఇటీవలి ‘మీటూ’ ఉద్యమం సినిమా రంగంలో చాలా మందినే వేలెత్తి చూపింది. స్టూడియోల్లో, ఔట్‌డోర్స్‌లో స్త్రీలకు వారి అవసరాలకు సున్నితత్వాలకు తగినట్లుగా ఏర్పాట్లు జరగడం లేదు. వారి మాటకు విలువ రావాలంటే వారు ఎంతో ప్రతిభ చూపించాల్సి వస్తోంది. నేటికీ పది మంది నిర్మాతల్లో ఇద్దరే మహిళా దర్శకురాళ్ల మీద నమ్మకం ఉంచి ప్రాజెక్ట్‌లు ఇస్తున్నారు. హీరోలు కూడా మరింత ఎరుకతో మహిళా టెక్నిషియన్లను ఎంకరేజ్‌ చేయాల్సి ఉంది. కాని ఇప్పటికి చాలానే జరిగినట్టు లెక్క. స్త్రీలు సినిమా ఆవరణంలో ఉన్నారు. వారు మరింతమంది స్త్రీలను ఆవరణంలోకి తెచ్చుకుంటారు.
భారతీయ సినిమా రంగంలో స్త్రీల జయకేతనం కొనసాగుతుంది.

షీరోస్‌
సమాజానికి ప్రతిబింబమే సినిమా. అది ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. సమాజం ఫలానా విధంగా ఉంటే అదీ ఫలానా విధంగానే ఉంది. దేశానికి పెద్ద, రాష్ట్రానికి పెద్ద, ఆఫీసుకు పెద్ద, ఇంటికి పెద్ద మగవాడు అయినప్పుడు సినిమాకి పెద్ద కూడా మగవాడే అవుతాడు. నాయకుల కథలే ప్రజలు వింటున్నప్పుడు సినిమాలు కూడా నాయక పాత్రల కథలే చెప్పాయి. అయినప్పటికీ శక్తిమంతమైన స్త్రీ పాత్రలను భారతీయ సినిమా రంగం హిందీలోకాని, దక్షణాదిలోగాని నిలబెట్టుకోగలిగింది. ప్రతిభావంతమైన నటీమణుల వల్లగాని, కుటుంబ మనుగడకు ఆధారం స్త్రీ గనుక స్త్రీ ప్రేక్షకులను కూడా ‘వినిమయ వర్గం’గా చూడటం వల్లగాని సినిమాల్లో స్త్రీ ఉనికి నిలబడుతూ వచ్చింది. మహబూబ్‌ ఖాన్‌ తీసిన ‘మదర్‌ ఇండియా’ ఈ మేరకు ఒక ఉదాత్త సందేశం ఇచ్చింది. దక్షిణాదిలో ఈ స్థాయి కథలు లేకపోయినా స్త్రీని సెంటిమెంట్‌కు మూలకారణంగా తీసుకుంటూ వందల సినిమాలు తయారయ్యాయి.

‘చరణదాసి’, ‘సుమంగళి’, ‘నాదీ ఆడజన్మే’, ‘మూగనోము’, ‘దేవత’, ‘చిట్టిచెల్లెలు’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘అమ్మ కడుపు చల్లగా’... వంటివి స్త్రీ కథలుగా వచ్చాయి. కాని అదే సమయంలో టాలెంట్‌ను గ్లామర్‌ను రంగరిస్తూ హీరోలతో సమానంగా సినిమాను శాసించగల స్థితికి హిందీలో నర్గిస్, నూతన్, మధుబాల, మీనాకుమారి, వైజయంతి మాల దక్షిణాదిలో సావిత్రి, జమున, జయలలిత, బి.సరోజాదేవి, వాణిశ్రీ తదితరులు ఎదిగారు. ఒక దశలో టాప్‌ హీరోయిన్ల డేట్ల కోసం హీరోలు పడిగాపులు గాచే స్థితి వచ్చింది. ‘ఇగో’ క్లాషెస్‌ వంటివి దారి తీసి జమునతో ఇద్దరు సూపర్‌స్టార్లు ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌ నటించము అనే నిర్ణయం తీసుకునే వరకు పరిస్థితులు వెళ్లాయి. ఇవన్నీ స్త్రీలు సినిమా పరిశ్రమలో తమ ఉనికిని ప్రతిపాదించడానికి తొలినాళ్లలో చేసిన పెనుగులాటగా చూడాలి.

కెమెరా కన్నులు
సీనియర్‌ దర్శకుడు బి.ఆర్‌.పంతులు కుమార్తె బి.ఆర్‌.విజయలక్ష్మిని భారతదేశంలో తొలి మహిళా సినిమాటోగ్రాఫర్‌గా చెప్పుకోవచ్చు. ఆమె కె. భాగ్యరాజా హీరోగా నటించిన ‘చిన్నవీడు’ (చిన్నిల్లు) వంటి సినిమాలకు పని చేసింది. 40 ఏళ్ల క్రితం ఒక మహిళా సినిమాటోగ్రాఫర్‌ ఉండటం చాలా వింత. ఇవాళ అన్ని భారతీయ సినిమా పరిశ్రమల్లో కలిపి కెమెరా అసిస్టెంట్లుగా, కెమెరా విమెన్‌గా, డీఓపీలుగా పని చేస్తున్న స్త్రీలు కనీసం వందమంది ఉన్నారు. వీరంతా ‘ఇండియన్‌ విమెన్‌ సినిమాటోగ్రాఫర్స్‌ కలెక్టివ్‌’ (ఐడబ్ల్యూసీసీ)గా ఒక గ్రూప్‌గా పరస్పరం మద్దతు ఇచ్చుకుంటున్నారు. ఇవాళ బాలీవుడ్‌లో భారీ సినిమాలకు మహిళా సినిమాటోగ్రాఫర్లు పని చేస్తున్నారు. ప్రియా సేథ్‌ (ఎయిర్‌ లిఫ్ట్, చెఫ్‌), సవితా సింగ్‌ (హవాయిజాదా), ఫౌజియా ఫాతిమా (మిత్ర్‌– మైఫ్రెండ్‌), దీప్తి గుప్తా (హనీమూన్‌ ట్రావెల్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌), తమిళంలో ప్రీతా జయరామన్‌... వీళ్లందరూ తమ కన్నుతో సినిమా చూపిస్తున్నారు. ఏ మాత్రం జంకక క్రేన్‌ షాట్స్‌ను షూట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement