Space hotel
-
అంతరిక్షంలో ఆతిథ్యం, ఎప్పటినుంచంటే..
ఫొటోలో కనిపిస్తున్నట్లు అంతరిక్షంలో జెయింట్ వీల్ ఉందని అనుకుంటున్నారా! అది ఓ హోటల్. నిజంగానే అంతరిక్షంలో ఉండనుంది. గ్రూప్ ఆర్బిటల్ అసెంబ్లీ సంస్థ భూ కక్ష్యలో రోబోలను ఉపయోగించి ఓ స్పేస్ హోటల్ నిర్మించనుంది. ఇది చక్రం ఆకారంలో ఉంటుంది. ఈ చక్రం అంచులకు అటాచ్ పాడ్ రూపంలో హోటల్ గదులు ఉంటాయి. ఇందులో ఒకేసారి 400 మంది ఆతిథ్యం పొందచ్చు. వినోదం కోసం అందులో ఒక సినిమాహాల్, బార్, లైబ్రరీ.. ఫిట్నెస్ కోసం జిమ్, స్పాలు కూడా ఉంటాయి. వీటిని ఏ ప్రైవేటు సంస్థలైనా నెలకొల్పుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ హోటల్లో 20 × 21 మీటర్ల విస్తీర్ణంలో ఉండే గదులను కొనుగోలు చేసి, వ్యక్తిగత గెస్ట్‌హౌస్‌లా కూడా మార్చుకోవచ్చు. అంతరిక్షంలో ఏ వస్తువూ స్థిరంగా నిలబడదు. మరి ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా.. వెర్నెహర్ వాన్ బ్రాన్ అనే శాస్త్రవేత్త.. కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని స్పష్టించి, అంతరిక్షంలో స్థిరమైన ఆవాసాన్ని ఏర్పరచుకోవచ్చునని ప్రతిపాదించాడు. దీని ఆధారంగా రోబో సహాయంతో ఒక పెద్ద వాయేజర్ స్టేషన్‌ను తయారు చేస్తారు. దాన్ని ఒక పెద్ద వృత్తాకారంలో తిప్పుతూ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని పుట్టిస్తారు. ఇక అక్కడ గదులను నిర్మించి ఆతిథ్యం ఇస్తారు. అంతేకాదు, చక్రం వేగాన్ని ఉపరితలం ఆధారంగా తగ్గిస్తూ, పెంచుతూ.. మరో రెస్టారెంట్‌ను చంద్రుడు లేదా మార్స్‌లో నిర్మించే ఆలోచన కూడా ఉంది. ఇది కాస్త ఫలిస్తే.. త్వరలోనే మనమందరం అంతరిక్షంలో ఆతిథ్యం పొందగలం. అయితే, అక్కడ ఆతిథ్యం పొందాలంటే, రోజుకు ఎంత ఖర్చు అవుతుందో ఇంకా చెప్పలేదు. కానీ, రెస్టారెంట్ పనులను 2025లో ప్రారంభించి, 2027లో స్వాగతం పలుకుతామని సంస్థ తెలిపింది. -
అంతరిక్షంలో స్టార్ హోటల్.. స్పెషల్ ఏంటంటే..
భూమి మీద రకరకాల హోటళ్లు చూసాం. మరి అంతరిక్షంలో హోటల్ ఉంటే ఎలా ఉంటుంది? అనుకుంటున్నారా? అయితే మరో ఆరేళ్లు ఓపిక పడితే స్పేస్ హోటల్ని కూడా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్బిటాల్ అసెంబ్లీ కార్పొరేషన్(ఓఏసీ) అనే కంపెనీ ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ స్పేస్ హోటల్ పేరు ‘వాయిజర్ స్పేస్‌స్టేషన్’. సుమారు 400 మందికి ఆతిథ్యం ఇవ్వనున్న ఈ హోటల్లో సకల సౌకర్యాలు ఉంటాయి. మన భూమి మీద హోటల్ రూమ్లకంటే ఈ రూమ్‌లు మరింత అడ్వాన్స్డ్గా ఉండనున్నాయి. వాయిజర్లో బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, లైబ్రరీలు, కచేరీ వేదికలు, హెల్త్ స్పాలు, జిమ్‌లు, స్పేస్‌లో నుంచి భూమినీ చూసేందుకు లాంజ్‌లు, బార్లు కూడా ఉంటాయి. 2025లో ప్రారంభమయ్యే ఈ హోటల్ నిర్మాణం 2027 నాటికి పూర్తవుతుంది. అప్పటినుంచి పర్యాటకులను హోటల్లో బస చేసేందుకు అనుమతిస్తారు. అయితే స్పేస్ హోటల్ ఉన్న వ్యక్తులు గాల్లో తేలకుండా ఉండేందుకు హోటల్ భ్రమణ రేటులో హెచ్చుతగ్గుల ద్వారా కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని ఉత్పత్తి చేసే విధంగా హోటల్‌ను నిర్మించనున్నట్లు ఓఏసీ చెప్పింది. మూన్ ఉపరితలంపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి స్థాయిలో హోటల్ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. దాదాపు ఒక జెయింట్ వీల్ వంటి నిర్మాణంలో ఉండే ఈ హోటల్ 90 నిమిషాలలో భూమి చుట్టూ తిరిగివస్తుంది. వాయిజర్ పర్యాటకులకు అంతరిక్షంలో విహరించిన అనుభూతిని అందించడంతోపాటు, తక్కువ గురుత్వాకర్షణలో స్పేస్ ఏజెన్సీలు చేపట్టే ప్రయోగాలకు ఆవాసంగా ఉపయోగపడనుంది. ఈ హోటల్ నిర్మాణంలో అనుభవం కలిగిన నాసా శాస్త్రవేత్తలతోపాటు పైలెట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు పనిచేయనున్నారు. 2012లోనే వాయిజర్ స్టేషన్ ఐడియా వచ్చింది. అది కార్యరూపం దాల్చేందుకు 2018లో ఓఏసీని ఏర్పాటు చేశారు. అయితే హోటల్ నిర్మాణానికయ్యే ఖర్చు, ఒకరోజు హోటల్లో గడిపేందుకు చెల్లించాల్సిన బిల్లు ఎంత అనేది ఇంతవరకు ఓఏసీ ప్రకటించలేదు. ఆ బిల్లెంతో తెలిస్తే బహుశా గురుత్వాకర్షణ శక్తి పనిచేయదనేమో మరి!