
‘దేవుడా!.....’ మొబైల్ ఫోన్లో ఒక ఆర్టికల్ చదువుతున్న నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చిందీ మాట. ఇల్యుషన్స్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే కనబడ్డ ఆర్టికల్ అది. నేను దేనికోసం ఇల్యుషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానో, ఆ విషయం పక్కకు వెళ్లి పోయి, రమణి జ్ఞాపకం వచ్చింది. నేను, రమణి ఒకే బ్రాంచ్‌లో రెండు సంవత్సరాలు కలిసి పని చేశాం. ఆ మరుసటి సంవత్సరమే రమణికి వాసుతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లిలో వాసూను చూసిన నాకు కొంత నిరాశ కలిగిందనే చెప్పాలి. రమణి అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి. అయినా చక్కగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంది. ఆత్మాభిమానం కల అమ్మాయి. హుందాగా ప్రవర్తించేది. వాసు ఆమెకు తగినవాడని అనిపించలేదు నాకు. చాలా నిరాడంబరంగా వాళ్ల పెళ్లి జరిగిపోయింది. వాసు వాళ్ళది గుంటూరు కావడంతో రమణి ట్రాన్స్ఫర్ చేయించుకొని గుంటూరు వెళ్ళిపోయింది.
ఆ తర్వాత రెండు సంవత్సరాలకు మళ్లీ రమణిని చూశాను. సడన్‌గా ఊడిపడింది నెలల బిడ్డను ఎత్తుకుని. వాసు రాలేదేమని అడిగిన నాకు, రమణి ముభావంగా ఏదో సమాధానం చెప్పింది. రమణి కబుర్లు వినాలని, నేను ఆఫీసుకు సెలవు పెట్టేసాను. తనకు ఇష్టమైన బంగాళాదుంప వేపుడు, టమోటా పప్పు చేసి పెట్టాను. చాలా ఆకలితో ఉన్న దానిలా తినింది తను. నాలో ఎన్నో ప్రశ్నలు. కానీ రమణి ఎలా తీసుకుంటుందో అని మొహమాట పడి మిన్నకుండి పోయాను. బాబు పేరు రాజా. రమణి లాగే చాలా చురుగ్గా ఉన్నాడు. మెరుస్తున్న కళ్ళతో ఉన్న వాడితో ఆడుతూ రోజు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. వాసు గురించి మళ్లీ అడగడంతో ‘వదిలేయ్ అన్నూ ....వాసు తల్లిదండ్రులు స్వీపర్స్, అందుకని వాళ్లంటే నాకు చులకనట. మా అమ్మ కూడా స్వీపరే కదా.. నేనెందుకు మా అత్తామామలను చులకన చేస్తాను?’.
నాకు విషయం కొంచెం అర్థమైంది. ‘రమణి.. నువ్వు చాలా చురుగ్గా ఉంటావు. తెలివి గల అమ్మాయివి. నువ్వు తక్కువ చేసి చూడకపోయినా, వాళ్ళకే ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అంతా సర్దుకుంటుందిలే.’ అన్నాను. ఆ తర్వాత పదేళ్ల వరకు నాకు రమణి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఉత్తరాలు రాసుకునే అలవాటు మా మధ్య లేదు. మళ్ళీ సడన్‌గా ఒక రోజు రమణి నుండి ఫోన్ వచ్చింది. సంతోషం ఆశ్చర్యం కలగలిపి ,‘హాయ్ రమణి... నా నెంబర్ ఎలా దొరికింది?’ అని అడిగాను. ‘మనస్సు ఉందమ్మా... మార్గం దొరికింది’ రమణిలో అదే చురుకుదనం తొణికిసలాడుతుంది.
‘ఎక్కడున్నావ్ ఇప్పుడు?’ అడిగాను నేను.
‘ఉయ్యూరు.... ప్రమోషన్ వచ్చిందోయ్. ఇల్లు కూడా కట్టాను’.
‘కంగ్రాట్స్... ఫ్యామిలీ అంతా షిఫ్టయి పోయారా?’
‘ఆ... కొత్త ఇంట్లోనే ఉన్నాం. నేను ..రాజా.. మా అమ్మ.’
‘వాసు ఎక్కడున్నాడు ?’ అడిగాను.
‘ఎక్కడ ఉంటాడు... విడాకులిచ్చినా దరిద్రం వదల్లేదు. నా చుట్టూ తిరుగుతూ శని గ్రహంలా పట్టి పీడిస్తున్నాడు’.
ఇంతకాలం తర్వాత రమణి నాకు ఎందుకు ఫోన్ చేసిందో నాకు అర్థం అయింది. వాసు వల్ల ఆమెకి ఏదోప్రాబ్లం. అది చెప్పుకునేందుకు నాతో మాట్లాడుతోంది.
‘ఏమంటున్నాడు రమణి?’....అనునయంగా అడిగాను.
‘ఏముంది ...నాకు ప్రమోషన్ వచ్చింది. అతగాడికి ఉన్న ఉద్యోగం ఊడింది. మగ పొగరు చూపించేవాడు. ఇల్లు కట్టుకున్నాను. నేను సంతోషంగా ఉంటే చూడలేకపోయాడు. విడాకులు ఇచ్చి పడేసా... అమ్మ.. నేను.. బాబు, అంతే’
‘మరైతే ప్రాబ్లం ఏంటి?’
‘ఎక్కడ... దరిద్రం వదిలితే కదా?...నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాడు. నా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు’.
‘అయ్యో... విసిగిస్తున్నాడా?’
‘ విసిగించడం ఏంటి అన్నూ ...ఊరికే ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఎత్తకపోయ్యాననుకో ఫోన్ ఎత్తే వరకు చేస్తూనే ఉంటాడు’.
‘ఫోన్ రిసీవెర్ తీసి పక్కన పెట్టలేక పోయావా?’
‘ ఫోన్ తీసి పక్కన పెడితే కూడా ఫోన్ మోగే టెక్నిక్ ఏదో అతని దగ్గర ఉంది’
‘రిసీవర్ పక్కన తీసి పెట్టినా రింగ్ అవుతుందా?’,. ఎంత దాచి పెట్టాలన్నా, నా గొంతులోని అపనమ్మకం రమణికి అర్థం అయింది.
‘అన్నూ.. నువ్వు నన్ను నమ్మడం లేదు. నీకు చెప్తే అర్థం కావడం లేదు. అతడికి నన్ను నాశనం చేయడమే పని. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు’.
‘సరే ఫోన్ చేసి ఏం మాట్లాడుతాడు ?’.
‘ఏంమాట్లాడుతాడూ?...భయపెడతాడు..క్షణం క్షణం నా గురించి అన్ని తెలుసుకుంటాడు. నా శరీరం మీద ఏదో బగ్ పెట్టుంటాడు. లేదంటే ఎలా తెలుస్తుంది? వాడంటాడూ ..’ ఇప్పుడే స్నానం చేశావు కదా... సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నావు... నాకు అంతా తెలుసు. నీ గురించి అన్నీ తెలుసు. నువ్వు నాశనం అవుతావు’ అంటాడు.
‘బయట ఉండి గమనిస్తున్నాడేమో రమణీ’.
‘ లేదు ఆన్నూ.. నీకు అర్థం కావడం లేదు. నేను ఇంట్లో ఏం చేస్తున్నానో కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. ఎలా కూర్చున్నాను ...ఎక్కడ కూర్చున్నాను ...ఏం తింటున్నాను ..అంతా. ఎక్కడో కెమెరాలు పెట్టాడు. బయటికి వెళ్తే చాలు, నలుగుర్నేసుకుని జీప్‌లో ఫాలో అవుతాడు’.
‘రమణీ, వాసూకు డబ్బు, హోదా, తెలివితేటలు ఉన్నాయా?’.
‘ లేవు.. లేవు. సోంబేరి వెధవ.’
‘రమణీ.. నిదానంగా ఆలోచించు.. అతడి దగ్గర డబ్బులేదు. సో..జీపు, నలుగురు మనుషులను మైన్టెన్ చెయ్యలేడు. తెలివితేటలు లేవు. ప్లాన్ చెయ్యలేడు. అతని ఇవన్నీ చేయలేడు. అతడు గెస్ చేసి చెప్పినాటివి యాక్సిడెంటల్‌గా నీకు సరిపోయి ఉంటాయి’.
‘అయ్యో ...నీకు ఎలా చెప్పాలి అన్నూ...వాడు నా నాశనం చూస్తాడు. వాడు నన్ను వదిలి పెట్టడు. వాడు నా చుట్టూ చుట్టూ తిరుగుతున్నాడు. నలుగురు గుండాలని పెట్టుకున్నాడు. తెలివితేటలు లేకపోవచ్చు, చావు తెలివి ఉంటుందిగా..అప్పైనా చేస్తాడు. వాడు నాశనమైనా సరే, నన్ను నాశనం చెయ్య న్దే వదల్డు’
రమణి చెప్పింది నిజం కాదని నాకు బలంగా అనిపిస్తుంది. ఏం చెప్పి కన్విన్స్ చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి పరిస్థితి గురించి నాకు దిగులుగా అనిపించింది. నేను నమ్మడం లేదని రమణికి అర్థం అయింది.
‘మా ఊరికి ఒకసారి రా... కొంచెం స్థలం మార్పిడి ఉంటుంది’ అనే లోపు ఫోన్ కట్ చేసింది. ఆమెకు లాజిక్ అవసరం లేదన్న విషయం నాకు గ్రహింపుకు రాలేదు. కారణం ఏదైనా ఆమె బాధ నిజం. ఆమె భయం నిజం కాకపోవచ్చు. ఆ భయం నుండి వచ్చిన సంఘర్షణ నిజం. ఆ అమ్మాయి చాలా హర్ట్ అయ్యింది అని నాకు అర్థమయింది. ఇంతలో మేనేజర్ దగ్గర నుండి పిలుపు రావడంతో తాత్కాలికంగా రమణి ఆలోచనలను వాయిదా వేశాను.
ఆ వాయిదా పడ్డం పడ్డం మళ్లీ ఇల్యుషన్స్ గురించిన ఆర్టికల్‌తో రమణి గుర్తొచ్చింది. ‘ఎవరికీ వినబడని శబ్దాలు వినబడతాయి... కనబడని రూపాలు కనబడతాయి.. లేనిది ఉన్నట్టుగా భ్రమిస్తారు.. ఇదీసారాంశం. భ్రమలా..లేని రూపాలు కనబడతాయా? ఇంతకంటే నరకం ఉంటుందా. ఆ నరకాన్నే చూసిందా రమణి! గూగుల్ సెర్చ్ ఇంజన్ అప్పట్లో అంత ప్రాచుర్యం కాదు. ఒకవేళ ఉన్నా, రమణి ప్రాబ్లం ఇదని పోల్చుకోలేక పోయి ఉంటాను. రమణి నెంబర్ నా దగ్గర లేదు. మేనేజర్ పిలిచిన హడావుడిలో, నేను నెంబర్ సేవ్ చేసుకోలేదు. తర్వాత ఇక ప్రయత్నించలేదు. అది భార్యాభర్తల గొడవలు గానే చూశాను. ఆమె ఉన్న బ్రాంచ్‌కి ఫోన్ చేద్దాం.. అనుకుంటూనే పోస్ట్ పోన్ చేశాను. తర్వాత రమణి ఆలోచనలు మరుగునపడిపోయాయి.
సమస్యల్లో ఉన్న స్నేహితురాలు ఫోన్ చేస్తే, నేను చేసింది ఏమిటి?..
గబగబా మురళి కి ఫోన్ కలిపాను.
‘మురళి.. రమణి ఫోన్ నెంబర్ ఉందా?’
‘ఎందుకు ఇప్పుడు నీకు?’ , అయోమయంగా అడిగాడు మురళి.
‘రమణితో మాట్లాడాలి. రేపు వుయ్యూరుకు వెళ్తున్నాను.’
‘ రమణి చనిపోయిన విషయం నీకు తెలియదా? నేనే చెప్పానే.’
మతి పోయింది నాకు.
‘నాకు తెలీదు ...రమణి చనిపోయిన విషయం నాకు తెలీదు.‘
‘అనఘా... నేనే చెప్పాను నీకు.‘
‘షటప్....చెప్తే మర్చిపోయే విషయమా ఇది?..చనిపోయింది, నా స్నేహితురాలు. విషయం విని ఉంటే ఎలామర్చిపోతాను?‘
‘సారీ’ చెప్పాడు, మురళి.
‘ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు నేను వెళ్తాను.’
‘రమణి చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నువ్వెళ్లి ఏం చేస్తావు?’
‘ వెళ్ళాలి ...నంబర్ ఇవ్వు’.
మురళి దగ్గర నెంబరు తీసుకొని మరుసటి రోజు ఉదయమే ఉయ్యూరుకు బయలు దేరాను. దారిలో రమణి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాను. రమణి కొడుకు రాజా ఫోన్ ఎత్తాడు. నేను వస్తున్నట్లు చెప్పాను. ‘కాలేజీ కి వెళ్ళు ..సాయంత్రం కలుస్తా’ అని చెప్పాను. చిన్న ఊరే అవ్వడంతో రమణి ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు. ఇల్లు చిన్నదే అయినా రమణి టేస్ట్ కనపడుతోంది. కాంపౌండ్ అంతా మొక్కలు, చెట్లు. కాంపౌండ్ లోనికి వెళ్లి, కాలింగ్ బెల్ కొట్టాను. ఒక ముసలావిడ తలుపు తీసింది’ఎవరూ?’ అంటూ.
‘నా పేరు అనఘ... రమణి స్నేహితురాలిని’ ముసలావిడ కు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ముసలావిడ వెనకాలే లోనికి నడిచాను. సోఫా చూపించి, ‘కూర్చో’ అంది, ఆమె. లోనికి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక కొంత సేపు మౌనంగా కూర్చున్నాను.
‘మా రమణితో కలిసి పనిచేసావామ్మ?’ ముసలావిడే సంభాషణ ప్రారంభించింది.
‘అవునండి ...నేను రమణి పెళ్లికి కూడా వచ్చాను. రమణి ఎలా చనిపోయిందండీ’ ఇబ్బంది పడుతూనే అడిగాను.
ముసలావిడ కళ్ళు పెద్దవి చేసింది.‘దెయ్యమమ్మా దెయ్యం.... రమణి కి దెయ్యం పట్టింది. గాలితో మాట్లాడేది. గాలిలో వేటి వేటినో చూసేది. నిద్ర పోదు. తినదు. ఒక్కోసారి తినడం మొదలుపెడితే ...ఇద్దరి తిండి తినేది. మంత్రగాడిని పిలిపించా. యాప మండలెత్తి ధభి దభి బాదుతె దెయ్యం దార్లోకొచ్చింది. ఐనా ఏం లాభం? అప్పటికే నష్టం జరిగిపోయింది. దయ్యం రమణిని లొంగ తీసుకుంది. పీల్చిపిప్పి చేసింది. కొద్దిరోజులకే పీల్చక పోయి,మంచంలో పడిపోయింది’.
నాకు వస్తున్న ఆవేశానికి ఆ ముసలిదాని చెంపలు టపిటపిమని వాయించాలనిపించింది. ఆ మంత్రగాడు దొరికితే, ఇంకే అభాగ్యురాలి వుసురూ తీయకుండా రెండు చేతులూ విరిచేయాలనిపించింది. రమణి శారీరకంగా, మానసికంగా ఎంత క్షోభ అనుభవించింది! కళ్ళ ముందర లేని ఆకారాలు తిరుగుతూ, శబ్దాలు వినబడుతూ ఉంటే, ఎలా భరించిందో! భయానికి నిద్ర రాక , తిండి సహించక కృశించి పోయివుంటుంది. దీనికి తోడు వేపమండలు తగిలి శారీరకబాధ. నాకు ముసల్దానితో మాట్లాడాలనిపించ లేదు. బైట మెట్లమీద కూర్చుని రాజా కోసం కళ్ళలో నీళ్ళతో ఎదురుచూడసాగాను. సాయంత్రం ఆరు అవుతోండగా రాజా వచ్చాడు. ముమ్మూర్తులా తల్లి పోలిక. కొనదేలిన ముక్కు, కర్లీ హేర్..పొడవుగా ఉన్నాడు.
‘ఎంత సేపయ్యింది ఆంటీ వచ్చి’ అంటూ పలకరించాడు. ’ఎంత సంస్కారం ఈ అబ్బాయికి ’ అనుకున్నాను నేను.
‘‘ఇక్కడ కూర్చున్నారేమిటి? లోపలికి వెళ్దాం రండి,... భోంచేసారా?’ ’ముసలిదానికి రాలేదు ఈ ఆలోచన’ అనుకుంటూ, ‘లేదు బాబు.. నువ్వు వెళ్లి ఫ్రెష్ అయి రా. నాకు ఇక్కడే బాగుంది’ అన్నాను.
రాజా తలూపి లోపలికి నడిచాడు. ఐదు నిమిషాల్లో మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు.
‘కూర్చో రాజా...’ నాపక్కన స్థలం చూపాను.
‘మీరు మా అమ్మ ఫ్రెండా ఆంటీ?’ నా పక్కన కూర్చుంటూ అడిగాడు రాజా.
రాజా చేతిని నా చేతి లోకి తీసుకున్నాను.
‘బాబు... మీ అమ్మ, నేను మంచి స్నేహితులం. సినిమాలకు, షాపింగ్‌లకు కూడా తిరిగే వాళ్ళం. మీ అమ్మ ఒంటరిగా ఉండేది. అందుకని మా అమ్మ వంటలు అప్పుడప్పుడు రుచి చూపించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ స్నేహం పరిహాసం అయింది. మీ అమ్మ చనిపోయిన విషయం నాకు నిన్న తెలిసింది. నాకు ఆమె సమస్య గురించి అవగాహన లేదు. నేను ఆమెకు కొంతైనా సపోర్టు ఇచ్చి ఉంటే బ్రతికుండేదేమో!. ఆ గిల్టినెస్ నన్ను బాధిస్తోంది’ దుః ఖంతో గొంతు పూడుకపోవడంతో ఆగిపోయాను.
దూరంగా ఉన్న గన్నేరు పూలను చూస్తూ రాజా చెప్పసాగాడు.
‘నేను అప్పటికి చిన్నవాడిని ఆంటీ... నాకు పూర్తిగా తెలిసేది కాదు. అమ్మ తన సమస్యను ఇంట్లో వారికి, స్నేహితులకు చెప్పటానికి ప్రయత్నించేది. పూర్తిగా వినకుండానే, అర్థం చేసుకోకుండానే వాళ్లు సలహాలు ఇవ్వ చూపేవారు. సర్దుకు పొమ్మనేవారు. ఆమ్మ పట్ల వారికి సానుభూతి ఉందని, నాకు అనిపించేది కాదు. చదువు, ఉద్యోగం ఉందని... అందుకే నాన్నతో గొడవలు వస్తున్నాయనీ వాళ్ళు నమ్మారని అనిపిస్తుంది. తర్వాత తర్వాత ఆమె తన భావాలను చెప్పుకోవడం కూడా మానేసింది. లోలోపల మధనపడేది. తన దారిన తను బ్రతుకుదాం అనుకున్నా ఎవరో ఒకరు పనిగట్టుకుని వచ్చి బుద్ధులు చెప్పేవారు. నాన్నకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఆమె మొదట వివరించడానికి చూసేది. తర్వాత మానేసింది. సంవత్సరాల తరబడి జరిగిన గొడవలు ఆమెను క్రుంగదీసాయి.
‘దెయ్యం పట్టిందని ఎందుకనుకున్నారు రాజా?...’ ఆవేదనతో అడిగాను నేను.
‘అమ్మకు గాలిలో పెద్ద పెద్ద ఆకారాలు కనిపించే వంట ఆంటీ.. భయపడి పోయేది. చేతిలో ఉన్న వస్తువు విసిరి కొట్టేది. వీధుల వెంబడి పరిగెత్తేది లేదా గదిలో ఓ మూల ముడుచుకుని కూర్చునేది. ఒక్కో రాత్రి గుమ్మంలో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనబడేది. ‘అమ్మ’ అని పిలిచి కుదుపుతే వచ్చి పడుకునేది. రాను రాను ఆమెకు నిద్ర కరువైంది. నిద్రపోవడానికి భయపడేది. ఆమె బాధ ఎవరైనా అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. కనీసం తగ్గి ఉండేది. నిద్రలేమీ ఆమెను కృంగదీసింది. పక్కనే మొద్దు లాంటి శరీరం పడుతుందని గాల్లోనే విసురుగా కాలితో తన్నేది. పట్టపగలు.. ’ చీకటి చీకటిగా ఉంది’ అంటూ అరిచేది. గది మూలల్లో వింత ఆకారాలు ఎగురుతున్నాయి... అనేది. గది పైకప్పు చూసి పెద్ద బస్టాండు అక్కడున్నట్లు మాట్లాడేది. జనంలో నేను తప్పిపోయినట్లు.... రాజా అని పిలుస్తుంటే జనఘోషలో ఆమె పిలుపు కలిసిపోయినట్లు.. నాకు ఆమె పిలుపు వినబడనట్లు, ఆరాటపడేది. ఎక్కడికో పారిపోవాలని గింజుకునేది. ఎక్కడుందో ఆమెకు అర్థం కాదు. చుట్టూ ఎవరున్నారో ఆమెకు తెలియదు. భయంతో ముడుచుకు పోయేది. నెమ్మది నెమ్మదిగా ఆమె తినడం కూడా మానేసింది. మంచినీళ్లు తాగించాలి అని చూసినా, మూతి బిగించేది. అమ్మమ్మేమో, దెయ్యం పట్టిందని మంత్రగాడిని పిలిపించి, పూజలు చేయించింది. వాడు కొట్టిన దెబ్బలకు అమ్మ శరీరం హూనం అయ్యింది. అందరూ కలిసి అమ్మను చంపేశారాంటీ‘.
నా శరీరం అణువణువు నిస్సత్తువ ఆవరించింది. రమణి ఇంత మానసిక క్షోభ అనుభవించిందని ఊహిస్తేనే వళ్ళు గగుర్పాటు పొందుతోంది. తల తిరుగుతున్నట్లుగా ఉంది. నా కంటి నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకోవడం కూడా మానేశాను. రమణి అనవసరంగా ఊహించుకుంటుంది, అనుకున్నానే కానీ... అది మానసిక వ్యాధి అని నాకు తెలియలేదు.
రాజా చెయ్యి మీద చెయ్యి వేస్తూ అడిగాను ‘రాజా... నాతో వచ్చెయ్యి. మా ఇంట్లోనే ఉందువు.’
‘అమ్మమ్మను చూసారు కదా ఆంటీ... ముసల్ది... ఆమెకు నేను తోడుగా ఉండాలి కదా.’
తల్లి మరణానికి కారణమైన వాళ్ళ బాగోగులు కూడా ఈ చిన్ని మనస్సు ఆలోచిస్తోంది. రమణి సంస్కారమే ఇతడికి వచ్చింది. కాసేపు రాజాతో మాట్లాడిన తర్వాత,‘రాజా బస్టాండ్లో వదలి పెడతావా..’ అంటూ లేచాను. మార్గంలో కనబడిన వ్యక్తులను చూస్తూ వెళుతున్నాను. చాలామంది నిర్వికారంగా ఉన్నారు. వీళ్లలో ఎంతమంది ఆలంబన కోసం అర్రులు చాస్తున్నారో! ఎంతమంది పిలుపు ఆత్మీయుల చెవులను చేరుతుందో!? సాయం కోసం చాచిన చేతులను ఎంతమేరకు ఆపన్న హస్తాలు అందుకున్నాయో?! ఎంతమంది చిత్తభ్రమలకు దగ్గరగా ఉన్నారో?! ఎవరు గుర్తించగలరు? అజ్ఞానమో..అవివేకమో... నిండు ప్రాణాలు అడవి పువ్వులు అవుతున్నాయి. బాధను చెప్పుకుంటే.. అర్థం చేసుకునే నిండు హృయాలు వారికి దొరకాలని ఆశపడుతూ తిరుగు ప్రయాణం అయ్యాను.
♦ యస్‌వియం నాగగాయత్రి
Comments
Please login to add a commentAdd a comment