రాఘవరావు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయిన వాడు. నిజాయితీగా పనిచేసి సంసార బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని, నెమ్మదిగా దైవచింతన వైపు మనసు మళ్ళించుకుని, కాలక్షేపం చేస్తున్నాడు. తనకొచ్చే పింఛనుతో జాగ్రత్తగా తనకీ, తన భార్యకి కావాల్సిన అవసరాలు తీర్చుకుని కాలం గడుపుతున్నాడు.
పొద్దున్నే సంధ్యావందనం, గాయత్రీ చేసుకోవడం, విష్ణు సహస్రవో, హనుమాన్ చాలీసానో చదువుకోడం...అలా మొత్తానికి పూజా, పురస్కారాలన్నీ అయితేనే గానీ కాఫీ కూడా తాగక పోవడం..అలా ఏదో నియమాలు పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాడు.
కానీ ఆయనకి కొన్ని జవాబు దొరకని ధర్మ సందేహాలు అంతర్గతంగా ఉండిపోయాయి.
ఆయనకి ఒకటే గట్టి కోరిక. ‘ఎలాగైనా సరే దేవుడితో ఒకసారి మాట్లాడగలిగితే!’ అసాధ్యం అని తెలిసినా ఎందుకో గానీ ఆ కోరిక నెమ్మది, నెమ్మదిగా పెరిగి పెద్దదై అదొక అబ్సెషన్‌లా తయారయింది.
ఎంతో మందికి తన కోరిక గురించి చెప్పాడు. అడిగాడు, తన కోరిక సాధ్యపడాలంటే ఏం చెయ్యాలని.
‘ఇదేం పిచ్చి రాఘవరావ్, నీకు? మానవ మాత్రులం మనం. కొన్ని జన్మలు తపస్సు చేసినా ఇది సాధ్యపడేదేనా! అదృష్టం కొద్దీ నీకు భగవంతుడి మీద మనసు మళ్ళి..పూజ అవీ నిష్ఠగా చేసుకోడం అలవాటైంది. అంతే ..అంతకు మించి అత్యాశ పడకు. ఈ పిచ్చి ఆలోచనలు మానేయ్’ అని స్నేహితులూ..
‘మేం నిత్యం భగవరాధనలోనే మునిగి ఉంటాం. ఆయనకి మన కోరికలు చెప్పుకుని అవి జరిగేలా చూడమని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోడం తప్ప ..ఇంకేం చెయ్యాల్సిన అవసరం లేదండీ. ఎప్పుడైనా ఆయనకి మనమీద దయ కలగాలని, కోరుకోవడం తప్ప, మీరనుకుంటున్నట్టుగా, జరగడం అసాధ్యం’ అని చీవాట్లు పెట్టిన పూజారిగారు..
‘అలా అనుకోవడం దుస్సాహసం, దురాశ , దుర్మార్గం’ ఆవేశంగా రొప్పుతూ అన్న కొందరు ప్రవచనకర్తలు...
మొత్తానికి చీవాట్లు, మొట్టి కాయలు పడి, రాఘవరావు సైలెంట్ అయిపోయాడు కానీ,మథన పడ్డం ఆపలే...
∙∙
ఎందుకో ఆరోజంతా అన్యమనస్కంగా, ఆదుర్దాగా అనిపించింది రాఘవరావుకి. అలాగే అలవాటు ప్రకారం రాత్రి తొందరగా భోజనం చేసి పడుకున్నాడు.
ఎంతో సేపు దొర్లిన తర్వాత కలత నిద్ర పట్టింది.
ఆ నిద్రలోనే ఒక బ్రహ్మాండమైన కల...ఆ కలలో..
ఆజానుబాహుడు, విశాల నేత్రాలతో స్ఫురద్రూపియైన ఓ మహానుభావుడు కనిపించాడు.
ఆయన్ని చూడగానే అప్రయత్నంగానే చెÄðæ్యుత్తి నమస్కరించాడు రాఘవరావు.
‘ఏం రాఘవయ్యా నిద్ర పట్టట్లే ?’ అడిగాడాయన. ఎంతో మృదుమధురంగా ఉంది ఆయన గొంతు.
‘లేదు,స్వామీ..ఎందుకో తెలియదు. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా?’
‘అదేంటీ, నన్ను చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానవు కదయ్యా! అందుకే వచ్చాను’ చిద్విలాసంగా అన్నాడు ఆ మహనీయుడు.
‘తండ్రీ నువ్వా! ధన్యుడ్ని...నన్ను కనికరించావా స్వామీ’ రాఘవరావు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
‘అవునయ్యా, నేనే! నన్నేదో అడగాలనుకున్నావుగా అడుగు’
‘అదేంటి స్వామీ, ఇలా ఉన్నారు? నాలుగు చేతుల్తో శంఖం, చక్రం, గద, బాణాలతో ఉండాలి? ఇంత సింపుల్‌గా ఉన్నారేంటీ?’ ఆశ్చర్యంగా అడిగాడు రాఘవరావు.
‘ఇదేనయ్యా మీతో వచ్చిన గొడవ. నన్ను,నన్నుగా చూడకుండా, ఏవేవో ఆపాదించి, ఇలా ఉండాలి, అలా లేడేవిటీ? అంటూ ,అనుమానపడ్తూ ఆస్వాదించాల్సినది వదిలేసి, బాధ పడుతూ ఉంటారు. నేను కూడా హాయిగా రెండు చేతులూ,రెండు కాళ్ళు, ఒకే ముఖంతో ఉంటాను. మిగతావన్నీ..సింబాలిజంగా, మీ ఊహని జోడించి మీరు తయారుచేసిన నా రూపాలు.అంతే’ నవ్వుతూ అన్నాడు దేవుడు.
‘స్వామీ విశ్వం అంతా నిండి ఉన్న వాడివీ...ఆది అంతం లేని వాడివి..నీకు పుట్టిన రోజు ఏవిటి స్వామీ? నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే!’
‘ మీ ఏడాది, మాకు ఒక రోజుతో సమానం గదా.. అందుకే మీరు నన్ను రోజూ పలకరించడం కోసమేగదా, ఈ పుట్టినరోజు వేడుక. అది మీకు ఓ సరదా. మాకు వినోదం’
‘నువ్వు నిద్రపోవడం. మేము నిన్ను సుప్రభాతంతో లేపడం..చోద్యంకాపోతే !! నువ్వు నిద్రపోవడం ఏవిటి స్వామీ?’
‘నాకు అర్థం అయినదేవిటంటే..అది మిమ్మల్ని మీరు ప్రచోదనం చేసుకుంటున్నారు.. జాగృతం చేసుకుంటున్నారు అని. అయినా నాక్కూడా హాయిగా ఉంటుందయ్యా అవి వింటుంటే. తెల్లవారుజామునే మీరు లేచి, నా ముందర కూర్చుని,శ్రుతిగా నన్ను కీర్తిస్తుంటే...’
‘స్వామీ మీక్కూడానా?’
‘ఎందుకుండదూ ? మీరు లేనిపోనివన్నీ ఆపాదించుకుంటూ..అబద్ధాలని, నిజాలు చేస్తూ, సొంత డబ్బా కొట్టుకోగాలేంది..నేను చేసినవి, మీరు చెపుతూంటే, వినడానికి బావుండదా ? ఆ ఇంకా ?’
‘నేను అప్పుడప్పుడు ఆఫీస్ నించి ఇంటికి వెళ్తూ , గుడి మూసే టైం అయ్యింది అని, ఇంటికెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకోకుండా, అలానే వచ్చి నీ దర్శనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి స్వామీ. నన్ను ఇంట్లోనూ, బయట కూడా తిడుతూ ఉంటారు. నీ గుడికొచ్చినపుడు, స్నానం చేసి మడిగానే రావాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఉంటే బావుంటుంది కదా’
‘ఇది మరీ బావుంది,రాఘవయ్యా! నేను రమ్మన్నానా? మీకు అవసరమై వస్తున్నారా? అయినా మీ భాషలో చెప్పాలంటే అది ఓ డ్రెస్ కోడ్. దేనికయినా అది అవసరం కదా? ఎవరింటికైనా శుభకార్యాలకి వెళ్తున్నప్పుడు మంచి దుస్తులు వేసుకెళ్తారు. ఆడవారు నగలుపెట్టుకుని అలంకరించుకుని వెళ్తారు. ఆ కార్యక్రమానికి అలా వెళ్ళడం సబబు. అదే ఎవరింటికైనా సంతాపం తెలియచెయ్యడానికి అలా వెళ్తారా?
ఒక పనిమీద వెళ్లేటప్పుడు నీ వస్త్రధారణ కూడా చాలా ముఖ్యం. అది నువ్వు ఆ పనికీ,ఆ వ్యక్తికీ ఇచ్చే గుర్తింపు, గౌరవం, విలువ అన్నీ ప్రతిబింబిస్తాయి. ఒక ప్రవిత్రమయిన కార్యాక్రమానికి, వెళ్ళేప్పుడు మనసా, వాచా, కర్మణా చెయ్యాలని చెపుతారు..అదే ఈ డ్రెస్ కోడ్ ముఖ్య ఉద్దేశం.
కానీ ఒక విషయంలో నాకు తృప్తిగా ఉందయ్యా. ఈ కొత్త జనరేషన్ వాళ్ళు, చిన్న వాళ్ళు అయినా కాస్త భక్తి,పూజా, పునస్కారం లాంటివి అలవాటు చేసుకోడం.. అవీ చూస్తుంటే ముచ్చటేస్తోంది! ఒక మంచి పని చేయాలనుకోవడం, చెయ్యడం ముఖ్యం. ఎలా చేసారు, చేస్తున్నారనేది తరువాతి దశ. కానీ ఒకటి! చెయ్యగలిగీ, చెయ్యకపోవడం తప్పు. అది ఒక జాడ్యం లా తయారవుతుంది. అందుకే కొన్ని రూల్స్ పెట్టడం అయింది. ఇంకో విషయం ఏంటంటే మీకు ఒక్కసారి రవ్వంత వెసులుబాటు ఇస్తే, ఇంక అదే అలవాటుగా చేసుకుంటారు. ఇవన్నీ ఆలోచించే, మీ పెద్దలు ఈ రూల్స్ పెట్టారు.’
‘ఇంకో విషయం స్వామీ..చాలాసార్లు ఆఫీస్‌కి వెళ్తూ, ఏదో ఒక స్తోత్రం చదువుతూ ఉండడం అలవాటు. ఆ టైం లో బండి నడుపూతూనో, బస్, ట్రైన్ లలో వెళ్తూనో ఉంటాను. అందువల్ల షూస్,చెప్పులూ తీసి చదవడం కుదరదు. నువ్వేవనుకుంటావో అని మనసు పీకుతూ ఉంటుంది.’
‘ఇంతకు ముందు చెప్పినట్లుగా, నువ్వు చెయ్యడం ముఖ్యం. చెడు ఆలోచనలు రాకుండా, ఎవరి గురించీ, తప్పుగా ఆలోచించకుండా, ఊరికే చెత్త మాట్లాడకుండా, నాగురించి ఆలోచిస్తూ, నా స్తోత్రం చదవడం కంటే కావాల్సిందేం ఉందయ్యా! ఎ స్మాల్ డీడ్ ఈస్ బెటర్ దాన్ ఎ గ్రాండ్ ఇన్‌టెన్షన్. మంచి పని చేస్తున్నావు. తప్పులేదు’
‘ఏవనుకోక స్వామీ, ఈ ప్రశ్న అడుగుతున్నందుకు..ద్వాపర యుగంలో నీకు తెలిసీ, నీ ముందరే ఎన్నో దారుణాలు జరిగాయి...నువ్వు తలుచుకుంటే అవి ఆపగలిగేవాడివి కదా ! ఎందుకు వదిలేసావు?’
‘మాయా జూదంలో పాండవులు ఓడిపోవడం, ద్రౌపది వస్త్రాపహరణం, లక్కఇల్లు దహనం.. భీష్మ,ద్రోణాచార్యుల మౌనం..అభిమన్యుడి చావు, ఉపపాండవుల వధ.. ఇవన్నీ చాలా అన్యాయంగా అనిపిస్తాయి. నువ్వు వారి పక్కనే ఉన్నావు.. వారితోనే తిరిగావు..నీ ప్రభావం వారిమీద ఉండాలిగా? వద్దనుకున్నా సరే..నీతో మాట్లాడగానే వాళ్ళు మారాలిగా? ఎందుకలా జరగలే ? భీష్ముడు, ద్రోణుడు కూడా ఏంచెయ్యలేక పోవడం ఆశ్చర్యం. వాళ్ళు కూడా కర్ణుడిలాంటి వాళ్ళే కదా? నువ్వేమో కర్ణుడుని ఎక్కువ శిక్షించావనిపిస్తుంది, స్వామీ! ఎందుకా పక్షపాతం నీకు ?’
దేవుడు కాసేపు ధీర్ఘాలోచనలో పడి మౌనంగా ఉండిపోయాడు..‘ఏవో అనుకున్నాను,రాఘవయ్యా! నువ్వు ఘటికుడివే!! మంచి ప్రశ్నే. దీనిని కొంచెం నీకు అర్థం అయ్యేలా సింపుల్ గా చెప్పాలి. నా ప్రతి అవతారానికి ఒక పరమార్థం, ఒక అవసరం ఉందని ఒప్పుకుంటావా? ప్రతి యుగం లోనూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేదే నా ఎజెండా. జరిగినవన్నీ, జరిగే వన్నీ, జరగబోయేవీ నా అధీనంలోనే ఉంటాయి..నేను పొందుపరిచే టైం టేబుల్ ప్రకారం నడుస్తాయి. అధర్మం మీద ధర్మం చేసే యుద్ధంలో కొన్ని సార్లు అమాయకులు, వాటితో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు బలి అవడం జరుగుతూంటుంది. ఇది ఆనాటి నించి ఈనాటి దాకా చూస్తునే ఉన్నాం కదా. కొన్ని కొన్ని పాత్రల నిడివి చాలా తక్కువ ఉంటుంది ఈ జగన్నాటకంలో !
ఇక భీష్ముడు, ద్రోణుడు నుంగతి, నువ్వు వినే ఉంటావు.. చాలాసార్లు ధృతరాష్ట్రుడికీ, దుర్యోధనుడుకీ హితబోధ చేసారు..కానీ వాటిని వాళ్ళిద్దరూ పెడచెవిన పెట్టడం కూడా నీకు తెలుసు. కాకపోతే వాళ్ళిద్దరూ, తమ తమ కర్తవ్యాలకి బద్ధులై,బాధ్యులై ఉండి రాజుకి ఎదురు చెప్పలేక అసహాయులై ఉండి పోయారు.
కర్ణుడు అలా కాదు. దుర్యోధనుడు అతనిని చాలా నమ్మాడు. అతని సలహాలు తీసుకున్నాడు. కర్ణుడు, దుర్యోధనుడికి ఎప్పుడూ మంచి చెప్పలే. తనని ఆదరించాడు, ఒక ఐడెంటిటీ కల్పించాడనే ఒక కారణంతో అన్ని తప్పుడు పనుల్లోనూ సహకరించాడు. తనూ చేసాడు. ఈ ఒకే ఒక్క వీక్ నెస్ వల్ల అతని మిగతా మంచి లక్షణాలు అన్నీ మరుగున పడిపోయాయి. భీష్ముడు అలా కాదు. మొదటినించీ ధర్మాన్నే పాటించాడు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలే. నామీద నమ్మకం ఉంచాడు. తన కర్తవ్యాన్ని పాలించాడు’
‘స్వామీ.. ఈ సృష్టినంతా నువ్వే డిజైన్ చేసావు. నువ్వు ఇందాక చెప్పినట్లుగా అంతా ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం నడిపిస్తున్నావు. అలాంటప్పుడు, ఈ అసమానతలు,రంగుల భేదాలు..కట్టుబాట్ల తేడాలు, భిన్నవైన ఆలోచనలు, విభిన్నమైన. అలవాట్లు..ఆవేశాలు, ద్వేషాలు, చంపుకోడాలు, మోసాలు..ఇవన్నీ ఎందుకు స్వామీ? అంతా ఒకేలాగా, హాయిగా, ఆనందంగా ఉండేటట్లు ఎందుకు చెయ్యలే?’ కొంచెం ఉద్వేగంతో అడిగాడు రాఘవరావు.
దేవుడు ముందు ఆశ్చర్య పోయాడు. ఏదో సరదాగా నడుస్తున్న ప్రశ్నలు– జవాబుల కార్యక్రమం కాస్త గాంభీర్యాన్ని సంతరించుకునే సరికి! తర్వాత కాసేపు ఆలోచించాడు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
తర్వాత, నెమ్మదిగా,మృదువుగా ఒక చిన్న పిల్లవాడిని సముదాయిస్తున్నట్టు, ఒక లేగదూడని నిమురుతున్నట్టూ..ఒక లేత గులాబీని స్పృశిస్తున్నట్టూ చెప్పాడు!
‘చూడు రాఘవరావు..ఈ సృష్టినంతా తయారు చేసేటప్పుడు..నేనొక రకమైన తన్మయత్వం చెందానయ్యా! ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. నేను సృష్టించే ఈ ప్రాణికోటిని చూసి నేనే ఆచ్చెరువొందాను!
నా చేతుల్లోంచి ప్రాణం పోసుకుంటున్న అద్భుతాన్ని చూసి గర్వపడ్డా! ఎన్ని ఆకృతులూ, ఎన్నెన్ని వర్ణాలు, ఎంత అందం, ఎంతెంత రమణీయం!
ఇన్ని కోట్ల ప్రాణుల్ని సృష్టించిన ఏ రెండిటికీ పోలిక లేకుండా ప్రతి ఒక్కటీ ఒక అపు‘రూపంగా’..దానికదే సాటిగా.. అలా ఒక్కొక్క శిల్పం,ప్రాణం పోసుకుంటున్నకొద్దీ..నా భావావేశాలు పుణికి పుచ్చుకుని నా ప్రతిరూపాలుగా, వాటిని చూసుకుంటున్న కొద్దీ..నేను మైమరచి పోయేవాణ్ణి..నా ముందు ఆవిష్కరింపబడుతున్న అద్భుతాన్ని చూసి ఓ శిల్పకారుడు, ఓ చిత్రకారుడిలా మురిసి పోయే వాడ్ని..కించిత్తు గర్వం కూడా కలిగేది. ఒకే రకంగా మూస పోసినట్టుగా తయారు చెయ్యడానికి, నేనెందుకయ్యా..మీరు, మీ ఫాక్టరీలు ఉన్నారుగా? నేను సృష్టించిన మనిషి మారిపోయాడు..పాడైపోయాడు. నేను ఇచ్చిన వాటితో సంతృప్తి చెందడం మానేసాడు. పంచభూతాలతో చెలగాటం ఆడడం మొదలుపెట్టాడు. నా సహనాన్నే పరీక్షించడం మొదలెట్టాడు. నేను ఎన్నో రకాలుగా వార్నింగ్ ఇచ్చాను. వినలేదు. నన్ను మించిపోయి, నాకంటే గొప్పవాడని అనుకోవడం మొదలు పెట్టాడు. తన నాశనానికి ,తానే కారణం అవుతున్నాడు’
‘నువ్వు మా అందరికీ ఒక ఎక్సై్పరీ డేట్ కూడా ఇచ్చి పంపిస్తే ఏ సమస్యా లేకుండా పోతుంది కదూ స్వామీ’
‘నేను మీకిచ్చిన జీవితం అనే వరానికి ఉన్న గొప్ప విశేషం మీ పుట్టుక, మీ చావు రెండూ కూడా ఊహించినట్టుగా జరగకపోవడమే!! దాన్లో నే మీ జీవితం యొక్క మిస్టరీ దాగుంది. అవి తెలిసిపోతే ఇంకేవుందీ? నేనుకూడా మీలాగే సిజేరియన్ చేసి అనుకున్న టైంకి డెలివరీ చేయడం, మెర్సీ కిల్లింగ్‌తో కావల్సినప్పుడు ప్రాణం తీయడం చేస్తే ఇంక తేడా ఏముంటుంది?
అన్ని దశలూ దాటుకుంటూ, ఛేదిస్తూ, ముందు కెళ్తున్నప్పుడు ఉండే ఉత్తేజం,ఆనందం, ఆ ఆశాభావం మీ జీవితం ఇంకొన్నాళ్ళలో ముగిసిపోతుంది అని తెలిసినప్పుడు ఇంకెక్కడ ఉంటాయి?’
‘స్వామీ, ఇంకొక్కటి..సత్యప్రమాణంగా ఇది చివరిది..నేను నిన్ను మళ్ళీ చూడగలనో లేదో... నాకోసం నువ్వొస్తావో రావో’
‘సరే, కానీ’ అన్నాడు దేవుడు..
‘నాకొకసారి, కలొచ్చింది. ఆ కలలో నా జీవితంలోని ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు .అన్నీ ప్రతిబింబిస్తున్నట్టు..ఆ నా జీవనగమనంలో నాలుగు పాదాల ముద్రలు కనిపించాయి. రెండు నావి, రెండు నీవి, అని అనుకుని ఎంతో ముచ్చట పడ్డాను.. నువ్వు నా పక్కనే ఉండి నడిపిస్తున్నావని! కానీ, చాలా చోట్ల రెండు పాదాల గుర్తులే కనిపించాయి..అవన్నీ కూడా నేను గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను భయంకరమైన సమస్యల్లో ఉండి, ఇంక జీవితం చాలిద్దాం అనుకున్నప్పుడు! నాకు చాలా బాధేసింది.. సరిగ్గా నీ సహాయం నాకు అవసరం అయినప్పుడే నువ్వు నా పక్కన లేవు. అలా ఎందుకు స్వామీ, నన్ను ఎందుకు వదిలేసాను?’ దీనంగా అడిగాడు రాఘవరావు. ‘పిచ్చివాడా, నువ్వు అలిసి,సొలిసి పోయుంటే జాలేసి..నిన్నెత్తుకున్నా.. నువ్వు సేద తీరుతూ ఆ చెడు కాలాన్ని దాటేవరకూ, నువ్వు నా చేతుల్లో ఉన్నావయ్యా!’ నవ్వుతూ అతన్ని కౌగిలించుకొని చెప్పాడు దేవుడు.
‘అయ్యో స్వామీ నేనెంత మూర్ఖుణ్ణి..నిన్ను అర్ధం చేసుకో లేకపోయా’ బావురుమన్నాడు రాఘవరావు!
‘అదే రాఘవయ్యా నేను ఇందాకటి నుంచీ చెప్పేది. నేనంటే ఒక నమ్మకాన్ని. నేనంటే ఒక విశ్వాసాన్ని. నేను ఒక సదుద్దేశాన్ని. ఒక ఆలోచనని.పసిపిల్లవాడు నువ్వు పైకెగరేసినప్పుడు, నువ్వు మళ్ళీ తిరిగి పట్టుకుంటావనీ, పట్టుకోగలవనీ.. ఎంత దృఢవిశ్వాసంతో ఉంటాడో.. మీరు అలా నామీద విశ్వాసం ఉంచినప్పుడే నేను మీకు కనిపిస్తాను కానీ ఇలా కాదు. కొన్ని నమ్మకాలకి తార్కాణాలే ఉంటాయి...భౌతికంగా కనిపించాల్సిన అవసరంలేదు!’
‘స్వామీ, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావ్ ?’
‘చూద్దాం..నేను రాలేకపోతే, నువ్వే నాదగ్గరికి వద్దుగానివిలే’ గుంభనంగా నవ్వుతూ అంతర్ధానం అయిపోయాడు దేవుడు.
∙∙
‘ఏవండీ,లేవండీ...బారెడు పొద్దెక్కింది. ఎప్పుడూ లేంది, ఏవిటివాళ్ళ?’ అంటూ మర్నాడు పొద్దున్నే రాఘవరావు భార్య, ఆయన ఇంకా లేవకుండా పడుకునే ఉంటే కదుపుతూ ఆయన్ని లేపే ప్రయత్నం చేసింది. ఎందుకో అనుమానం వచ్చి ఆయన్ని తేరిపారా చూసింది.
ఆయన మొహంలో మునుపెన్నడూ లేని ప్రశాంతత..చేతులు రెండూ జోడించి గుండెలమీద పెట్టుకునున్నారు. ఆయన తనకికలేరు అని అర్థం అయిందావిడకి!
దేవుణ్ణి దర్శించి, దేవుడితో మాట్లాడి, తన దేవుడి దగ్గరకే వెళిపోయాడు రాఘవరావు. సమాధానంలేని ప్రశ్నలా మిగిలి ప్రశ్నించాల్సిన, అవసరంలేని,సమాధానాన్ని వెతుక్కుంటూ!
- అశోక్ కుమార్ సోమంచి
దేవుడు కనిపించిన రోజు...
Published Sun, Jun 30 2019 8:43 AM | Last Updated on Sun, Jun 30 2019 8:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment