క్యాన్సర్‌నే గెలిచాడు | Santiago Lange beats cancer then wins Olympic sailing gold | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌నే గెలిచాడు

Published Thu, Aug 18 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

క్యాన్సర్‌నే గెలిచాడు

క్యాన్సర్‌నే గెలిచాడు

 54 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన లాంజ్
రిటైర్మెంట్‌కు చేరువగా ఉన్న వయసు అది... చాలా మంది మనవళ్లతో ఆడుకుంటే చాలనుకునే వయసు... ఇలాంటప్పుడు క్యాన్సర్‌లాంటి ప్రమాదకర వ్యాధి కూడా వస్తే..? ఇక మంచంపైనే వారి ప్రపంచం ముగిసిపోతుంది. కానీ 54 ఏళ్ల సాంటియాగో లాంజ్ అలా అనుకోలేదు. సముద్రపు అలలతో పోరాటం చేశాడు... టీవీ చూస్తూ ఒలింపిక్స్ కబుర్లు చెప్పుకునే సీనియర్ సిటిజన్లకు సవాల్ విసిరాడు. ఆరో సారి ఒలింపిక్స్ బరిలోకి దిగడమే కాదు, సెయిలింగ్‌లో ఏకంగా స్వర్ణం కూడా సాధించేశాడు. మాటల్లోనూ, రికార్డు పుస్తకాల్లోనూ విశ్లేషించలేని గొప్ప ఘనత ఇది. వయసు పెరిగినా వన్నె తగ్గని ఒక ‘కుర్రాడు’ ఇచ్చే స్ఫూర్తి ఇది.
 
 అర్జెంటీనాకు చెందిన సాంటియాగో రౌల్ లాంజ్ వృత్తిరీత్యా నావల్ ఇంజినీర్. నిరంతరం నీటితో సహవాసం చేసే ఆ ఉద్యోగమే అతడిని సెయిలింగ్ వైపు మళ్లించింది. దాంతో ఆటపై పట్టు పెంచుకున్న అతను 1988లోనే తొలిసారి దేశం తరఫున ఒలింపిక్స్ బరిలోకి దిగాడు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు 1996, 2000, 2004, 2008లలో కూడా లాంజ్ ఒలింపిక్స్‌లో పోటీ పడ్డాడు. ఈ ఐదు ప్రయత్నాల్లో కలిపి టోర్నడో విభాగంలో అతను రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. రెండు వేర్వేరు విభాగాల్లో నాలుగు సార్లు అతనికి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కూడా దక్కింది.
 
 క్యాన్సర్‌తో పోరాటం
 గతేడాది సాంటియాగోకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకింది. ఒక వైపు ప్రమాదకరమైన వ్యాధి, రెండో వైపు మళ్లీ పిలుస్తున్న పడవ... తీవ్రమైన మానసిక సంఘర్షణ తర్వాత అతను పోరాడాలని నిర్ణయించుకున్నాడు. తన గత ఐదు ఒలింపిక్స్ అనుభవాలనే స్ఫూర్తిగా తీసుకున్నాడు. చికిత్సలో భాగంగా ఆరు నెలల తర్వాత స్పెయిన్‌లోని బార్సిలోనాలో అతనికి ఆపరేషన్ జరిగింది. ఊపిరితిత్తిలో కొంత భాగం కూడా తీసేయాల్సి వచ్చింది. అయితే ఐదు రోజులకే సైక్లింగ్ చేసి తన ఆరోగ్యాన్ని అంచనా వేసుకున్నాడు. నెల రోజులకే మళ్లీ సెయిలింగ్ కోసం నీటి వైపు కదిలాడు. రియో లక్ష్యంగా సాధన చేసి చివరకు క్వాలిఫై అయ్యాడు. 29 ఏళ్ల సిసిలియా సరోలీతో జత కట్టి సాంటియాగో.... నాక్రా 17 మిక్స్‌డ్ కేటగిరీలో దూసుకుపోయాడు. అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం అందుకున్న సాంటియాగో... రియో ఒలింపిక్స్‌లో ఎక్కువ వయసులో పసిడి సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
 
 ఉద్వేగభరిత క్షణాలు
 54 ఏళ్ల వయసులో సాంటియాగో ఉత్సాహం, పోరాటం చూసి సెయిలింగ్ భాగస్వామి సరోలీ కూడా ఆశ్చర్యానికి లోనైంది. ‘ఇలాంటి వ్యక్తిని మనం ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండం. ప్రాణాలు తీసే వ్యాధి తర్వాత కూడా అతను ఈ రకంగా సెయిలింగ్ చేయడం నిజంగా గ్రేట్. అతనికి భాగస్వామిగా బరిలోకి దిగడం నా అదృష్టం’ అని ఆమె చెప్పింది. సెయిలింగ్‌లోనే మరో ఈవెంట్‌లో అతని ఇద్దరు కొడుకులు యాగో, క్లౌజ్ కూడా పోటీ పడటం మరో విశేషం. సాంటియాగో విజేతగా నిలిచాడని తెలియగానే తీరాన ఆ కుటుంబం చేసుకున్న సంబరాలకు అంతు లేకుండా పోయింది.
 
 నాన్న ప్రపంచాన్ని గెలిచాడన్న పిల్లల ఆనందం, చచ్చిపోతానేమో అనుకునే స్థితినుంచి కుటుంబం ముందు స్వర్ణం సాధించిన తండ్రి సంతోషం... ఆ కుటుంబం ఆత్మీయత చూసినవారికి కూడా కళ్లు చెమర్చాయి. ‘నేను నా పిల్లల రేస్‌ను చూడటం, వారు నా రేస్‌ను చూడడం, వారితో కలిసి ప్రారంభోత్సవంలో నడవటం, చివరకు ఇలా విజయోత్సవం జరుపుకోవడం అంతా అద్భుతంగా అనిపిస్తోంది. నాకు దేవుడు చాలా ఎక్కువే ఇచ్చేశాడు. ఇంతకంటే జీవితంలో ఏం ఆశిస్తాం’ అని సాంటియాగో ఉద్వేగంగా చెప్పాడు.
 -సాక్షి క్రీడా విభాగం


 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement