Batra
-
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం?
దేశంలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిపై 2004లో తన తండ్రి ఢిల్లీ వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశారని, తదనంతరం ఎదురైన పరిణామాలు ఇలా ఉన్నాయంటూ స్టోరీపిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు తన్మయ్ గోస్వామి ట్విట్టర్ మాధ్యమంలో పలు వివరాల తెలిపారు. తన తండ్రి విషయంలో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ వైద్యపరంగా నిర్లక్ష్యం వహించారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇందుకుగాను రూ. 80 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తన తండ్రి అభ్యర్థించారన్నారు. ఇది జరిగి11 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని, 2015లో తన తండ్రి చనిపోయారన్నారు. అయితే వృద్ధురాలైన తన తల్లి ఈ కేసును విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నదని, సుదీర్ఘ పోరాటం అనంతరం 19 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విజయం సాధించామని తెలిపారు. తొందరపాటుతో శస్త్రచికిత్స అసోంకు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం 19 సంవత్సరాల పాటు ప్రముఖ వైద్యసంస్థతో న్యాయపరంగా పోరాడి ఎలా గెలిచిందనే వివరాలను తన్మయ్ గోస్వామి తెలియజేశారు. తన తండ్రి 2004లో ఈపీఎస్ డయాగ్నస్టిక్ స్టడీ కోసం బాత్రా ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఈపీఎస్ అధ్యయనం అసాధారణంగా ఉంటే, రోగితో చర్చించిన తర్వాత ఆర్ఎఫ్ఏ చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆర్ఎఫ్ఏ ప్రమాదకరం లేదా ప్రాణాంతకం కావడంతో దానిని వైద్యులు సిఫార్సు చేయరు. అయినప్పటికీ బాత్రా ఆసుపత్రి కార్డియాలజిస్టులు తన తండ్రితో లేదా మా కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఆర్ఎఫ్ఏ చేశారన్నారు. ఇది కూడా చదవండి: భర్త మృతితో కలత.. కొద్దిసేపటికే భార్య కూడా కన్నుమూత! పేస్ మేకర్ సరిగా అమర్చకపోవడంతో.. అయితే ఈ చికిత్స కారణంగా తన తండ్రి ఆరోగ్యం విషమించిందని గోస్వామి తెలిపారు. దీంతో వైద్యులు తన తండ్రిని కాపాడేందుకు అతని ఛాతీలో పేస్ మేకర్ అమర్చాలని నిర్ణయించారు. దీంతో వైద్యులు తన తల్లికి ఫోన్ చేసి, వెంటనే ఢిల్లీకి రావాలని తెలియజేశారు. వారు చెప్పిన విధంగానే తన తల్లి ఢిల్లీ వెళ్లిందన్నారు. అక్కడి చికిత్స ముగిసిన కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారని, అయితే తన తండ్రి అనారోగ్యం నుంచి కోలుకోలేదన్నారు. తన తండ్రి ఛాతీ ప్రాంతం రోజురోజుకు ఉబ్బిపోవడాన్ని గమనించి, గౌహతిలో కార్డియాలజిస్ట్‌ని సంప్రదించామన్నారు. అప్పుడు ఆయన తన తండ్రిని పరీక్షించి, పేస్ మేకర్ సరిగా అమర్చలేదనే విషయాన్ని తెలిపారన్నారు. దీంతో తండ్రి ఛాతీలోని పేస్ మేకర్‌ను సరిచేయడానికి అతనికి అత్యవసరంగా అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తరువాత.. వైద్యుల సలహా మేరకు తన తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందన్నారు. అనంతరం ఆయన బలహీనంగా మారి, పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. అయినా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించేవారన్నారు. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలోని బత్రా హాస్పిటల్‌పై వినియోగదారుల ఫోరమ్‌లో కేసు నమోదు చేశారన్నారు. తమ కుటుంబ న్యాయవాది ఈ కేసును చేపట్టారన్నారు. ఇది వినియోగదారుల న్యాయస్థానానికి సంబంధించిన ఉదంతం కనుక సత్వర న్యాయం జరుగుతుందని తామంతా భావించామన్నారు. చనిపోయే వరకూ న్యాయపోరాటం 2004 నుండి 2015 వరకు.. అంటే తన తండ్రి చనిపోయే వరకు కేసులోని ప్రతి విచారణ వాయిదాకు హాజరయ్యారన్నారు. కోల్‌కతా నుండి మా న్యాయవాది ఢిల్లీకి వచ్చేవారని, అతని ప్రయాణ, బస ఖర్చులను తామే భరించామని గోస్వామి తెలిపారు. ఈ విధంగా 19 సంవత్సరాల పాటు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయన్నారు. ఈ కేసు కోసం తమకు పెద్ద మొత్తంలోనే ఖర్చయ్యిందన్నారు. కేసు విచారణ సమయంలో పలు కారణాలతో విచారణ వాయిదా పడుతూ వచ్చిందన్నారు. వీటన్నింటినీ కూడా తాము ఎదుర్కొన్నామన్నారు. తన తండ్రి చనిపోయే వరకూ అంటే 11 సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేశారన్నారు. తన తండ్రి చనిపోయాక, బాత్రా హాస్పిటల్ కాస్త ఊపిరి పీల్చుకుందేమో.. కానీ మా తల్లి మాత్రం ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో తాను ఈ ఉదంతంలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవడం మొదలుపెట్టానని గోస్వామి తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! కేసు జాప్యం వెనుక సవాలక్ష కారణాలు ఈ కేసు ఇన్ని సంవత్సరాలు కొనసాగడం వెనుక పలు కారణాలున్నాయని గోస్వామి తెలిపారు. ఇది మెడికల్ కేసు కావడంతో వాదనకు న్యాయమూర్తులు సరిపోలేదు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ పలుకుబడి కూడా కేసు జాప్యానికి కారణంగా మారింది. దీనికితోడు ఉద్దేశపూర్వక జాప్యాలు, కోర్టు నుండి సాక్ష్యాలను ఉపసంహరించుకోవడం లాంటివి ఎదురయ్యాయన్నారు. అయితే తమ న్యాయవాది వినతి మేరకు కేసు విచారణలో స్వతంత్ర వైద్య బోర్డు అవసరమని కోర్టు కోరింది. మెడికల్ బోర్డు విచారణలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. In 2004, my dad filed a case of medical negligence against one of India's most powerful hospitals viz. Batra Hospital, Delhi and Padmashree awardee cardiologist Dr Upendra Kaul. Case was filed in the state consumer court, Delhi & my dad asked for a compensation of Rs. 80 lakh.… — Tonmoy Goswami (@protonycle) August 3, 2023 ఆధారాలను చూపలేకపోయిన ఆసుపత్రి వర్గాలు అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు తన తండ్రి ఆర్ఎఫ్ఏ చికిత్స విషయంలో తమ సమ్మతి తీసుకున్నట్లు పేర్కొంటూ బెంచ్‌ను గందరగోళపరిచేందుకు ప్రయత్నించాయి. ఇందుకు సాక్ష్యం అడిగినప్పుడు, వారు తరచూ ఈపీఎస్ సమ్మతి పత్రాన్ని సాకుగా చూపిస్తూ వచ్చారు. దీంతో కేసు ఆలస్యం అవుతూ వచ్చిందేగానీ, ముందుకు కదలలేదు. పైగా పీఎస్ సమ్మతి పత్రాన్ని తమకు ఇచ్చేశామని వారు కోర్టులో బుకాయించేవారని గోస్వామి తెలిపారు. ఎంతకాలం గడిచినా బాత్రా ఆసుపత్రి వర్గాలు ఆర్ఎఫ్ఏ పత్రాలను కోర్టుకు సమర్పించ లేకపోయాయి. ఎట్టకేలకు 2018లో తాము ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్‌లో కేసును గెలిచామన్నారు. కేసు దాఖలు చేసిన తేదీ నుండి 7% సాధారణ వడ్డీతో రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం బాత్రా ఆసుపత్రి వర్గాలకు ఆదేశించింది. అయితే తన తండ్రి కోరిన విధంగా రూ. 80 లక్షల పరిహారంతో పోల్చితే ఇది ఏమీ కానప్పటికీ, తాము ఈ కేసులో గెలిచినందుకు ఎంతో సంతోషించామన్నారు. కథ మళ్లీ మొదటికి.. అయితే అప్పటితో కథ ఆగిపోలేదని బాత్రా ఆసుపత్రి వర్గాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నేషనల్ కన్స్యూమర్ ఫోరమ్‌లో అప్పీలు చేశామని గోస్వామి తెలిపారు. దీంతో కేసు మొదటికి వచ్చింది. అయితే మరో 14 ఏళ్లు పట్టినా ఈ పోరాటం కొనసాగిస్తానని తల్లికి మాట ఇచ్చానని గోస్వామి తెలిపారు. అయితే మా న్యాయవాది నెగ్వివ్ అహ్మద్ ఈ కేసు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయినా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుని, విచారణలో ఎక్కువ వాయిదాలు పడకుండా కేసు త్వరగా ముందుకు కొనసాగేందుకు ప్రయత్నించారు. ఫలితంగా 2023లో ఈ కేసులో తాము మరోమారు గెలిచామని గోస్వామి తెలిపారు. అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు వారి పరపతి నిలబెట్టుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తాము భావించామన్నారు. అయితే 19 ఏళ్లలో తాము రెండుసార్లు విజయం సాధించిన నేపధ్యంలో బాత్రా ఆసుత్రి వర్గాల సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయలేదని గోస్వామి తెలిపారు. భవిష్యత్ న్యాయ పోరాటాలకు స్ఫూర్తి ఎట్టకేలకు ఈ కేసు ముగిసినందుకు మా కుటుంబం సంతోషించింది. అయితే ఇంతటి సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా సాధ్యం కాదని తాను అర్థం చేసుకున్నానని గోస్వామి అన్నారు. తాము సాగించిన న్యాయపోరాటం భవిష్యత్తులో మరింతమంది రోగులకు న్యాయం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. బాధితులు ఎవరైనా ఇటువంటి న్యాయపోరాటం చేసేటప్పుడు వారు గోస్వామి కుటుంబాన్ని గుర్తుంచుకుంటారన్నారు. నష్టపరిహారం సొమ్ముతో మంచి పని మాకు కోర్టు నుంచి అందిన పరిహారం మొత్తాన్ని మా అమ్మ ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుందన్నారు. మొదట్లో తాను బాత్రా ఆసుపత్రిపై కోపంగా ఉండేవాడనిని, ఈ ఆసుపత్రిలో మీ సొంతపూచీ కత్తుతో చేరాలని ఆసుపత్రి ముందు బోర్డు పెట్టాలని అనుకునే వాడినని అన్నారు. అయితే అటువంటి సందర్భంలో తన తల్లి తనను శాంతపరిచేదని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
కరోనా సోకిన 63 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య
ఢిల్లీ : కరోనా వైరస్ సోకిన 63 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మీఠాపూర్ నివాసి అయిన ఆయన గత 10 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి సంబంధించి రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు. కరోనా లక్షణాలతో మే19న బాత్రా ఆసుపత్రిలో చేరగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీర్ఘకాలిక సమస్యలతో పాటు ఇప్పుడు కోవిడ్ కూడా సోకడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. (భీమ్ యాప్‌లో లోపం? ) సోమవారం మధ్యాహ్న భోజనం తర్వాత 30-40 నిమిషాల తర్వాత అతనికి మందులు ఇవ్వడానికి నర్సు వెళ్లి చూడగా అప్పటికే సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్నట్లు కనిపించాడని బాత్రా హాస్పిటల్ వైద్య డైరెక్టర్ డాక్టర్ ఎస్.సి.ఎల్ గుప్తా అన్నారు. అతన్ని బతికించడానికి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కోసం ప్రత్యేకంగా నియమించిన ఆసుపత్రుల్లో బాత్రా హాస్పిటల్ కూడా ఒకటి. అయితే గతంలోనూ కరోనా సోకి పలువురు డిప్రెషన్‌కి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్చి 19న 23 ఏళ్ల కరోనా బాదితుడు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. (ఇక మద్యం బాటిళ్లపై కోవిడ్ పన్ను! ) -
కోచ్‌లతో ఆటలా..!
ఏ ఆటైనా ఆడించడం కోచ్ పని... నిర్వహించడం పరిపాలకుడి పని. కోచ్ పనిలో పరిపాలకుడు వేలుపెడితే నష్టమే ఎక్కువ. ఈ చిన్న విషయాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు మరచిపోయారు. తన నియంతృత్వ ఆలోచనా విధానంతో కోచ్‌ను తప్పించారు. మొత్తం దేశంలో హాకీ అంతా తన చేతుల్లోనే ఉండాలనే ఆలోచనతో ఆయన మరోసారి గిల్‌ను గుర్తుకు తెచ్చారు. జాతీయ క్రీడను గాడిలో పెట్టాల్సిన పరిపాలకులు... తమ అహం కోసం కోచ్‌లను తప్పిస్తూ వాళ్లతో ఆటలాడుతున్నారు. సమయం ఇవ్వకుండానే సాగనంపుతున్నారు ఇప్పటికి ఆరుగురు విదేశీ కోచ్‌లపై వేటు వచ్చే ఏడాదే రియో ఒలింపిక్స్ సాక్షి క్రీడావిభాగం ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ కచ్చితంగా ఎవరూ చెప్పలేరని అంటారు. అలాగే భారత హాకీలో కొత్త కోచ్ ఎప్పుడు వస్తాడో, ఎంత కాలం ఉంటాడో, ఎందుకు వెళ్లిపోతాడో కూడా అంచనా వేయలేని పరిస్థితి. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం కేపీఎస్ గిల్ హయాంలో స్వదేశీ, విదేశీ అని లేకుండా ‘కోచ్‌లతో కుర్చీలాట’ మొదలైంది. సమాఖ్య పేరు మారినా, అధికారం బదలాయింపు జరిగినా కోచ్‌లతో గిల్లీకజ్జాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ హాకీని ఏలిన భారత్ నేడు తమ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. జాతీయ క్రీడను గాడిలో పెట్టాల్సిన వారే ఈ ఆటతో ఆటలాడుకుంటున్నారు. తమ పెత్తనమే ఉండాలని కోరుకుంటూ, పట్టుదలకు పోయి ఆటకు అన్యాయం చేస్తున్నారు. రాచ్ నుంచి పాల్ వరకు... రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ఒలింపిక్ స్వర్ణాలు నెగ్గిన భారత్‌కు తొలిసారి 2004లో గెరార్డ్ రాచ్ (జర్మనీ) రూపంలో విదేశీ కోచ్ వచ్చారు. అయితే ఏథెన్స్ ఒలింపిక్స్‌లో, చాంపియన్స్ ట్రోఫీలో భారత పేలవ ప్రదర్శన కారణంగా ఆయనపై అదే ఏడాది వేటు వేశారు. ఆ తర్వాత వచ్చిన విదేశీ కోచ్‌లు కూడా రావడం, బాధ్యత తీసుకోవడం, కొన్నాళ్లు ఉండటం ఆ తర్వాత వెళ్లిపోవడం జరుగుతోంది. తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ వాన్ యాస్ విషయంలోనూ ఇదే జరిగింది. 2018 ప్రపంచ కప్ వరకు ఆయనను భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఈ ఫిబ్రవరిలో నియమించారు. ఆరు నెలలు కూడా గడవకముందే ఆయనపై వేటు వేశారు. నాడు గిల్... నేడు బాత్రా పంజాబ్ ‘సూపర్‌కాప్’ కేపీఎల్ గిల్ తన హయాంలో స్వదేశీ కోచ్‌లతో ఓ ఆటాడుకున్నారు. కోచ్‌లను నియమించడం, ఫలితాలు వస్తున్న సమయంలో వారిని అకారణంగా తప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు గిల్ హయాంలో ఎనిమిది మంది (జఫర్ ఇక్బాల్, సెడ్రిక్ డిసౌజా, భాస్కరన్, పర్గత్ సింగ్, ఎం.కె.కౌశిక్, హర్చరణ్ సింగ్, సీఆర్ కుమార్, రాజిందర్ సింగ్) స్వదేశీ కోచ్‌లపై వేటు పడింది. ఆ తర్వాత 2004 నుంచి 2015 వరకు ఏడుగురు (గెరార్డ్ రాచ్, జోస్ బ్రాసా, మైకేల్ నాబ్స్, రోలెంట్ ఆల్ట్‌మన్స్, గ్రెగ్ నికోల్, టెర్రీ వాల్ష్, పాల్ వాన్ యాస్) విదేశీ కోచ్‌లను తప్పించారు. రోలెంట్ ఆల్ట్‌మన్స్ ప్రస్తుతం భారత హాకీ జట్టుకు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆనాడు గిల్ నియంతృత్వ ధోరణిపై తిరుగుబాటు చేసిన నాటి భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్) ఉపాధ్యక్షుడు, నేటి హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా ఇప్పుడు గిల్ అడుగుజాడల్లో నడస్తుండటం గమనార్హం. పారిశ్రామికవేత్త అయిన బాత్రా భారత హాకీ పురోగతికి తనవంతు కృషి చేస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే మొత్తం హాకీ ఇండియా తన చేతుల్లోనే ఉండాలనుకోవాలనే ఆయన అత్యాశ ఆటకు చేటు చేస్తోంది. గతేడాది కోచ్ టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో భారత్ ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. అయితే టెర్రీ వాల్ష్ కుదురుకున్నాడని అనుకుంటున్న తరుణంలో ఆయనను సాగనంపారు. ఆయన స్థానంలో వచ్చిన పాల్ వాన్ యాస్‌కు దీనికి మినహాయింపు కాదు. ఇటీవల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ సందర్భంగా మలేసియాతో మ్యాచ్ అనంతరం నరీందర్ బాత్రా నేరుగా మైదానంలోకి రావడం... ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేయడం... ఆయనను అక్కడి నుంచి వెళ్లాపోవాలని కోచ్ పాల్ కోరినందుకే ఆయనపై వేటు పడిందని అంటున్నారు. ఇకనైనా మేలుకుంటారా... రియో ఒలింపిక్స్‌కు ఇంకా ఏడాది సమయం ఉంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత భారత హాకీ జట్టు ఖాతాలో మరో పతకం చేరలేదు. ఒలింపిక్స్ సన్నాహాలపై ప్రభావం పడకుండా ఉండాలంటే వెంటనే కొత్త కోచ్‌ను నియమించడమో లేక హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా ఉన్న రోలెంట్ ఆల్ట్‌మన్స్‌కు మరోసారి చీఫ్ కోచ్ బాధ్యతలు అప్పగించడమో చేయాలి. టెర్రీ వాల్ష్‌ను తప్పించిన తర్వాత కొంతకాలంపాటు ఆల్ట్‌మన్స్ భారత్‌కు తాత్కాలిక కోచ్‌గా పనిచేశారు. రెండేళ్లుగా జట్టుతో ఉన్నందున ఆయనకు భారత హాకీ బలాబలాలపై మంచి అవగాహన ఏర్పడింది. కొత్త కోచ్‌ను నియమించే బదులు రియో ఒలింపిక్స్ వరకు ఆల్ట్మన్స్ను కోచ్‌గా కొనసాగించాలని భారత ఆటగాళ్లు కూడా కోరుకుంటున్నారు. ఇకనైనా హాకీ ఇండియా అధికారులు తమ పొరపాట్లను సరిదిద్దుకొని భారత హాకీకి మేలు చేసే నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. విదేశీ కోచ్‌లు వచ్చి పోయారిలా... 1. గెరార్డ్ రాచ్ (జర్మనీ) నియామకం: భారత జట్టు తొలి విదేశీ కోచ్‌గా 2004 జూన్‌లో నియమించారు. ఏథెన్స్ ఒలింపిక్స్, చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. దాంతో అదే ఏడాది డిసెంబరులో రాచ్పై వేటు పడింది. 2. జోస్ బ్రాసా (స్పెయిన్) వేతనం: రూ. 7 లక్షలు (నెలకు) నియామకం: 2009 మేలో కోచ్‌గా ఎంపిక చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: బ్రాసా అధ్వర్యంలో భారత్ 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించింది. అయితే అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుపొందకపోవడంతో భారత్ నేరుగా లండన్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయింది. 2010లో ఆయన కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. 3. నాబ్స్ (ఆస్ట్రేలియా) వేతనం: రూ. 6.5 లక్షలు నియామకం: 2011 జూన్‌లో కోచ్‌గా నియమించారు. 2016 రియో ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: నాబ్స్ ఆధ్వర్యంలో భారత్ 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే లండన్ ఒలింపిక్స్‌లో భారత్ చిట్టచివరిదైన 12వ స్థానంలో నిలిచింది. 2013 జూన్‌లో ఆయనపై వేటు వేశారు. 4. గ్రెగ్ నికోల్ (దక్షిణాఫ్రికా) నియామకం: 2013లో మైకేల్ నాబ్స్‌ను తప్పించాక కొంతకాలంపాటు గ్రెగ్ నికోల్ (దక్షిణాఫ్రికా) భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. వేటు పడిందిలా: నికోల్ ఆధ్వర్యంలో భారత్ 2013లో జపాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగింది. ఈ టోర్నీలో టీమిండియా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. నికోల్ న్యూజిలాండ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వెళ్లిపోయారు. 5. టెర్రీ వాల్ష్ (ఆస్ట్రేలియా) వేతనం: రూ. 10 లక్షలు నియామకం: 2013 అక్టోబరులో కోచ్‌గా తీసుకొచ్చారు. 2016 రియో ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో భారత్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. వేటు పడిందిలా: ఆసియా క్రీడలు ముగిశాక హాకీ ఇండియా, సాయ్ అధికారులతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయనను తప్పించారు. 6. వాన్ యాస్ (నెదర్లాండ్స్) వేతనం: రూ. 7.5 లక్షలు నియామకం: ఈ ఏడాది ఫిబ్రవరిలో కోచ్‌గా నియమించారు. 2018 ప్రపంచకప్ వరకు ఆయనతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: ఇటీవల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ టోర్నీ సందర్భంగా హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో మైదానంలో వాగ్వాదం. టోర్నీ ముగిశాక నేరుగా నెదర్లాండ్స్ వెళ్లిపోయిన పాల్ తిరిగి భారత్‌కు రాలేదు. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన వారిలో కోచ్‌గా ఆయన పేరు లేదు.