ప్రేక్షకుల ప్రవర్తన షాక్ కు గురిచేసింది: బోల్ట్
అమెరికన్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ కు ఆదివారం రియో ఒలింపిక్స్ లో చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ పరుగుల వీరుడైన అతడి పట్ల ప్రేక్షకులు విపరీతంగా ప్రవర్తించారు. అతనిపై కేకలు వేసి అవమానపరిచారు.
అయినా, నిరుత్సాహానికి లోనుకాని గాట్లిన్ మెరుపువేగంతో పరుగెత్తి రజతం సాధించాడు. జమైకన్ స్టార్ ఉసేన్ బోల్ట్ 9.81 సెకన్లలో 100 మీటర్ల పరుగుపందెం పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలువగా.. 9.89 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్న గాట్లిన్ కొద్దిలో గోల్డ్ మెడల్ ను చేజార్చుకున్నాడు.
అయితే, గ్లాటిన్ 2001లో డ్రగ్స్ వాడి డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయాడు. దీంతో అతనిపై ఏడాదిపాటు నిషేధం విధించారు. ఆ తర్వాత 2006లో అతను మరోసారి డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలాడు. 2010లో మళ్లీ అథ్లెటిక్స్ లో అడుగుపెట్టిన గాట్లిన్ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో తాజా ఒలింపిక్స్ తో తన సత్తా చాటాడు. 34 ఏళ్ల వయస్సులోనూ పతకం సాధించాడు. అయితే, అతన్ని చూడగానే ప్రేక్షకులు హేళనగా వ్యాఖ్యలు చేస్తూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. 100 మీటర్ల సెమీస్ పరుగుపందెంలోనూ ఇదే రకంగా చేదు అనుభవం ఎదురైంది.
మరోవైపు పరుగులు వీరుడు ఉసేన్ బోల్ట్ ను మాత్రం ప్రేక్షకులు గౌరవ హర్షధ్వానాలతో స్వాగతించారు. అతడు మైదానంలో అడుగుపెట్టగానే ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కింది. వారి అభిమానాన్ని బోల్ట్ సాదరంగా ఆహ్వానించాడు. అయితే, రేసు ముగిసిన తర్వాత సహచర ఆటగాడికి ఎదురైన చేదు అనుభవంపై బోల్ట్ స్పందించాడు.
'ఇప్పటివరకు నాకు తెలిసి మైదానంలో ఒక ఆటగాడిని సతాయించడం ఇదే తొలిసారి అనుకుంటా. ప్రేక్షకుల ప్రవర్తన నన్ను షాక్ గురిచేసింది' అని బోల్ట్ విస్మయం వ్యక్తం చేశాడు. ప్రేక్షకుల మూర్ఖ ప్రవర్తనను పంటిబిగువున భరించిన జస్టిన్ గాట్లిన్ రజతం సాధించిన అనంతరం అమెరికా జాతీయ జెండాను భుజాన వేసుకొని మైదానంలో కలియతిరిగారు. ఆయనకు కొంతమంది ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభించింది.