ఊళ్లో రచ్చబండ మీదో, టీస్టాల్ టేబుళ్ల దగ్గరో జరిగే టైంపాస్ ముచ్చట్లను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అలా అని ‘సీరియస్’ విషయాల మీద డిస్కషన్ జరగదు అనుకుంటే తప్పులో కాలేసినట్లే!
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన నుంచి మొదలు ‘నాసా’ వరకు రకరకాల విషయాలపై డీప్‌గా చర్చ జరుగుతుంది. అందులో నిజం ఉందా? ఊహ మాత్రమే ఉందా? అనేది వేరే విషయంగానీ... వినబడానికి మాత్రం ఈ టైంపాస్ ముచ్చట్లు బహు కమ్మగా ఉంటాయి.
సాయంత్రం అలవాటు ప్రకారం ఎప్పటిలాగే నా మిత్రుడితో కలిసి మా అమ్మమ్మ వాళ్ల ఊరు మద్దూరుకు వెళ్లాను. ఆ ఊళ్లోని ఏకైక రాజస్థాన్ హోటల్‌లో నా మానాన నేను మాడిపోయిన పకోడీలు తింటున్నాను. బయట జోరుగా వర్షం కురుస్తోంది. ఇంతలో నలుగురు గొర్రెల కాపరులు వర్షంలో తడుస్తూ హోటల్‌లోకి వచ్చారు. వీళ్లలో భిన్న వయస్సులకు చెందిన వారున్నారు. మా టేబుల్ పక్కనే వారూ కూర్చున్నారు. వారు కూడా పకోడీలు టీ ఆర్డర్ చేశారు. వాళ్ల సంభాషణ సాగిందిలా...
‘‘ఇదేమి వానరా దేవుడా.. ఆగుతనే లేదు. వాన పాడుగాను. అప్పుడేమో రాకేడ్తిమి. ఇప్పుడేమో పోక ఇంకో బాధ మోపైంది. పత్తి సేను ఇరగ కాసింది. తెంపుదామంటె గింత కూడ గెరువిస్తలేదు. పంటంత పాడుగావట్టె రా వారి. ఇంత అద్దుమానం కాలం నేనుప్పుడూ చూడలేదు’’ అన్నారు అందులో ఒకరు.
వారందరిలో కెల్లా చిన్నవాడైన వాడనుకుంటా చాలా క్రియేటివిటీతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ‘‘ఇక ఈ వానలు తగ్గవు. మీకు తెలియదా ఏంది!’’అన్నాడు.
మిగిలిన ముగ్గురు ‘‘ఎందుకు?’’ అని అడిగారు ఆత్రంగా.
‘‘మీకు తెల్వదనుకుంట అసలు ముచ్చట. వానలిలా ఆగకుండా పడడానికి గా ఇస్రో శాస్త్రవేత్తలే కారణం’’ అన్నాడు. వాళ్లతో పాటు నాకూ ఫీజులు ఎగిరిపోయాయి.
‘‘అవునా..!!’’ అని అందరూ నోరెళ్ల బెట్టారు. చెవులు రిక్కబెట్టారు. నాకు గొంతులో పకోడీ ఇరికినంత పనైంది. వారితో పాటు నేనూ ఆత్రంగా వింటున్నా. అప్పడికే నా పకోడీలు అయిపోయినయ్..‘‘భయ్యా.. ఔర్ దో ప్లేట్ పకోడీ, దో చాయ్’’ అని అతి చిన్నగా వెయిటర్‌కు సైగ చేశా. ముందు పకోడీలున్నా మనసు మాత్రం అతను చెప్పే మాటల మీదే కేంద్రీకృతమైంది. అతను చెప్పడం మొదలు పెట్టాడు..
‘‘ఈ మధ్య మన శాస్త్రవేత్తలు చంద్రుడి మీదికి ఒక రాకెట్‌ను పంపిడ్రు.తెలుసా? గది ఫేలైంది. అందుకే ఈ వానలు’’.
‘‘అరెయ్ కాస్త అర్థమయ్యేట్టు చెప్పురా బై’’ అని అడిగారు ఇంకొకరు.
‘‘అవును రా అయ్యా.. ఈ శాస్తవేత్తలు ప్రయోగించిన రాకెట్ మన ఊరికి పదింతలుంటది. దీనికి వేల కోట్లు రూపాలు ఖర్సు కూడా అయినై. అది బై మిస్టేక్లో చంద్రుడి మీదకు వెâే ్ల బదులు తొవ్వ తప్పి పైన మొగులుకు బొక్క పెట్టింది. అరె పైన మొగులు అంటే ఏమనుకున్నార్రా మీరు. అది మొత్తం ఐస్ గడ్డ. మీకు అల్కగ చెప్పాలంటే కుండకు బొక్క పడ్డది రా వారి. అందుకే రోజూ ఈ కారుడు కథ’’
‘‘ఎట్ల మరి ఈ వానలు ఆగయా. ఇక అంతేనా?’’ అడిగాడు అందులోని ముసలాయన కాస్త భయం భయంగా.
‘‘ఆగయ్.. ఎవ్వరూ ఏమీ చేయలేరు. కుండకు బొక్క పడితే ఏమైతది.. నీళ్లు ఒడిసె దాకా కార్తది.. ఇçప్పుడు గా ఆకాశానికే బొక్క పడ్డది. ఇక మంచు గడ్డలు పూరాగా కరిగేదాకా వానలు పడ్తనే ఉంటయ్. ఆçపుడు ఎవ్వరి వశం కాదు’’.
‘‘ ప్రభుత్వం ఏం చేయలేదా ?’’ అన్నారు కాస్త కోపంగా ఇంకొకరు.
‘‘అరెయ్ నీకో విషయం తెలుసా.. రాకెట్ ప్రయోగం ఫేలైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శానా కోపమొచ్చింది. మనోడికి ఓసారి గిట్లే కోపం వస్తే ఏమైందో యాదికుందా గా.. పాకిస్థాన్ ఉగ్రవాదుల గుడారాల మీద ఓరాత్రి పూట బాంబులేసి ఆదేశ మోళ్లందరికీ ఉచ్చవోయిచిండు. ఈసారి కూడా మోదీ శాస్త్రవేత్తల మీద శానా గరమైండు. ఢిల్లీ నుంచి ఆగమాగం శాస్త్రవేత్తల ఆఫీసుకు పోయిండు. అక్కడున్న అందరికంటే పెద్ద శాస్తవేత్త తప్పయింది క్షమించమని ప్రధానిని పట్టుకొని ఏడ్చిండు. టీవీలళ్ల చూడలేదా మీరు’’.
‘‘అరె ఆయన ఏడిసింది అందుకా నేను ఎందుకో అనుకున్నరా వారి’’ అన్నాడు మరొకాయన అమాయకంగా.
‘‘మరి ఏమనుకున్నర్ మీరు సైన్స్ అంటే తమాశాలా! దానితో మంచి ఎంత ఉంటదో చెడు కూడా అంతే ఉంటది.’’ అని అతను ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.
అప్పటికే రెండు ప్లేట్ల పకోడీలు తిని, చాయ్‌లు కూడా తాగిన నాలో ఓపిక, సహనం చచ్చింది. ‘‘అన్నా ఏ ఊరే నీది?’’ అని అడిగా.
అతను మహామేధావిలాగా ముఖం పెట్టి ‘‘మాది ఈ ఊరే తమ్మి’’ అన్నాడు.
‘‘అన్నా.. వానలిలా కురవడానికి కారణం మనమే. మనం వాతావరణాన్ని చాలా కలుషితం చేస్తున్నాం. అందుకే ఈ అకాల వర్షాలు. కరువు కాటకాలు. చలికాలం ఉక్కపోత. కాలం పోయినంక కూడా గిట్ల
కుండపోత. అంతటికీ కారణం మనమే. అంతేకానీ నువ్వు అన్నట్టు శాçస్త్రవేత్తలు, చంద్రయాన్ ప్రయోగం కాదు. అన్నా ఇవన్నీ నీకు ఎవరైనా జెప్పిన్రా లేక నువ్వే పుట్టించినవా?’’ అని అడిగితే అతని దగ్గర సమాధానం లేదు.
‘‘ఈయన చెప్పినవన్ని గాలిముచ్చట్లు. మీరు నమ్మకండి’’ అని అక్కడున్న వాళ్లందిరికీ సర్ది చెప్పే సరికి నాతల ప్రాణం తోకలోకొచ్చింది.
ఈ టెన్షన్లో ఎన్ని పకోడీలు తిన్నానో.. ఎన్ని చాయ్‌లు తాగానో తెల్లారితే గానీ నాకు అర్థం కాలేదు..ఇంత క్రియేటివిటీనా దేవుడా! – ఇప్పకాయల రమేష్, చేర్యాల, సిద్దిపేట జిల్లా
మా ఊరి మేధావులు!
Published Sun, Dec 8 2019 2:37 AM | Last Updated on Sun, Dec 8 2019 2:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment