లోహ విహంగాల నీడల్లో.. | Human Interested Story In Funday | Sakshi
Sakshi News home page

లోహ విహంగాల నీడల్లో..

Published Sun, Sep 22 2019 8:32 AM | Last Updated on Sun, Sep 22 2019 8:32 AM

Human Interested Story In Funday - Sakshi

రాత్రి పన్నెండు గంటల సమయం ఊరు అలసి పడుకుంది. కానీ ఊరికి దూరంగా ఉన్న ఆ విమానాశ్రయం నిశాచరుళ్లా ఒళ్లు విరుచుకుని ఉత్సాహంగా పని మొదలు పెట్టింది. అంతఃపురానికి రెక్కలొచ్చాయేమో అనిపించే పెద్ద విమానాలు గర్వంగా దివికి భువికి మధ్య తమ ఖో ఖో ఆటను ప్రారంభించాయి. 
ఇద్దరు మనుషులు పట్టేటటువంటి రెండు పెద్ద సూట్‌కేసులు వెంట తెచ్చిన భారీకాయురాలు ఒకావిడ కౌంటర్‌లోని సుకుమారితో గొడవ మొదలుపెట్టింది. 60 కేజీల కంటే ఎక్కువ లగేజీ అనుమతించరని ఆ కౌంటర్‌ సుకుమారి ఈవిడకి నచ్చజెపుతోంది.
‘‘హన్నా! అమెరికాలో విమానాల్లోనే మారుమాట్లాడకుండా ఈ సూట్‌కేసులు ఎక్కించారు. ఇక్కడేంటి?’’ అంటూ జగడ, జగడ, జగడం చేసేస్తోంది. క్యూలో నిల్చున్న నిద్రకళ్ల ప్రయాణికులు విసుక్కుంటున్నారు. ఆవిడకి ఏదో సర్దిచెప్పడానికి వెళ్లిన ఒకరు, ‘మైండ్‌ యువర్‌ బిజినెస్‌’ అన్న అక్షింతలతో వెనక్కి వచ్చారు. 
బిజినెస్‌ క్లాసులో ప్రయాణించే బడాబాబులకు ప్రత్యేక కౌంటర్‌ ఉందిగా. అక్కడ ఏ గొడవా లేదు!
కాఫీ వెండింగ్‌ మెషిన్‌ దగ్గరున్నామెకి నిద్ర ముంచుకొస్తోంది. అంతలో ఎవరో వచ్చి కాఫీకి ఆర్డరిచ్చారు. కప్పులో కాఫీ నింపాక, ‘నో షుగర్‌ ప్లీజ్‌’ అన్నారు. ఆమెకి మండినా కస్టమర్‌ ఫారినర్‌  తెల్లదొరగారు! రాని నవ్వును తెచ్చిపెట్టుకుని, ‘నో ప్రాబ్లవ్‌ు’ అంటూ ఇంకో కప్పు రెడీ చేస్తోంది. ఇలా మేకప్‌లూ అవీ చేసుకుని రాత్రి డ్యూటీలు చెయ్యడం ఇష్టం లేదంటూ ఆ సాయంత్రం భర్తతో జరిగిన గొడవ ఇంకా మనసులో గుచ్చుకుంటూనే ఉంది! కానీ, ఇల్లు గడవాలంటే ఎయిర్‌పోర్టులో గడపాల్సిందే. తప్పదు అనుకుంటూ కాఫీ రెడీ చేస్తోంది. 

ఎయిర్‌పోర్టులో కుర్చీలన్నీ నిండిపోగా, నేలపై కూర్చొని తన ల్యాప్‌ట్యాప్‌లో ఈమెయిల్‌ పంపుతున్న ఆ సుబ్బారావుకి ఈ ప్రయాణం ఇష్టం లేకపోయినా తప్పడం లేదు. ఇంట్లో అబ్బాయికి ఒంట్లో బాలేదు. భార్య కూడా ఉద్యోగస్తురాలే. ఇంక ఎయిర్‌పోర్టుకి ఎవరొస్తారు? 
ఇప్పటికే ఆయన ప్రయాణాలతో మూడు పాస్‌పోర్టు పుస్తకాలు నిండిపోయాయి.అదీగాక ఇప్పుడు ఎక్కవలసిన విమానం నాలుగ్గంటలు లేటట! ఇష్టంలేని ప్రయాణం, ఈ ఒంటరితనం అతన్ని చుట్టుముట్టేస్తున్నాయి. కానీ, అంతలోనే ఏదో గుర్తోచ్చింది. అప్పుడప్పుడు ఎయిర్‌పోర్టులో కనిపించి పలకరింపుగా నవ్వే ‘ఆమె కోసం’ కళ్లు వెదుకుతున్నాయి!
అటు పక్క ఎక్కణ్నుంచో వచ్చి విమానం భూమిపై వాలింది. దీని కెప్టెన్‌ (పైలెట్‌) తన పర్సులోంచి దేవుడి ఫొటో తీసి భక్తితో దండం పెట్టుకున్నాడు. అది చూసిన ‘గగన సఖి’ (ఎయిర్‌ హోస్టెన్‌) అతనికి కళ్లతోనే థాంక్స్‌ చెప్పి, ప్రయాణికులకు చిరునవ్వుతో వీడ్కోలు చెప్పడానికి నిలబడింది. ఇంకాసేపట్లో ఇంటికెళ్లి విశ్రాంతిగా పడుకోవచ్చునన్న ఆలోచన ఆమెకు హాయిగా వుంది. ఆ విమానం ల్యాండ్‌ అయిన విషయాన్ని కంప్యూటర్‌కి తెలియజేశాడు ఓ గుమాస్తా. ఇంటర్నెట్‌ ద్వారా ఆ విషయం కాలిఫోర్నియాలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్‌ గారికి ఈమెయిల్‌ ద్వారా చేరింది. వెంటనే ఆయన బళ్లారిలోని తన సోదరికి ఫోన్‌ చేసి, అమ్మా నాన్న ఇద్దరూ బెంగళూరు చేరినట్టు చెప్పాడు. వాళ్ల నాన్నగారేమో ఇక్కడ విమానంలోని లగేజ్‌ని తీసుకురావడంలోనే ఇంకా నిమగ్నమయున్నారు.

సిల్కు చీర, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్నావిడ విమానంలోంచి గబగబా దిగింది. బయట లాంజ్‌లో ఆవిడ భర్త, సుపుత్రుడు ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. ఈవిడేమో పరుగులాంటి నడకతో ఓ మూలకెళ్లి అటూ ఇటూ చూసి సిగరెట్‌ వెలిగించింది. చిన్నపిల్లలు జీళ్లులాగించినట్టు ఆత్రంగా దమ్ము లాగి, అది పూర్తవ్వకముందే ఇంకో సిగరెట్‌ వెలిగించింది. 
గ్రీన్‌ చానెల్‌ గుండా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఆ ప్రయాణికుడు కస్టమ్స్‌ వాళ్ల చేతికి చిక్కాడు. పర్మిట్‌ కంటే ఎక్కువ ఉన్న డీవీడీ ప్లేయర్లు, హ్యాండ్‌ కెమెరాలు, ల్యాప్‌టాప్, నాలుగు విస్కీ బాటిళ్లు, సూట్‌కేసులో ఉండడంతో ఎనిమిది వందల డాలర్లు ఫైన్‌ కట్టమంటున్నారు. ఆయన బతిమాలి బామాలి టేబుల్‌ కింద రెండు వందల డాలర్లు సమర్పించి సర్దుకుంటున్నాడు. కష్టపడి దక్కించుకున్న వస్తువులతో బయటికి రాగానే ఏదో బట్టల కంపెనీ ప్రచార సుందరి ఇండియాకి సుస్వాగతం అంటూ అతనికి ఓ గులాబీతో స్వాగతం పలికింది. ఏవేవో పేర్లున్న బోర్డులతో ట్యాక్సీవాలాలు ‘ఈయనా లేక ఆయనా’ అన్న చూపులతో ఆత్రంగా వెదుకుతున్నారు. 

ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేని ఎయిర్‌ పోర్టు పనివాళ్లు కొందరు అక్కడ చకచకా పనులు చేస్తున్నారు. కన్వేయర్‌ బెల్టుపై వచ్చిన లగేజీని విమానంలోకి చేరుస్తున్నారు. అలసివచ్చిన అతిథికి మంచినీళ్లిచ్చినట్టు ఎయిర్‌పోర్ట్‌కి చేరిన విమానానికి ఇంధనం నింపుతున్నారు ఇంకొందరు. రకరకాల తినుబండారాలను విమానంలోకి పంపి, అంతకుముందు ప్రయాణికులు వాడిన పాత్రలు గట్రా క్లీన్‌ చేయడానికి పంపుతున్నారు. విమానం నుంచి దిగిన ప్రయాణికులందరినీ తడిమి తడిమి చూసి ఏ అపాయం లేదని నిర్ధారిస్తున్నారు కొందరు. ఇంకొందరు బూట్ల వల్ల పడిన మరకలను మళ్లీ మళ్లీ శుభ్రం చేస్తున్నారు. 
రెండేళ్ల పాటు జర్మనీలో ఉండి, ఇప్పుడే ఇండియాలో దిగిన కుర్రోడొకడు విమానాశ్రయం నుండి నేరుగా దగ్గర్లోని ఉడిపి హోటల్‌కెళ్లి ఇడ్లీ, వడ, దోశ అన్నీ తెప్పించుకుని గబగబా తినడం మొదలుపెట్టాడు. కానీ సర్వర్‌ తెచ్చిన నీళ్లు వద్దని, ‘మినరల్‌ వాటర్‌’ కావాలని అడుగుతున్నాడు. 

విదేశీ ప్రయాణికుడొక్కరు బాత్‌ రూవ్‌ులో టాయ్‌లెట్‌ పేపర్‌ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కొళాయి కింద ఓ మగ్గు ఉండటం చూసి దాన్ని ఉపయోగించడం సరిగ్గా రాక, ఒంటిమీదంతా నీళ్లు చల్లుకున్నాడు. అక్కడింకో విదేశీయుడు ఉట్టి పాస్‌పోర్ట్‌తో దిగాడు. వీసా లేకపోవడంతో ఇమిగ్రేషన్‌ అధికారులు ఆయన్ని ఆపేశారు. బయట పంచతారా హోటల్‌ నుండి పంపిన లగ్జరీ కారు ఈ విదేశీయుడికై వేచి ఉంది. ఇంగ్లిష్‌ రాని ఆ విదేశీయుడు ఏదో భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన్ను వాపస్‌ పంపడానికి ఏర్పాటు జరుగుతోంది. బహుశా!  మొదటిసారి విమానం ఎక్కిన కొత్త ప్రయాణికుడొక్కడు సీటు బెల్ట్‌ ఎలా కట్టుకోవాలో తెలీక తికమక పడుతున్నాడు. ఇదేమీ పట్టని పక్కసీటతను అప్పుడు ప్రయాణంలో చూడ్డానికి సినిమాల పట్టీని సీరియస్‌గా చదువుతున్నాడు. 
అదెలాగో కొన్ని దోమలు విమానంలోకి దూరాయి. అప్పుడే ప్రయాణికులను పరిశీలించటం మొదలెట్టాయి. 

డెబ్బయ్యేళ్ల తుంటరి ముసలాయన అందమైన ఎయిర్‌ హోస్టెన్‌ను టచ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తమ తలపైని లగేజ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఇంకెవరో తమ సామాన్లు సర్దేశారని ఒక చిన్న సైజు పొట్లాట మెల్లగా మొదలైంది. 
లోపల ‘లగేజీల కొంప’లో కొత్త కొత్త లేబుళ్లు తగిలించుకున్న కొత్త, పాత సూట్‌కేసులు మాటా మంతీ లేకుండా మౌనంగా పక్కపక్కనే పడున్నాయి. మూలని సూట్‌కేస్‌లోంచి ఓ బొద్దింక మెల్లిగా బయటికి వచ్చింది. వీసా, పాస్‌పోర్టు గొడవేమీ లేకుండా తెలీని కొత్త దేశంలో ఎవరింటికో చేరడానికి తయారవుతోంది. 
మొదటిసారి ఆఫీస్‌ పనిమీద ఫారిన్‌ ఛాన్స్‌ వచ్చిన కుర్రాడు తన బ్యాగ్‌కి వెయ్యాల్సిన ట్యాగ్‌ ఎలా వేయాలో తెలీక, తబ్బిబ్బవుతున్నాడు. దాన్ని వేయకపోతే విమానంలో ఎక్కనివ్వరేమోనన్న చిన్న అనుమానం! తన బ్యాగ్‌కి ట్యాగ్‌ వేస్తున్న తోటి ప్రయాణికుడికి దగ్గరగా జరిగి, తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తే ఆయన అనుమానంగా చూస్తూ దూరంగా వెళ్లాడు. 
అప్పుడే విమానంలోంచి దిగిన ఆ ఇరవై అయిదేళ్ల అందగాడు, తన ఫియాన్సీకి మొబైల్‌ ద్వారా ‘హాయ్‌’ చెప్పాడు. బయట లాంజ్‌లో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో ఈ వరుడి కోసం ఎదురుచూస్తోంది. అతనితో ఇంటర్నెట్‌లో మాట్లాడి ఒప్పేసుకుంది.

‘చూడకుండా ఎలాగమ్మా ఓకే చెప్పేది’ అని గొణుక్కుంటూనే ఈయనగారూ పెళ్లికి ఒప్పుకున్నాడు. అందుకని విమానం దిగగానే బాత్రూమ్‌కెళ్లి డ్రెస్‌ మార్చుకుని లండన్‌ హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో కొన్న ఖరీదైన సెంటు రాసుకుని,  ఉత్సాహంగా ‘చూపులు కలిసే శుభవేళ’కు తయారవుతున్నాడు. 
విమానంలో ప్రయాణానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్కరు తప్ప. ‘కోమల్‌ కులకర్ణి’ అని మైక్‌లో పిలుస్తున్నారు. వాకీ టాకీలతో సిబ్బంది అటూ ఇటూ తిరుగుతూ ‘ఇంకా కనపడని ఆ కోమల్‌ కులకర్ణి’ కోసం వెదుకుతున్నారు. 
ఇంతలో చురుకైన ఓ అమ్మాయి ఆ కోమల్‌ కులకర్ణిగారిని కనిపెట్టేసింది! ఎనభై యేళ్ల ఆ ముసలాయన్ని ‘ఎవ్రీ బడీ ఈజ్‌ వెయిటింగ్‌ ఫర్‌ యూ’ అంటూ గద్దిస్తోంది. ‘‘క్షమించండి. నాకు ఇంగ్లిష్‌ రాదమ్మా. మా అబ్బాయి టికెట్‌ చేతిలో పెట్టి, ఎటో వెళ్లాడు’’ అంటూ ఆయన పరుగులాంటి నడకతో ఆమెను అనుసరించాడు. 
అటు పక్క ఇంకో వృద్ధుడు నెమ్మదిగా మోకాళ్లపై కూర్చొని టోపీ పెట్టుకొని ప్రశాంతంగా నమాజు మొదలుపెట్టాడు.
ఓ పక్క కొత్త దంపతులు తమ మొదటి విదేశీ ప్రయాణానికి బంధుమిత్రులతో వచ్చారు. ‘‘అమ్మాయి అడుగుపెట్టిన వేళా విశేషం చాలా బావుంది. అప్పుడే అబ్బాయికి ఫారిన్‌ ఛాన్స్‌ వచ్చిందని’’ పొగడ్తలు వినపడుతున్నాయి. అమ్మాయి తల్లిదండ్రుల కళ్లలో కనపడీ కనపడని కన్నీళ్లు. వెళ్లగానే ఫోన్‌ చేయమని చెప్పింది అమ్మాయి తల్లి. కన్నీళ్లు నిండిన కళ్లతో తలూపింది ఆ కొత్త పెళ్లికూతురు. భారంగా విమానంలోకి అడుగుపెట్టగానే లోపల కనపడ్డ తన ఫేవరేట్‌ సినీతారని చూడగానే దుఃఖం మరచిపోయి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.  బయట ఆమె వదిలిపెట్టిన లగేజ్‌ ట్రాలీ అనాథగా మిగిలిపోయింది, ఆమె పుట్టింటి జ్ఞాపకాల్లాగ.

చేతిలో చిన్న పొట్లాన్ని పట్టుకుని ఓ ముసలాయన ‘‘షికాగోకి వెళ్తున్నారా? మా అమ్మాయికి పంపాలండి. హోమియోపతి మందులు. చాలా అర్జెంట్‌ సార్‌. తనే ఎయిర్‌పోర్ట్‌కి వస్తుంది. ప్లీజ్‌’’ ఒకరిద్దర్ని బతిమాలుకుంటున్నాడు. ఆ చిన్ని సీసాల్లో తెల్ల మాత్రల్ని ఏదో డ్రగ్స్‌ అన్నట్టు అనుమానిస్తున్న వాళ్లు మొహాలు తిప్పుకుంటున్నారు. పాపం, ఆ ముసలాయన ఆదుర్దాగా, పరుగులాంటి నడకతో మరొకర్ని రిక్వెస్ట్‌ చేయడానికి వెళ్లాడు. 
కుడివైపుకు కొంగు కప్పుకున్న ఓ గుజరాతీ మహిళ దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది. వెక్కిళ్లతో కదిలిపోతోంది. ఆమె చుట్టూ ఉన్న బంధువులు ఆమెను ఓదార్చుతున్నారు. ఫ్రాంక్‌ ఫర్ట్‌లో దిగి ఇంకో విమానంలో ఎక్కడం గురించి ఓ బంధువు ఆమెకు జాగ్రత్తలు చెపుతున్నాడు. అంత దుఃఖంలోనూ ఆమెను ఈ ప్రయాణం భయపెడుతోంది. ఇంతవరకు ప్రతి సంవత్సరం అబ్బాయే ఇండియాకు వచ్చి అమ్మని చూసి వెళ్లేవాడు. కానీ దూర దేశంలో జరిగిన కారు ప్రమాదంలో అబ్బాయిని పొట్టన పెట్టుకుంది. ఇక ఎన్నడూ రాని కొడుకుని చూడ్డానికి కొండంత దుఃఖాన్ని తోడు తీసుకుని వెళుతోంది ఒంటరైపోయిన ఆ ‘అమ్మ’. బహుశా ఇది ఆమెకు మొదటి ‘ఒంటరి ప్రయాణం’.

రయ్‌మనే శబ్దంతో విమానం తన భారీ దేహాన్ని రన్‌వే వైపుకి మెల్లిగా కదిలించింది. నిదానంగా వేగంగా పుంజుకుంటోంది. లోపల ప్రయాణికుల రణగొణ ధ్వనులు సర్దుకున్నాయి. ఇంకా ఇంకా వేగం పెంచుకుంటూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. ఒక్కసారిగా ఒళ్లు తేలికై, ఎన్నోసార్లు ప్రయాణించిన వారికైనా చిన్నపాటి భయం, గగుర్పాటు కలిగించింది. అంతా సవ్యంగా జరిగింది. ధైర్యంగా, పక్షులే నివ్వెరపోయేలా హాయిగా ఎగురుతోంది విమానం. కానీ అంత భారీ విమానం కూడా చిన్న ‘పక్షి దెబ్బ’కు తట్టుకోలేదని పాపం చిన్న పక్షులకి అస్సలు తెలీదు. 
అందరి ఆదుర్దాలు, భయాలు, సంతోషాలు, జ్ఞాపకాలు అన్నీ వెనక్కి వదిలినా, ఆ వృద్ధుడు కూతురికై పంపిన హోమియోపతి మందులను, అతని మమకారాన్ని, చివరగా కన్నకొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి దుఃఖాన్ని వదలలేక తనలోనే మోస్తూ భారంగా దూరంగా ఎగురుతోంది ఆ లోహ విహంగం.

కన్నడ మూలం : వసుధేంద్ర
తెలుగు: బదరి రూపనగుడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement