తిరుగులేని బోల్ట్
రియోడిజనీరో:జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. రియోలో రెండో స్వర్ణాన్ని సాధించి తనకు తిరుగులేదని నిరూపించాడు. తాజాగా జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో 19.78 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి... మరో స్వర్ణ పతకాన్ని ఉసేన్ తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే రియోలో 100 మీటర్ల పరుగులో ఉసేన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న బోల్ట్.. 200 మీటర్ల రేసులో కూడా ఆద్యంత దుమ్మురేపాడు. దీంతో అతని ఖాతాలో వరుసగా ఎనిమిదో ఒలింపిక్స్ స్వర్ణం చేరింది.
తాజా ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగులో పసిడిని సొంతం చేసుకున్నబోల్ట్.. 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 100 మీ. ఈవెంట్ లో వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రియోలో బోల్ట్ ముందు 4x 100 జట్టు రేసు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా పసిడి సాధిస్తే ఒలింపిక్స్ లో అపజయమే లేని ధీరుడిగా బోల్ట్ నిలిచిపోతాడు.