నన్ను గాట్లిన్ అగౌరపరిచాడు: బోల్ట్
లండన్: రియో ఒలింపిక్స్ కు ముందు జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్కు అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్కు మాటల యుద్ధం ప్రారంభమైంది. రియో అర్హతలో భాగంగా గత నెల్లో జమైకా నేషనల్ సీనియర్ చాంపియన్ షిప్స్ ట్రయల్స్ నుంచి బోల్ట్ అర్థాంతరంగా వైదొలగడాన్నిలండన్ డైమండ్ లీగ్ వేదికగా గాట్లిన్ తప్పుబట్టాడు. అప్పుడు వైదొలిగిన బోల్ట్ చికిత్స అనంతరం తిరిగి పోటీల్లో పాల్గొనడాన్ని ఒక తప్పుగా చిత్రీకరించే యత్నం చేశాడు. బోల్ట్ ఒక అమెరికా స్పింటర్ గా ఉన్నట్లైతే మరొకాసారి అవకాశం ఉండేది కాదంటూ గాట్లిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
దీనిపై బోల్ట్ కూడా ఘాటుగానే స్పందించాడు. 'అదొక జోక్లా అనిపించినా, నన్ను అగౌరపరిచే విధంగా ఉంది. నేను ట్రయల్స్ నుంచి వైదొలగానని అమెరికన్ స్ప్రింటర్లు భావించి ఉంటారు. నేను మళ్లీ లండన్ ట్రయల్స్ లో పాల్గొనడం వారిలో అసంతృప్తి కల్గించి ఉంటుంది. ప్రతీ సంవత్సరం నన్ను నిరూపించూకుంటూ ముందుకు సాగుతున్నా. నేనే అత్యుత్తమం అనడంలో ఎటువంటి సందేహం లేదు. గాట్లిన్ మాటలు విన్న మరుక్షణం నాకు నవ్వొచ్చింది. ఆ తరువాత చాలా బాధనిపించింది. నన్ను టార్గెట్ చేస్తూ గ్లాటిన్ అలా వ్యాఖ్యానించడం నిజంగా అమర్యాదగా ప్రవర్తించినట్లే' అని బోల్ట్ తెలిపాడు. రియో అర్హతలో భాగంగా లండన్ లో జరిగిన డైమండ్ లీగ్ 200మీటర్ల రేసును బోల్ట్ దిగ్విజయంగా ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన ఆ రేసును బోల్ట్ 19.89 సెకన్లలో పూర్తి చేసి సత్తా చాటాడు.