లండన్: గత రెండు రోజుల క్రితం వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ను సాధించిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్పై మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ ప్రశంసల వర్షం కురిపించింది. ఓపెన్ శకంలో 22 గ్రాండ్ స్లామ్ల సాధించి తన రికార్డును సమం చేసిన సెరెనా ప్రదర్శన ఆద్యంతం అద్భుతమని స్టెఫీగ్రాఫ్ కొనియాడింది.
'వింబుల్డన్లో సెరెనా అసాధారణ ఆటతో అదరగొట్టింది. ఈ తాజా విజయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నఅన్నిరకాల అభిమానులకూ సెరెనా అపూరమైన కానుక ఇచ్చింది' అని స్టెఫీగ్రాఫ్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఫైనల్లో సెరెనా చేతిలో ఓటమి పాలైన తన దేశానికి చెందిన కెర్బర్ ప్రదర్శనను కూడా స్టెఫీగ్రాఫ్ ప్రశంసించింది. ఆమె పోరాట తీరుకు జర్మనీ గర్వపడుతుందని తెలిపింది. శనివారం జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో సెరెనా జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. తుది పోరులో కెర్బర్ ను వరుస సెట్లలో ఓడించి టైటిల్ సాధించింది. దీంతో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్న సెరెనా.. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో స్టెఫీ గ్రాఫ్ సరసన నిలిచింది.