ఈ యేటి మేటి బోల్ట్, అయానా
ఐఏఏఎఫ్ పురస్కారాల ప్రదానం
మొనాకో: వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ మూడేసి స్వర్ణాలు సాధించిన జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్... రియో ఒలింపిక్స్‌లో 10 వేల మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకం నెగ్గిన అయానా అల్మాజ్ (ఇథియోపియా) ఈ ఏడాది ‘ప్రపంచ ఉత్తమ అథ్లెట్స్’ పురస్కారాలు అందుకున్నారు. అథ్లెటిక్స్ అధికారులు, అథ్లెట్స్, జర్నలిస్టులతోపాటు ఆన్‌లైన్ పోలింగ్ ద్వారా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) ఈ ఇద్దరిని ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్‌లో బోల్ట్ 100, 200 మీటర్లతోపాటు 4్ఠ100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లోనూ బోల్ట్ ఈ మూడు విభాగాల్లో పసిడి పతకాలు గెలిచాడు. 30 ఏళ్ల బోల్ట్ ఐఏఏఎఫ్ మేటి అథ్లెట్ పురస్కారాన్ని అందుకోవడం ఇది ఆరోసారి కావడం విశేషం.
గతంలో అతను 2008, 2009, 2011, 2012, 2013లలో ఈ గౌరవాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్న బోల్ట్ 19.19 సెకన్లతో తన పేరిటే ఉన్న 200 మీటర్ల ప్రపంచ రికార్డును సవరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నాడు. ‘రియో ఒలింపిక్స్‌లో 200 మీటర్లను 19 సెకన్లలోపు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని అనుకున్నాను. కానీ అది సాధ్యపడలేదు. వచ్చే సీజన్‌లో ఎలాంటి గాయాల బారిన పడకుండా ఉంటే ఏదైనా జరగొచ్చు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నేను పాల్గొనే అవకాశం లేదు. ఒకసారి రిటైరయ్యాక పునరాగమనం చేయొద్దని నా కోచ్ స్పష్టం చేశారు’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు.