
చక్కనమ్మ చిక్కకపోతే కష్టమే...లాంటి కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకొని, ఆరోగ్యకరమైన రీతిలోనే బరువు తగ్గి సన్నబడి ఆశ్చర్యంలో ముంచెత్తింది పరిణీతి చోప్రా. తాజాగా బాలీవుడ్ సినిమా ‘కేసరి’లో జీవనిగా మెరిసిన చోప్ర రేపోమాపో తెలుగు సినిమాల్లో కూడా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘పక్కా యాక్షన్ సినిమాలో నటించాలని ఉంది’ అంటున్న పరిణీతి మనసులో మాటలు...
అలా చేశాను!
మూడురోజులు వార్తల్లో లేకపోతేనే ‘ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే’ అని గుసగుసలాడుకునే ఇండస్ట్రీ మనది. అలాంటిది ఆ మధ్య పదినెలలు బ్రేక్ తీసుకునేసరికి ఎన్నో గాసిప్స్ వినిపించాయి. అవకాశాలు లేక తీసుకున్న విరామం కాదు అది. నిజం చెప్పాలంటే... నా కెరీర్ గురించి సింహావలోకనం చేసుకోవడానికతీసుకున్న విరామం. ఎలాంటి పాత్రలు నాకు నప్పుతాయి, ఏవీ కావు అనే దాని గురించి విశ్లేషించుకున్నాను. ఈ విషయంలో ఆదిత్యచోప్రా, మనీష్‌శర్మ సహకరించారు. ఫిట్‌నెస్ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.ఇప్పుడు నేను ఛార్జ్ కావడానికి, ఉత్సాహంగా పనిచేయడానికి ఆ విరామమే కారణం. చబ్బీగా ఉంటేనే ఇష్టపడే అభిమానులకు బరువు తగ్గడం నచ్చలేదు అనుకోను. నా బరువులో మార్పే కాని వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు కదా!
మిక్సింగ్!
ఫిట్‌నెస్ అంటే ప్రతిరోజూ, ప్రతిపూటా మనల్ని మనం సవాలు చేసుకోవడం. ఈ సవాలులో మజా అనుభవించకపోతే వర్కవుట్స్ అంటేనే బోర్‌కొడుతుంది. అందుకే ఎప్పుడూ ఒకేరకమైన వర్కవుట్స్ కాకుండా మిక్స్ చేస్తుంటాను. నా విషయానికి వస్తే గంట నుంచి రెండు గంటల వరకు డ్యాన్స్ చేస్తాను. స్విమ్మింగ్ చేస్తాను. కేరళ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు సాధన చేస్తాను.
పాడుతా తీయగా...
సినిమా చూశాం అంటే చూశాం అన్నట్లు కాకుండా ఆ సినిమాలో నుంచి ఏదో ఒక విషయంలో మనం ఇన్‌స్పైర్ కావాలి. ఫలానా స్కర్ట్ ధరించాలనో, ఫలనా హెయిర్‌స్టైయిల్ ఫాలో కావాలనో, ఇలాంటి గుణాలున్న వ్యక్తిని జీవితభాగస్వామిగా ఎంచుకోవాలనో... ఇలా ఏదైనా కావచ్చు.కామెడీ సినిమాలో నటించాలనే కోరిక ‘గోల్‌మాల్’తో తీరినా మంచి యాక్షన్ సినిమాలో నటించాలనే కోరిక బలంగా ఉంది.మ్యూజిక్ అంటే మొదటి నుంచి ఆసక్తి. మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే రోజుల్లో కూడా ఫస్ట్‌ఫ్లోర్‌లో అటు ఇటూ నడుస్తూ పాడేదాన్ని. మ్యూజిక్‌ను సీరియస్‌గా తీసుకుంటాను. ఎన్నో పాటలు పాడాలని, లైవ్ షోలు చేయాలనే కోరిక ఉంది.