కేరాఫ్‌ క్లాసిక్‌ బ్యూటీ.. 'సంజనా బత్రా'! | Care Of Classic Beauty Sanjana Batra Success Story | Sakshi
Sakshi News home page

Sanjana Batra: ఫ్యాషన్‌ మీదున్న ఆసక్తే.. తనను స్టార్‌ స్టయిలిస్ట్‌గా..

Published Sun, May 12 2024 2:29 PM | Last Updated on Sun, May 12 2024 2:29 PM

కేరాఫ్‌ క్లాసిక్‌ బ్యూటీ.. 'సంజనా బత్రా'!

కేరాఫ్‌ క్లాసిక్‌ బ్యూటీ.. 'సంజనా బత్రా'!

పేరు.. సంజనా బత్రా హోమ్‌ టౌన్‌ అండ్‌ వర్క్‌ ప్లేస్‌ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్‌ .. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లో స్క్రీన్‌ అండ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌లో మాస్టర్‌ డిగ్రీ. మరి ఫ్యాషన్‌ రంగంలో.. నో ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌. ఫ్యాషన్‌ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్‌ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్‌ స్టయిల్‌.. Classic, Chic.. eclectic! వర్క్‌ డిస్క్రిప్షన్‌.. fast-paced, challenging and creatively satisfying.

ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్‌ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ!  వాళ్ల నాన్నమ్మ వార్డ్‌ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్‌ టేబుల్‌లో నెయిల్‌ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్‌ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్‌ సెన్స్‌ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్‌ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.

అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్‌ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్‌గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్‌ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్‌ స్టడీస్‌ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్‌ మీద ఆమె దృష్టి పడింది.

బ్యూటీ అండ్‌ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్‌ మ్యగజైన్‌కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్‌ రోషన్‌ నటించిన ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ సినిమా (ప్రొడక్షన్‌లో)కి పనిచేసే ఆఫర్‌ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్‌ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్‌ నటి నర్గిస్‌ ఫక్రీ పర్సనల్‌ ఫొటో షూట్‌ ఉంది.. ఆమెకు స్టయిలింగ్‌ చేయగలవా?’ అంటూ ఓ కాల్‌ వచ్చింది.

ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్‌ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్‌ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్‌ అవుతారు. హెడ్‌ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!

"ఫ్యాషన్‌ అండ్‌ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్‌ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్‌ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్‌ స్టార్‌ అంటే అనుష్క శర్మనే.  నేను స్టయిలింగ్‌ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement