Olympic gold
-
అరుదైన ఒలింపిక్ స్వర్ణానికి రూ.5 కోట్లు
బోస్టన్: అమెరికా గడ్డపై 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ నాటి బంగారు పతకం శుక్రవారం వేలంలో దాదాపు రూ.5 కోట్లు పలికింది! దానిపై ‘ఒలింపియాడ్, 1904’అని రాసుంది. ముందువైపు విజేత పుష్పగుచ్ఛం పట్టుకొని ఉండగా వెనకవైపు పురాతన గ్రీస్‌లో విజయానికి అధిదేవత నైక్, దేవతల రాజు జ్యూస్ ఉన్నారు.దీన్ని అమెరికన్ అథ్లెట్ ఫ్రెడ్షూల్కు ప్రదానం చేశారు. ఆ ఒలింపిక్స్‌లో అమెరికన్లు 96 ఈవెంట్లలో ఏకంగా 78 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నేటి ఒలింపిక్స్ వెండిపై బంగారు పూత పూసిన పతకాలిస్తున్నారు. అప్పట్లో మాత్రం అచ్చమైన బంగారంతో చేసిన పతకాలే ఇచ్చేవారు. ఇలాంటి పతకాలు వేలానికి రావడం అసాధారణమని వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్ పేర్కొంది.2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకంతో పాటు 1932, 1964, 1998 2012 ఒలింపిక్స్ పతకాలతో సహా వందలాది ఒలింపిక్ వస్తువులు వేలంలో అమ్మకానికి వచ్చాయి. ఒలింపిక్ స్మృతి చిహ్నాలకు ఎప్పటినుంచో మంచి ధర లభిస్తోంది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలెస్‌లో జరగనున్నాయి. ఈ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుండటం 1932, 1984 తరువాత ఇది మూడోసారి.ఇదీ చదవండి: రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్ -
ఒకే ఏడాది 4 గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన ఆల్‌టైమ్ గ్రేట్
ఒక ఏడాదిలో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే కొందరికి అదే జీవితకాలపు ఘనత.. రెండు గెలిస్తే ఆనందం రెట్టింపు.. మూడు గెలిస్తే గొప్ప ఆటగాళ్ల సరసన చోటు.. ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే అది టెన్నిస్ చరిత్రలో ఐదుగురికి మాత్రమే సాధ్యమైన అసాధారణ ప్రదర్శన.. ఈ నాలుగుతో పాటు ఒలింపిక్ స్వర్ణం కూడా గెలిస్తే ఆ అద్భుతం పేరే స్టెఫీ గ్రాఫ్.. సుదీర్ఘ కాలం ఆటపై తనదైన ముద్ర వేసి పలు రికార్డులతో కెరీర్ గ్రాఫ్‌ను ఆకాశాన నిలిపి ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అనిపించుకున్న ఈ జర్మన్ స్టార్ సాధించిన ఘనతలెన్నో! 1999లో స్టెఫీగ్రాఫ్ ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు టెన్నిస్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఆమెకు 30 ఏళ్లే! అప్పటి ఆమె ఫిట్నెస్ స్థాయి, ఆటపరంగా చూస్తే అదేమీ పెద్ద వయసు కాదు. పైగా అంతకు రెండు నెలల క్రితమే ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె విజేతగా నిలిచింది. 19 ఏళ్ల వయసులో ఉత్సాహంగా చెలరేగుతున్న మార్టినా హింగిస్‌ను ఫైనల్లో ఓడించి మరీ టైటిల్ చేజిక్కించుకుంది. అనంతరం వింబుల్డన్ లోనూ ఫైనల్ చేరింది. మరికొన్నాళ్లు కొనసాగి ఉంటే మరింత ఘనత ఆమె ఖాతాలోకి చేరేదేమో! అయితే తాను అనుకున్న సమయంలో అనుకున్న తరహాలో ఆటను ముగించింది స్టెఫీ. ‘టెన్నిస్‌లో నేను సాధించాల్సిందంతా సాధించేశాను. ఇంకా ఏం మిగిలి లేదు. ఆటను ఇంకా ఆస్వాదించలేకపోతున్నాను. గతంలో ఉన్న ప్రేరణ కూడా కనిపించడం లేదు. మైదానంలోకి దిగుతున్నప్పుడు ఒక టోర్నీలో ఆడుతున్న భావనే రావడం లేదు’ అని ప్రకటించింది. నిజమే.. ఆమె కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన స్టెఫీ కెరీర్ గ్రాఫ్‌ను చూస్తే అంతా అద్భుతమే కనిపిస్తుంది. సీనియర్లను దాటి.. స్టెఫీ కెరీర్లో పెద్దగా ఒడిదుడుకుల్లేవ్. ఆరంభంలో సహజంగానే వచ్చే కొన్ని అడ్డంకులను దాటిన తర్వాత విజయప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆమెకు ఎదురు లేకుండా పోయింది. 13 ఏళ్ల వయసులో తొలి ప్రొఫెషనల్ టోర్నీ ఆడినప్పుడు ఆమె ప్రపంచ ర్యాంక్ 124. అయితే స్టెఫీ తండ్రి, తొలి కోచ్ పీటర్ గ్రాఫ్ ర్యాంకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. తర్వాతి రెండేళ్లు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా ఆట మెరుగుపర్చుకోవడంపైనే ఆమె దృష్టి పెట్టింది. అదే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. 1985 వచ్చే సరికి నాటి దిగ్గజాలు మార్టినా నవత్రిలోవా, క్రిస్ ఎవర్ట్ల కెరీర్ చరమాంకంలో ఉంది. వీరిద్దరి తర్వాత ఎవరు అంటూ చర్చ మొదలైన సమయంలో అందరికంటే ముందుగా వినిపించిన పేరు స్టెఫీగ్రాఫ్దే. 1986 ఫ్యామిలీ సర్కిల్ కప్ ఫైనల్లో ఎవర్ట్నే ఓడించి తొలి డబ్ల్యూటీఏ టైటిల్ గెలుచుకోవడంతో కొత్త శకం మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మయామీ ఓపెన్ లో క్రిస్ ఎవర్ట్‌తో పాటు మార్టినా నవ్రతిలోవాపై కూడా విజయం సాధించడంతో ఇక కొత్త టెన్నిస్ రాణి ఎవరనే ప్రశ్నకు సమాధానం లభించింది. 22లో మొదటిది.. ఒకే ఏడాది ఎనిమిది డబ్ల్యూటీఏ టైటిల్స్‌తో మహిళల టెన్నిస్‌లో స్టెఫీ గ్రాఫ్ ఆధిపత్యం మొదలైంది. అయితే అసలు ఆటలోకి ఆమె ఇంకా అడుగు పెట్టలేదు. అదే గ్రాండ్‌స్లామ్ విజయం. ఎన్ని ట్రోఫీలు అందుకున్నా, గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోకపోతే వాటికి లెక్క లేదనేది స్టెఫీకి బాగా తెలుసు. ఆ చిరస్మరణీయ క్షణం 1987లో వచ్చింది. ఆ ఏడాది అప్పటికే ఆరు టోర్నీలు గెలిచి అమితోత్సాహంతో ఉన్న గ్రాఫ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎదురు లేకుండా పోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో మార్టినా నవ్రతిలోవాను 6–4, 4–6, 8–6తో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ను స్టెఫీ ముద్దాడింది. పశ్చిమ జర్మనీలో టెన్నిస్ క్రీడపై ఆసక్తి పెరిగి, ప్రధాన క్రీడల్లో ఒకటిగా ఎదిగేందుకు ఈ విజయం కారణంగా నిలిచిందని అప్పటి మీడియా స్టెఫీ ఘనతను ప్రశంసించింది. అదే సంవత్సరం ఆగస్టు 17న తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ గా మారిన ఘనత.. మొత్తంగా 1302 రోజుల పాటు దిగ్విజయంగా సాగింది. ఆల్‌టైమ్ గ్రేట్‌గా.. స్టెఫీని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టిన ఏడాది 1988. హార్డ్ కోర్టు, క్లే, గ్రాస్.. ఇలా మూడు రకాల కోర్ట్స్‌లో చెలరేగిపోతున్న స్టెఫీ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఏ టోర్నీ కోసం బరిలోకి దిగినా ఆమెదే విజయం అన్నట్లుగా మారిపోయింది. ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే అదో గొప్ప ఘనతగా భావించే సమయమది. అప్పటికి టెన్నిస్ చరిత్రలో నలుగురు మాత్రమే దీనిని అందుకున్నారు. పురుషుల విభాగంలో డాన్ బడ్జ్, రాడ్ లేవర్ (రెండు సార్లు), మహిళల విభాగంలో మౌరీన్ కనోలీ, మార్గరెట్ కోర్ట్లకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఇందులో ఆఖరిది 1970లో వచ్చింది. మారిన టెన్నిస్, పెరిగిన పోటీ నేపథ్యంలో ఎవరూ అంత నిలకడగా అన్ని గ్రాండ్‌స్లామ్‌లలో గెలవలేని పరిస్థితి. అయితే స్టెఫీ మాత్రం తానేంటో చూపించింది. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లు గెలిచి ఐదో ప్లేయర్‌గా తన పేరు ముద్రించుకుంది. అంతకు ముందు మరో అరుదైన ఘనతతో ఉన్నత స్థానంలో నిలిచింది స్టెఫీ. అదే ఒలింపిక్స్ స్వర్ణపతకం. సియోల్ ఒలింపిక్స్ ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి గాబ్రియెలా సబటిని (అర్జెంటీనా)ని ఓడించి ‘గోల్డెన్ స్లామ్’ అనే నామకరణానికి తాను కారణమైంది. ఇప్పటికీ 34 ఏళ్లు ముగిసినా మరెవరికీ అది సాధ్యం కాలేదంటే స్టెఫీ ప్రతిభ ఎంతటిదో అర్థమవుతోంది. మరో దిగ్గజంతో జత కట్టి.. 1999 ఫ్రెంచ్ ఓపెన్ .. మహిళల విభాగంలో స్టెఫీ విజేత కాగా, మరో వైపు పురుషుల సింగిల్స్‌లో అమెరికన్ స్టార్ ఆండ్రీ అగస్సీ చాంపియన్ . టైటిల్ గెలిచిన తర్వాత ఆటగాళ్లకు ఇచ్చే ‘డిన్నర్’లో ఇద్దరూ కలిశారు. స్టెఫీకి అది చివరి గ్రాండ్‌స్లామ్ (22వది) కాగా, అగస్సీకి నాలుగోది మాత్రమే. సర్క్యూట్లో పరిచయం ఉంది. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టెఫీ అంటే గౌరవం కూడా ఉంది అతనికి. కానీ ఈ సారి మాత్రం కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నారు. దాంతో స్నేహం కాస్త బలపడింది. టెన్నిస్ జగత్తులో ఇద్దరు స్టార్ల మధ్య అనుబంధం అంత సులువు కాదు. అహం, ఆర్జన వంటివి తోడుగా వస్తాయి. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ బంధంగా మారింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత స్టెఫీ, అగస్సీ పెళ్లి చేసుకున్నారు. చివరకు ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లతో అగస్సీ ఆట ముగించాడు. వీరికి ఇద్దరు పిల్లలు. జర్మనీని వదిలి యూఎస్‌లో ఆమె స్థిరనివాసం ఏర్పరచుకుంది. స్టెఫీగ్రాఫ్ విజయాల్లో కొన్ని.. 22 గ్రాండ్‌స్లామ్‌ల విజేత (7 వింబుల్డన్, 6 ఫ్రెంచ్ ఓపెన్, 5 యూఎస్ ఓపెన్, 4 ఆస్ట్రేలియన్ ఓపెన్ ). ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన జాబితాలో రెండో స్థానం. కెరీర్లో మొత్తం సింగిల్స్ టైటిల్స్ సంఖ్య: 107 (ఓవరాల్‌గా అత్యధిక టైటిల్స్ జాబితాలో మూడో స్థానం) ప్రతి గ్రాండ్‌స్లామ్‌ను కనీసం 4 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ వరల్డ్ నంబర్‌వన్ గా అత్యధిక వారాల (377) పాటు సాగిన ఘనత. (ఇందులో వరుసగా 186 వారాల రికార్డు) ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు -
తిరుగులేని బోల్ట్
రియోడిజనీరో:జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. రియోలో రెండో స్వర్ణాన్ని సాధించి తనకు తిరుగులేదని నిరూపించాడు. తాజాగా జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో 19.78 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి... మరో స్వర్ణ పతకాన్ని ఉసేన్ తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే రియోలో 100 మీటర్ల పరుగులో ఉసేన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న బోల్ట్.. 200 మీటర్ల రేసులో కూడా ఆద్యంత దుమ్మురేపాడు. దీంతో అతని ఖాతాలో వరుసగా ఎనిమిదో ఒలింపిక్స్ స్వర్ణం చేరింది. తాజా ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగులో పసిడిని సొంతం చేసుకున్నబోల్ట్.. 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 100 మీ. ఈవెంట్ లో వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రియోలో బోల్ట్ ముందు 4x 100 జట్టు రేసు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా పసిడి సాధిస్తే ఒలింపిక్స్ లో అపజయమే లేని ధీరుడిగా బోల్ట్ నిలిచిపోతాడు. -
క్యాన్సర్‌నే గెలిచాడు
54 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన లాంజ్ రిటైర్మెంట్కు చేరువగా ఉన్న వయసు అది... చాలా మంది మనవళ్లతో ఆడుకుంటే చాలనుకునే వయసు... ఇలాంటప్పుడు క్యాన్సర్‌లాంటి ప్రమాదకర వ్యాధి కూడా వస్తే..? ఇక మంచంపైనే వారి ప్రపంచం ముగిసిపోతుంది. కానీ 54 ఏళ్ల సాంటియాగో లాంజ్ అలా అనుకోలేదు. సముద్రపు అలలతో పోరాటం చేశాడు... టీవీ చూస్తూ ఒలింపిక్స్ కబుర్లు చెప్పుకునే సీనియర్ సిటిజన్లకు సవాల్ విసిరాడు. ఆరో సారి ఒలింపిక్స్ బరిలోకి దిగడమే కాదు, సెయిలింగ్‌లో ఏకంగా స్వర్ణం కూడా సాధించేశాడు. మాటల్లోనూ, రికార్డు పుస్తకాల్లోనూ విశ్లేషించలేని గొప్ప ఘనత ఇది. వయసు పెరిగినా వన్నె తగ్గని ఒక ‘కుర్రాడు’ ఇచ్చే స్ఫూర్తి ఇది. అర్జెంటీనాకు చెందిన సాంటియాగో రౌల్ లాంజ్ వృత్తిరీత్యా నావల్ ఇంజినీర్. నిరంతరం నీటితో సహవాసం చేసే ఆ ఉద్యోగమే అతడిని సెయిలింగ్ వైపు మళ్లించింది. దాంతో ఆటపై పట్టు పెంచుకున్న అతను 1988లోనే తొలిసారి దేశం తరఫున ఒలింపిక్స్ బరిలోకి దిగాడు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు 1996, 2000, 2004, 2008లలో కూడా లాంజ్ ఒలింపిక్స్‌లో పోటీ పడ్డాడు. ఈ ఐదు ప్రయత్నాల్లో కలిపి టోర్నడో విభాగంలో అతను రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. రెండు వేర్వేరు విభాగాల్లో నాలుగు సార్లు అతనికి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కూడా దక్కింది. క్యాన్సర్‌తో పోరాటం గతేడాది సాంటియాగోకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకింది. ఒక వైపు ప్రమాదకరమైన వ్యాధి, రెండో వైపు మళ్లీ పిలుస్తున్న పడవ... తీవ్రమైన మానసిక సంఘర్షణ తర్వాత అతను పోరాడాలని నిర్ణయించుకున్నాడు. తన గత ఐదు ఒలింపిక్స్ అనుభవాలనే స్ఫూర్తిగా తీసుకున్నాడు. చికిత్సలో భాగంగా ఆరు నెలల తర్వాత స్పెయిన్‌లోని బార్సిలోనాలో అతనికి ఆపరేషన్ జరిగింది. ఊపిరితిత్తిలో కొంత భాగం కూడా తీసేయాల్సి వచ్చింది. అయితే ఐదు రోజులకే సైక్లింగ్ చేసి తన ఆరోగ్యాన్ని అంచనా వేసుకున్నాడు. నెల రోజులకే మళ్లీ సెయిలింగ్ కోసం నీటి వైపు కదిలాడు. రియో లక్ష్యంగా సాధన చేసి చివరకు క్వాలిఫై అయ్యాడు. 29 ఏళ్ల సిసిలియా సరోలీతో జత కట్టి సాంటియాగో.... నాక్రా 17 మిక్స్డ్ కేటగిరీలో దూసుకుపోయాడు. అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం అందుకున్న సాంటియాగో... రియో ఒలింపిక్స్‌లో ఎక్కువ వయసులో పసిడి సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఉద్వేగభరిత క్షణాలు 54 ఏళ్ల వయసులో సాంటియాగో ఉత్సాహం, పోరాటం చూసి సెయిలింగ్ భాగస్వామి సరోలీ కూడా ఆశ్చర్యానికి లోనైంది. ‘ఇలాంటి వ్యక్తిని మనం ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండం. ప్రాణాలు తీసే వ్యాధి తర్వాత కూడా అతను ఈ రకంగా సెయిలింగ్ చేయడం నిజంగా గ్రేట్. అతనికి భాగస్వామిగా బరిలోకి దిగడం నా అదృష్టం’ అని ఆమె చెప్పింది. సెయిలింగ్‌లోనే మరో ఈవెంట్లో అతని ఇద్దరు కొడుకులు యాగో, క్లౌజ్ కూడా పోటీ పడటం మరో విశేషం. సాంటియాగో విజేతగా నిలిచాడని తెలియగానే తీరాన ఆ కుటుంబం చేసుకున్న సంబరాలకు అంతు లేకుండా పోయింది. నాన్న ప్రపంచాన్ని గెలిచాడన్న పిల్లల ఆనందం, చచ్చిపోతానేమో అనుకునే స్థితినుంచి కుటుంబం ముందు స్వర్ణం సాధించిన తండ్రి సంతోషం... ఆ కుటుంబం ఆత్మీయత చూసినవారికి కూడా కళ్లు చెమర్చాయి. ‘నేను నా పిల్లల రేస్‌ను చూడటం, వారు నా రేస్‌ను చూడడం, వారితో కలిసి ప్రారంభోత్సవంలో నడవటం, చివరకు ఇలా విజయోత్సవం జరుపుకోవడం అంతా అద్భుతంగా అనిపిస్తోంది. నాకు దేవుడు చాలా ఎక్కువే ఇచ్చేశాడు. ఇంతకంటే జీవితంలో ఏం ఆశిస్తాం’ అని సాంటియాగో ఉద్వేగంగా చెప్పాడు. -సాక్షి క్రీడా విభాగం -
నాదల్కు స్వర్ణం
రియో డి జనీరో: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో ఒలింపిక్స్ స్వర్ణం గెలుపొందాడు. దీర్ఘకాల మిత్రుడు మార్క్ లోపేజ్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. రొమేనియా జోడి మెర్జియా, హోరియాలతో జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో.. ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్ గెలిచిన నాలుగో టెన్నిస్ స్టార్‌గా (సెరెనా, వీనస్, నికోలస్ మస్సు) నిలిచాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నాదల్ సింగిల్స్‌లో స్వర్ణం అందుకున్నాడు. అటు పురుషుల సింగిల్స్‌లోనూ బ్రెజిల్ క్రీడాకారుడు థామస్ బెలూచీపై 2-6, 6-4, 6-2తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే సెమీస్‌లో జపాన్ ప్లేయర్ కీ నిషికోరీపై 6-1, 6-4తో గెలిచి ఫైనల్ చేరాడు. కాగా, మహిళల సింగిల్స్ ఫైనల్లో పుయెర్టోరికో క్రీడాకారిణి, మోనికా ప్యూగ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ కెర్బర్ బంగారు పతకం కోసం పోటీపడనున్నారు. -
స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్నాను!
- అపూర్వి చండేలా, షూటర్ చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. బాస్కెట్ బాల్ బాగా ఆడేదాన్ని. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకునేదాన్ని. అభినవ్ బింద్రా ఒలింపిక్ గోల్డ్ గెలుచుకున్న తరువాత అది చాలామందిలో స్ఫూర్తి నింపింది. అందులో నేను కూడా ఒకరిని. షూటర్ కావాలనుకోవడానికి ఇదే కారణం. నా తల్లిదండ్రులు తమ కోరికలను నా మీద ఎప్పుడూ రుద్దలేదు. అభిరుచికి తగిన స్వేచ్ఛను ఇచ్చారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడానికి ఆ ప్రోత్సాహమే వెన్నుదన్నుగా నిలచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం నా జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. అది మాటలకు అందని అద్భుత భావన. నా ఫస్ట్ నేషనల్ టైటిల్‌ను 2012లో గెలుచుకున్నాను. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం నా లక్ష్యం... ఒలింపిక్స్‌లో క్వాలిఫై కావడం. రోజూ యోగా, ధ్యానం చేస్తాను. చాలా దూరం పరుగెడతాను. ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏమాత్రం వీలున్నా కొత్త ప్రదేశాలు చూడడానికి ప్రాధాన్యత ఇస్తాను. -
ఓవెన్స్ ఒలింపిక్ పతకానికి రూ.9 కోట్లు
లాస్ఏంజిల్స్: అమెరికా అథ్లెటిక్స్ గ్రేట్ జెస్సీ ఓవెన్స్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణ పతకానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. కాలిఫోర్నియాలో ఆదివారం జరిగిన వేలంలో 14 లక్షల 66 వేల 574 డాలర్ల (దాదాపు రూ.9 కోట్లు) ధరకు కొనుగోలు చేశారు. ఇంత ధర ఇప్పటిదాకా ఏ ఒలింపిక్ పతకానికీ దక్కకపోవడం విశేషం. దీంతో విశ్వ వ్యాప్తంగా ఓవెన్స్ సాధించిన ఫీట్కున్న ప్రాముఖ్యత ఏమిటో లోకానికి వెల్లడయినట్టయ్యింది. వెయ్యికి పైగా క్రీడా వస్తువులను ఈ వేలంలో ఉంచారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జాత్యహంకారానికి చెంపపెట్టుగా... నల్ల జాతీయుడైన ఓవెన్స్ బెర్లిన్ ఒలింపిక్స్‌లో 100మీ., 200మీ., లాంగ్‌జంప్, 4ఁ100మీ.రిలేలో స్వర్ణాలు సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ నాలుగు పతకాలలో ఓ పతకం వేలానికి రాగా దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను వెల్లడి చేయలేదు. అయితే ఆయన తిరిగి ఈ స్వర్ణాన్ని ఆయన జెస్సీ ఓవెన్స్ ఫౌండేషన్‌ను ఇవ్వనున్నట్టు వేలం నిర్వాహకులు వెల్లడించారు. అలాగే 1960లో మహ్మద్ అలీ తన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకున్న బౌట్‌కు ముందు ధరించిన గౌను 60వేల 667 డాలర్ల (రూ.37 లక్షలు)కు అమ్ముడుపోయింది.