ఒక ఏడాదిలో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే కొందరికి అదే జీవితకాలపు ఘనత.. రెండు గెలిస్తే ఆనందం రెట్టింపు.. మూడు గెలిస్తే గొప్ప ఆటగాళ్ల సరసన చోటు.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే అది టెన్నిస్ చరిత్రలో ఐదుగురికి మాత్రమే సాధ్యమైన అసాధారణ ప్రదర్శన.. ఈ నాలుగుతో పాటు ఒలింపిక్ స్వర్ణం కూడా గెలిస్తే ఆ అద్భుతం పేరే స్టెఫీ గ్రాఫ్.. సుదీర్ఘ కాలం ఆటపై తనదైన ముద్ర వేసి పలు రికార్డులతో కెరీర్ గ్రాఫ్‌ను ఆకాశాన నిలిపి ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అనిపించుకున్న ఈ జర్మన్ స్టార్ సాధించిన ఘనతలెన్నో!
1999లో స్టెఫీగ్రాఫ్ ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు టెన్నిస్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఆమెకు 30 ఏళ్లే! అప్పటి ఆమె ఫిట్‌నెస్ స్థాయి, ఆటపరంగా చూస్తే అదేమీ పెద్ద వయసు కాదు. పైగా అంతకు రెండు నెలల క్రితమే ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె విజేతగా నిలిచింది. 19 ఏళ్ల వయసులో ఉత్సాహంగా చెలరేగుతున్న మార్టినా హింగిస్‌ను ఫైనల్లో ఓడించి మరీ టైటిల్ చేజిక్కించుకుంది. అనంతరం వింబుల్డన్ లోనూ ఫైనల్ చేరింది.
మరికొన్నాళ్లు కొనసాగి ఉంటే మరింత ఘనత ఆమె ఖాతాలోకి చేరేదేమో! అయితే తాను అనుకున్న సమయంలో అనుకున్న తరహాలో ఆటను ముగించింది స్టెఫీ. ‘టెన్నిస్‌లో నేను సాధించాల్సిందంతా సాధించేశాను. ఇంకా ఏం మిగిలి లేదు. ఆటను ఇంకా ఆస్వాదించలేకపోతున్నాను. గతంలో ఉన్న ప్రేరణ కూడా కనిపించడం లేదు. మైదానంలోకి దిగుతున్నప్పుడు ఒక టోర్నీలో ఆడుతున్న భావనే రావడం లేదు’ అని ప్రకటించింది. నిజమే.. ఆమె కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన స్టెఫీ కెరీర్ గ్రాఫ్‌ను చూస్తే అంతా అద్భుతమే కనిపిస్తుంది.
సీనియర్లను దాటి..
స్టెఫీ కెరీర్‌లో పెద్దగా ఒడిదుడుకుల్లేవ్. ఆరంభంలో సహజంగానే వచ్చే కొన్ని అడ్డంకులను దాటిన తర్వాత విజయప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆమెకు ఎదురు లేకుండా పోయింది. 13 ఏళ్ల వయసులో తొలి ప్రొఫెషనల్ టోర్నీ ఆడినప్పుడు ఆమె ప్రపంచ ర్యాంక్ 124. అయితే స్టెఫీ తండ్రి, తొలి కోచ్ పీటర్ గ్రాఫ్ ర్యాంకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. తర్వాతి రెండేళ్లు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా ఆట మెరుగుపర్చుకోవడంపైనే ఆమె దృష్టి పెట్టింది. అదే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.
1985 వచ్చే సరికి నాటి దిగ్గజాలు మార్టినా నవత్రిలోవా, క్రిస్ ఎవర్ట్‌ల కెరీర్ చరమాంకంలో ఉంది. వీరిద్దరి తర్వాత ఎవరు అంటూ చర్చ మొదలైన సమయంలో అందరికంటే ముందుగా వినిపించిన పేరు స్టెఫీగ్రాఫ్‌దే. 1986 ఫ్యామిలీ సర్కిల్ కప్ ఫైనల్లో ఎవర్ట్‌నే ఓడించి తొలి డబ్ల్యూటీఏ టైటిల్ గెలుచుకోవడంతో కొత్త శకం మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మయామీ ఓపెన్ లో క్రిస్ ఎవర్ట్‌తో పాటు మార్టినా నవ్రతిలోవాపై కూడా విజయం సాధించడంతో ఇక కొత్త టెన్నిస్ రాణి ఎవరనే ప్రశ్నకు సమాధానం లభించింది.
22లో మొదటిది..
ఒకే ఏడాది ఎనిమిది డబ్ల్యూటీఏ టైటిల్స్‌తో మహిళల టెన్నిస్‌లో స్టెఫీ గ్రాఫ్ ఆధిపత్యం మొదలైంది. అయితే అసలు ఆటలోకి ఆమె ఇంకా అడుగు పెట్టలేదు. అదే గ్రాండ్‌స్లామ్ విజయం. ఎన్ని ట్రోఫీలు అందుకున్నా, గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోకపోతే వాటికి లెక్క లేదనేది స్టెఫీకి బాగా తెలుసు. ఆ చిరస్మరణీయ క్షణం 1987లో వచ్చింది. ఆ ఏడాది అప్పటికే ఆరు టోర్నీలు గెలిచి అమితోత్సాహంతో ఉన్న గ్రాఫ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎదురు లేకుండా పోయింది.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో మార్టినా నవ్రతిలోవాను 6–4, 4–6, 8–6తో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ను స్టెఫీ ముద్దాడింది. పశ్చిమ జర్మనీలో టెన్నిస్ క్రీడపై ఆసక్తి పెరిగి, ప్రధాన క్రీడల్లో ఒకటిగా ఎదిగేందుకు ఈ విజయం కారణంగా నిలిచిందని అప్పటి మీడియా స్టెఫీ ఘనతను ప్రశంసించింది. అదే సంవత్సరం ఆగస్టు 17న తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ గా మారిన ఘనత.. మొత్తంగా 1302 రోజుల పాటు దిగ్విజయంగా సాగింది.
ఆల్‌టైమ్ గ్రేట్‌గా..
స్టెఫీని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టిన ఏడాది 1988. హార్డ్ కోర్టు, క్లే, గ్రాస్.. ఇలా మూడు రకాల కోర్ట్స్‌లో చెలరేగిపోతున్న స్టెఫీ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఏ టోర్నీ కోసం బరిలోకి దిగినా ఆమెదే విజయం అన్నట్లుగా మారిపోయింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే అదో గొప్ప ఘనతగా భావించే సమయమది. అప్పటికి టెన్నిస్ చరిత్రలో నలుగురు మాత్రమే దీనిని అందుకున్నారు. పురుషుల విభాగంలో డాన్ బడ్జ్, రాడ్ లేవర్ (రెండు సార్లు), మహిళల విభాగంలో మౌరీన్ కనోలీ, మార్గరెట్ కోర్ట్‌లకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఇందులో ఆఖరిది 1970లో వచ్చింది.
మారిన టెన్నిస్, పెరిగిన పోటీ నేపథ్యంలో ఎవరూ అంత నిలకడగా అన్ని గ్రాండ్‌స్లామ్‌లలో గెలవలేని పరిస్థితి. అయితే స్టెఫీ మాత్రం తానేంటో చూపించింది. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లు గెలిచి ఐదో ప్లేయర్‌గా తన పేరు ముద్రించుకుంది. అంతకు ముందు మరో అరుదైన ఘనతతో ఉన్నత స్థానంలో నిలిచింది స్టెఫీ. అదే ఒలింపిక్స్ స్వర్ణపతకం. సియోల్ ఒలింపిక్స్ ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి గాబ్రియెలా సబటిని (అర్జెంటీనా)ని ఓడించి ‘గోల్డెన్ స్లామ్’ అనే నామకరణానికి తాను కారణమైంది. ఇప్పటికీ 34 ఏళ్లు ముగిసినా మరెవరికీ అది సాధ్యం కాలేదంటే స్టెఫీ ప్రతిభ ఎంతటిదో అర్థమవుతోంది.
మరో దిగ్గజంతో జత కట్టి..
1999 ఫ్రెంచ్ ఓపెన్ .. మహిళల విభాగంలో స్టెఫీ విజేత కాగా, మరో వైపు పురుషుల సింగిల్స్‌లో అమెరికన్ స్టార్ ఆండ్రీ అగస్సీ చాంపియన్ . టైటిల్ గెలిచిన తర్వాత ఆటగాళ్లకు ఇచ్చే ‘డిన్నర్’లో ఇద్దరూ కలిశారు. స్టెఫీకి అది చివరి గ్రాండ్‌స్లామ్ (22వది) కాగా, అగస్సీకి నాలుగోది మాత్రమే. సర్క్యూట్‌లో పరిచయం ఉంది. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టెఫీ అంటే గౌరవం కూడా ఉంది అతనికి. కానీ ఈ సారి మాత్రం కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నారు.
దాంతో స్నేహం కాస్త బలపడింది. టెన్నిస్ జగత్తులో ఇద్దరు స్టార్ల మధ్య అనుబంధం అంత సులువు కాదు. అహం, ఆర్జన వంటివి తోడుగా వస్తాయి. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ బంధంగా మారింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత స్టెఫీ, అగస్సీ పెళ్లి చేసుకున్నారు. చివరకు ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లతో అగస్సీ ఆట ముగించాడు. వీరికి ఇద్దరు పిల్లలు. జర్మనీని వదిలి యూఎస్‌లో ఆమె స్థిరనివాసం ఏర్పరచుకుంది.
స్టెఫీగ్రాఫ్ విజయాల్లో కొన్ని..
- 22 గ్రాండ్‌స్లామ్‌ల విజేత (7 వింబుల్డన్, 6 ఫ్రెంచ్ ఓపెన్, 5 యూఎస్ ఓపెన్, 4 ఆస్ట్రేలియన్ ఓపెన్ ). ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన జాబితాలో రెండో స్థానం.
- కెరీర్‌లో మొత్తం సింగిల్స్ టైటిల్స్ సంఖ్య: 107 (ఓవరాల్‌గా అత్యధిక టైటిల్స్ జాబితాలో మూడో స్థానం)
- ప్రతి గ్రాండ్‌స్లామ్‌ను కనీసం 4 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్
- వరల్డ్ నంబర్‌వన్ గా అత్యధిక వారాల (377) పాటు సాగిన ఘనత. (ఇందులో వరుసగా 186 వారాల రికార్డు)
- ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు
Comments
Please login to add a commentAdd a comment