ఫొటోలో కనిపిస్తున్నట్లు అంతరిక్షంలో జెయింట్ వీల్ ఉందని అనుకుంటున్నారా! అది ఓ హోటల్. నిజంగానే అంతరిక్షంలో ఉండనుంది. గ్రూప్ ఆర్బిటల్ అసెంబ్లీ సంస్థ భూ కక్ష్యలో రోబోలను ఉపయోగించి ఓ స్పేస్ హోటల్ నిర్మించనుంది. ఇది చక్రం ఆకారంలో ఉంటుంది. ఈ చక్రం అంచులకు అటాచ్ పాడ్ రూపంలో హోటల్ గదులు ఉంటాయి. ఇందులో ఒకేసారి 400 మంది ఆతిథ్యం పొందచ్చు. వినోదం కోసం అందులో ఒక సినిమాహాల్, బార్, లైబ్రరీ.. ఫిట్‌నెస్ కోసం జిమ్, స్పాలు కూడా ఉంటాయి. వీటిని ఏ ప్రైవేటు సంస్థలైనా నెలకొల్పుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ హోటల్‌లో 20 × 21 మీటర్ల విస్తీర్ణంలో ఉండే గదులను కొనుగోలు చేసి, వ్యక్తిగత గెస్ట్‌హౌస్‌లా కూడా మార్చుకోవచ్చు.
అంతరిక్షంలో ఏ వస్తువూ స్థిరంగా నిలబడదు. మరి ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా.. వెర్నెహర్ వాన్ బ్రాన్ అనే శాస్త్రవేత్త.. కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని స్పష్టించి, అంతరిక్షంలో స్థిరమైన ఆవాసాన్ని ఏర్పరచుకోవచ్చునని ప్రతిపాదించాడు. దీని ఆధారంగా రోబో సహాయంతో ఒక పెద్ద వాయేజర్ స్టేషన్‌ను తయారు చేస్తారు. దాన్ని ఒక పెద్ద వృత్తాకారంలో తిప్పుతూ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని పుట్టిస్తారు. ఇక అక్కడ గదులను నిర్మించి ఆతిథ్యం ఇస్తారు. అంతేకాదు, చక్రం వేగాన్ని ఉపరితలం ఆధారంగా తగ్గిస్తూ, పెంచుతూ.. మరో రెస్టారెంట్‌ను చంద్రుడు లేదా మార్స్‌లో నిర్మించే ఆలోచన కూడా ఉంది. ఇది కాస్త ఫలిస్తే.. త్వరలోనే మనమందరం అంతరిక్షంలో ఆతిథ్యం పొందగలం. అయితే, అక్కడ ఆతిథ్యం పొందాలంటే, రోజుకు ఎంత ఖర్చు అవుతుందో ఇంకా చెప్పలేదు. కానీ, రెస్టారెంట్ పనులను 2025లో ప్రారంభించి, 2027లో స్వాగతం పలుకుతామని సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment