Steffi Graf
-
ఒకే ఏడాది 4 గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన ఆల్‌టైమ్ గ్రేట్
ఒక ఏడాదిలో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే కొందరికి అదే జీవితకాలపు ఘనత.. రెండు గెలిస్తే ఆనందం రెట్టింపు.. మూడు గెలిస్తే గొప్ప ఆటగాళ్ల సరసన చోటు.. ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే అది టెన్నిస్ చరిత్రలో ఐదుగురికి మాత్రమే సాధ్యమైన అసాధారణ ప్రదర్శన.. ఈ నాలుగుతో పాటు ఒలింపిక్ స్వర్ణం కూడా గెలిస్తే ఆ అద్భుతం పేరే స్టెఫీ గ్రాఫ్.. సుదీర్ఘ కాలం ఆటపై తనదైన ముద్ర వేసి పలు రికార్డులతో కెరీర్ గ్రాఫ్‌ను ఆకాశాన నిలిపి ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అనిపించుకున్న ఈ జర్మన్ స్టార్ సాధించిన ఘనతలెన్నో! 1999లో స్టెఫీగ్రాఫ్ ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు టెన్నిస్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఆమెకు 30 ఏళ్లే! అప్పటి ఆమె ఫిట్నెస్ స్థాయి, ఆటపరంగా చూస్తే అదేమీ పెద్ద వయసు కాదు. పైగా అంతకు రెండు నెలల క్రితమే ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె విజేతగా నిలిచింది. 19 ఏళ్ల వయసులో ఉత్సాహంగా చెలరేగుతున్న మార్టినా హింగిస్‌ను ఫైనల్లో ఓడించి మరీ టైటిల్ చేజిక్కించుకుంది. అనంతరం వింబుల్డన్ లోనూ ఫైనల్ చేరింది. మరికొన్నాళ్లు కొనసాగి ఉంటే మరింత ఘనత ఆమె ఖాతాలోకి చేరేదేమో! అయితే తాను అనుకున్న సమయంలో అనుకున్న తరహాలో ఆటను ముగించింది స్టెఫీ. ‘టెన్నిస్‌లో నేను సాధించాల్సిందంతా సాధించేశాను. ఇంకా ఏం మిగిలి లేదు. ఆటను ఇంకా ఆస్వాదించలేకపోతున్నాను. గతంలో ఉన్న ప్రేరణ కూడా కనిపించడం లేదు. మైదానంలోకి దిగుతున్నప్పుడు ఒక టోర్నీలో ఆడుతున్న భావనే రావడం లేదు’ అని ప్రకటించింది. నిజమే.. ఆమె కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన స్టెఫీ కెరీర్ గ్రాఫ్‌ను చూస్తే అంతా అద్భుతమే కనిపిస్తుంది. సీనియర్లను దాటి.. స్టెఫీ కెరీర్లో పెద్దగా ఒడిదుడుకుల్లేవ్. ఆరంభంలో సహజంగానే వచ్చే కొన్ని అడ్డంకులను దాటిన తర్వాత విజయప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆమెకు ఎదురు లేకుండా పోయింది. 13 ఏళ్ల వయసులో తొలి ప్రొఫెషనల్ టోర్నీ ఆడినప్పుడు ఆమె ప్రపంచ ర్యాంక్ 124. అయితే స్టెఫీ తండ్రి, తొలి కోచ్ పీటర్ గ్రాఫ్ ర్యాంకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. తర్వాతి రెండేళ్లు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా ఆట మెరుగుపర్చుకోవడంపైనే ఆమె దృష్టి పెట్టింది. అదే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. 1985 వచ్చే సరికి నాటి దిగ్గజాలు మార్టినా నవత్రిలోవా, క్రిస్ ఎవర్ట్ల కెరీర్ చరమాంకంలో ఉంది. వీరిద్దరి తర్వాత ఎవరు అంటూ చర్చ మొదలైన సమయంలో అందరికంటే ముందుగా వినిపించిన పేరు స్టెఫీగ్రాఫ్దే. 1986 ఫ్యామిలీ సర్కిల్ కప్ ఫైనల్లో ఎవర్ట్నే ఓడించి తొలి డబ్ల్యూటీఏ టైటిల్ గెలుచుకోవడంతో కొత్త శకం మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మయామీ ఓపెన్ లో క్రిస్ ఎవర్ట్‌తో పాటు మార్టినా నవ్రతిలోవాపై కూడా విజయం సాధించడంతో ఇక కొత్త టెన్నిస్ రాణి ఎవరనే ప్రశ్నకు సమాధానం లభించింది. 22లో మొదటిది.. ఒకే ఏడాది ఎనిమిది డబ్ల్యూటీఏ టైటిల్స్‌తో మహిళల టెన్నిస్‌లో స్టెఫీ గ్రాఫ్ ఆధిపత్యం మొదలైంది. అయితే అసలు ఆటలోకి ఆమె ఇంకా అడుగు పెట్టలేదు. అదే గ్రాండ్‌స్లామ్ విజయం. ఎన్ని ట్రోఫీలు అందుకున్నా, గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోకపోతే వాటికి లెక్క లేదనేది స్టెఫీకి బాగా తెలుసు. ఆ చిరస్మరణీయ క్షణం 1987లో వచ్చింది. ఆ ఏడాది అప్పటికే ఆరు టోర్నీలు గెలిచి అమితోత్సాహంతో ఉన్న గ్రాఫ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎదురు లేకుండా పోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో మార్టినా నవ్రతిలోవాను 6–4, 4–6, 8–6తో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ను స్టెఫీ ముద్దాడింది. పశ్చిమ జర్మనీలో టెన్నిస్ క్రీడపై ఆసక్తి పెరిగి, ప్రధాన క్రీడల్లో ఒకటిగా ఎదిగేందుకు ఈ విజయం కారణంగా నిలిచిందని అప్పటి మీడియా స్టెఫీ ఘనతను ప్రశంసించింది. అదే సంవత్సరం ఆగస్టు 17న తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ గా మారిన ఘనత.. మొత్తంగా 1302 రోజుల పాటు దిగ్విజయంగా సాగింది. ఆల్‌టైమ్ గ్రేట్‌గా.. స్టెఫీని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టిన ఏడాది 1988. హార్డ్ కోర్టు, క్లే, గ్రాస్.. ఇలా మూడు రకాల కోర్ట్స్‌లో చెలరేగిపోతున్న స్టెఫీ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఏ టోర్నీ కోసం బరిలోకి దిగినా ఆమెదే విజయం అన్నట్లుగా మారిపోయింది. ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే అదో గొప్ప ఘనతగా భావించే సమయమది. అప్పటికి టెన్నిస్ చరిత్రలో నలుగురు మాత్రమే దీనిని అందుకున్నారు. పురుషుల విభాగంలో డాన్ బడ్జ్, రాడ్ లేవర్ (రెండు సార్లు), మహిళల విభాగంలో మౌరీన్ కనోలీ, మార్గరెట్ కోర్ట్లకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఇందులో ఆఖరిది 1970లో వచ్చింది. మారిన టెన్నిస్, పెరిగిన పోటీ నేపథ్యంలో ఎవరూ అంత నిలకడగా అన్ని గ్రాండ్‌స్లామ్‌లలో గెలవలేని పరిస్థితి. అయితే స్టెఫీ మాత్రం తానేంటో చూపించింది. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లు గెలిచి ఐదో ప్లేయర్‌గా తన పేరు ముద్రించుకుంది. అంతకు ముందు మరో అరుదైన ఘనతతో ఉన్నత స్థానంలో నిలిచింది స్టెఫీ. అదే ఒలింపిక్స్ స్వర్ణపతకం. సియోల్ ఒలింపిక్స్ ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి గాబ్రియెలా సబటిని (అర్జెంటీనా)ని ఓడించి ‘గోల్డెన్ స్లామ్’ అనే నామకరణానికి తాను కారణమైంది. ఇప్పటికీ 34 ఏళ్లు ముగిసినా మరెవరికీ అది సాధ్యం కాలేదంటే స్టెఫీ ప్రతిభ ఎంతటిదో అర్థమవుతోంది. మరో దిగ్గజంతో జత కట్టి.. 1999 ఫ్రెంచ్ ఓపెన్ .. మహిళల విభాగంలో స్టెఫీ విజేత కాగా, మరో వైపు పురుషుల సింగిల్స్‌లో అమెరికన్ స్టార్ ఆండ్రీ అగస్సీ చాంపియన్ . టైటిల్ గెలిచిన తర్వాత ఆటగాళ్లకు ఇచ్చే ‘డిన్నర్’లో ఇద్దరూ కలిశారు. స్టెఫీకి అది చివరి గ్రాండ్‌స్లామ్ (22వది) కాగా, అగస్సీకి నాలుగోది మాత్రమే. సర్క్యూట్లో పరిచయం ఉంది. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టెఫీ అంటే గౌరవం కూడా ఉంది అతనికి. కానీ ఈ సారి మాత్రం కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నారు. దాంతో స్నేహం కాస్త బలపడింది. టెన్నిస్ జగత్తులో ఇద్దరు స్టార్ల మధ్య అనుబంధం అంత సులువు కాదు. అహం, ఆర్జన వంటివి తోడుగా వస్తాయి. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ బంధంగా మారింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత స్టెఫీ, అగస్సీ పెళ్లి చేసుకున్నారు. చివరకు ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లతో అగస్సీ ఆట ముగించాడు. వీరికి ఇద్దరు పిల్లలు. జర్మనీని వదిలి యూఎస్‌లో ఆమె స్థిరనివాసం ఏర్పరచుకుంది. స్టెఫీగ్రాఫ్ విజయాల్లో కొన్ని.. 22 గ్రాండ్‌స్లామ్‌ల విజేత (7 వింబుల్డన్, 6 ఫ్రెంచ్ ఓపెన్, 5 యూఎస్ ఓపెన్, 4 ఆస్ట్రేలియన్ ఓపెన్ ). ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన జాబితాలో రెండో స్థానం. కెరీర్లో మొత్తం సింగిల్స్ టైటిల్స్ సంఖ్య: 107 (ఓవరాల్‌గా అత్యధిక టైటిల్స్ జాబితాలో మూడో స్థానం) ప్రతి గ్రాండ్‌స్లామ్‌ను కనీసం 4 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ వరల్డ్ నంబర్‌వన్ గా అత్యధిక వారాల (377) పాటు సాగిన ఘనత. (ఇందులో వరుసగా 186 వారాల రికార్డు) ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు -
‘గోల్డెన్’ గ్రాఫ్...
టెన్నిస్ ప్రపంచంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజయం సాధించడమే పెద్ద ఘనత. ఒక్క ట్రోఫీతోనే జీవితకాలం సంతృప్తి పొందేవారు ఎందరో. అలాంటిది ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం అంటే దిగ్గజాలకు మాత్రమే సాధ్యం. చరిత్రలో కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను చేసి చూపించగా... వారిలో జర్మనీ స్టార్ స్టెఫీ గ్రాఫ్ ప్రదర్శన మరింత ప్రత్యేకం. 1988లో స్టెఫీ గ్రాఫ్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు అదే ఏడాది ప్రతిష్టాత్మక సియోల్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించింది. తద్వారా ఇలాంటి అరుదైన రికార్డు సృష్టించిన ఏకైక ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. స్టెఫీ గ్రాఫ్ సృష్టించిన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ రికార్డుకు మరో ప్రత్యేకత ఉంది. స్టెఫీకి ముందు ఈ ఫీట్ చేసిన మిగతా నలుగురు 1978కి ముందు చేసినవారే. 1978 నుంచే మూడు సర్ఫేస్‌లలో గ్రాండ్‌స్లామ్ జరుగుతోంది. అప్పటివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ పచ్చికపై, యూఎస్ ఓపెన్ మట్టి కోర్టులపై జరిగేవి. తర్వాత ఈ రెండు వేదికలు కూడా హార్డ్ కోర్టులుగా (స్వల్ప తేడా ఉంటుంది) మారాయి. అలా అన్ని తరహా కోర్టుల్లో గ్రాండ్‌స్లామ్ సాధించిన ఘనత స్టెఫీకే చెల్లింది. తర్వాతి రోజుల్లో ఇలా గెలవడం అసాధ్యంగా మారిపోవడంతో ఒకే ఏడాది కాకపోయినా... ఏదో ఒక సమయంలో గ్రాండ్‌స్లామ్ గెలవడమే గొప్పగా మారింది. దానినే టెన్నిస్ ప్రపంచం ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ అంటూ వ్యవహరించడం మొదలుపెట్టింది. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టెఫీ గ్రాఫ్ తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను 1987లో ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో సాధించింది. 1983లో తొలిసారి ‘మేజర్’ బరిలోకి దిగినా తొలి నాలుగేళ్లలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్ మాత్రమే. 1987 ఆగస్టు 17న తొలిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్టెఫీ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆపై ఆమె సాధించిన రికార్డులు, ఘనతలకు లెక్కే లేదు. నాలుగుకు నాలుగు... ర్యాంకుల్లో అగ్రస్థానంతో ఏడాదిని మొదలుపెట్టిన స్టెఫీ ‘గ్రాఫ్’ అమిత వేగంతో ఎదురు లేకుండా దూసుకుపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 6–1, 7–6 (7/3)తో నాటి అమెరికా దిగ్గజం క్రిస్ ఎవర్ట్‌ను ఓడించి టైటిల్ అందుకుంది. టోర్నీలో ఆమె ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. ఆపై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రెంచ్ ఓపెన్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో కేవలం 34 నిమిషాల్లో 6–0, 6–0తో నటాషా జ్వెరేవా (సోవియట్ యూనియన్)ను చిత్తుచిత్తుగా ఓడించింది. 1911 తర్వాత ‘డబుల్ బేగల్’తో ఒక గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. టెన్నిస్ పరిభాషలో ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా సెట్ గెలిస్తే బేగల్ అంటారు. వింబుల్డన్‌లో స్టెఫీకి మరో విజయం దక్కింది. ఫైనల్లో స్టెఫీ 5–7, 6–2, 6–1తో వరుసగా ఆరుసార్లు (1982–87) టైటిల్ సాధించి జోరు మీదున్న మార్టినా నవ్రతిలోవా (అమెరికా)ను బోల్తా కొట్టించడంతో ఈ జర్మనీ అమ్మాయి పేరు మారుమోగిపోయింది. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ఫైనల్లో స్టెఫీ 6–3, 3–6, 6–1తో గాబ్రియెలా సబాటిని (అర్జెంటీనా)పై నెగ్గడంతో ఆమె ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత పూర్తయింది. ఒలింపిక్ వేటలో... యూఎస్ ఓపెన్ ఫైనల్ ముగిసిన తర్వాత వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఒలింపిక్స్ జరిగాయి. ఇన్ని ఘనతలు సాధించిన తర్వాత ఇంత తక్కువ వ్యవధి ఉంటే ఈతరం ఆటగాళ్లు విశ్రాంతి పేరుతో ఒలింపిక్స్‌కే చివరి నిమిషంలో డుమ్మా కొట్టేవారేమో. కానీ స్టెఫీ అలా చేయలేదు. న్యూయార్క్ నుంచి హడావుడిగా స్వదేశం వెళ్లి ఒకే ఒక రోజు విరామం తర్వాత తమ పశ్చిమ జర్మనీ దేశపు ఇతర అథ్లెట్లతో కలిసి ఒలింపిక్స్ వెళ్లే విమానం ఎక్కింది. దేశం కోసం సాధించే పతకానికి తన దృష్టిలో చాలా విలువ ఉందని ఆమె చూపించింది. గ్రాండ్‌స్లామ్ ఫామ్‌ను ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తూ దూసుకుపోయింది. ఒక్క క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఆమెకు కాస్త పోటీ ఎదురైంది. సోవియట్ యూనియన్‌కు చెందిన లారిసా సావ్చెంకోకు ఒక సెట్ చేజార్చుకొని చివరకు మ్యాచ్ గెలుచుకుంది. ఫైనల్లో ఆమెకు మరోసారి అర్జెంటీనా అందగత్తె సబాటిని ఎదురైంది. కొద్ది రోజుల క్రితమే హోరాహోరీగా సాగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆమెను ఓడించిన గ్రాఫ్‌కు ఈసారి ఎదురులేకుండా పోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో స్టెఫీ 6–3, 6–3తో సబాటినిపై గెలుపొంది శిఖరాన నిలిచింది. స్టెఫీ గ్రాఫ్ సాధించిన అద్భుతాన్ని పొగుడుతూ ప్రపంచ మీడియా తొలిసారి ‘గోల్డెన్ స్లామ్’ అనే పదాన్ని ఉపయోగించింది. అది ఆమె కోసమే పుట్టిందన్నట్లుగా మరో ప్లేయర్ కోసం దానిని వాడాల్సిన అవసరం లేకపోయింది. పురుషులు, మహిళల విభాగాల్లోనూ ఇప్పటికీ మరెవరూ అందుకోలేని ఘనతగా ‘గోల్డెన్‌స్లామ్’ నిలిచిపోయింది. -
సెరెనా కొత్త ‘స్లామ్’ రికార్డు సృష్టిస్తుంది: స్టెఫీ
జుహై (చైనా): అమెరికన్ వెటరన్ స్టార్ సెరెనా విలియమ్స్ తిరిగి కోర్టులోకి దిగితే సరికొత్త గ్రాండ్‌స్లామ్ రికార్డును నెలకొల్పుతుందని టెన్నిస్ లెజెండ్ స్టెఫీగ్రాఫ్ అన్నారు. ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చిన సెరెనా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు దూరమైంది. ఇక్కడ జరుగుతున్న డబ్ల్యూటీఏ ఎలైట్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న స్టెఫీగ్రాఫ్ మీడియాతో మాట్లాడుతూ ‘సెరెనా బరిలోకి దిగితే టెన్నిస్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్ నెలకొల్పిన 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును చెరిపేస్తుంది’ అని చెప్పారు. ఇప్పటికే అమెరికన్ స్టార్ 23 టైటిళ్లతో స్టెఫీగ్రాఫ్ (22) రికార్డును అధిగమించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు సెరెనా వచ్చే జనవరిలో జరిగే ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ఆడాలని ఆశిస్తున్నారు. ఈ ఏడాది రెండు వారాల గర్భంతో ఆస్ట్రేలియన్ బరిలోకి దిగిన ఆమె టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. -
సెరెనాపై స్టెఫీగ్రాఫ్ ప్రశంసలు
లండన్: గత రెండు రోజుల క్రితం వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌పై మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ ప్రశంసల వర్షం కురిపించింది. ఓపెన్ శకంలో 22 గ్రాండ్ స్లామ్ల సాధించి తన రికార్డును సమం చేసిన సెరెనా ప్రదర్శన ఆద్యంతం అద్భుతమని స్టెఫీగ్రాఫ్ కొనియాడింది. 'వింబుల్డన్‌లో సెరెనా అసాధారణ ఆటతో అదరగొట్టింది. ఈ తాజా విజయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నఅన్నిరకాల అభిమానులకూ సెరెనా అపూరమైన కానుక ఇచ్చింది' అని స్టెఫీగ్రాఫ్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఫైనల్లో సెరెనా చేతిలో ఓటమి పాలైన తన దేశానికి చెందిన కెర్బర్ ప్రదర్శనను కూడా స్టెఫీగ్రాఫ్ ప్రశంసించింది. ఆమె పోరాట తీరుకు జర్మనీ గర్వపడుతుందని తెలిపింది. శనివారం జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో సెరెనా జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. తుది పోరులో కెర్బర్ ను వరుస సెట్లలో ఓడించి టైటిల్ సాధించింది. దీంతో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్న సెరెనా.. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో స్టెఫీ గ్రాఫ్ సరసన నిలిచింది. -
కేరళ బ్రాండ్ అంబాసిడర్ గా స్టెఫీగ్రాఫ్
తిరువనంతపురం: జర్మనీ టెన్నిస్ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ కేరళ ఆయుర్వేద వైద్యం ప్రచారకర్తగా నియమితులయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన ఆటతో అభిమానుల అలరించిన 46 ఏళ్ల స్టెఫీగ్రాఫ్ ను కేరళ ప్రభుత్వం ఆయుర్వేద బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ బుధవారం తెలిపారు. 'విజిట్స్ కేరళ స్కీమ్'లో భాగంగా స్టెఫీగ్రాఫ్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు కేరళ పర్యాటక సంస్థకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. టూరిజం బోర్డు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు సాగించి, ఒప్పందం కుదుర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఈ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి 1999లో టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. మాజీ నంబర్ వన్ ఆటగాడు ఆండ్రీ ఆగసీని 2001, అక్టోబర్ లో ఆమె వివాహం చేసుకుంది. -
స్టెఫీగ్రాఫ్ తండ్రి పీటర్ మృతి
జర్మనీ టెన్నిస్ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ తండ్రి పీటర్ గ్రాఫ్ కేన్సర్ వ్యాధితో మరణించారు. మాన్హీమ్లో ఆదివారం రాత్రి పీటర్ (73) చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. స్టెఫీగ్రాఫ్ అత్యున్నత దశకు చేరుకోవడానికి పీటర్ ఎంతో కృషి చేశారు. స్టీఫ్ కెరీర్ కొనసాగించిన సమయంలో ఆమె వెన్నంటే ఉంటూ ప్రోత్సహించారు. కూతురుకు పీటర్ కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరించారు. 1997లో పన్ను ఎగువేత కేసులో పీటర్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ సమయంలో తండ్రికూతుళ్ల మధ్య అంతరం ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఏడాది శిక్ష అనుభవించిన పీటర్ ఇటీవల కాలంలో విదేశీ టెన్నిస్ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. తన కెరీర్లో రికార్డు స్థాయిలో 22 గాండ్ర్స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న స్టెఫీగ్రాఫ్ టెన్నిస్ స్టార్ ఆండ్రీ అగస్సీని పెళ్లి చేసుకుంది.