రెండు చేతులు జట్టు కడితే బలం. ఆ చేతులకు భావుకత జత కూడితే అది అందమైన కళారూపం. ప్రకృతి అందాలను సందర్శించినప్పుడు బ్రహ్మ సృష్టి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, కళలను కనులారా కాంచినపుడు మానవ సృష్టి గురించి అంతే ఘనంగా చాటుతాం. భారతీయతను ఎవరికి పరిచయం చేయాలన్నా మన హస్తకళలను చూపితే చాలు, సంస్కృతీ సంప్రదాయాలతో నిండిన చారిత్రక వైభవం కోటి కథల పందిరై కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ‘కళ’పోసిన చేతులను ఆకాశమే హద్దుగా కీర్తిస్తుంది. ఇప్పుడు ఆ చేతుల చేతలను స్మరించుకునే సందర్భం.. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇటీవల ప్రదానం చేసిన ‘ సన్మాన్ ’ పురస్కారాలే!
గౌరీదేవి నలుగుపిండితో ముచ్చటైన బొమ్మను చేసి, ప్రాణం పోసిందని పురాణ కథ. కృష్ణుడు.. రాధ కోసం బంగారు జరీతో వస్త్రాలను రూపొందించాడని ఇతిహాసం. జానపద కథలను చిత్రాలుగా రంగులద్దారని చారిత్రకం. ఏ దేశమేగినా మన హస్తకళలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నది వాస్తవం. అగ్గిపెట్టెలో పట్టేటంత చీర, బంగారు దారాలతో అల్లిక, ఎటువైపు చూసినా ఒకేలా అనిపించే నైపుణ్యం, కాలాన్ని పలికించే బొమ్మలు, రాళ్ల రంగుల చిత్రాలు... నేటి హస్త కళా నైపుణ్యానికి అడ్డుగీతలు లేనే లేవని చాటుతూ భారతీయ వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు కళాకారులు. హస్తకళలన్నీ ఒకే తాటిపైకి వచ్చేలా వారధులుగా నిలుస్తున్నారు వ్యాపారులు.
నడతను మార్చే సృజన
కళలకు పాఠ్యాంశాలు అక్కర్లేకపోవచ్చు కానీ, కళలు జీవన పాఠాలు నేర్పుతాయి. సమాజంలో బాధ్యతను, నడవడికను ఒంటపట్టేలా చేస్తాయి. ముఖ్యంగా రేపటి పౌరుల పెంపకంలో హస్తకళలు ఎనలేని ఆలోచనను పెంపొందిస్తాయి. మనిషిని సున్నితత్వంవైపు పయనింపజేస్తాయి. చూస్తున్న కంటికి, చేస్తున్న చేతికి వారధిగా నిలిచిన కళ ‘శ్రద్ధ’ అనే దారాలను అల్లుతూనే ఉంటుంది. ఏకాగ్రత, క్రమశిక్షణతో పాటు జీవనగమనానికి దారి అవుతుంది. ఒకప్పుడు ఎందుకూ పనికిరావనుకునే కళలు, వృత్తులు ఈ టెక్నాలజీ యుగంలోనూ కొత్త ఉపాధికి మార్గాలు అవుతున్నాయి. ఉన్న ఆదాయానికి అదనపు వెసులుబాటుగా మారుతున్నాయి. కరోనా నేర్పిన పాఠం నుంచి మనిషి పల్లెజీవనం వైపుగా దృష్టి సారించినట్టే.. ఆ పల్లె అందించిన కళలను ఔపోసన పట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది నేటి యువత. కనీసం ఒక్క కళారూపాన్నయినా కళ్ల ముందు నిలిపేందుకు తాపత్రయపడుతోంది.
దగ్గరగా ఉన్న పదార్థాలే పనిముట్లు
కొన్ని సాధారణ, తేలికైన పనిముట్లను మాత్రమే వాడి కేవలం చేతులతో రూపొందించే వస్తువులు హస్తకళలుగా విరాజిల్లుతున్నాయి. చేతులతో బట్టలు, అచ్చులు, కాగితాలు, మొక్కలకు సంబంధించిన పదార్థాలను వాడి తయారు చేసే సృజనాత్మక రూపాలన్నీ హస్తకళల కిందికి వస్తాయి. వ్యక్తిగత అవసరాలకు, వ్యాపారం చేసుకోవడానికి చేత్తో తయారుచేసే అలంకార వస్తువులన్నీ హస్తకళలుగానే ప్రాచుర్యం చెందుతున్నాయి. ఈ కళల మూలాలన్నీ గ్రామీణ కళల్లోనే ఉన్నాయి. ప్రాచీన నాగరికతల నుంచి మనిషి తన వివిధ రకాల అవసరాల కోసం వీటిని కొత్తగా కనుక్కుంటూ వస్తున్నాడు. కొన్ని కళలు శతాబ్దాల నుంచీ ఉండగా, మరికొన్ని అధునాతనంగా రూపుదాల్చుతున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కళలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. హస్తకళల్లో చాలా వరకు తమకు దగ్గరలో ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పదార్థాలనే వాడినా, కొన్నింటిలో సంప్రదాయేతర పదార్థాలనూ వాడుతున్నారు.
ఆర్థిక వ్యవస్థలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్
దేశ ఆర్థిక వ్యవస్థలో హస్తకళల రంగం ముఖ్య భూమికను పోషిస్తోంది. అతిపెద్ద ఉపాధిని కల్పించే రంగాల్లో ఒకటిగా ఉండటమే కాదు, ఎగుమతుల్లోనూ గణనీయమైన వాటా కలిగి ఉంది. రాష్ట్ర, ప్రాంతీయ బృందాలు హస్తకళారూపాల ఎగుమతికి కృషిచేస్తున్నాయి. భారతీయ హస్తకళల పరిశ్రమలో 70 లక్షలకు పైగా కళాకారులు ఉన్నట్టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గణాంకాలు చెబుతున్నాయి. 2021 సంవత్సరానికి వివిధ విభాగాలలో భారతదేశం నుంచి హస్తకళల ఎగుమతులు కోట్లాది డాలర్లలో ఉన్నాయి. వీటిలో కలప సంబంధితమైవి 84.5 కోట్ల డాలర్లు, ఎంబ్రాయిడరీ, క్రొచెట్‌కి సంబంధించినవి 60.4 కోట్ల డాలర్లు, ఆర్ట్ మెటల్ వస్తువులు 46.8 కోట్ల డాలర్లు, హ్యాండ్‌ప్రింటెడ్ టెక్స్‌టైల్స్ 33.9 కోట్ల డాలర్లు, ఫ్యాషన్ ఆభరణాలు 18.6 కోట్ల డాలర్లు, ఇతర హస్తకళలు 82.6 కోట్ల డాలర్ల మేరకు ఉన్నాయి. అమెరికా, కెనడా, యూరప్‌లోని ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, లాటిన్ అమెరికా దేశాలు, ఆస్ట్రేలియా వంటి అగ్రదేశాలకు భారతీయ హస్తకళారూపాలు ఎగుమతి అవుతున్నాయి.
ప్రాంతీయ వైభవం
అయినప్పటికీ, కొన్ని కళలు ఆధునికతను అందుకునే శక్తిలేక కునారిల్లుతున్నాయి. మరికొన్ని సరైన ఉపాధి ఇవ్వలేక అంతరించిపోతున్నాయి. కానీ, కొంతమంది కళాకారులు మాత్రం తమ హస్తకళలకు కొత్త ఊపిరిపోస్తున్నారు. ఆ సేతు హిమాచలం వరకు ఒక్కోరాష్ట్రం తమవైన ప్రాంతీయ హస్తకళలతో విరాజిల్లేలా చేస్తున్నారు. భారతమాత మెడలోని హారాలై మెరుస్తూనే ఉన్నారు. ఆ హారంలోని మేలిమి రత్నాలను ఇటీవల ‘సమ్మాన్’ అవార్డులతో సత్కరించింది తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కౌన్సిల్.
కన్నుల పండువ చేసే చేర్యాల పెయింటింగ్
కళలల్లో మెరుగైన జీవనాన్ని వెతుక్కోవడానికి ఈ కాలం సరైన సమాధానంగా వచ్చి నిలిచింది. అందుకు నకాషి కళగా పేరొందిన చేర్యాల పెయింటింగ్స్‌ను చెప్పుకోవచ్చు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేర్యాల గ్రామంలో పురుడు పోసుకుంది ఈ కళ. నాలుగువందల ఏళ్ల నాటి ఈ కళకు జానపద కథలు మూలాధారంగా నిలిచాయి. ఇతిహాసాలు, పురాణ కథలూ ఈ చిత్రకళలో కొత్తగా ఊపిరిపోసుకుంటున్నాయి. ఈ కళను కులవృత్తిగా సాన పట్టిన సాయికిరణ్ నేటి యువత అవసరాలకు అనుగుణంగా వినూత్నంగా ఆలోచించి కళ్లద్దాల హోల్డర్లు, పెన్ స్టాండ్లు, పేపర్ బాక్సులు తయారుచేస్తున్నాడు.
ఒకప్పుడు నకాషి కళతో తయారుచేసిన పెయిటింగ్స్, తోలు బొమ్మలతో పల్లెల్లో కథలు చెప్పి అలరించేవారు. కథల గానంలో ఈ కళ ముఖ్య పాత్ర పోషించేది. ‘సంప్రదాయ మహిళ తన రోజువారీ జీవితం’ కథతో సాయి కిరణ్ బొమ్మను తయారుచేశాడు. చింతపండు మిశ్రమం, రంపపు పొట్టు, రాళ్ల నుండి తీసిన ఎరుపు రంగును ఉపయోగించిన ఈ బొమ్మ తయారీకి ఇరవై రోజులు పట్టింద’ని వివరించాడు సాయి కిరణ్. ఈ అద్భుతమైన కళాఖండానికి హ్యాండీక్రాఫ్ట్స్ విభాగంలో పింగళి కమలారెడ్డి సమ్మాన్ అవార్డు లభించింది.
ఎల్లలు చెరిపేసిన జమ్దానీ
పశ్చిమబెంగాల్ చేనేతకారుడు జ్యోతిష్ దేబ్‌నాథ్ పూర్వీకులు బంగ్లాదేశ్‌లోని జమ్దానీలో ఉండేవారు. దేశ విభజన సమయంలో పెద్ద సంఖ్యలో హిందూ నేతకార్మికులు భారతదేశానికి వలస వచ్చారు. రెండువేల సంవత్సరాల ఘనత ఉన్న జమ్దానీ కళను సాధన చేసిన జ్యోతిష్ దేబ్‌నాథ్ నూలు వస్త్రాల నేతకళలో క్లిష్టమైన నేర్పును చూపిస్తాడు. వస్త్రాలను అందంగా నేయడంలో ప్రవీణుడిగా పేరొందాడు. ‘జమ్దానీ చీరను పిట్ లూమ్‌లో పూర్తి చేయడానికి 45 రోజులు పట్టింది. నూలుదారాల్లో అన్నీ సహజ రంగులనే వాడటంతో పాటు జరీ దారాన్ని కూడా ఉపయోగించి చీరను నేశాను’ అని వివరిస్తాడు జ్యోతిష్. రూ.30 వేల ధర పలికే ఈ చీర అద్భుతమైన హస్తకళకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ ఏడాది జ్యోతిష్‌కు చేనేత విభాగంలో కళాంజలి సమ్మాన్ అవార్డు లభించింది.
చరకసంస్థ
కన్నడ నాటక రంగానికి మార్గదర్శకులుగా ఉన్న ప్రసన్న.. దేశీ చరక సంస్థలకు వ్యవస్థాపక ధర్మకర్త. చరక సంస్థ అనేది దక్షిణ భారతదేశంలోని çపడమటి కనుమల్లోని భీమన్‌కోన్ గ్రామంలో ఉన్న మహిళల మల్టీపర్పస్ ప్రారిశ్రామిక సహకార సంఘం. ఈ సంస్థలో తయారుచేసిన రెడీమేడ్ వస్త్రాలు బెంగళూరు, మైసూరు, ధార్వాడ్, శివమొగ్గ వంటి నగరాల్లో దేశీ బ్రాండ్‌తో రిటైల్ ఔట్‌లెట్‌లలో అమ్ముతారు. సహజమైన రంగుల్లో చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేస్తుందీ సంస్థ. శివమొగ్గ, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో దాదాపు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. చేనేత రంగంపై ఎన్నో పుస్తకాలను రాసిన ప్రసన్నకు ఈ ఏడాది తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.
రెండువైపులా అందమైన అనుభూతి.. మీర్జాపూర్ మీనాకారి
పశ్చిమ బెంగాల్‌లోని మీర్జాపూర్‌కు చెందిన సంప్రదాయ కళకు అంతర్జాతీయ పేరుంది. క్లిష్టమైన అల్లికలతో కూడిన ఈ ఆర్ట్‌కు మీనాకారి అని పేరు. బెంగళూరు నుంచి వచ్చే çపట్టుచీరలపై మాల్దా ప్రాంతం నుంచి వచ్చే బంగారు దారంతో అల్లే మీనాకారి అసామాన్యమైన కళగా పేరొందింది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా ఈ కళను అందిపుచ్చుకున్నాడు పలాశ్ మునియా. పదమూడేళ్లు శ్రమించి క్లిష్టమైన డిజైన్లు, అల్లిబిల్లి అల్లికలను సృష్టించాడు. ఆ నైపుణ్యంతోనే చీరకు రెండు వైపులా ఒకే రకంగా కనిపించే అందమైన అల్లికను తీసుకొచ్చాడు. భారతదేశ ప్రాచీన కళను కాపాడుతున్నందుకు గాను పలాశ్ మునియాకు ఈ ఏడాది హ్యాండ్లూమ్ విభాగంలో ఇంజమూరి శ్రీనివాసరావు కన్సొలేషన్ అవార్డును ప్రదానం చేశారు.
కళావారధి : మోరి
ఆధునిక బ్రాండ్లు ఎన్ని వచ్చినా ప్రపంచం చూపు హస్తకళలవైపే అనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. ప్రాచీన కళను ఆధునిక కాలానికి తీసుకురావడానికి ఓ వారధిగా కృషి చేస్తోంది. గుజరాత్ వాసి అయిన బృందా దత్. భారతీయ హస్త కళల సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ‘దేశంలో కళాకారులు ఏ మూల ఉన్నా అక్కడ నేనుంటాను’ అంటుంది ఈ యూత్ ఐకాన్. భారతీయ హస్తకళల పట్ల అపారమైన గౌరవం, ఆధునిక భావాల అభిరుచితో భూత భవిష్యత్తుల కలయికగా ‘మోరి డైనమిక్ డిజైన్ స్టూడియో’ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించింది బృందా దత్. దేశం నలుమూలలనున్న క్రాఫ్ట్స్ కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తూ, తన అనుభవాన్ని మెరుగుపరచుకుంటూ కళ ఎప్పటికీ నిలిచేలా వినూత్నమైన డిజైన్లను రూపొందిస్తోంది ఆమె. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలూ కల్పిస్తోంది. భారతీయ హస్తకళలను ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా ‘మోరి’సంస్థను ఏర్పాటు చేసిన బృందా దత్‌కు క్రాఫ్ట్‌ప్రెన్యూర్ అవార్డు లభించింది.
చిన్నారి కళనేత గద్వాల
తెలంగాణలోని గద్వాల నేత కళల కాణాచి. గద్వాల పేరు వింటేనే అక్కడి చేనేత కళ్ల ముందు నిలుస్తుంది. చేనేతకారుల కుటుంబం నుంచి అతి పిన్న వయసులో నైపుణ్యం సాధించిన మెట్ట స్వాతిలక్ష్మి బాలకళాకారిణిగా పేరొందింది. పదేళ్ళ వయసు నుంచే నేత పనితో కుటుంబానికి సాయంగా ఉంటోంది స్వాతిలక్ష్మి. ఆమె పనిలో నైపుణ్యం, అంకిత భావం చెప్పుకోదగినది. కుటంబానికి ఆమే ఏకైక ఆర్థిక ఆధారం. చిన్న వయసులోనే ఆమె సాధించిన నైపుణ్యంతో పాటు కుటుంబానికి అండగా ఉంటున్న స్వాతిలక్ష్మి ఈ ఏడాది చైల్డ్ ఆర్టిసన్‌గా గుర్తింపు పొందింది.
బంగారు నైపుణ్యం: వెంకటగిరి
వెంకటగిరి చేనేత చీరలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీయులనూ ఆకర్షిస్తున్నాయి. ఈ చీరలకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. వెండి జరీ, హాఫ్ ఫైన్ జరీ వంటి రకాలతో ఇక్కడ చీరలు నేస్తున్నారు. చక్కటి నైపుణ్యంతో నేసిన ఈ చీరలకు ఆంధ్రాలోనే కాదు తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ గొప్ప గిరాకీ ఉంది. ఆధునిక డిజైన్లతో మగ్గంపై నేసే ఈ చీరల్లోని జామ్దానీ వర్క్‌కు మంచి డిమాండ్ ఉంది. రెండు వైపులా ఒకే డిజైన్‌లా కనబడటం జామ్దానీ వర్క్ ప్రత్యేకత. చీరల తయారీలో ఇలాంటి నైపుణ్యం మరెక్కడా కనపడదు. కాటన్‌లో చెంగావి రంగు చీరల తయారీ ఇక్కడి కార్మికుల నైపుణ్యానికి నిదర్శం. ఈ ప్రాంతంలో తరతరాలుగా కుటుంబ జీవనాధారంగా చేనేత పని నడుస్తోంది. వీరిలో పట్నం మునిరాజు కుటుంబాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మునిరాజు చేనేత విభాగంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నారు. మల్బరీ పట్టు చేనేతలో గ్రాము బంగారు దారాన్ని ఉపయోగించి, 30 రోజుల్లో చీరను నేసిన మునిరాజు అత్యద్భుతమైన కళానైపుణ్యానికి చేనేత విభాగంలో శ్రీమతి లలిత ప్రసాద్ సమ్మాన్ అవార్డ్ లభించింది.
దంతపు చెక్క బొమ్మ : చెన్నపట్నం
బెంగళూరు, మైసూరు నగరాల మధ్య ఉన్న చెన్నపట్నంలోని ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కౌసర్ పాషా తరతరాలుగా వస్తున్న కుటుంబకళను ఔపోసన పట్టాడు. కనీసం ఇరవై మందికి ఉపాధి కల్పించేలా వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాడు. అంకుడు చెట్టు నుంచి మెత్తని మృదువైన కలపను ఈ కళలో ఉపయోగిస్తారు. దీనిని ఆలేమారా అంటే ‘దంతపు చెక్క’ అని కూడా పిలుస్తారు. ఇది మంచి తెలుపు రంగులో ఉంటుంది. తేలికగా వంగుతుంది.
సులభంగా అచ్చు వేయవచ్చు. అవసరమైన ఆకారాన్ని రూపొందించవచ్చు. బొమ్మ పూర్తయిన తర్వాత సహజ రంగులతో పెయిటింగ్ వేస్తారు. ఇది పిల్లలు ఆడుకోవడానికి చాలా సురక్షితమైనదిగా పేరొందింది. పాఠశాలల్లో ముఖ్యంగా మాంటిస్సోరిలో నర్సరీ పిల్లలకు ఉపయోగించే పరికరాలు, అబాకస్, సైజ్ వెరిఫికేషన్ బ్లాక్స్, లూప్ నిచ్చెనలు, కౌంటింగ్ సెట్లు, విజిల్స్, గిలక్కాయలు, కిచెన్ సెట్స్, అనేక ఇతర బొమ్మలనూ వీరు తయారుచేస్తారు. చెన్నపట్నం పల్లెటూరి జీవితంపై అత్యద్భుతమైన హస్తకళతో రూపొందించిన కౌసర్ పాషాకు ప్రోత్సాహక సమ్మాన్ అవార్డు లభించింది.
ఏ కళ బతకాలన్నా సంప్రదాతకు ఆధునికత కూడా తోడవ్వాలి. కాలానుగుణమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. ప్రాచీన కళలోని సూక్ష్మాలను వెలికి తీయాలి. వేల ఏళ్ల చరిత్రను ముందు తరాలకు పరిచయం చేస్తున్న కళాకారుల కృషికి తగిన గుర్తింపు దక్కాలి. వారి జీవనం సంపన్నంగా ఉంటేనే భారతీయ కళలు సుసంపన్నం అవుతాయి. గత కాలపు కళ వేళ్లు పట్టుకొన్న ఈతరం చేతులు మరిన్ని కొత్త నైపుణ్యాలను దిద్దుకుంటాయి. -నిర్మలారెడ్డి
జీవమున్న బొమ్మ.. ఏటికొప్పాక
ఆంధ్రప్రదేశ్‌లోని ఏటికొప్పాక బొమ్మలను ఒకసారి చూస్తే చాలు మనసులో సున్నితమైన భావాలు కలుగుతాయి. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలంలోని గ్రామం ఏటికొప్పాక. లక్క బొమ్మల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఏటికొప్పాక బొమ్మలంటేనే ఓ బ్రాండ్. అక్కడి కళాకారుల సృజనాత్మక శక్తికి తిరుగులేదు. పూలు, చెట్ల బెరడుల నుంచి చేసిన రంగులను ఇక్కడ బొమ్మలకు ఉపయోగిస్తారు. ఏటికొప్పాక బొమ్మ చేయడమంటే ఓ జీవికి ప్రాణం పోసినంత పని. ఎందుకంటే ప్రతి బొమ్మనీ విడిగా తయారుచేయాల్సిందే. మూస పోసి ఒకే పోలికున్న బొమ్మలు చేయడానికి అచ్చులు ఉండవు. దేనికదే ప్రత్యేకం. అడవుల్లో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి, ఎండబెట్టి, ఆ కలపతో ఈ బొమ్మలను తయారుచేస్తారు.
ఫ్యాషన్ ఆభరణాలను, గృహాలంకరణ వస్తువులనూ ఈ అంకుడు చెట్ల కలప నుంచే తయారుచేస్తున్నారు. ఈ గ్రామంలో సీవీ రాజు, శ్రీశైలపు చిన్నయాచారికి బొమ్మల తయారీలో రాష్ట్రపతి అవార్డులు కూడా లభించాయి. చిన్నయాచారితో కలిసి పదహారేళ్లుగా సంప్రదాయ చెక్క, లక్కబొమ్మల తయారీలో నైపుణ్యం సాధించాడు బి.సూరిబాబు. 2018లో వృత్తి పరమైన ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్నాడు. ఈ యేడాది ‘మెకనైజ్డ్ లేడీస్ ఎట్ వర్క్ బొమ్మ’ను ప్రత్యేకంగా రూపొందించాడు. ‘ఈ బొమ్మ వారం రోజులు పట్టింది. పసుపు, నీలి రంగు, బెల్లం, లక్కతో కలిసిన సహజ రంగులను వాడాను’ అని చెప్పాడు. సూరిబాబుకు యశ్వంత్ భారతి రామ్మూర్తి కన్సోలేషన్ సన్మాన్ అవార్డు వచ్చింది.
డిజిటల్ మార్కెట్
అనేక హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెంచడానికి దేశంలోని కళాకారుల అందరూ ఆన్‌లైన్‌ను వేదికగా మార్చుకుంటున్నారు. ఈ–మార్కెట్ ప్లేస్ వల్ల దేశ, విదేశాల్లోని ఏ ప్రాంతానికైనా తమ కళాకృతులను పంపేందుకు వెసులుబాటు కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్థానిక ప్రదర్శన శాలల్లోనే కాకుండా హైటెక్ విధానాలతోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించి కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి.
సాంస్కృతిక వైభవం: కిన్హాల్ బొమ్మ
కర్ణాటక రాష్ట్రంలోని ‘కిన్హాల్’ క్రాఫ్ట్ సంప్రదాయ వైభవంతో అలరారుతుంటుంది. చేతితో రూపొందించిన కిన్హాల్ చెక్క బొమ్మలు దేవతా మూర్తులకు ప్రసిద్ధి. రంగురంగుల ఈ బొమ్మలు చూపు తిప్పుకోనివ్వవు. ఈ బొమ్మల ఆభరణాల కోసం వెండి రేకును పెయింటింగ్‌గా ఉపయోగిస్తారు. ఈ కళాఖండాలు ఇళ్లు, బడుల్లో అలంకారంగానే కాదు పిల్లల దృష్టికోణంలో అద్భుతమైన మార్పును తీసుకువస్తున్నాయి. టేకు చెక్కను చెక్కి, మరవజ్ర చెట్టు గమ్‌తో కిన్హాల్‌కు చెందిన సంతోష్ అందమైన కళాఖండాన్ని రూపొందించాడు. అందుకుగాను సంతోష్‌కు శ్రీ జాస్తి రామయ్య సమ్మాన్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment