‘అతను సాధిస్తున్న విజయాలు ఆటకు మంచిది కాదు. అసలు పోటీ అనేది లేకుండా పోతోంది. ఇలా అయితే కష్టం..’ ఆ ఆట గురించి విశ్లేషకులు చెప్పిన మాట ఇది! ‘అతను బరిలో ఉంటే ప్రత్యర్థులు తమ అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆ ప్లేయర్ లేని సమయంలో ఎంతో గొప్పగా ఆడేవాళ్లు కూడా ఎదురుగా అతను ఉంటే తడబడుతున్నారు..’ ఒక యూనివర్సిటీ అధ్యయనంలో తేలిన విషయం ఇది.
‘ఆ ప్లేయర్ జోరును తగ్గించేందుకు అవసరమైతే నిబంధనలు కూడా మార్చాల్సిందే. అతని బలహీనతలను గుర్తించి అలాంటి నిబంధనలు చేర్చాలి.. మరికొందరి సలహా! ఇదంతా ఒక్కడి గురించే! ఒక ఆటగాడు సాధిస్తున్న విజయాలు, ఘనతలు కూడా ఆటకు చేటు చేస్తాయని అనిపించడం చూస్తే సదరు ఆటపై అతని ముద్ర ఏమిటో స్పష్టమవుతుంది. వారు వీరని తేడా లేకుండా ప్రత్యర్థులంతా మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారంటే అతని గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. అలాంటి అద్భుతం పేరే టైగర్ వుడ్స్.. గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు.. ఆర్జనలో ఆకాశాన్నందుకున్నా, కీర్తి వెంట అపకీర్తి వచ్చి చేరినా
ఈ ‘టైగర్’ విలువ ఏమాత్రం తగ్గలేదు!
- మొహమ్మద్ అబ్దుల్ హాది
టైగర్ వుడ్స్ కెరీర్ అంతా ఒక సినిమాను తలపిస్తుంది. ఆసక్తికరమైన మలుపులు, డ్రామాలకు కొదవే లేదు. గోల్ఫ్ ప్రపంచంలో గెలుచుకున్న టోర్నీలు, సాధించిన సంపద మాత్రమే కాదు.. మత్తు పదార్థాలు వాడి పోలీసులకు చిక్కడం, పరాయి స్త్రీలతో సంబంధాల వల్ల కుటుంబ బంధాల్లో కుదుపు, కారు ప్రమాదంలో చావుకు దగ్గరగా వెళ్లి బతికిపోవడం.. ఆపై అన్నింటినీ దాటి మళ్లీ పూర్వ వైభవం సాధించడం కూడా అసాధారణం. అతను సాధించిన విజయాలను అంకెల్లో తూచలేం. టోర్నీల సంఖ్య, వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్, అవార్డులు, రివార్డులు.. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ అంతకు మించిన ఒక కరిష్మా, గోల్ఫ్ మైదానాన్ని తాను ఏకఛత్రాధిపత్యంతో శాసించిన తీరు అతడిని అందనంత ఎత్తులో నిలబెడతాయి.
పసిప్రాయంలోనే..
గోల్ఫ్‌కు సంబంధించి వుడ్స్ బాల మేధావి! రెండేళ్ల వయసులోనే తొలిసారి అతని చేతికి తండ్రి గోల్ఫ్ స్టిక్‌ను అందించాడు. ఆ తర్వాత ప్రతి వయో విభాగంలోనూ ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా అతను విజేతగా నిలుస్తూ వచ్చాడు. ఎనిమిదేళ్ల వయసులో అరుదైన ‘80 పాయింట్ల స్కోర్’ను సాధించిన వుడ్స్.. ఆరుసార్లు వరల్డ్ జూనియర్ చాంపియన్ గా నిలవడంతోనే అతని అసలు సత్తా ఏమిటో గోల్ఫ్ ప్రపంచానికి తెలిసింది. స్కూల్, కాలేజీ.. అమెచ్యూర్ స్థాయిల్లో తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోయాడు. సరిగ్గా చెప్పాలంటే ఆ దశలో అతను పాల్గొన్న ఏ ఒక్క టోర్నీలోనూ వుడ్స్‌కు ఓటమి ఎదురు కాలేదు. దాంతో ఈ కుర్రాడు చరిత్రను తిరగరాయగలడని అంతా భావించారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో అందరికీ అర్థమైంది.
ప్రొఫెషనల్‌గా..
19 ఏళ్ల వయసులో వుడ్స్.. గోల్ఫ్ ప్రొఫెషనల్‌గా మారాడు. అప్పటికి అతని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు కాబట్టి నైకీ, టిట్‌లీస్ట్‌లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు వెంటనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2000 సంవత్సరంలో వుడ్స్ రికార్డు స్థాయిలో 15 స్ట్రోక్ తేడాతో యూఎస్ ఓపెన్ ను గెలుచుకున్నాడు. ‘గోల్ఫ్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన’ అంటూ దీనిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి.
2007లో మోకాలి గాయంతో వుడ్స్ ఆటకు దూరంగా ఉండగా.. ఆ సీజన్ మొత్తం టీవీ రేటింగ్ భారీగా పడిపోయి అతని విలువేంటో చూపించింది. పుష్కర కాలానికి పైగా గోల్ఫ్ మైదానాన్ని అతను శాసించాడు. ఈ క్రమంలో ఎన్నో అద్భుత విజయాలు అంది వచ్చాయి. అతను బరిలో ఉంటే చాలు మిగతా గోల్ఫర్లంతా రెండో స్థానం కోసమే పోటీ పడాల్సిన పరిస్థితి. అయితే ఆ తర్వాతి కొన్ని పరిణామాలు, వ్యక్తిగత అంశాలు ఆటపై ప్రభావం చూపించాయి. ఐదు సార్లు వెన్నుకు జరిగిన శస్త్రచికిత్సలు కూడా వుడ్స్ జోరుకు బ్రేకులు వేశాయి.
2013 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత వరుస పరాజయాలు పలకరించాయి. ఇక వుడ్స్ ఆట ముగిసినట్లేనని, అతను మళ్లీ కోలుకోవడం కష్టమని గోల్ఫ్ ప్రపంచం మొత్తం నిర్ణయించేసుకుంది. అదే జరిగితే అతను టైగర్ ఎందుకవుతాడు! ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ మెల్లగా మళ్లీ స్టిక్ పట్టిన వుడ్స్ ఒకప్పటి తన ఆటను చూపించాడు. మరోసారి వరల్డ్ నంబర్‌వన్ కావడంతో పాటు మరో మాస్టర్స్ టోర్నమెంట్‌ను తన ఖాతాలో వేసుకొని శిఖరాన నిలిచాడు.
గోల్ఫ్ కోర్సు బయట...
2009లో అనూహ్యంగా జరిగిన ఒక కారు ప్రమాదం కారణంగా ఇతర మహిళలతో వుడ్స్‌కు ఉన్న సంబంధాల విషయం వెలుగులోకి వచ్చింది. ముందుగా వాటిని వ్యక్తిగత అంశం అంటూ తిరస్కరించినా.. ఆ తర్వాత దానిని అంగీకరించక తప్పలేదు. క్షమించాలంటూ అతను బహిరంగ ప్రకటన చేశాడు. దాంతో అసెంచర్, గెటరాడ్, జనరల్ మోటార్స్, జిల్లెట్‌వంటి సంస్థలన్నీ అతనితో తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
ఇదే కారణంతో కొద్ది రోజులకే వుడ్స్ భార్య ఎలిన్ నార్‌డెగ్రెన్ అతనికి విడాకులు ఇచ్చింది. మద్యం, డ్రగ్స్ సేవించి కారు నడుపుతున్నాడంటూ 2017లో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన వుడ్స్ కోలుకునేందుకు సమయం పట్టింది. అయితే ఇలాంటివన్నీ అధిగమించిన అతను మరోసారి అసలు వేదికపై తానేంటో చూపించగలిగాడు.
ఆ పేరు అలా వచ్చింది..
వుడ్స్ తండ్రి ఎర్ల్ డెన్నిసన్.. ఆర్మీ అధికారిగా వియత్నాం యుద్ధంలో పాల్గొన్నాడు. తల్లి కుల్టిడా థాయ్‌లాండ్ దేశస్తురాలు. అయితే అతని తల్లిదండ్రుల నేపథ్యాలు కూడా చాలా భిన్నమైనవి కావడంతో వుడ్స్ గురించి ‘అతను పావు వంతు థాయ్, మరో పావు చైనీస్, ఒక పావు కకేషియన్ , మిగతా పావులో సగం ఆఫ్రికన్ అమెరికన్, మిగిలిన సగం మాత్రమే అసలు అమెరికన్ ’ అని విమర్శకులు చెబుతారు. అసలు పేరు ఎల్‌డ్రిక్ టాంట్ వుడ్స్ అయితే..‘టైగర్’గా పిలిచే వియత్నాం యుద్ధవీరుడు, తన తండ్రి స్నేహితుడి పేరును గౌరవంగా తన పేరుకు ముందు జోడించుకున్నాడు వుడ్స్.
నాకూ నత్తి ఉండేది
కొన్నేళ్ల క్రితం డిల్లాన్ అనే స్కూల్ అబ్బాయి తన బాల్కనీ కిటికీలోంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ అతనికి ప్రాణాపాయం తప్పింది. తనకు నత్తి ఉందని, అందరూ ఎగతాళి చేస్తున్నారని, స్కూల్ స్పోర్ట్స్ టీమ్‌లో కూడా తనను తీసుకోవడం లేదని అతను కారణం చెప్పాడు. ఈ విషయం వార్తల ద్వారా వుడ్స్‌కు తెలిసింది. ఆ కుర్రాడు తన ఆటను చూస్తాడని కూడా సన్నిహితులు చెప్పారు. దాంతో వుడ్స్ ఆ చిన్నారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశాడు..
‘అందరిలాగా ఉండలేకపోవడం ఎంత బాధ కలిగిస్తుందో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడూ నేనూ నీ తరహా సమస్యతో బాధపడ్డాను. ఆ సమయంలో దానిని దూరం చేసుకునేందు నేను నా కుక్కతో మాట్లాడుతూ ఉండేవాడిని. అది పడుకునేవరకు ఆపకపోయేవాడిని. చివరకు నత్తి దూరమైంది. ఆ సమస్యను ఎలాగైనా అధిగమించవచ్చు. కానీ నువ్వు సంతోషంగా ఉండాలి’ అంటూ! భావోద్వేగంతో రాసిన ఆ లేఖ వుడ్స్ సహృదయాన్ని చూపించింది.
సాధించిన ఘనతలెన్నో..
మేజర్ చాంపియన్‌షిప్స్ – 15 సార్లు విజేత
వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ – 18 సార్లు విజేత
మొత్తం పీజీఏ టూర్ విజయాలు – 82
పీజీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు – 11 సార్లు
అత్యుత్తమ వరల్డ్ ర్యాంకింగ్ – 1997లో జూన్ 15న తొలిసారి వరల్డ్ నంబర్‌వ¯Œ .. ఏకంగా 683 వారాల పాటు అగ్రస్థానంలో నిలిచిన రికార్డు
వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు
అమెరికా అత్యున్నత పౌర పురస్కారం
‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ అందుకున్న ఘనత
Comments
Please login to add a commentAdd a comment